న్యూఢిల్లీ: బిల్కిస్ బానో ఉదంతంలో ప్రధాని మోదీపై విమర్శల దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రం చేసింది. సామూహిక అత్యాచారం, హత్యలకు సంబంధించిన ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది విడుదల విషయంలో గుజరాత్ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘ఈ నిర్ణయానికి మోదీ అనుమతి ఉందా? లేని పక్షంలో గుజరాత్ సీఎంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆయన, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పాలి’’ అని బుధవారం డిమాండ్ చేశారు.
మోదీ మాటలకూ చేతలకూ ఎంత తేడా ఉందో ప్రపంచమంతా గమనిస్తూనే ఉందన్నారు రాహుల్ గాంధీ. ‘‘ఐదు నెలల గర్భిణిపై సామూహిక అత్యాచారానికి, ఆమె మూడున్నరేళ్ల చిన్నారితో పాటు ఏడుగురు కుటుంబీకుల పాశవిక హత్యకు పాల్పడ్డ వాళ్లను స్వాతంత్య్ర అమృతోత్సవం నాడే విడుదల చేశారు. నారీ శక్తి అంటూ భారీ ప్రసంగాలు చేసిన వాళ్లు ఈ చర్యల ద్వారా మహిళలకు ఏం సందేశమిచ్చినట్టు?’’ అంటూ మోదీ పంద్రాగస్టు ప్రసంగాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. సీబీఐ వంటి సంస్థలు దర్యాప్తు చేసిన కేసుల్లో దోషులకు కేంద్రం అనుమతి లేకుండా క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు.
ఇదీ చదవండి: మోదీజీ.. అదే నిజమైతే మీ చిత్తశుద్ది నిరూపించుకోండి.. రేపిస్టులకు బెయిల్ రాకుండా చేయండి: మంత్రి కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment