బిల్కిస్ సామూహిక అత్యాచారం కేసులో 12 మందికి జీవిత ఖైదు
► కింది కోర్టు తీర్పును సమర్థించిన బాంబే హైకోర్టు
► ముగ్గురికి ఉరిశిక్ష వేయాలన్న సీబీఐ అభ్యర్థన తిరస్కరణ
ముంబై: గుజరాత్‌లో సంచలనం రేపిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 12 మందికి జీవిత ఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. దోషుల్లో ముగ్గురికి ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులు, వైద్యులను నిర్దోషులుగా ప్రకటించిన కింది కోర్టు తీర్పును పక్కనబెట్టింది.
కాగా, ఈ ఏడుగురూ ఇప్పటికే అనుభవించిన జైలు జీవితాన్ని శిక్షా కాలంగా పరిగణిస్తామని, అయితే ఒక్కొక్కరికి రూ.20 వేల జరిమానా విధిస్తున్నామని, ఈ మొత్తాన్ని 8 వారాల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వీకే తహిల్రమణి, జస్టిస్ మృదులా భట్కర్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. దోషుల్లో ఒకరు శిక్ష అనుభవిస్తూ మరణించారు.
2002 గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్‌పూర్‌లోని బిల్కిస్ ఇంటిపై దాడి చేశారు. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్ కుటుంబ సభ్యులు ఏడుగురిని హతమార్చారు.
ఈ కేసులో 2008లో ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా తేలుస్తూ శిక్ష విధించింది. దీన్ని సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ బిల్కిస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేసును సుప్రీంకోర్టు అహ్మదాబాద్ నుంచి ముంబై హైకోర్టుకు బదలాయించింది. ఇది అత్యంత అరుదైన కేసని, ప్రధాననిందితులైన జశ్వంత్‌భాయ్, గోవింద్‌భాయ్, రాధేశ్యాంలకు ఉరిశిక్ష వేయాలని సీబీఐ వాదించింది.
శిక్ష పడింది వీరికే: జశ్వంత్‌భాయ్ నాయి, గోవింద్‌భాయ్ నాయి, శైలేష్ భట్, రాధేశ్యాం షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, ప్రదీప్ మొరాధియా, బకభాయి వోహానియా, రాజుభాయ్ సోని, మితేష్‌భట్, రమేష్ చందన.