న్యూఢిల్లీ: స్వయానా అన్న కూతురిపైనే అత్యాచారం జరడమేగాక, ఆమెకు వ్యభిచారకూపంలోకి దింపిన 50 ఏళ్ల వయస్కుడికి యావజ్జీవం విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. నిందితుడు, ఉత్తరప్రదేశ్‌వాసి పన్నూ అత్యాచారం, సామూహిక అత్యాచారం, బెదిరింపులు, నేరపూరిత కుట్ర, అక్రమ నిర్భందం వంటి నేరాలకు పాల్పడ్డట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి వీరేందర్ భట్ నిర్ధారించారు. ఇతడు చేసిన నేరాలు అత్యంత క్రూరమైనవి, రాక్షసప్రవృత్తితో కూడుకున్నవని ఆయన వ్యాఖ్యానించారు.
బాలిక తండ్రి మరణించిన తరువాత ఆమెకు చదువు చెప్పిస్తానని 2003లో ఢిల్లీకి తీసుకొచ్చి కామవాంఛ తీర్చుకున్నాడని పేర్కొన్నారు. బాలికతో బలవంతంగా మద్యం తాగించి నగ్నంగా నృత్యాలు చేయించాడని పేర్కొన్నారు. స్నేహితులతో కలిసి సామూహికంగా అత్యాచారం కూడా చేశాడని కోర్టు ప్రకటించింది. బాలిక పనిచేసే ఇంటి యజమాని పన్నూ దురాగతాల గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఢిల్లీ కంటోన్మెంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.