China President Jinping
-
అక్రమంగా వాళ్ల ప్రాంతాలు మన మ్యాప్‌లో చేర్చడం ఎందుకూ..
అక్రమంగా వాళ్ల ప్రాంతాలు మన మ్యాప్‌లో చేర్చడం ఎందుకూ.. భయపడి వెళ్లకుండా ఉండటమెందుకు.. సార్! -
భారత్ చైనా సంబంధాలు బలపడాలి: జిన్‌పింగ్
న్యూఢిల్లీ: భారత్ అభ్యర్ధన మేరకే భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారని చైనా విదేశాంగ శాఖ తెలిపిన దాంట్లో వాస్తవం లేదని.. వాస్తవానికి ద్వైపాక్షిక చర్చల గురించి అభ్యర్ధించింది చైనాయేనని అది ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపింది భారత విదేశాంగ శాఖ. జోహన్నెస్‌బెర్గ్ వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కొద్దిసేపు మాట్లాడుతూ కనిపించారు. అది కూడా వేదిక నుండి కిందకు దిగుతున్న వేళ చిన్నగా అడుగులేస్తూ క్లుప్తంగా సంభాషించారు. ఇదే వేదికపై మోదీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమేవేశంలో పాల్గొంటారని ముందుగా వార్తలు వచ్చినప్పటికీ సమావేశాల్లో ఇరు దేశాల నేతలు ఎక్కడా ప్రత్యేక చర్చల్లో పాల్గొనలేదు. అనధికారికంగా మాత్రం కొద్దిసేపు సంభాషిచారు. భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు మధ్య జరిగిన అనధికారిక సంభాషణలో ఇరువురు వాస్తవాధీన రేఖ వద్ద బలగాలను తొలగించి ఉద్రిక్తతను తొలగించే విషయమైన చర్చించినట్లు తెలిపారు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా. జూన్ 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని సరిహద్దు వెంబడి పరిష్కారం కాని అనేక సమస్యల ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక ద్వైపాక్షిక చర్చల ప్రస్తావన తీసుకొచ్చింది చైనాయేనని భారత్ ఇంకా ఆ విషయమై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా చైనా విదేశాంగ శాఖ మాత్రం భారత్ అభ్యర్ధన మేరకే చైనా అధ్యక్షుడు భారత ప్రధానితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారని.. ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచే అంశమై మాట్లాడినట్లు తెలిపింది. రెండు దేశాల మధ్య శాంతిని, స్థిరత్వాన్ని నెలకొల్పితేనే ప్రపంచాభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి కూడా సాధ్యమవుతుందన్నారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: ట్రంప్ మగ్ షాట్:మస్క్ రియాక్షన్ అదిరిపోయింది! -
‘మాకు నిజమైన మిత్రుడు’.. జిన్‌పింగ్ ఎన్నికపై పాకిస్థాన్ హర్షం
ఇస్లామాబాద్: చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్(69) రికార్డ్ స్థాయిలో మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మరోమారు అధ్యక్షుడిగా ఎన్నిక కావటంపై హర్షం వ్యక్తం చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి హెహబాజ్ షరీఫ్. తమ దేశానికి ఆయన నిజమైన స్నేహితుడని అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు ప్రధాని. జిన్‌పింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘సీపీసీ జనరల్ సెక్రటరీగా మూడోసారి ఎన్నికైనందుకు యావత్ పాకిస్థాన్ తరఫున షీ జిన్‌పింగ్‌కు నా అభినందనలు. తెలివైన సారథ్యం, చైనా ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకున్న నిబద్ధతకు ఇది తార్కాణం’ అని ట్వీట్ చేశారు ప్రధాని షెహ్బాజ్. మరోవైపు.. జిన్‌పింగ్ ఎన్నికపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా స్పందించారు. ‘సీపీసీ జనరల్ సెక్రటరీగా మరోసారి ఎన్నికైన షీ జిన్‌పింగ్‌కు అభినందనలు. పాకిస్థాన్‌కు నిజమైన స్నేహితుడు, పాక్-చైనాల వ్యూహాత్మక బంధానికి బలమైన మద్దతుదారుడు’ అంటూ ట్వీట్ చేశారు. On behalf of the entire Pakistani nation, I congratulate President Xi Jinping on his reelection as CPC General Secretary for the 3rd term. It is a glowing tribute to his sagacious stewardship and unwavering devotion for serving the people of China. 🇵🇰 🇨🇳 — Shehbaz Sharif (@CMShehbaz) October 23, 2022 I extend heartiest congratulations to H.E. Xi Jinping on his reelection as CPC General Secretary, and my best wishes for his health and happiness. He is a true friend of Pakistan and champion for All-Weather Strategic Cooperative Partnership between Pakistan and China. 🇵🇰 🇨🇳 — The President of Pakistan (@PresOfPakistan) October 23, 2022 ఇదీ చదవండి: ‘ప్రపంచానికి చైనా అవసరం’.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ వ్యాఖ్యలు -
చరిత్రకెక్కిన జిన్‌పింగ్.. మావో జెడాంగ్ తర్వాత తొలినాయకుడిగా..
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (69) చరిత్ర సృష్టించారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి నాయకుడు ఆయనే! బీజింగ్‌లోని ఆర్నేట్ గ్రేట్ హాల్లో ఆదివారం సీపీసీ 20వ సెంట్రల్ కమిటీ ప్లీనరీ జిన్‌పింగ్ అధ్యక్షతన జరిగింది. 203 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, 168 మంది ప్రత్యామ్నాయ సభ్యులు పాల్గొన్నారు. జిన్‌పింగ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. 24 మందితో సీపీసీ పొలిట్‌బ్యూరోకూ సెంట్రల్ కమిటీ ఆమోదముద్ర వేసింది. జిన్‌పింగ్ సహా ఏడుగురు సభ్యులతో అత్యంత శక్తిమంతమైన స్టాండింగ్ కమిటీనీ ఎన్నుకున్నారు. ఇందులో జిన్‌పింగ్ మద్దతుదారులకే స్థానం దక్కింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్నికయ్యాయని జిన్‌పింగ్ స్వయంగా ప్రకటించారు. సీపీసీ షాంఘై అధ్యక్షుడు లీ ఖియాంగ్.. జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు. చైనా ప్రీమియర్ (ప్రధానమంతి) లీ కెఖియాంగ్ వచ్చే ఏడాది మార్చిలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన ప్రీమియర్‌గా లీ ఖియాంగ్ బాధ్యతలు చేపడతారన్న ప్రచారం సాగుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ.. చైనా ప్రజలకు వెన్నెముక ప్రపంచానికి చైనా అవసరం, చైనాకు ప్రపంచం అవసరం ఉందని షీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచానికి దూరంగా ఒంటరిగా ఉంటూ చైనా అభివృద్ధి చెందలేదని అన్నారు. అలాగే ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ప్రపంచానికి చైనా కావాలని చెప్పారు. తమ ఆర్థిక వ్యవస్థ నమ్మదగినది, స్వేచ్ఛాయుతమైనది అని పేర్కొన్నారు. పునాది బలంగా ఉందని వివరించారు. దేశ విదేశీ పెట్టుబడుల కోసం తలుపులు తెరిచి ఉంచామని వెల్లడించారు. సంస్కరణల విషయంలో స్థిరంగా ముందుకు కదులుతున్నామని చెప్పారు. సౌభాగ్యవంతమైన చైనా బాహ్య ప్రపంచం కోసం ఎన్నో అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. మార్క్సిజం వైపు మొగ్గు చూపుతుండడంతోపాటు చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని జిన్‌పింగ్ ఇప్పటికే ప్రకటించారు. నూతన శకంలో సోషలిజం అభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వందేళ్ల చరిత్ర ఉన్న.. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ స్వయం సంస్కరణ ద్వారా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మన పార్టీ చైనా ప్రజలకు ఒక బలమైన వెన్నుముకగా మారాలన్నారు. ఘన కీర్తి కలిగిన చైనా అద్భుతమైన కలలతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తోందని జిన్‌పింగ్ వివరించారు. మార్గసూచి(రోడ్‌మ్యాప్) తయారు చేసుకున్నామని, శంఖం పూరించామని చెప్పారు. మన దేశానికి మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీకి పక్షపాతానికి తావులేని వాస్తవికమైన ప్రచారం కల్పించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మూడు అత్యున్నత పదవులు అత్యంత శక్తిమంతమైన సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) చైర్మన్‌గా జిన్‌పింగ్‌ను కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూర్ మరోసారి నియమించింది. ఆయనకు మూడు అత్యున్నత పదవులు దక్కాయి. దేశాధ్యక్షుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా, సీఎంసీ చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) జనరల్స్ ఝాంగ్ యుషియా, హీ వీడాంగ్‌ను సీఎంసీ వైస్ చైర్మన్లుగా నియమించారు. పలువురు సైనిక ఉన్నతాధికారులకు సెంట్రల్ మిలటరీ కమిషన్‌లో సభ్యులుగా అవకాశం లభించింది. ఆదివారం సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్పెక్షన్ (సీసీడీఐ) స్టాండింగ్ కమిటీ కార్యదర్శి, ఉప కార్యదర్శులు, సభ్యులను కూడా ఎన్నుకున్నారు. 24 మందితో కూడిన సీపీసీ పొలిట్‌బ్యూరోలో మహిళలకు స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: మీడియా సాక్షిగా చైనా మాజీ అధ్యక్షుడి జింటావో గెంటివేత! -
బిగ్ ట్విస్ట్.. చైనా అధ్యక్ష పదవికి జిన్‌పింగ్ రాజీనామా..?
China President Xi Jinping.. డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఒమిక్రాన్ వేరియంట్ల కారణంగా చైనీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చైనాలో పాజిటివ్ కేసులు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చైనాలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారనే వార్త చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, కరోనా కట్టడిలో విఫలం కావడం, చైనా ఆర్థికవ్యవస్థ పతనానికి జిన్‌పింగ్ తప్పుడు నిర్ణయాలే కారణమని ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వదంతులు ప్రచారంలో ఉన్నాయి. కాగా, ఇటీవలే జరిగిన సీపీసీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రచారం ఊపందుకుంది. మరోవైపు.. చైనాలో కరోనా కట్టడి కోసం జిన్‌పింగ్.. జీరో కొవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పాజిటివ్ వచ్చిన వారిని బలవంతంగా క్వారన్టైన్ కేంద్రాలకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో జిన్‌పింగ్‌పై చైనీయుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక, కరోనా కారణంగా చైనాలో వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఈ కారణంగా జిన్‌పింగ్ రాజీనామా చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. కెనడాకు చెందిన బ్లాగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ.. ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్ను తదుపరి చైనా అధ్యక్షుడిగా పార్టీ నియమిస్తుందని పేర్కొన్నాడు. అంతకన్నా ముందు.. చైనా కమ్యూనిస్టు పార్టీ ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటుచేసి జిన్‌పింగ్‌ను పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించనుందని బాంబు పేల్చాడు. ఇది కూడా చదవండి: యూఏఈ నూతన అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ -
సంయుక్త ప్రకటనలు, ఒప్పందాలు ఉండవ్
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీల మధ్య సమావేశానికి సన్నాహాలు పూర్తయ్యాయి. అక్టోబరు 11, 12వ తేదీల్లో చెన్నై సమీపంలోని మహాబలిపురం వేదికగా ఇరుదేశాల నేతల సమావేశం జరుగుతుందని భారత్, చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను పంచుకునేందుకు ఈ సమావేశాలు వీలు కల్పిస్తాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది జిన్‌పింగ్‌ది అనధికార పర్యటన కావడంతో ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు, సంయుక్త ప్రకటనలు, పత్రికా ప్రకటనలు ఉండవు. కేవలం ఇరువురు నేతల మధ్య వ్యక్తిగత సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ఉద్దేశం. జిన్‌పింగ్ గడిపే 24 గంటల్లో మోదీతో కనీసం నాలుగుసార్లు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. చారిత్రక ప్రాంతమైన మహాబలిపురంలో జరిగే సాంస్కృతిక ఉత్సవాలకు జిన్‌పింగ్, మోదీలు హాజరవుతారు. బంగాళాఖాతం సముద్ర అందాలను వీక్షిస్తూ చెన్నైలో రిసార్ట్‌లో ఇరువురు నేతలు అంతరంగిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. కశ్మీర్ ద్వైపాక్షిక అంశం: చైనా జిన్‌పింగ్ భారత్ పర్యటన నేపథ్యంలో కశ్మీర్ అంశంపై చైనా తన అభిప్రాయాన్ని బహిరంగ పరిచింది. ఇన్నాళ్లూ పాక్‌కు మద్దతుగా నిలిచిన చైనా ఆ దేశానికి షాక్ ఇచ్చింది. కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని, ఆ రెండు దేశాలే దానిని పరిష్కరించుకోవాలని చెబుతూ పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసింది. చైనా ప్రభుత్వ అధికార ప్రతినిధి గెంగ్ విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా భారత్, పాక్‌లు కశ్మీర్లు సమస్య ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. అయితే చైనా తన మాట మీద ఎంతవరకు నిలబడుతుందన్నది ప్రశ్నార్థకమే. టూర్ షెడ్యూల్ ఇదీ మామల్లపురం (మహాబలిపురం) పాండవుల రథాల దగ్గర శుక్రవారం సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మోదీ, జిన్‌పింగ్ పాల్గొంటారు. అదే రోజు రాత్రి జిన్‌పింగ్ గౌరవార్థం సముద్ర తీర ప్రాంతంలో విందు ఉంటుంది. విందు చివర్లో ఇరుదేశాలకు చెందిన సీనియర్ అధికారులు పాలుపంచుకుంటారు.ఆ తర్వాత జిన్‌పింగ్ చెన్నైలో తను బస చేసే హోటల్‌కు వెళ్లిపోతారు.అక్టోబర్ 12 శనివారం ఉదయం 10 గంటలకు సముద్ర తీర ప్రాంతంలోని ఫైవ్‌స్టార్ రిసార్ట్‌లో మోదీ, జిన్‌పింగ్ 40 నిముషాల సేపు మాట్లాడుకుంటారు. తర్వాత ఇరువైపు దౌత్యబృందాలు అధికారిక చర్చలు జరుపుతాయి. అది పూర్తయ్యాక భోజనం సమయంలో మళ్లీ మోదీ , జిన్‌పింగ్‌లు చర్చిస్తారు. చర్చకు వచ్చే అంశాలు కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే 370 ఆర్టికల్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే చైనా అధ్యక్షుడి భారత్ రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనాకు సరిహద్దుగా ఉన్న లద్దాఖ్‌ను కశ్మీర్ 370 అధికరణం రద్దు చేయడం ద్వారా కేంద్ర పాలిత ప్రాంతం చేయడంతో ఈ అంశం ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌కు 100 కి.మీ. దూరంలో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ నిర్వహిస్తున్న సైనిక కసరత్తులు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, ఆర్థిక సంబంధాలు, విదేశాంగ విధానాలు, చైనా 5జీ నెట్వర్క్ విధానం తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు తమ మనోభావాలను పంచుకుంటారు. -
మోదీ మిత్రుడికి 1.30 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత దేశం కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధ విమానాల నిర్వహణ కోసం ప్రజలు ‘మిస్టర్ 56’ స్నేహితుడికి మరో 50 ఏళ్ల పాటు సుమారు లక్ష కోట్ల పన్నులు చెల్లించాల్సి వస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. ఎన్నికల్లో ఛాతీని 56 అంగుళాలకు పెంచి ఉత్సాహంగా మాట్లాడే మోదీ.. పాక్, చైనాలతో చర్చల సమయంలో ఆ ఉత్సాహం ఎందుకు చూపరని కాంగ్రెస్ విమర్శించింది. ఈ నేపథ్యంలో మోదీని రాహుల్ ‘మిస్టర్ 56’గా అభివర్ణించారు. ‘క్షమించండి.. రాఫెల్ కుంభకోణం విలువ రూ. 30 వేల కోట్లు అని గతంలో చెప్పానుగానీ ఆఫ్సెట్ కాంట్రాక్టులను కలుపుకొంటే ఆ విలువ రూ.1.3 లక్షల కోట్లు’ అని రాహుల్ ట్వీట్‌చేశారు. రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో మోదీ స్నేహితుడికి 20 బిలియన్ల డాలర్ల (సుమారు 1.30 లక్షల కోట్లు) లబ్ధి చేకూరిందని రాహుల్ ఆరోపించారు. ఈ విషయంలో మోదీ, రక్షణ మంత్రి అబద్ధాలాడుతున్నారని ఆరోపణలు చేశారు. మోదీ.. డోక్లాం గురించి మరిచారా? ‘బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలసి పలు అంశాలు చర్చించినా డోక్లాంను ప్రస్తావించడం మరిచారు. ఈ ప్రభుత్వం దేశ సరిహద్దులు, జాతి భద్రత విషయంలో ఎప్పుడు ధైర్యం చేసి మాట్లాడుతుందో.. కళ్లెర్ర జేసి, ఛాతీ 56 అంగుళాలకు పెంచుతుందో.. 132 కోట్ల మంది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
మా భూభాగాన్ని వదులుకోం: జిన్‌పింగ్
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలోని భూభాగాలను తాము వదులుకోబోమని, అదేసమయంలో అంతర్జాతీయంగా కల్లోల పరిస్థితులను సృష్టించే ఉద్దేశం తమకు లేదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం చైనాలో ఉన్న అమెరికా రక్షణ మంత్రి మాటిస్‌తో జిన్‌పింగ్ సమావేశమయ్యారు. దక్షిణ చైనా సముద్రంలో ఆగ్నేయాసియా దేశాల సమీపంలోని చిన్న దీవులను ఆక్రమించడం, వాటిలో ఆధునిక ఆయుధ సంపత్తిని మోహరించడాన్ని భేటీ సందర్భంగా జిన్‌పింగ్ సమర్ధించుకున్నారు. ‘మేం పటిష్ట సామ్యవాద దేశాన్ని నిర్మించుకోవాల్సి ఉంది. శాంతి పూర్వక అభివృద్ధిని కాంక్షిస్తున్నాం. వలస, విస్తరణ వాదాలను కోరుకోవటం లేదు. అంతర్జాతీయంగా అలజడులను సృష్టించాలనుకోవటం లేద. పూర్వీకులు మాకిచ్చిన భూభాగాలపై మాకు హక్కుంది. ఆ భూభాగాల్లో ఒక్క అంగుళం కూడా వదలం’ అని అన్నారు. -
చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
-
చైనా సర్వోన్నత నేత జిన్‌పింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇక జీవితకాలం ఆ పదవిలో కొనసాగేందుకు మార్గం అధికారికంగా సుగమమైంది. ఓ వ్యక్తి అధ్యక్షుడిగా రెండు కంటే ఎక్కువసార్లు పనిచేయకూడదంటూ ఉన్న పరిమితిని ఎత్తివేసే రాజ్యాంగ సవరణకు ఆ దేశ పార్లమెంటు ఆదివారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జిన్‌పింగ్ రెండోసారి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇకపై కూడా ఆయన ఎన్నాళ్లు కోరుకుంటే అన్నాళ్లు, కావాలంటే చనిపోయేంత వరకు కూడా అధ్యక్షుడిగా ఉండొచ్చు. ఇటీవలి దశాబ్దాల్లో చైనాలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా జిన్‌పింగ్ ఎదిగారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) స్థాపక చైర్మన్ అయిన మావో జెడాంగ్ తర్వాత అధ్యక్ష పదవిలో జీవితకాలం కొనసాగనున్న నేతగా జిన్‌పింగ్ రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఎవరూ రెండు కన్నా ఎక్కువసార్లు చేపట్టకూడదంటూ ఉన్న నిబంధనను రద్దు చేయాలని ఇటీవల జరిగిన సీపీసీ మహాసభల్లో తీర్మానించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులపై ఉన్న పరిమితిని ఎత్తివేయాలన్న సీపీసీ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదించింది. పొరుగుదేశాలకు ఆందోళనకరం.. జిన్‌పింగ్‌కు జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం కల్పించడం భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు ఆందోళన కలిగించే అంశం. 2013లో జిన్‌పింగ్ అధ్యక్షుడయ్యాక ఆయా దేశాలతో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. భారత్‌తో డోక్లాం వివాదం తెలిసిందే. భారత్‌కు శత్రుదేశమైన పాకిస్తాన్‌కు చైనా బాగా దగ్గరవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా–పాక్ ఆర్థిక కారిడార్‌ను కూడా నిర్మిస్తోంది. మాల్దీవులు, శ్రీలంకల్లోనూ తన ప్రాబల్యాన్ని బాగా పెంచుకుంది. రోడ్డు, రైల్వే ప్రాజెక్టులతో నేపాల్‌తో కూడా సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాలతోనూ విభేదాలను చైనా పెంచుకుంది. ఇవన్నీ జిన్‌పింగ్ అధ్యక్షుడయ్యాక జరిగినవే. ఈ నేపథ్యంలో జీవితకాలం పదవిలో కొనసాగే అవకాశాన్ని ఆయనకు కల్పించడం పొరుగుదేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యంత ప్రాధాన్యం... చైనాను ఆర్థికంగా, సైనికపరంగా ‘సూపర్‌పవర్’గా మార్చాలనేదే జిన్‌పింగ్ లక్ష్యం. మరో 30 ఏళ్లలో చైనాను ›ప్రపంచ ఆర్థికశక్తిగా, ప్రపంచస్థాయి మిలటరీ శక్తిగా రూపుదిద్దే తన జీవితకాల లక్ష్యాన్ని సాధించేందుకు జిన్‌పింగ్‌కు తాజా నిర్ణయం దోహదపడతుందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలను చేపట్టడంతో పాటు పార్టీ కఠినమైన క్రమశిక్షణ పాటించేలా చేయడం, వివిధస్థాయిల్లో అవినీతిని అంతమొందించేందుకు తీసుకున్న ధృడచిత్త వైఖరి ఆయనకు ప్రజాదరణ తెచ్చిపెట్టింది. ఈ విషయంలో పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో ఉన్న వారిని కూడా ఉపేక్షించలేదనే పేరు గడించారు. ఇప్పటికే ఆయన చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రధానకార్యదర్శిగా, చైనా పీపుల్స్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్‌గా దేశంలోని అన్ని వ్యవస్థలపై కీలకబాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేపథ్యమిదీ... విప్లవోద్యమ కాలంలో నిర్వహించిన పాత్రతో జిన్‌పింగ్ తండ్రి పార్టీలో కీలకబాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయనను తప్పించడంతో షీ కుటుంబం కష్టాలు ఎదుర్కొంది. పార్టీలో జిన్‌పింగ్ నిబద్ధతతో, అత్యంత క్రమశిక్షణతో పనిచేశారు. 1971లోనే కమ్యూనిస్ట్ యూత్‌లీగ్‌లో చేరారు. పార్టీలో చేరేందుకు పదిసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమై 1974లో దానిని సాధించగలిగారు. 1999లో ఫుజియన్ ప్రావిన్స్ గవర్నర్ పదవిని చేపట్టారు. 2002లో ఝేజియాంగ్ ప్రావిన్స్, 2007లో షాంఘై పార్టీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. 2007లోనే పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో, సెంట్రల్ సెక్రటేరియట్లో చేరారు. హుజింటావో అధ్యక్షుడిగా ఉన్నపుడు 2008–13 మధ్యలో ఉపాధ్యక్షుడిగా, 2010–12 మధ్యకాలంలో సెంట్రల్ మిలటరీ కమిషన్ వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. 2012లో తొలిసారిగా ప్రధానకార్యదర్శి పదవిని చేపట్టిన ఆయన 2017లో మళ్లీ ఆ పదవికి ఎన్నికయ్యారు. -
యుద్ధ సన్నద్ధతతో ఉండండి
బీజింగ్: ఎల్లప్పుడూ యుద్ధ సన్నద్ధతతో ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆ దేశ సైన్యానికి పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీకి విధేయంగా ఉంటూ, యుద్ధాలు గెలవడంపై దృష్టిపెట్టాలన్నారు. ఇటీవల ముగిసిన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్(సీపీసీ) జిన్‌పింగ్‌కు తిరిగి అధ్యక్ష పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో ఆయన గురువారం రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ సీనియర్ మిలిటరీ అధికారులతో సమావేశమయ్యారు. సైన్యంలో సంస్కరణలు అమలుచేయడంతో పాటు, వినూత్న విధానాలు అవలంబించాలని సైనికాధికారులకు సూచించారు. చట్టాలు, నియంత్రణలకు లోబడి కఠిన ప్రమాణాలతో సైన్యాన్ని ముందుకు నడిపించాలని దిశానిర్దేశం చేశారు. మిలిటరీలో పార్టీని పటిష్టం చేయాలని, యుద్ధ సన్నద్ధతకు సంబంధించి కసరత్తులను తీవ్రతరం చేయాలని కోరారు. సైన్యం భవిష్యత్ ప్రణాళికలకు ఎదురవుతున్న వ్యూహాత్మక సమస్యలను పరిష్కరించాలని సూచించారు. -
ఘర్షణ వద్దు.. శాంతి ముద్దు
- బ్రిక్స్ ప్రారంభ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ - నేడు పలు దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు.. రేపు జిన్‌సింగ్‌తో భేటీ! జియామెన్(చైనా): వివాదాస్పద అంశాల పరిష్కారానికి బ్రిక్స్ దేశాలు దౌత్యమార్గాన్ని కొనసాగించాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. మూడ్రోజుల పాటు జరిగే బ్రిక్స్ దేశాల తొమ్మిదో వార్షిక సదస్సును చైనాలోని జియామెన్ నగరంలో ఆదివారం ఆయన ప్రారంభించారు. భారత్‌తో ఇటీవలి డోక్లాం వివాదం ప్రస్తావన లేకుండా.. విభేదాల పరిష్కారానికి శాంతి, అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని, ప్రపంచం యుద్ధ, ఘర్షణ పూరిత వాతావరణం కోరుకోవడం లేదని స్నేహపూర్వక ధోరణిలో జిన్‌పింగ్ మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరులో సమగ్ర విధానాన్ని అనుసరించాలని, ఉగ్రవాదాన్ని తుది ముట్టడించడమే కాకుండా, దాని వెనకున్న మూల కారణాలకు పరిష్కారం కనుగొనాలని సూచించారు. బ్రిక్స్ సభ్య దేశాలు విభేదాల్ని పక్కన పెట్టాలని, పరస్పర విశ్వాసం, వ్యూహాత్మక చర్చల ద్వారా ఒకరి ఆందోళనల్ని మరొకరు గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య సహకారం పెంపొందించే దిశగా అధిక దృష్టి సారించాలని కోరారు. నేడు బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలైన భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమెర్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు ఎజెండాలోని అంశాలపై చర్చతో పాటు గత సదస్సు తీర్మానాలపై సమీక్షిస్తారు. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఉన్న జియామెన్ నగరాన్ని టైఫూన్ మవర్ ఒక పక్క కుదిపేస్తుండగా.. మరోవైపు కీలకమైన బ్రిక్స్ దేశాల సదస్సు ప్రారంభమైంది. టైఫూన్ దెబ్బకు విమానాల రాకపోకలకు అంతరాయంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. తొలిరోజు ‘బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్’ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన దాదాపు 1000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. చైనా చేరుకున్న ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి జియామెన్ చేరుకున్నారు. నేడు బ్రిక్స్ సదస్సులో ప్రసంగించడంతో పాటు సభ్య దేశాలు, ఆతిథ్య దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. సదస్సు ద్వారా ఫలవంతమైన చర్చలు, సానుకూల ఫలితాల్ని ఆశిస్తున్నానని, గోవా బ్రిక్స్ సదస్సుతో సాధించిన ఫలితాల్ని తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని ఇప్పటికే ప్రధాని స్పష్టం చేశారు. మంగళవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగవచ్చని భారత అధికార వర్గాల సమాచారం. 73 రోజుల పాటు కొనసాగిన డోక్లామ్ వివాదం పరిష్కారమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.