న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీల మధ్య సమావేశానికి సన్నాహాలు పూర్తయ్యాయి. అక్టోబరు 11, 12వ తేదీల్లో చెన్నై సమీపంలోని మహాబలిపురం వేదికగా ఇరుదేశాల నేతల సమావేశం జరుగుతుందని భారత్, చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను పంచుకునేందుకు ఈ సమావేశాలు వీలు కల్పిస్తాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది జిన్‌పింగ్‌ది అనధికార పర్యటన కావడంతో ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు, సంయుక్త ప్రకటనలు, పత్రికా ప్రకటనలు ఉండవు. కేవలం ఇరువురు నేతల మధ్య వ్యక్తిగత సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ఉద్దేశం. జిన్‌పింగ్ గడిపే 24 గంటల్లో మోదీతో కనీసం నాలుగుసార్లు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. చారిత్రక ప్రాంతమైన మహాబలిపురంలో జరిగే సాంస్కృతిక ఉత్సవాలకు జిన్‌పింగ్, మోదీలు హాజరవుతారు. బంగాళాఖాతం సముద్ర అందాలను వీక్షిస్తూ చెన్నైలో రిసార్ట్‌లో ఇరువురు నేతలు అంతరంగిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.
కశ్మీర్ ద్వైపాక్షిక అంశం: చైనా
జిన్‌పింగ్ భారత్ పర్యటన నేపథ్యంలో కశ్మీర్ అంశంపై చైనా తన అభిప్రాయాన్ని బహిరంగ పరిచింది. ఇన్నాళ్లూ పాక్‌కు మద్దతుగా నిలిచిన చైనా ఆ దేశానికి షాక్ ఇచ్చింది. కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని, ఆ రెండు దేశాలే దానిని పరిష్కరించుకోవాలని చెబుతూ పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసింది. చైనా ప్రభుత్వ అధికార ప్రతినిధి గెంగ్ విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా భారత్, పాక్‌లు కశ్మీర్‌లు సమస్య ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. అయితే చైనా తన మాట మీద ఎంతవరకు నిలబడుతుందన్నది ప్రశ్నార్థకమే.
టూర్ షెడ్యూల్ ఇదీ
మామల్లపురం (మహాబలిపురం) పాండవుల రథాల దగ్గర శుక్రవారం సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మోదీ, జిన్‌పింగ్ పాల్గొంటారు. అదే రోజు రాత్రి జిన్‌పింగ్ గౌరవార్థం సముద్ర తీర ప్రాంతంలో విందు ఉంటుంది. విందు చివర్లో ఇరుదేశాలకు చెందిన సీనియర్ అధికారులు పాలుపంచుకుంటారు.ఆ తర్వాత జిన్‌పింగ్ చెన్నైలో తను బస చేసే హోటల్‌కు వెళ్లిపోతారు.అక్టోబర్ 12 శనివారం ఉదయం 10 గంటలకు సముద్ర తీర ప్రాంతంలోని ఫైవ్‌స్టార్ రిసార్ట్‌లో మోదీ, జిన్‌పింగ్ 40 నిముషాల సేపు మాట్లాడుకుంటారు. తర్వాత ఇరువైపు దౌత్యబృందాలు అధికారిక చర్చలు జరుపుతాయి. అది పూర్తయ్యాక భోజనం సమయంలో మళ్లీ మోదీ , జిన్‌పింగ్‌లు చర్చిస్తారు.
చర్చకు వచ్చే అంశాలు
కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే 370 ఆర్టికల్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే చైనా అధ్యక్షుడి భారత్ రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనాకు సరిహద్దుగా ఉన్న లద్దాఖ్‌ను కశ్మీర్ 370 అధికరణం రద్దు చేయడం ద్వారా కేంద్ర పాలిత ప్రాంతం చేయడంతో ఈ అంశం ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌కు 100 కి.మీ. దూరంలో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ నిర్వహిస్తున్న సైనిక కసరత్తులు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, ఆర్థిక సంబంధాలు, విదేశాంగ విధానాలు, చైనా 5జీ నెట్‌వర్క్ విధానం తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు తమ మనోభావాలను పంచుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment