![PM Narendra Modi bilateral talks with France President Emmanuel Macron](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/pm.jpg.webp?itok=49lKalEl)
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ నిర్ణయం
పారిస్ నుంచి మాసే సిటీకి వెళ్తూ విమానంలో ద్వైపాక్షిక చర్చలు
పారిస్: వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులతోపాటు కీలక రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ నిర్ణయించుకున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంతోపాటు అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల నడుమ పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయానికొచ్చారు.
ఇరుదేశాలు కలిసికట్టుగా ముందుకు సాగుతూ బలీయమైన శక్తులుగా ఎదగాలన్నదే తమ ఆశయమని పేర్కొన్నారు. ప్రజా బాహుళ్యానికి సామాజికంగా, ఆర్థికంగా లబ్ధి చేకూర్చడానికి, పర్యావరణ పరిరక్షణకు కృత్రిమ మేధ(ఏఐ)ను సవ్యదిశలో ఉపయోగించుకొనేలా చర్యలు తీసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని ఇద్దరు నేతలు ఉద్ఘాటించారు. నరేంద్ర మోదీ, ఇమ్మానుయేల్ మాక్రాన్ బుధవారం సమావేశమయ్యారు.
ఇరువురు నేతలు ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి మాసే నగరానికి విమానంలో వెళ్తూ చర్చల్లో పాల్గొన్నారు. భారత్, ఫ్రాన్స్ మధ్య సుదృఢమైన సంబంధాలే లక్ష్యంగా విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు సైతం ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఈ ఏడాది ద్వైపాక్షిక సహకారం విషయంలో డిజిటల్ హెల్త్, యాంటీ–మైక్రోబియల్ రెసిస్టెన్స్, రెండు దేశాల మధ్య ఆరోగ్య నిపుణుల మార్పిడిని ప్రాధాన్య అంశాలుగా గుర్తించారు.
2026లో ‘ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని మోదీ, మాక్రాన్ తేల్చి చెప్పారు. ఈ అంశంతోపాటు అంతర్జాతీయ వ్యవహారాలపై పరస్పరం సమన్వయంతో పని చేయాలని అంగీకారానికి వచ్చారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు గట్టిగా మద్దతు ఇస్తున్నామని మాక్రాన్ ఈ సందర్భంగా స్పష్టంచేశారు. భారత్, ఫ్రాన్స్ మధ్య బంధం గత 25 ఏళ్లుగా నానాటికీ బలపడుతోందని, బహుముఖ భాగస్వామ్యంగా రూపాంతరం చెందుతోందని ఇరువురు నేతలు హర్షం వ్యక్తంచేశారు.
రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రక్షణ, పౌర అణు ఇంధనం, అంతరిక్షం వంటి కీలక వ్యూహాత్మక రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని మోదీ, మాక్రాన్ సమీక్షించారు. వచ్చే సంవత్సరాన్ని ‘ఇండియా–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’గా జరుపుకోబోతున్న నేపథ్యంలో నవీన ఆవిష్కరణల్లో పరస్పర సహకారానికి అత్యధిక ప్రాధాన్యం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ గౌరవార్థం అధ్యక్షుడు మాక్రాన్ మాసే సమీపంలోని కసీస్ పట్టణంలో రాత్రి విందు ఇచ్చారు. త్వరలో భారత్‌లో పర్యటించాలని మాక్రాన్‌ను మోదీ ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఉమ్మడిగా అణు రియాక్టర్ల అభివృద్ధి
ఇంధన భద్రత, కర్బన రహిత ఆర్థిక వ్యవస్థకు అణు విద్యుత్ ఉత్పత్తి చాలా ముఖ్యమని నరేంద్ర మోదీ, ఇమ్మానుయేల్ మాక్రాన్ అభిప్రాయపడ్డారు. అత్యాధునిక న్యూక్లియర్ రియాక్టర్లను ఉమ్మడిగా అభివృద్ధి చేసుకోవడానికి వారు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు(ఎస్‌ఎంఆర్), అడ్వాన్స్‌డ్ మాడ్యులర్ రియాక్టర్లు(ఏఎంఆర్)ల అభివృద్ధికి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
భారతీయ జవాన్లకు నివాళులు
మాసే సిటీకి చేరుకున్న మోదీ, మాక్రాన్‌లకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాసేలోని చరిత్రాత్మక మజర్‌గిస్ శ్మశాన వాటికను మోదీ, మాక్రాన్ సందర్శించారు. 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచయుద్ధంలో ప్రాణత్యాగాలు చేసిన భారతీయ సైనికులకు ఘనంగా నివాళులరి్పంచారు. ఇక్కడి ఇండియన్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు.
సావర్కర్‌కు మోదీ నివాళులు
భారత స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌కు మాసే సిటీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాళులరి్పంచారు. సముద్ర తీరప్రాంత నగరమైన మాసే నుంచే సావర్కర్ సాహసోపేతంగా తప్పించుకొనేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సావర్కర్‌ను బ్రిటిషర్ల కస్టడీకి అప్పగించవద్దంటూ అప్పట్లో మాసే ప్రజలు, ఫ్రెంచ్ కార్యకర్తలు ఉద్యమించారని వివరించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఉద్ఘాటించారు. సావర్కర్ ధైర్యసాహసాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని కొనియాడారు. 1910 జూలై 8న మాసేలో బ్రిటిషర్ల ఓడలో బందీగా ఉన్న సావర్కర్ అక్కడి నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించారు. కానీ, ఫ్రెంచ్ అధికారులు ఆయనను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ బ్రిటిషర్లకు అప్పగించారు. తర్వాత సావర్కర్‌కు బ్రిటిష్ పాలకులు జీవిత ఖైదు విధించారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలుకు తరలించారు.
ఇండియన్ కాన్సులేట్ ప్రారంభం
ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ బుధవారం మాసే సిటీలో భారత నూతన కాన్సులేట్‌ను సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారతీయులు, ఫ్రాన్స్ పౌరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ దేశ జాతీయ జెండాలు చేతబూని సందడి చేశారు.
మా యువ శక్తిపై పందెం కాయొచ్చు
ప్రధాని మోదీ పారిస్‌లో గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్‌తో సమావేశమయ్యారు. కృత్రిమ మేధ(ఏఐ)తో భారత్‌కు లభించే అవకాశాలపై వారు చర్చించారు. ఇండియాలో డిజిటల్ పరివర్తన కోసం గూగుల్, ఇండియా ఎలా కలిసి పని చేయాలన్నదానిపై మాట్లాడుకున్నారు. మోదీతో సమావేశమైన ఫొటోలను సుందర్ పిచాయ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దీనిపై మోదీ ప్రతిస్పందించారు. ప్రజా ప్రయోజనాల కోసం కృత్రిమ మేధను సమర్థంగా ఉపయోగించుకొనే విషయంలో ఇండియా వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అవకాశాల గనిగా మారిన భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘మా యువ శక్తిపై మీరు పందెం కాయొచ్చు’’ అని పెట్టుబడిదారులకు సూచించారు.
అమెరికాకు పయనమైన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని అమెరికాకు బయలుదేరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన సమావేశం కానున్నారు. మెర్సియిల్ ఎయిర్‌పోర్టులో మోదీకి మాక్రాన్ వీడ్కోలు పలికారు. ‘థాంక్యూ ఫ్రాన్స్’ అంటూ మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫ్రాన్స్ పర్యటన ఫలవంతంగా జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment