Bilateral agreements
-
వియత్నాంతో పుతిన్ చెట్టపట్టాల్
హనోయి: యుద్ధోన్మాదంతో ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగాక అంతర్జాతీయ మద్దతు కరువైన తరుణంలో రష్యా ఆసియా దేశాలతో మైత్రికి మొగ్గుచూపుతోంది. అందులోభాగంగానే ఉత్తర కొరియా పర్యటన ముగించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం అక్కడి నుంచి నేరుగా వియత్నాం చేరుకున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా గురువారం వియత్నాం అధ్యక్షుడు టో లామ్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపారు. విద్య, శాస్త్ర సాంకేతికత, చమురు, సహజవాయువుల అన్వేషణ, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అణు శాస్త్ర సాంకేతికతపై ఉమ్మడి పరిశోధనకూ అంగీకరించారు. -
Russia-North Korea relations: మరింత బలమైన మైత్రీబంధం
సియోల్: పశ్చిమ దేశాల ఆంక్షల కత్తులు వేలాడుతున్నా రష్యా, ఉత్తర కొరియాలు మైత్రిబంధంతో మరింత దగ్గరయ్యాయి. శత్రుదేశం తమపై దాడి చేస్తే తోటి దేశం సాయపడేలా కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపైనా విస్తృతస్తాయి చర్చలు జరిపి కొన్ని కీలక ఉమ్మడి ఒప్పందాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉ.కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు. ఘన స్వాగతం పలికిన కిమ్సరిగ్గా 24 ఏళ్ల తర్వాత ఉ.కొరియాలో పర్యటిస్తున్న పుతిన్‌కు ప్యాంగ్యాంగ్ నగర శివారులోని ఎయిర్‌పోర్ట్‌లో కిమ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కిమ్–2 సంగ్ స్క్వేర్‌లో వేలాది మంది చిన్నారులు బెలూన్లు ఊపుతూ పుతిన్‌కు ఆహ్వానం పలికారు. సైనికుల నుంచి పుతిన్ గౌరవవందనం స్వీకరించారు. తర్వాత అక్కడే తన సోదరి కిమ్ యో జోంగ్‌ను పుతిన్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అక్కడి విమోచనా స్మారకం వద్ద పుతిన్ నివాళులర్పించారు.పలు రంగాలపై ఒప్పందాలు‘కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్’ అధికార భవనానికీ పుతిన్, కిమ్‌లు ఒకే కారులో వచ్చారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి, మానవ సంబంధాల రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1991లో సోవియట్ రష్యా పతనం తర్వాత ఇంతటి విస్తృతస్థాయిలో ఒప్పందాలు కుదర్చుకోవడం ఇదే మొదటిసారి. ‘ఈ ఒప్పందం అత్యంత పటిష్టమైంది. కూటమి అంత బలంగా ఇరుదేశాల సత్సంబంధాలు కొనసాగుతాయి. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి పూర్తి మద్దతు, సాయం ప్రకటిస్తున్నా’’ అని కిమ్ అన్నారు. అయితే ఉ.కొరియా ఎలాంటి సాయం చేయబోతోందనేది కిమ్ వెల్లడించలేదు. ‘‘ మైత్రి బంధాన్ని సమున్నత శిఖరాలకు చేర్చే విప్లవాత్మకమైన ఒప్పందమిది. అయితే ఉ.కొరియాకు సైనిక సాంకేతిక సహకారం అనేది ఈ ఒప్పందంలో లేదు’ అని పుతిన్ స్పష్టంచేశారు. ఇరుదేశాల సరిహద్దు వెంట వంతెన నిర్మాణం, ఆరోగ్యసంరక్షణ, వైద్య విద్య, సామాన్య శాస్త్ర రంగాల్లోనూ ఒప్పందాలు కుదిరాయని రష్యా ప్రకటించింది.కారు నడిపిన పుతిన్, కిమ్కుమ్సుసాన్ ప్యాలెస్‌కు బయల్దేరిన సందర్భంగా వారు ప్రయాణించిన లిమో జిన్ కారును పుతిన్ స్వయంగా నడిపారు. మార్గ మధ్యంలో ఒక చోట ఆగి పచ్చిక బయళ్లపై కొద్దిసేపు నడుస్తూ మట్లాడు కున్నారు. మార్గమధ్యంలో మరో చోట ఆగి పుతిన్‌కు కిమ్ టీ పార్టీ ఇచ్చారు. తర్వాత సంగీత కచేరీకి వెళ్లారు. తర్వాత కిమ్ సైతం పుతిన్‌ను వెంటబెట్టుకుని ఆ కారును నడిపారు. ఒప్పందాల తర్వాత పుతిన్ చిత్రప టం ఉన్న కళాఖండాలను పుతిన్‌కు కిమ్ బహూకరించారు. కిమ్‌కు పుతిన్ రష్యాలో తయారైన ఆరాస్ లిమోజిన్ కారు, టీ కప్పుల సెట్, నావికా దళ ఖడ్గాన్ని బహుమ తిగా ఇచ్చారు. కిమ్‌కు పుతిన్ లిమోజిన్ కారును బహుమతిగా ఇవ్వడం ఇది రెండోసారి. -
ఫ్రాన్స్‌లో మోదీకి రెడ్‌కార్పెట్
పారిస్: ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బార్నీ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి పూర్తి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటారు. అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో సమావేశమవుతారు. ‘‘పారిస్ చేరుకున్నా. భారత్–ఫ్రాన్స్ మధ్య మరింత సంబంధాలు బలపడేందుకు నా పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నా’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్‌లోని భారతీయులతో భేటీ కాబోతున్నానని వెల్లడించారు. వారంతా ఆయన బస చేసిన హోటల్ బయట గుమికూడి ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. వారితో మోదీ ముచ్చటించారు. ప్రవాస భారతీయులు తమ నైపుణ్యాలు, కష్టించే తత్వంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారని ప్రశంసించారు. ఈ పర్యటన నాకెంతో ప్రత్యేకం భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి తన పర్యటనతో మరింత ఊపొస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. ఫ్రాన్స్ బయల్దేరే ముందు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. రక్షణ భాగస్వామ్యంతోపాటు కీలక అంశాలపై ఆయనతో చర్చించబోతున్నానని వివరించారు. రాబోయే పాతికేళ్లలో ఇరు దేశాల బంధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చిస్తామన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మాక్రాన్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ఫ్రాన్స్ పర్యటన తనకెంతో ప్రత్యేకమని ఉద్ఘాటించారు. నేషనల్ డే పరేడ్‌లో 269 మంది జవాన్ల భారత బృందం పాలుపంచుకోనుంది. తర్వాత మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని అబూదాబీలో పర్యటిస్తారు. 26 రఫేల్ జెట్లు, 3 స్కారి్పన్ సబ్మెరైన్లు న్యూఢిల్లీ: నావికా దళం కోసం 26 రఫేల్ యుద్ధ విమానాలు, 3 స్కార్పిన్ జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే ప్రతిపాదనలకు రక్షణ శాఖ గురువారం ఆమోద ముద్ర వేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని రక్షణ ఆయుధాల సేకరణ మండలి (డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుల విలువ రూ.85,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతం కానుంది. ప్రధాని మోదీ శుక్రవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీఅలో ద్వైపాక్షిక వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతంలో భాగంగా రఫేల్, స్కారి్పన్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటారని సమాచారం. వైమానిక దళం కోసం ఫ్రాన్స్ నుంచి 36 ఫైటర్ జెట్లను భారత్ ఇప్పటికే కొనుగోలు చేసింది. -
సరిహద్దుల్లో శాంతితోనే సత్సంబంధాలు
న్యూఢిల్లీ: భారత్–చైనా మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు సమస్యలన్నీ ద్వైపాక్షిక ఒప్పందాలకు లోబడి పరిష్కారం కావాల్సి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుండబద్దలు కొట్టారు. గురువారం ఆయన చైనా రక్షణ మంత్రి లి షంగ్ఫుతో చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి(ఎల్ఏసీ) మూడేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) దేశాల రక్షణ మంత్రుల సమావేశం కోసం లి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్, లి సుమారు 45 నిమిషాలసేపు చర్చలు జరిపారు. ఇరువురు మంత్రులు సరిహద్దు వివాదాలతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై ఎటువంటి దాపరికాలు లేకుండా చర్చలు జరిపినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్ఏసీ వెంట నెలకొన్న వివాదాలు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, హామీలు, ఒడంబడికలకు లోబడి పరిష్కారం కావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ‘సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని బట్టే రెండు దేశాల మధ్య సంబంధాల కొనసాగింపు ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ఒప్పందాల ఉల్లంఘనలతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని, ఉద్రిక్తతలు సడలిన తర్వాత మాత్రమే బలగాల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు’అని రక్షణ శాఖ ఆ ప్రకటనలో వివరించింది. -
ఫిలిప్పీన్స్‌కు భారత్ బ్రహ్మోస్
న్యూఢిల్లీ: భారత తయారీ బ్రహ్మోస్ మిస్సైళ్లను ఫిలిప్పీన్స్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఇరు ప్రభుత్వాల మధ్య త్వరలో ఒక ఒప్పందం కుదరనుంది. ఫిలిప్పీన్స్ నేవీకి బ్రహ్మోస్‌ను అందించే ఈ డీల్‌పై సంవత్సరాలుగా చర్చలు సాగుతున్నాయి. తాజా ఒప్పందంతో భారత్– ఫిలిప్పీన్స్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం మరింత బలోపేతం కానుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 413 కోట్లని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఆ దేశ బడ్జెట్‌శాఖ ఇటీవల రెండు ఎస్‌ఏఆర్‌ఓ(స్పెషల్ అలాట్మెంట్ రిలీజ్ ఆర్డర్స్)ను విడుదల చేసింది. వచ్చే కొన్ని వారాల్లో కొనుగోలు విషయమై అధికారిక ప్రకటన వెలువడచ్చని తెలుస్తోంది. ఫిలిప్పీన్స్‌కు అందజేయబోయే క్షిపణుల రేంజ్ సుమారు 290 కిలోమీటర్లు. ఇది ధ్వని వేగానికి దాదాపు 3 రెట్లు అధిక వేగంతో పయనిస్తుంది. దీన్ని సబ్మెరైన్లు, నౌకలనుంచి ప్రయోగించవచ్చు. ఇటీవల కాలంలో సైనిక విభాగాల ఆధునీకరణకు ఫిలిప్పీన్స్ పలు చర్యలు తీసుకుంటోంది. భారత్, ఫిలిప్పీన్స్ గత ఆగస్టులో దక్షిణ చైనా సముద్రంలో నౌకా విన్యాసాలు జరిపాయి. ఈ ప్రాంతంలో ఫిలిప్పీన్స్‌కు చైనాతో వివాదాలున్నాయి. ఇండో రష్యన్ జాయింట్ వెంచర్లో భాగంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధి చేశారు. -
చైనాతో శాంతియుత పరిష్కారం
న్యూఢిల్లీ: తూర్పు లదాఖ్‌లో సరిహద్దుల వద్ద తలెత్తిన విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్, చైనా అంగీకారానికి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. రెండు దేశాల మధ్య అమలవుతున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, మార్గదర్శకాలకు లోబడి చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఏకాభిప్రాయం కుదిరిందని విదేశాంగ శాఖ తెలిపింది. లదాఖ్ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఆదివారం రెండు దేశాల సైనికాధికారులు జరిపిన ఉన్నత స్థాయి చర్చలపై ఈ మేరకు స్పందించింది. ‘ఈ భేటీ స్నేహపూర్వక, సానుకూల వాతావరణంలో జరిగింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తవుతున్నందున విభేదాలకు త్వరగా పరిష్కారం కనుగొనాలి. ఇండో–చైనా సరిహద్దుల్లో శాంతి, సామరస్య పరిస్థితులు ద్వైపాక్షిక సంబంధాలు మరింత అభివృద్ది చెందేందుకు దోహదపడతాయి’అని విదేశాంగ శాఖ పేర్కొంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు, సరిహద్దుల్లో శాంతి, సామరస్య పూర్వక పరిస్థితులను నెలకొల్పేందుకు సైనిక, దౌత్యపరమైన సంబంధాలను రెండు దేశాలు కొనసాగిస్తాయని తెలిపింది. శనివారం నాటి భేటీతో కచ్చితమైన ఫలితాలు వస్తాయని తాము అనుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఉన్నత స్థాయి సైనిక సంభాషణలు సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేస్తాయి కాబట్టి చాలా ముఖ్యమైనవని పేర్కొన్నాయి. -
డ్రాగన్ దారికొచ్చేనా..!
-
సంయుక్త ప్రకటనలు, ఒప్పందాలు ఉండవ్
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీల మధ్య సమావేశానికి సన్నాహాలు పూర్తయ్యాయి. అక్టోబరు 11, 12వ తేదీల్లో చెన్నై సమీపంలోని మహాబలిపురం వేదికగా ఇరుదేశాల నేతల సమావేశం జరుగుతుందని భారత్, చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను పంచుకునేందుకు ఈ సమావేశాలు వీలు కల్పిస్తాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది జిన్‌పింగ్‌ది అనధికార పర్యటన కావడంతో ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు, సంయుక్త ప్రకటనలు, పత్రికా ప్రకటనలు ఉండవు. కేవలం ఇరువురు నేతల మధ్య వ్యక్తిగత సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ఉద్దేశం. జిన్‌పింగ్ గడిపే 24 గంటల్లో మోదీతో కనీసం నాలుగుసార్లు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. చారిత్రక ప్రాంతమైన మహాబలిపురంలో జరిగే సాంస్కృతిక ఉత్సవాలకు జిన్‌పింగ్, మోదీలు హాజరవుతారు. బంగాళాఖాతం సముద్ర అందాలను వీక్షిస్తూ చెన్నైలో రిసార్ట్‌లో ఇరువురు నేతలు అంతరంగిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. కశ్మీర్ ద్వైపాక్షిక అంశం: చైనా జిన్‌పింగ్ భారత్ పర్యటన నేపథ్యంలో కశ్మీర్ అంశంపై చైనా తన అభిప్రాయాన్ని బహిరంగ పరిచింది. ఇన్నాళ్లూ పాక్‌కు మద్దతుగా నిలిచిన చైనా ఆ దేశానికి షాక్ ఇచ్చింది. కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని, ఆ రెండు దేశాలే దానిని పరిష్కరించుకోవాలని చెబుతూ పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసింది. చైనా ప్రభుత్వ అధికార ప్రతినిధి గెంగ్ విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా భారత్, పాక్‌లు కశ్మీర్లు సమస్య ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. అయితే చైనా తన మాట మీద ఎంతవరకు నిలబడుతుందన్నది ప్రశ్నార్థకమే. టూర్ షెడ్యూల్ ఇదీ మామల్లపురం (మహాబలిపురం) పాండవుల రథాల దగ్గర శుక్రవారం సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మోదీ, జిన్‌పింగ్ పాల్గొంటారు. అదే రోజు రాత్రి జిన్‌పింగ్ గౌరవార్థం సముద్ర తీర ప్రాంతంలో విందు ఉంటుంది. విందు చివర్లో ఇరుదేశాలకు చెందిన సీనియర్ అధికారులు పాలుపంచుకుంటారు.ఆ తర్వాత జిన్‌పింగ్ చెన్నైలో తను బస చేసే హోటల్‌కు వెళ్లిపోతారు.అక్టోబర్ 12 శనివారం ఉదయం 10 గంటలకు సముద్ర తీర ప్రాంతంలోని ఫైవ్‌స్టార్ రిసార్ట్‌లో మోదీ, జిన్‌పింగ్ 40 నిముషాల సేపు మాట్లాడుకుంటారు. తర్వాత ఇరువైపు దౌత్యబృందాలు అధికారిక చర్చలు జరుపుతాయి. అది పూర్తయ్యాక భోజనం సమయంలో మళ్లీ మోదీ , జిన్‌పింగ్‌లు చర్చిస్తారు. చర్చకు వచ్చే అంశాలు కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే 370 ఆర్టికల్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే చైనా అధ్యక్షుడి భారత్ రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనాకు సరిహద్దుగా ఉన్న లద్దాఖ్‌ను కశ్మీర్ 370 అధికరణం రద్దు చేయడం ద్వారా కేంద్ర పాలిత ప్రాంతం చేయడంతో ఈ అంశం ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌కు 100 కి.మీ. దూరంలో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ నిర్వహిస్తున్న సైనిక కసరత్తులు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, ఆర్థిక సంబంధాలు, విదేశాంగ విధానాలు, చైనా 5జీ నెట్వర్క్ విధానం తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు తమ మనోభావాలను పంచుకుంటారు. -
అసంప్షన్ ద్వీపంపై ముందడుగు
న్యూఢిల్లీ: సీషెల్స్‌లోని అసంప్షన్ ద్వీపంలో నౌకాదళ కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నేవల్ బేస్ ప్రాజెక్టు నిర్మాణానికి భారత్, సీషెల్స్ మధ్య అంగీకారం కుదిరింది. భారత పర్యటనలో ఉన్న సీషెల్స్ అధ్యక్షుడు డేనీ ఫార్, ప్రధాని మోదీ మధ్య సోమవారం జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో హిందూ మహాసముద్రంలో భారత్ ప్రభావం పెరగనుంది. మోదీ, ఫార్ మధ్య సోమవారం రక్షణతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలపైనా చర్చలు జరిగాయి. సీషెల్స్‌కు 10కోట్ల డాలర్ల (దాదాపు రూ.680కోట్లు ) రుణం ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది. దీని ద్వారా సీషెల్స్‌లో మిలటరీ మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుందని ఫార్ పేర్కొన్నారు. మా లక్ష్యం ఒక్కటే!: మోదీ ‘భారత్, సీషెల్స్‌లు కీలక వ్యూహాత్మక భాగస్వాములు. ప్రజాస్వామ్య విలువలను ఇరుదేశాలు గౌరవిస్తాయి. హిందూ మహాసముద్రంలో శాంతి భద్రతలు, సుస్థిరత నెలకొనాలన్నది మా లక్ష్యం’ అని మోదీ అన్నారు. 2015లో సీషెల్స్ పర్యటనలో హామీ ఇచ్చినట్లుగా.. డార్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను సీషెల్స్‌కు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ద్వీప సముదాయ దేశ రక్షణ సామర్థ్యం, తీర ప్రాంత మౌలికవసతులు పెంచుకునేందుకు భారత్ అన్ని విధాలా సాయం చేస్తుందని మోదీ స్పష్టం చేశారు. సీషెల్స్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీ, తీరప్రాంత భద్రత, వైట్ షిప్పింగ్ (మిలటరీయేతర వాణిజ్య నౌకల రవాణాపై సమాచార మార్పిడి), సీషెల్స్ దౌత్యాధికారులకు శిక్షణ (ఇరుదేశాల విదేశాంగ శాఖల మధ్య), గోవా సిటీ కార్పొరేషన్– సిటీ ఆఫ్ విక్టోరియా (సీషెల్స్) మధ్య పరస్పర సహకారంపై ఒప్పందాలు కుదిరాయి. భారత రాష్ట్రపతి కోవింద్ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు వచ్చిన ఫార్ ఢిల్లీకి రాకముందే అహ్మదాబాద్, గోవాల్లో పర్యటించారు. భారత పర్యటన సందర్భంగా అలదాబ్రా జాతికి చెందిన రెండు భారీ తాబేళ్లను సీషెల్స్ అధ్యక్షుడు కానుకగా ఇచ్చారు. వీటిని హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉంచనున్నారు. ఫార్.. సోమవారం మోదీతో సమావేశం అనంతరం జరిగిన విందు సమావేశంలో సితార్ వాయించారు. ‘భారత్‌తో స్నేహబంధాన్ని సీషెల్స్ అధ్యక్షుడు ఫార్ వినూత్నంగా వ్యక్తపరిచారు. మోదీ ఏర్పాటుచేసిన విందులో సితార్ వాయిస్తూ.. పాట పాడారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొంటూ.. ఫార్ పాడిన పాటను ట్వీట్ చేశారు. ఆరోగ్యం జాగ్రత్త! రాష్ట్రపతి భవన్లో ఫార్ కోసం ఏర్పాటుచేసిన ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ కార్యక్రమంలో ఓ ఐఏఎఫ్ సైనికుడు వేసవి తాపం ధాటికి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడున్న అధికారులు, సహచరులు ఆయన్ను పక్కన కూర్చోబెట్టి ప్రాథమిక చికిత్సనందించారు. అయితే, కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ.. ఆ సైనికుడి వద్దకెళ్లి పరామర్శించారు. కాసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. అసంప్షన్ కథేంటి? హిందూ మహాసముద్రంలోని సీషెల్స్‌లో పాగా వేయడం భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకం. 115 ద్వీపాల సమూహమైన సీషెల్స్‌తో ఒప్పందం కారణంగా ఈ ప్రాంతంలో భారత్ తన ప్రభావం పెంచుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఈ సముద్రంలోని వివిధ దేశాల్లో తన మిలటరీ అస్తిత్వాన్ని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అందుకే తన ప్రాభవాన్ని పెంచుకోవాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది. 2015లోనే అసంప్షన్ ఐలాండ్‌ను అభివృద్ధి చేసేందుకు భారత్ ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. సీషెల్స్‌లో దీనిపై వ్యతిరేకత మొదలైంది. చైనా–భారత్‌ల మిలటరీ వ్యూహంలో చిక్కుకుపోతామనే భావన అక్కడి ప్రజల్లో వ్యక్తమైంది. కాగా, ‘మా తీరప్రాంత భద్రతను దృష్టిలో పెట్టుకుని అసంప్షన్ ద్వీపంపై చర్చించాం. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాం’ అని ఫార్ అన్నారు. -
ధోరణి మార్చని చైనా!
సంపాదకీయం: భారత్-చైనా సంబంధాలు ఏ కొంచెమైనా మెరుగుపడతాయనుకున్న ప్రతిసారీ ఏదో ఒక అపశ్రుతి వినబడటం రివాజుగా మారింది. రెండు నెలలక్రితం ప్రధాని మన్మోహన్సింగ్ చైనా పర్యటించినప్పుడు ప్రధాన అంశాలపై ఎలాంటి ఒప్పందాలూ లేకపోయినా ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు అది ఎంతోకొంత దోహదపడిందని అందరూ సంతోషించారు. తీరా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించేసరికి చైనా తన వెనకటి గుణాన్ని ప్రదర్శించింది. ‘రెండు దేశాలమధ్యా ఉన్న సరిహద్దుల్లో సమస్యలు ముదిరేలా చేయవద్ద’ని హితవు పలికింది. అంతేకాదు... అరుణాచల్ తమ దేశంలో అంతర్భాగమని మరోసారి చెప్పుకొచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మొదటినుంచీ ఇలాగే ప్రవర్తిస్తోంది. దాన్ని ‘వివాదాస్పద ప్రాంతం’గా అభివర్ణిస్తోంది. 1988 నుంచి ఇరుదేశాల మధ్యా సాన్నిహిత్యానికి చురుగ్గా ప్రయత్నాలు సాగాయి. శిఖరాగ్రస్థాయి సమావేశాలు చాలామార్లు జరిగాయి. ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. వాణిజ్య ఒప్పందాలూ అమల్లోకి వచ్చాయి. అలాగని చైనా ఎప్పుడూ తన అలవాట్లను మార్చుకోలేదు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగానే ప్రవర్తిస్తూవచ్చింది. మొన్నటికి మొన్న జూలైలో లడఖ్ ప్రాంతంలో చైనా చొరబాటు యత్నం చేసింది. అటు తర్వాత రెండు చైనా హెలికాప్టర్లు మన భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. సరిగ్గా ఈ ఘటనలు జరగడానికి కొన్ని రోజులముందే మన రక్షణమంత్రి ఎ.కె. ఆంటోనీ అక్కడకు వెళ్లొచ్చారు. దీన్నిబట్టి చైనా చేష్టలు ఎలా ఉంటున్నాయో అంచనా వేసుకోవచ్చు. ఏడాదిక్రితం చైనాకు చెందిన అణ్వాయుధ సుఖోయ్ యుద్ధ విమానాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా తరచుగా ఇలా మాట్లాడటం వెనక మన నాయకత్వం నిర్వాకం కూడా ఉంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా అరుణాచల్ అభివృద్ధిని విస్మరించారు. అది భారత్‌లో అంతర్భాగమని తరచు అనడమే తప్ప ఆ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపానపోలేదు. వాస్తవానికి అది చైనాతోనే కాదు... అటు భూటాన్‌తో, ఇటు మయన్మార్‌తో సరిహద్దులున్న రాష్ట్రం. తూర్పు ఆసియాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంలో కీలకపాత్ర పోషించగల ప్రాంతం. అయితే, 1962 యుద్ధం తర్వాత మన పాలకులు మర్యాదస్తుల్లా మారారు. అందుకు సంబంధించి ఏంచేసినా చైనాకు కోపం తెప్పించినట్టవుతుందన్న భావనతో ఉండిపోయారు. ఒక్క అరుణాచల్ మాత్రమే కాదు...మిగిలిన ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రైల్వేలైన్లు, రోడ్లు, వైమానిక సౌకర్యాలు...అన్నీ అరకొరగానే మిగిలిపోయాయి. అటు చైనా మాత్రం సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు రహదారులు, ఇతర హంగులూ సమకూర్చుకుంటున్నది. తన ఉనికిని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. మన దేశం ఆలస్యంగానైనా కళ్లు తెరిచి మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించినా అందులో చురుకుదనంపాలు చాలా తక్కువ. 2016 నాటికల్లా 61 రహదారులు నిర్మించాలని పథకరచన జరగ్గా అందులో పట్టుమని 15 కూడా కార్యరూపం దాల్చలేదు. నిధుల కొరత, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఫైళ్ల నత్తనడక ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించాలని, అది వ్యూహాత్మకంగా మనకు అవసరమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పడాన్ని స్వాగతించాలి. అరుణాచల్‌ను, ఇతర ఈశాన్య రాష్ట్రాలనూ మారుమూల ప్రాంతాలుగా పరిగణించడం మాని, ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి దేశంలోని ఇతర ప్రాంతాలతో వాటిని అనుసంధానించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆ పనిచేస్తే ఈశాన్య ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అక్కడ ప్రశాంత పరిస్థితులు కూడా నెలకొంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఇప్పటికే కొన్ని చర్యలు ప్రారంభించాయి. మరికొన్ని నెలల్లో ఇటానగర్‌కు రైలు లింకు ఏర్పడబోతున్నది. అలాగే, అక్కడ జల విద్యుత్తు ప్రాజెక్టుల జోరు కూడా పెరుగుతున్నది. ఇరుగుపొరుగుతో మన సంబంధాలు బాగుండాలి. అందులో సందేహమేమీ లేదు. ముఖ్యంగా ఆసియాలో భౌగోళికంగా చూసినా, జనాభారీత్యా చూసినా భారత్, చైనాలు రెండు పెద్ద దేశాలు. పరస్పర సహకారంతో ముందుకెళ్తే ఈ రెండు దేశాలూ లబ్ధిపొందుతాయి. అంతర్జాతీయంగా ఇరుదేశాల పలుకుబడి కూడా పెరుగుతుంది. మొత్తంగా ఆసియా ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టమవుతుంది. కానీ, ఒంటిచేత్తో చప్పట్లు సాధ్యంకాదు. మన దేశం మాత్రమే చెలిమికి తహతహలాడితే సరిపోదు. సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఇరు దేశాల అధినేతలమధ్యా అంగీకారం కుదిరినప్పుడు చైనా దానికి కట్టుబడి ఉండాలి. అందుకు అనుగుణమైన ఆచరణను కనబరచాలి. అయితే, అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా భావిస్తూ ఇప్పటికీ అది తమదేనని చైనా వాదించడమే కాదు... అక్కడివారికి విడి వీసాలు జారీచేస్తోంది. మన ప్రధాని లేదా రాష్ట్రపతి అక్కడ పర్యటించినప్పుడల్లా అందుకు అభ్యంతరం చెప్పడం దానికి అలవాటైంది. ఒకపక్క సరిహద్దు వివాదాన్ని చర్చలద్వారా తేల్చుకుందామంటూనే ఇలా ప్రవర్తించడంలోని ఆంతర్యమేమిటో ఆ దేశమే చెప్పాలి. రెండు దేశాలూ చిత్తశుద్ధితో చర్చలు సాగిస్తే, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే ఇలాంటి వివాదాలు పరిష్కారంకావడం అసాధ్యంకాదు. కానీ, చర్చల దారి చర్చలదీ...తన ధోరణి తనది అన్నట్టుగా ఉంటే సమస్యలు సమస్యలుగానే ఉండిపోతాయని చైనా గుర్తించడం అవసరం. సైనిక పరంగా, మౌలిక సదుపాయాలపరంగా సరిహద్దుల్లో మన స్థానాన్ని పటిష్టంచేసుకుంటేనే అవతలివారు మనల్ని గౌరవిస్తారని, సామరస్యతకు ముందుకొస్తారని మన పాలకులు గ్రహించినట్టు కనబడుతోంది. ఇది శుభసూచకం.