న్యూఢిల్లీ: భారత తయారీ బ్రహ్మోస్ మిస్సైళ్లను ఫిలిప్పీన్స్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఇరు ప్రభుత్వాల మధ్య త్వరలో ఒక ఒప్పందం కుదరనుంది. ఫిలిప్పీన్స్ నేవీకి బ్రహ్మోస్‌ను అందించే ఈ డీల్‌పై సంవత్సరాలుగా చర్చలు సాగుతున్నాయి. తాజా ఒప్పందంతో భారత్– ఫిలిప్పీన్స్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం మరింత బలోపేతం కానుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 413 కోట్లని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఆ దేశ బడ్జెట్‌శాఖ ఇటీవల రెండు ఎస్‌ఏఆర్‌ఓ(స్పెషల్ అలాట్‌మెంట్ రిలీజ్ ఆర్డర్స్)ను విడుదల చేసింది.
వచ్చే కొన్ని వారాల్లో కొనుగోలు విషయమై అధికారిక ప్రకటన వెలువడచ్చని తెలుస్తోంది. ఫిలిప్పీన్స్‌కు అందజేయబోయే క్షిపణుల రేంజ్ సుమారు 290 కిలోమీటర్లు. ఇది ధ్వని వేగానికి దాదాపు 3 రెట్లు అధిక వేగంతో పయనిస్తుంది. దీన్ని సబ్‌మెరైన్లు, నౌకలనుంచి ప్రయోగించవచ్చు. ఇటీవల కాలంలో సైనిక విభాగాల ఆధునీకరణకు ఫిలిప్పీన్స్ పలు చర్యలు తీసుకుంటోంది. భారత్, ఫిలిప్పీన్స్ గత ఆగస్టులో దక్షిణ చైనా సముద్రంలో నౌకా విన్యాసాలు జరిపాయి. ఈ ప్రాంతంలో ఫిలిప్పీన్స్‌కు చైనాతో వివాదాలున్నాయి. ఇండో రష్యన్ జాయింట్ వెంచర్‌లో భాగంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment