న్యూఢిల్లీ: ఆయుధాలను, క్షిపణి వ్యవస్థల్ని ఎప్పుడూ దిగుమతి చేసుకునే భారత్ ఎగుమతి చేసే దిశగా తొలి అడుగు పడింది. మొట్టమొదటి సారిగా బ్రహ్మోస్ క్షిపణుల్ని ఫిలిప్పీన్స్‌కు విక్రయించనుంది. ఈ మేరకు భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 37.4 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం (రూ.28 వందల కోట్లకు పైనే) కుదిరింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో (బీఏపీఎల్) ఫిలిప్పీన్స్ రక్షణ శాఖ కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసినట్టుగా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, నేల మీద నుంచి నిర్దేశించిన లక్ష్యాలను బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు ఛేదించగలవు. ఫిలిప్పీన్స్ నేవీకి యాంటీ–షిప్ బ్రహ్మోస్ క్షిపణుల సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ)తో కలిసి బీఏపీఎల్ బ్రహ్మోస్ క్షిపణుల్ని తయారు చేస్తోంది. ఫిలిప్పీన్స్ నావికాదళం ఎన్ని క్షిపణుల్ని కొనుగోలు చేయనుందో రక్షణ శాఖ వెల్లడించలేదు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చైనా సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక ప్రాంతాల్లో బ్రహ్మోస్ క్షిపణుల్ని భారీగానే మోహరించింది. తాను సొంతంగా క్షిపణుల్ని తయారు చేయడమే కాకుండా ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిన చారిత్రక సందర్భంలో తాను ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని ఫిలిప్పీన్స్‌లో భారత రాయబారి శంభు కుమరన్ వ్యాఖ్యానించారు. ఈ కొనుగోలు ఒప్పందంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయని, ఇండో ఫసిఫిక్ ప్రాంతాల్లో శాంతి, స్వేచ్ఛాయుత వాణిజ్యమనే ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి మరో అడుగు పడినట్టయిందని కుమరన్ చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్, అస్త్ర, రాడార్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ కొనుగోలు కోసం కూడా పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని డీఆర్‌డీఒ చైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment