India exports
-
ఆరేళ్లలో ఎగుమతుల లక్ష్యం 2 ట్రిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ‘‘భారీ’’ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడానికి సమిష్టి కృషి అవసరమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఐఐఎఫ్‌టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) వార్షిక స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రసంగిస్తూ భారత్ వచ్చే ఆరేళ్ల కాలంలో ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘‘2030 నాటికి 2 ట్రిలియన్ల డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించడానికి మనమంతా భాగస్వాములు అవుదాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ ఎగుమతుల విలువ 800 బిలియన్ డాలర్లను అధిగమిస్తుంది. 2 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి మనం నిజంగా సమిష్టిగా ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. ఇది యాదృచ్చికంగా జరగదు. నిర్దిష్ట చర్యల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను’’ అని గోయల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.భారత్ మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 778 బిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతులు జరిగింది. ఆయా అంశాలపై ఇంకా గోయల్ ఏమన్నారంటే.. ఇతర దేశాలలో భారత్ ఉత్పత్తులు ఎదుర్కొంటున్న నాన్–టారిఫ్ అడ్డంకులను అధ్యయనం చేయడానికి విద్యార్థులు, అధ్యాపకులు సహకరించాలి. తద్వారా అధికారులు వాటిని పరిష్కరించడానికి వీలవుతుంది. త్వరలో దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్న ఐఐఎఫ్‌టీ కొత్త క్యాంపస్ ఎగుమతుల పురోగతికి మరింత చొరవ చూపుతుంది.స్నాతకోత్సవంలో ఎవరేమన్నారంటే... చర్చల కోసం ఒక కేంద్రాన్ని కూడా ఐఐఎఫ్‌టీ త్వరలో ఏర్పాటు చేయనుంది. ఈ తరహా చొరవ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, నైపుణ్యం వంటి అంశాలకు సంబంధించి ముఖ్యమైనది. ఈ కేంద్రం విద్యార్థులకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చల్లో అనుసరించాల్సిన నైపుణ్యాలను అందించడానికి దోహదపడుతుంది. భారత్ ఎగుమతుల పురోగతి విషయంలో కేస్ స్టడీస్‌ను సిద్ధం చేయడానికి కూడా ఈ కేంద్రం దోహదపడుతుంది. – సునీల్ భరత్వాల్, వాణిజ్య కార్యదర్శిపెరిగిన ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) ర్యాంకింగ్ 2024లో మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎఫ్‌టీ పన్నెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకుంది. రిక్రూట్మెంట్ కోసం అనేక పెద్ద సంస్థలు క్యాంపస్‌ను సందర్శిస్తున్నాయి. – రాకేష్ మోహన్ జోషి, ఐఐఎఫ్టి వైస్ ఛాన్సలర్ -
‘భారత్‌లో తయారీ’తో పెరిగిన ఎగుమతులు
న్యూఢిల్లీ: ‘మేక్ ఇన్ ఇండియా’ (భారత్‌లో తయారీ)తో భారత్ నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తయారీకి భారత్‌ను కేంద్రంగా మలిచే లక్ష్యంతో 2014 సెపె్టంబర్ 25న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మోదీ సర్కారు ప్రారంభించింది. పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా దీనిపై ‘ఎక్స్’లో ప్రధాని ఓ పోస్ట్ పెట్టారు. ‘‘వివిధ రంగాల్లో ఎగుమతులు ఎలా పెరిగాయన్నది గమనించాలి. సామర్థ్యాలు ఏర్పడ్డాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. సాధ్యమైన అన్ని విధాలుగా ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంస్కరణల విషయంలో భారత పురోగతి సైతం కొనసాగుతుంది’’అని తన పోస్ట్‌లో ప్రధాని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద 14 రంగాల్లో అదనపు సామర్థ్యాలపై ప్రోత్సాహకాలు కల్పించడం గమనార్హం. నిబంధనల అమలు, ఎఫ్‌డీఐ విధానాలు సులభంగా మార్చడం, మెరుగైన వ్యాపార వాతావరణానికి సంబంధించి సానుకూల చర్యలు ఇందుకు మద్దతుగా నిలిచినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీనికితోడు అవినీతి పట్ల కఠిన వైఖరి, ఎల్రక్టానిక్స్ తదితర వర్ధమాన రంగాల పట్ల ప్రత్యేక దృష్టి సారించడం మేక్ ఇన్ ఇండియా విజయవంతానికి, దేశ, విదేశీ పెట్టుబడులు పెరగడానికి సాయపడినట్టు చెప్పారు. ‘‘మనం గొప్ప విజయం సాధించాం. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో దేశంలో తయారీకి అద్భుతమైన భవిష్యత్ ఉంది’’అని గోయల్ పేర్కొన్నారు.తయారీ వాటా పెరుగుతుంది..మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో రానున్న సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ వాటా పెరుగుతుందని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశ అవసరాలు తీర్చడంతోపాటు ఎగుమతులు 2023–24లో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 778 బిలియన్ డాలర్లకు చేరుకునేలా ఈ కార్యక్రమం సాయపడినట్టు మంత్రి తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణకు చర్యలు తీసుకున్నట్టు మంత్రి గోయల్ తెలిపారు. గడిచిన పది ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్‌డీఐ రాక, అంతకుముందు పదేళ్ల (యూపీఏ హయాం) కాలంతో పోల్చి చూస్తే 119 శాతం పెరిగి 667 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు.100 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు‘‘ఏటా 70–80 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏటా 100 బిలియన్ డాలర్లకు పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’అని పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా సైతం ప్రకటించారు. ఎఫ్‌డీఐ దరఖాస్తుల అనుమతుల ప్రక్రియను గాడిలో పెడుతున్నట్టు చెప్పారు. దేశంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి వీలుగా రక్షణ, రైల్వేలు, బీమా, టెలికం తదితర రంగాలకు సంబంధించి నిబంధనలను సరళతరం చేసినట్టు తెలిపారు. -
ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: దాదాపు మూడు నెలల పాటు సానుకూల గణాంకాలు నమోదు చేసిన ఎగుమతులు జూలైలో 1.2 శాతం క్షీణించాయి. 33.98 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అదే సమయంలో దిగుమతులు 7.45 శాతం పెరిగి 57.48 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రూడాయిల్, వెండి, ఎల్రక్టానిక్ గూడ్స్ దిగుమతులు పెరగడం ఇందుకు కారణం. మొత్తం మీద జూలైలో వాణిజ్య లోటు 23.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. జూన్‌లో ఇది 21 బిలియన్ డాలర్లుగా ఉండగా, గతేడాది జూలైలో 19.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సమీక్షాకాలంలో ముడి చమురు దిగుమతులు 17.44 శాతం పెరిగి 13.87 బిలియన్ డాలర్లకు, వెండి దిగుమతులు 439 శాతం ఎగిసి 165.74 మిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే గతేడాది నమోదైన 778 బిలియన్ డాలర్ల ఎగుమతుల (ఉత్పత్తులు, సరీ్వసులు) స్థాయిని ఈసారి అధిగమించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 22 శాతం క్షీణించడం కూడా ఎక్స్‌పోర్ట్స్ తగ్గుదలకు కారణమని వివరించారు. ధరలు పడిపోవడం, దేశీయంగా వినియోగం పెరగడం వంటి అంశాల వల్ల జూలైలో పెట్రోలియం ఎగుమతులు తగ్గినట్లు సునీల్ వివరించారు. ఆఫ్రికా తదితర మార్కెట్లకి కూడా ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, రవాణా రేట్లు భారీగా పెరిగిపోవడం, కమోడిటీల ధరలు తగ్గడం, కంటైనర్ల కొరత వంటి అంశాలు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ అశ్వని కుమార్ చెప్పారు. వచ్చే నెల నుంచి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. → జూలైలో బియ్యం, జీడిపప్పు, నూనె గింజలు, మెరైన్ ఉత్పత్తులు, రత్నాభరణాలు, రసాయనాలు, కాటన్ యార్న్ ఎగుమతులు ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. → ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫార్మా, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు వరుసగా 37 శాతం, 8 శాతం, సుమారు 4 శాతం మేర పెరిగాయి. → బంగారం దిగుమతులు 10.65 శాతం తగ్గి 3.13 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. → చైనా నుంచి దిగుమతులు 13 శాతం పెరిగి 10.28 బిలియన్ డాలర్లకు చేరగా, ఎగుమతులు 9 శాతం క్షీణించి 1.05 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. బ్రిటన్, జర్మనీ, దక్షిణాఫ్రికా, మలేíÙయా తదితర దేశాలకు కూడా ఎగుమతులు తగ్గాయి. అమెరికా, నెదర్లాండ్స్, సింగపూర్ వంటి దేశాలకు మాత్రం పెరిగాయి. అమెరికాకు ఎగుమతులు 3 శాతం పెరిగి 6.55 బిలియన్ డాలర్లకు చేరాయి. అక్కడి నుంచి దిగుమతులు 1 శాతం పెరిగి 3.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్–జూలై వ్యవధిలో.. → ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై వ్యవధిలో ఎగుమతులు 4% పెరిగి 144.12 బిలియన్ డాలర్లకు చేరగా దిగుమతులు సుమారు 8% వృద్ధి చెంది దాదాపు 230 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సరుకులకు సంబంధించి ఎగుమతులు, దిగుమతుల మధ్య వాణిజ్య లోటు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 75.15 బిలియన్ డాలర్ల నుంచి 85.58 బిలియన్ డాలర్లకు పెరిగింది. అటు సేవల ఎగుమతుల విలువ 107 బిలియన్ డాలర్ల నుంచి 117 బిలియన్ డాలర్లకు పెరిగింది. → అమెరికాకు ఎగుమతులు 9 శాతం పెరిగి 27.44 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు సుమారు 7 శాతం పెరిగి 15.24 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి 12.2 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య మిగులు నమోదైంది. అటు రష్యా నుంచి దిగుమతులు జూలైలో 23 శాతం పెరిగి 5.41 బిలియన్ డాలర్లకు, ఏప్రిల్–జూలై మధ్య కాలంలో 20 శాతం వృద్ధి చెంది 23.77 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రూడాయిల్ దిగుమతులు పెరగడం ఇందుకు కారణం. -
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. వాణిజ్యంపై ప్రభావం
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని షేక్ హసీనా దేశం వదిలివెళ్లారు. దాంతో అక్కడి పరిపాలన సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ తెలిపింది. సంస్థ వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.భారత్ బంగ్లాదేశ్‌కు చాలా వస్తువులను ఎగుమతి చేస్తోంది.ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం తగ్గుతుంది. అయితే దీని ప్రభావం పెద్దగా ఉండదు.2023-24లో బంగ్లాదేశ్‌కు భారత్ 11 బిలియన్ డాలర్లు(రూ.92 వేలకోట్లు) విలువ చేసే వస్తువులను ఎగుమతి చేసింది. అంతకుముందు ఏడాది నమోదైన 12.21 బిలియన్ డాలర్లతో(రూ.1 లక్ష కోట్లు) పోలిస్తే ఇది తక్కువ.గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లా నుంచి భారత్‌కు దిగుమతుల విలువ రెండు బిలియన్ డాలర్ల(రూ.16 వేలకోట్లు) నుంచి 1.84 బిలియన్ డాలర్లకు(రూ.15 వేలకోట్లు) తగ్గింది.ఇదీ చదవండి: 16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!ఎగుమతులు: కూరగాయలు, కాఫీ, టీ, మసాలాలు, పంచదార, చాక్లెట్లు, శుద్ధిచేసిన పెట్రోలియం, రసాయనాలు, పత్తి, ఇనుము, ఉక్కు, వాహనాలు.దిగుమతులు: చేపలు, ప్లాస్టిక్, తోలు ఉత్పత్తులు, దుస్తులు. -
India exports: రెడ్ సీ సవాళ్లున్నా.. ఎగుమతులు రయ్!
న్యూఢిల్లీ: ఎర్ర సముద్రం ప్రాంతంలో అలాగే అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులను జనవరిలో భారత్ వస్తు ఎగుమతులు అధిగమించాయి. 2023 జనవరిలో పోలి్చతే 2024 జనవరిలో భారత్ ఎగుమతులు 3.12 శాతం పెరిగాయి. విలువలో 36.92 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక రెండు నెలల క్షీణత అనంతరం జనవరిలో వస్తు దిగుమతులు 3 శాతం పెరిగి 54.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 17.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన తొమ్మిది నెలల్లో ఇంత తక్కువ స్థాయి వాణిజ్యలోటు ఇదే తొలిసారి. ఎర్ర సముద్రం సంక్షోభం ఎగుమతిదారులపై ప్రభావం చూపుతోంది. వారు తమ వస్తువులను యూరప్– ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు రవాణా చేయడానికి – ఆఫ్రికాను చుడుతూ కేప్ ఆఫ్ గాడ్ హోప్ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది. దీనితో రవాణా వ్యయం తడిసి మోపెడవుతోంది. సరకు రవాణాలో 14 రోజుల ఆలస్యంతోపాటు బీమా వ్యయాలు కూడా పెరిగాయి. యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్ల దాడుల కారణంగా ఎర్ర సముద్రం– మధ్యధరా సముద్రాన్ని హిందూ మహాసముద్రానికి కలిపే కీలకమైన షిప్పింగ్ మార్గం బాబ్–ఎల్–మండేబ్ జలసంధి చుట్టూ పరిస్థితి తీవ్రరూపం దాలి్చంది. ముఖ్యాంశాలు... ► సమీక్షా నెల జనవరిలో క్రూడ్ ఆయిల్ దిగుమతులు 4.33 శాతం పెరిగి 16.56 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► పసిడి దిగుమతులు ఏకంగా 174 శాతం పెరిగి 1.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 10 నెలల్లో క్షీణత కాగా, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ 10 నెలల కాలంలో ఎగుమతుల విలువ 4.89% క్షీణించి 353.92 బిలియన్ డాలర్లకు పడ్డాయి. దిగుమతులు కూడా 6.71% పడిపోయి 561.12 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 207.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మొత్తం దిగుమతుల విలువలో క్రూడ్ ఆయిల్ విలువ 15.91% పడిపోయి 146.75 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పసిడి దిగుమతులు 301.7% పెరిగి 38 బిలియన్ డాలర్లకు చేరాయి. సేవలు..ఓకే ఇదిలాఉండగా, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం జనవరిలో 32.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిపింది. 2023లో ఈ విలువ 28 బిలియన్ డాలర్లు. ఇక ఏప్రిల్ నుంచి జనవరి మధ్య ఈ విలువ 267.5 బిలియన్ డాలర్ల నుంచి 284.45 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
ఎగుమతులు మళ్లీ మైనస్‌లోకి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ తీవ్ర అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతులు అద్దం పడుతున్నాయి. అక్టోబర్‌లో ‘ప్లస్’లోకి వచి్చన ఎగుమతులు తిరిగి నవంబర్‌లో మైనస్‌లోకి జారిపోయాయి. 2022 ఇదే నెలతో పోలి్చతే 2023 నవంబర్‌లో ఎగుమతుల విలువ 2.83% క్షీణించి 33.90 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక 10 నెలల తర్వాత అక్టోబర్‌లో ఎగువబాటకు చేరిన దిగుమతులు నవంబర్‌లో మళ్లీ క్షీణతలోకి జారాయి. 4.33% పతనంతో 54.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ముందు.. వెనుకలు ఇలా... అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్‌లో 2.6 శాతం క్షీణించాయి. అక్టోబర్‌లో సానుకూల ఫలితం వెలువడింది. మరుసటి నెలలోనే మళ్లీ క్షీణరేటు నమోదయ్యింది. ఏప్రిల్–నవంబర్ మధ్య క్షీణ గణాంకాలే.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 6.51 శాతం క్షీణించి 278.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.67 శాతం క్షీణించి 445.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు– ఈ ఏడు నెలల్లో 166.36 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎనిమిది నెలల కాలంలో పసిడి దిగుమతులు 21 శాతం పెరిగి 32.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
ఎలక్ట్రానిక్స్‌లో దూసుకెళ్తున్న భారత్
ఒకప్పుడు మొబైల్ ఫోన్ అనగానే చైనాయే గుర్తొచ్చేది. డ్రాగన్ దేశం నుంచే వివిధ దేశాలకు లక్షలాదిగా మొబైళ్లు ఎగుమతి అయ్యేవి. పైగా స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ దాదాపు చైనాలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత్ ఫోన్ల తయారీలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2014–2023 మధ్య కాలంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో 23 శాతం వార్షిక వృద్ధిరేటు సాధించుకుంటూ ప్రపంచంలో రెండవ అతి పెద్ద మొబైల్ ఉత్పత్తి దేశంగా అవతరించింది. ఈ మేరకు గ్లోబల్ రీసెర్చ్ ఆర్గ నైజేషన్ ‘కౌంటర్ పాయింట్’ నివేదించింది. భారత్ దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం విజయవంతం కావడంతో దేశంలో ఫోన్ల ఉత్పత్తి భారీగా పెరిగింది. ఇండియాలో ఎలక్ట్రానిక్ రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఫోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం 2021 ఏప్రిల్‌లో పీఎల్ఐ పథకాన్ని ప్రవేశపెట్టింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేయడంలో ఆయా సంస్థలకు రూ. 40,995 కోట్ల రాయితీలు ఈ పథకం కింద ఇచ్చింది. దీంతో స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్‌లతో పాటు పలు కంపెనీలు ఫోన్ల ఉత్పత్తిని విపరీతంగా పెంచాయి. దేశీయ మార్కెట్లో విక్రయించడంతో పాటు పలు దేశాలకు ఎగుమతులు పెరిగాయి. ఈ అనూహ్య పెరుగుదలకు యాపిల్ ఐఫోన్ల ఒప్పంద తయారీ కంపెనీలైన ఫాక్స్‌కాన్, పెగట్రాన్, విస్ట్రన్లతో పాటు శాంసంగ్ ప్రధాన కారణం. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి సాధించేందుకు ‘ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్’ (ఐసీఈఏ) సుంకాలు తగ్గించి, మార్కెట్లో పోటీ తత్వాన్ని పెంచాలని చూస్తోంది. ఉత్పత్తులను మెరుగుపరచడం, కార్మిక సంస్కరణలు చేయడం, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై దృష్టి సారించింది. 2025–26 నాటికి 600 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లు ఎగుమతి అవుతాయని భారత్ అంచనా వేస్తోంది. ఒకప్పుడు మన దేశం నుంచి మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు ఫోన్లు ఎగుమతి అవ్వగా... ప్రస్తుతం అమెరికా, నెదర్లాండ్, ఆస్ట్రియా, ఇటలీ వంటి యూరప్ దేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘పేస్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్’ (పీఎంపీ), ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్’ (పీఎల్ఐ), ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి కార్యక్రమాలను కేంద్రం ప్రారంభించి స్థానిక తయారీ సంస్థలను ప్రోత్సహించింది. 2014లో దేశీయంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 19 శాతం మాత్రమే ఉండేది. 2022 నాటికి 98 శాతం స్థానికంగా తయారు చేసిన ఫోన్లను భారత్ ఎగుమతి చేసింది. ఇప్పటికే ఇండియాలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెల్ఫోన్లు, లాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ మదర్ బోర్డులతో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో వినియోగించే మైక్రో ప్రాసెసర్లు, చిప్సెట్స్ కూడా మన దేశంలోనే తయారు చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇదే తరహాలో భారత్ ముందుకెళ్తే ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింత వృద్ధి సాధించేందుకు అవకాశం ఉంది. – తాడేపల్లి విజయ్ ‘ 78424 85865 -
జూలైలో ఎగుమతులు 16% డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆరి్థక అనిశ్చితి పరిస్థితులు భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దేశ జూలై ఎగుమతుల్లో (2022 ఇదే నెల గణాంకాలతో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా 16 శాతం క్షీణించాయి. విలువలో 32.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కీలక పెట్రోలియం, రత్నాలు–ఆభరణాలు, ఇతర కీలక రంగాల ఎగుమతులు భారీగా పడిపోయాయి. వాణిజ్య పరిశ్రమల శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. దిగుమతులూ క్షీణతే..: ఇక దిగుమతుల విలువ కూడా జూలైలో 17% పడిపోయి 52.92 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2022 జూలైలో 25.43 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు తాజాగా దాదాపు 5 బిలియన్ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం. నాలుగు నెలల్లోనూ.. ఈ ఏడాది (2022–23) ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఎగుమతులు 14.5% పడిపోయి 136.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 13.79 శాతం పడిపోయి 213.2 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 76.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఈ నాలుగు నెలల్లో పసిడి దిగుమతులు 2.7% పెరిగి 13.2 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతుల బిల్లు 23.4% తగ్గి 55 బిలియన్ డాలర్లకు దిగివచి్చంది. ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై మరిన్ని ఆంక్షలు ఉండబోవు: కేంద్రం మరిన్ని ఎల్రక్టానిక్ వస్తువులపై దిగుమతి ఆంక్షలు విధించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని వాణిజ్య కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. చైనా వంటి దేశాల నుంచి దిగుమతులను తగ్గించడానికి అలాగే దేశీయ తయారీని పెంచడానికి నవంబర్ 1 నుండి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, మరికొన్ని ఎల్రక్టానిక్ పరికరాలపై దిగుమతి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీకి ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం వర్తిస్తుందని మంత్రి చెప్పారు. -
ఐదేళ్లలో 370 మిలియన్ డాలర్ల జుట్టు ఎగుమతి
ఢిల్లీ: భారతదేశం నుంచి గడిచిన ఐదు సంవత్సరాల్లో 370.11 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మానవ జుట్టు ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2018-19లో 34.46 మిలియన్ డాలర్లు, 2019-20లో 5.70 మిలియన్ డాలర్లు, 2020-21లో 11.65 మిలియన్ డాలర్లు, 2021-22 లో 149.07 డాలర్లు, 2022-23లో అత్యధికంగా 169.23 మిలియన్ డాలర్లు విలువచేసే జుట్టు ఎగుమతి చేసినట్లు తెలిపారు. మానవ జుట్టు, జుట్టు ఉత్పత్తుల అసోసియేషన్, ప్లెక్స్ కౌన్సిల్ అందించిన సమాచారం ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా జుట్టు (ముడి సరుకు) లభించేది భారతదేశంలోనే అని అన్నారు. అలాగే భారత్ లో లభించే జుట్టు అత్యంత నాణ్యమైనదిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వాణిజ్య ప్రదర్శనలకు హాజరయ్యేందుకు సంబంధిత పరిశ్రమలతో కలిసి ప్లెక్స్ కౌన్సిల్ చురుకుగా పనిచేస్తోందని, జుట్టుతో విగ్గులు వంటి విలువైన వస్తువులు ఉత్పత్తి చేసేందుకు ఎగుమతిదారులకు శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఇటీవల ప్లెక్స్ కౌన్సిల్ నిర్వహించిన అతిపెద్ద బ్యూటీ షో "కాస్మోప్రోఫ్ వరల్డ్‌వైడ్ బోలోగ్నా 2023"లో ఇండియా నుంచి జుట్టు ఉత్పాదనలు చేసే పరిశ్రమలకు చెందిన 20 మంది ప్రదర్శనకారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ ప్రదర్శనలో ఇండియన్ పెవిలియన్ ను సందర్శించిన ప్రపంచదేశాల కొనుగోలుదారుల నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు. 2024లో నిర్వహించనున్న ప్రదర్శనలో ప్లెక్స్ కౌన్సిల్ ఇదే స్ఫూర్తితో పాల్గొంటుందని మంత్రి తెలిపారు. ఇండియా నుంచి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా మయన్మార్ ద్వారా చైనాకు భారతీయ జుట్టు అక్రమ రవాణా జరుగుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, కస్టమ్స్ శాఖ వద్జ ఎటువంటి కేసులూ నమోదు కాలేదని మంత్రి పేర్కొన్నారు. -
ఎగుమతులు మూడో నెలా డౌన్
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఎగుమతులు వరుసగా మూడో నెలా క్షీణించాయి. ఏప్రిల్‌లో 12.7 శాతం తగ్గి 34.66 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దిగుమతులు కూడా వరుసగా అయిదో నెలా క్షీణించాయి. ఏప్రిల్‌లో 14 శాతం క్షీణించి 49.9 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గత ఏప్రిల్‌లో ఇవి 58.06 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్‌కు ప్రధాన మార్కెట్లుగా ఉన్న అమెరికా, యూరప్‌లో డిమాండ్ అంతగా లేకపోవడం .. ఎగుమతులు మందగించడానికి కారణమైంది. పరిస్థితి మెరుగుపడటానికి మరికొద్ది నెలలు పట్టే అవకాశం ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ‘యూరప్, అమెరికాలో డిమాండ్ క్షీణించింది. వచ్చే 2–3 నెలలు కూడా అంత ఆశావహంగా కనిపించడం లేదు. అయితే, చైనా ఎకానమీ కోలుకుని.. యూరప్, అమెరికా మార్కెట్లలో కూడా కాస్త డిమాండ్ నెలకొనే అవకాశం ఉన్నందున ఆగస్టు–సెప్టెంబర్ తర్వాత నుంచి ఎగుమతులు మళ్లీ పుంజుకోవడానికి ఆస్కారం ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. 20 నెలల కనిష్టానికి వాణిజ్య లోటు .. ఎగుమతులు, దిగుమతుల మందగమనంతో ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 20 నెలల కనిష్టమైన 15.24 బిలియన్ డాలర్లకు తగ్గింది. చివరిసారిగా 2021 ఆగస్టులో వాణిజ్య లోటు ఇంతకన్నా తక్కువగా 13.81 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. గతేడాది ఏప్రిల్‌లో ఇది 18.36 బిలియన్ డాలర్లుగా ఉంది. కమోడిటీల ధరలు, రత్నాభరణాల్లాంటి ఉత్పత్తులకు డిమాండ్ క్షీణించడంతో దిగుమతులు తగ్గినట్లు సారంగి వివరించారు. ఎగుమతులపరంగా రాబోయే రోజుల్లోనూ రత్నాభరణాలు, కొన్ని రకాల ఇంజినీరింగ్ ఉత్పత్తులు, దుస్తులపై ప్రభావం ఉండవచ్చన్నారు. ఎక్కువగా ఎగుమతులు చేసేందుకు ఆస్కారమున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నూనె గింజల్లాంటి వాటిపై వ్యాపారవర్గాలు మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. 2022–23 గణాంకాల సవరణ.. గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను వాణిజ్య శాఖ ఎగువముఖంగా సవరించింది. దీని ప్రకారం.. ► 2022–23లో ఉత్పత్తులు, సర్వీసుల ఎగుమతులు 14.68 శాతం వృద్ధి చెంది 676.53 బిలియన్ డాలర్ల నుంచి 775.87 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 17.65 శాతం పెరిగి 894.19 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 118.31 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ► ఉత్పత్తుల ఎగుమతులు 6.74% వృద్ధితో 450.43 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 16.47% పెరిగి 714 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► సేవల ఎగుమతులు 27.86 శాతం ఎగిసి 325.44 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 22.54 శాతం పెరిగి 180 బిలియన్ డాలర్లకు చేరాయి. -
ఎగుమతులు @ 447 బిలియన్ డాలర్లు
రోమ్: భారత్ వస్తు ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22తో పోల్చితే 6 శాతం పెరిగి 447 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇదే సమయంలో దేశ దిగుమతులు 16.5 శాతం ఎగసి 714 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 267 బిలియన్ డాలర్లకు చేరింది. పెట్రోలియం, ఫార్మా, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల రంగాల నుంచి ఎగుమతుల్లో మంచి వృద్ధి నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్, ఇటలీల్లో ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకూ పర్యటించిన గోయల్ ఈ సందర్భంగా పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు మరింత పురోగమించడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపిన అంశాల్లో ముఖ్యమైనవి... ► వస్తు, సేవలు కలిపి ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక విభాగాల దిగుమతులు 892 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ ఎకానమీ క్రియాశీలత, పురోగమనానికి సూచికలుగా ఎగుమతి–దిగుమతి గణాంకాలు ఉన్నాయి. ► అన్ని దేశాలతో పటిష్ట వాణిజ్య సంబంధాలు నెరపడానికి భారత్ కృషి సల్పుతోంది. ► ఇన్వెస్టర్ల పెట్టుబడులకు భారత్ అత్యంత ఆకర్షణ ప్రదేశంగా ఉంది. ఎకానమీ పరంగా చూస్తే, భారత్ ఎంతో పటిష్టంగా ఉంది. వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదవుతున్నాయి. ఎగుమతులు బాగున్నాయి. ద్రవ్యోల్బణం దిగివస్తోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పటిష్టంగా 600 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. విదేశాల నుంచి భారత్‌కు పంపుతున్న రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లుపైగానే ఉంటున్నాయి. పెట్టుబడుల ప్రవాహం బాగుంది. ► ఎగుమతుల భారీ వృద్ధి లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్ ఇప్పటికే ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించడం జరిగింది. -
రెండేళ్ల తర్వాత ఎగుమతులు ‘మైనస్’
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు రెండేళ్ల తర్వాత అక్టోబర్‌లో క్షీణతను చవిచూశాయి. సమీక్షా నెల్లో అసలు వృద్ధిలేకపోగా 17 శాతం పడిపోయి (2021 ఇదే నెలతో పోల్చి) 29.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గ్లోబల్ డిమాండ్ పడిపోవడం దీనికి నేపథ్యం. ద్రవ్యోల్బణం,, కరెన్సీ విలువల్లో విపరీతమైన ఒడిదుడుకులు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలూ భారత్ ఎగుమతులకు ప్రతికూలంగా నిలిచా యి. ఇక ఇదే నెల్లో దిగుమతులు 6 శాతం పెరిగి 56.69 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసం–వాణిజ్యలోటు 26.91 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ►రత్నాలు–ఆభరణాలు (21.56%), ఇంజనీరింగ్ (21.26%), పెట్రోలియం ఉత్పత్తులు (11.28%), రెడీమేడ్ వస్త్రాలు–టెక్స్టైల్స్ ((21.16%), రసాయనాలు (16.44%), ఫార్మా (9.24%), సముద్ర ఉత్పత్తులు (10.83%), తోలు (5.84%) సహా కీలక ఎగుమతి రంగాలు అక్టోబర్‌లో ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ►అయితే ఆయిల్ సీడ్స్, ఆయిల్మీల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, పొగాకు, టీ, బియ్యం ఎగుమతుల సానుకూల వృద్ధిని నమోదుచేశాయి. ►ఆర్థిక వృద్ధి, దేశీయ వినియోగం పెరగడం కూడా దిగుమతుల పురోగతికి దోహదపడుతోంది. ►మొత్తం దిగుమతుల్లో చమురు బిల్లు 29.1 శాతం వృద్ధితో 15.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ►పసిడి దిగుమతుల విలువ 27.47 శాతం తగ్గి 3.7 బిలియన్ డాలర్లకు చేరింది. ఏప్రిల్–అక్టోబర్ మధ్య వృద్ధి 12.55 శాతం కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలూ (ఏప్రిల్–అక్టోబర్) మధ్య ఎగుమతులు 12.55 శాతం పెరిగి 263.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు ఇదే కాలంలో 33.12 శాతం పెరిగి 436.81 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 173.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో వాణిజ్యలోటు 94.16 బిలియన్ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ దాదాపు 400 బిలియన్ డాలర్లు. 2022–23లో ఈ లక్ష్యం 450 బిలియన్ డాలర్లు. అయితే ప్రస్తుత ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఈ లక్ష్యం సాధన కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వరుసగా మూడో నెలా క్షీణత నుంచి వృద్ధికి...
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతుల తొలి, తుది లెక్కలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. వరుసగా మూడు నెలల్లో తొలి నిరాశాకరమైన గణాంకాలు తుది గణాంకాల్లో సానుకూలంగా మారాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో భారత్ ఎగుమతులు 4.82 శాతం పెరిగి 35.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారంలో వెలువడిన తొలి గణాంకాల ప్రకారం భారత్ ఎగుమతులు సెప్టెంబర్‌లో 3.52 శాతం క్షీణించి 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం దిగుమతులు 8.66 శాతం పెరిగి 61.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 26.16 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య క్షీణత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య భారత్ ఎగుమతులు వృద్ధిలేకపోగా 16.96 బిలియన్ డాలర్లు క్షీణించి 231.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 38.55 శాతం పెరిగి 380.34 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు భారీగా 148.46 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ విలువ 76.25 బిలియన్ డాలర్లు. కీలక రంగాలు నిరాశ ► ఇంజనీరింగ్ వస్తు ఎగుమతులు 10.85 శాతం క్షీణించి 8.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు కూడా 18 శాతం క్షీణించి బిలియన్ డాలర్లకు తగాయి. ► ప్లాస్టిక్స్ కూడా ఇదే పరిస్థితి. 12.2 శాతం క్షీణతతో 660.66 మిలియన్ డాలర్లకు చేరాయి. ► అయితే రత్నాలు–ఆభరణాలు, పెట్రోలియం ప్రొడక్టులు, తోలు, ఫార్మా, కెమికల్స్, బియ్యం ఎగుమతులు పెరిగాయి. దిగుమతులు ఇలా... ► ఆయిల్ దిగుమతులు 5.38 శాతం తగ్గి 15.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పసిడి దిగుమతులు 24.62 శాతం పడిపోయి 3.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► బొగ్గు, కోక్, బ్రిక్విటీస్ దిగుమతులు 60.82 శాతం పెరిగి 3.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సేవల రంగం ఎగుమతులు 19 శాతం అప్ ఇదిలావుండగా, సేవల రంగం ఎగుమతుల విలువ సెప్టెంబర్‌లో 18.72 శాతం పెరిగి 25.65 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. దిగుమతుల విలువ 20 శాతం పెరిగి 15.10 బిలియన్ డాలర్లకు చేరింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య సేవల ఎగుమతులు 27.88 శాతం వృద్ధితో 150.43 బిలియన్ డాలర్లకు చేరాయి. జూలై, ఆగస్లుల్లో సవరణలు ఇలా... జూలై, ఆగస్టు నెలల్లో ఎగుమతుల తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది. భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా స్వల్పంగా 1.15 శాతం మేర క్షీణించాయని (33 బిలియన్ డాలర్లు) తొలి గణాంకాలు తెలిపాయి. తరువాత గణాంకాల సవరణల్లో 1.6 శాతం వృద్ధికి ఎగుమతుల పరిమాణం మారింది. ఇక జూలైలో ఎగుమతులు 0.76 శాతం క్షీణించి 35.24 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు మొదట్లో వెలువడిన తొలి గణాంకాలు పేర్కొన్నాయి. అయితే అటు తర్వాత సవరించిన లెక్కల ప్రకారం, ఎగుమతులు జూలైలో 2.14 శాతం పెరిగి 36.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సెప్టెంబర్‌లో ఎగుమతులు ఏకంగా 3.5 శాతం క్షీణించి, 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని, దిగుమతులుసైతం ఏడు నెలల్లో తొలిసారి 60 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయని తొలి గణాంకాలు వెలువడ్డాయి. తాజా గణాంకాలు పరిస్థితిని ఆశాజనకంగా మార్చాయి. వరుసగా 22 నెలలూ ఎగుమతులు వృద్ధి బాటన నడిచినట్లయ్యింది. లక్ష్యం కష్టమేనా... 2021–22లో 400 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులను సాధించిన భారత్, 2022–23లో 450 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యం సాధన కష్టమేనన్న విశ్లేషణ ఉంది. అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు దేశాల మధ్య వాణిజ్యంపై తీవ్ర ప్రతికూలత చూపుతాయన్న విశ్లేషణలే దీనికి కారణం. -
ఎగుమతుల క్షీణత... వాణిజ్యలోటు తీవ్రత
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు–దిగుమతులకు సంబంధించి జూలై గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ఎగుమతులు స్వల్పంగా 0.76 శాతం క్షీణించి (2021 జూలై నెలతో పోల్చి) 35.24 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇక ఎగుమతులు 44 శాతం పెరిగి 66.26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 31.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 జూలైలో భారత్ వాణిజ్యలోటు 10.63 బిలియన్ డాలర్లు మాత్రమే. పసిడి దిగుమతులు జూలైలో వార్షికంగా సగానికి సగం పడిపోయి 2.37 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఏప్రిల్ నుంచి జూలై వరకూ...: ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో భారత్ ఎగుమతుల విలువ 156 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 48 శాతం ఎగసి 256 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల లక్ష్యం 400 బిలియన్ డాలర్ల సాధన నెరవేరింది. 2022–23లో కూడా 470 బిలియన్ డాలర్ల లక్ష్య సాధన నెరవేరుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్యశాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం వ్యక్తం చేశారు. డిమాండ్–సరఫరాల సవాళ్లు, నియంత్రణలు, కోవిడ్–19 సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఎగుమతుల విభాగం చక్కని పనితీరునే కనబరుస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మరో ప్రకటనలో పేర్కొంది. -
భారత్ నుంచి ఎగుమతుల్లో సముచిత వృద్ధి!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్యపరంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఎగుమతులు ‘సముచిత స్థాయిలో‘ వృద్ధి చెందే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. బడా ఎగుమతిదారులు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిళ్లతో సమాలోచనలు జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు పరిణామాలను సమీక్షిస్తున్నామని ఆయన వివరించారు. ‘ధర, నాణ్యతపరంగా మన ఎగుమతులకు ప్రత్యేకత ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి ఎగుమతుల అంచనాలు ఉంటాయి‘ అని గోయల్ చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో 2022–23లో 450–500 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేయడం సాధ్యపడేదేనా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యమేదీ విధించుకోలేదని ఆయన పేర్కొన్నారు. నూతన విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ)పై స్పందిస్తూ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడంతో ప్రస్తుత పాలసీని ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో ఉత్పత్తుల ఎగుమతులు 17 శాతం పెరిగి 37.94 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి, క్రూడాయిల్ దిగుమతులు భారీగా పెరగడంతో కరెంటు అకౌంటు లోటు 25.63 బిలియన్ డాలర్లకు ఎగిసింది. -
తొలి అడుగు.. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులు
న్యూఢిల్లీ: ఆయుధాలను, క్షిపణి వ్యవస్థల్ని ఎప్పుడూ దిగుమతి చేసుకునే భారత్ ఎగుమతి చేసే దిశగా తొలి అడుగు పడింది. మొట్టమొదటి సారిగా బ్రహ్మోస్ క్షిపణుల్ని ఫిలిప్పీన్స్‌కు విక్రయించనుంది. ఈ మేరకు భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 37.4 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం (రూ.28 వందల కోట్లకు పైనే) కుదిరింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో (బీఏపీఎల్) ఫిలిప్పీన్స్ రక్షణ శాఖ కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసినట్టుగా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, నేల మీద నుంచి నిర్దేశించిన లక్ష్యాలను బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు ఛేదించగలవు. ఫిలిప్పీన్స్ నేవీకి యాంటీ–షిప్ బ్రహ్మోస్ క్షిపణుల సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ)తో కలిసి బీఏపీఎల్ బ్రహ్మోస్ క్షిపణుల్ని తయారు చేస్తోంది. ఫిలిప్పీన్స్ నావికాదళం ఎన్ని క్షిపణుల్ని కొనుగోలు చేయనుందో రక్షణ శాఖ వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చైనా సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక ప్రాంతాల్లో బ్రహ్మోస్ క్షిపణుల్ని భారీగానే మోహరించింది. తాను సొంతంగా క్షిపణుల్ని తయారు చేయడమే కాకుండా ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిన చారిత్రక సందర్భంలో తాను ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని ఫిలిప్పీన్స్‌లో భారత రాయబారి శంభు కుమరన్ వ్యాఖ్యానించారు. ఈ కొనుగోలు ఒప్పందంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయని, ఇండో ఫసిఫిక్ ప్రాంతాల్లో శాంతి, స్వేచ్ఛాయుత వాణిజ్యమనే ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి మరో అడుగు పడినట్టయిందని కుమరన్ చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్, అస్త్ర, రాడార్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ కొనుగోలు కోసం కూడా పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని డీఆర్‌డీఒ చైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. -
నెలవారీ ఎగుమతుల్లో భారత్ రికార్డు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు జూలైలో 50 శాతం పెరిగి 35.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఒక నెల్లో విలువలో ఎగుమతులు ఇంత భారీ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. పెట్రోలియం, ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతులు మంచి ఫలితాన్ని నమోదుచేసుకున్నాయి. ఇక ఇదే నెల్లో దిగుమతులు 63 శాతం పెరిగి 46.40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరిసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు 10.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే.. ► పెట్రోలియం (3.82 బిలియన్ డాలర్లు), ఇంజనీరింగ్ (2.82 బిలియన్ డాలర్లు), రత్నాలు–ఆభరణాల (1.95 బిలియన్ డాలర్లు) ఎగుమతుల్లో భారీ పెరుగుదల మొత్తం గణాంకాలపై సానుకూల ప్రభావం చూపింది. ► చమురు దిగుమతులు 97.45 శాతం పెరిగి 12.89 బిలియన్ డాలర్లకు చేరాయి. ► పసిడి దిగుమతులు 1.78 బిలియన్ డాలర్ల నుంచి (2020 జూలై నెల్లో) 4.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ► ఆయిల్‌సీడ్స్, బియ్యం, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయి. ► కాగా ముత్యాలు, ప్రీసియన్, సెమీ–ప్రీసియస్ రాళ్ల దిగుమతుల విలువ 1.68 బిలియన్ డాలర్లుగా ఉంది. ► రవాణా పరికరాలు, ప్రాజెక్ట్ గూడ్స్, వెండి దిగుమతులు క్షీణించాయి. ► అమెరికా (2.4 బిలియన్ డాలర్లు), యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (1.21 బిలియన్ డాలర్లు), బెల్జియం (489 మిలియన్ డాలర్లు) దేశాలకు ఎగుమతులు పెరిగాయి. నాలుగు నెలల్లో... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య ఎగుమతులు 74.5 శాతం పెరిగి 130.82 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ ఎగుమతులు 75 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు ఇదే కాలంలో 94 శాతం పెరిగి 172.5 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఒక్క చమురు దిగుమతులను చూస్తే విలువ 123.84 శాతం పెరిగి 19.61 బిలియన్ డాలర్ల నుంచి 43.90 బిలియన్ డాలర్లకు ఎగసింది. కాగా, వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటన చేస్తూ, ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యం. మరో ఎనిమిది నెలల్లో (2021 ఆగస్టు–మార్చి 2022) 269.44 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. అంటే నెలకు సగటును 33.68 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరపాల్సి ఉంది’’ అని పేర్కొంది. గ్లోబల్ డిమాండ్ బాగుంది... గ్లోబల్ డిమాండ్ ఏప్రిల్–జూలై మధ్య పటిష్టంగా ఉంది. ఎగుమతిదారుల ఆర్డర్ బుకిం గ్ పరిస్థితి ఎంతో మెరుగుపడింది. ఆగస్టు మొద టివారంలో 7.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదుకావడం మరో హర్షణీయ పరిణామం. – ఏ శక్తివేల్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ -
మైనస్‌లోనే కొనసాగుతున్న ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు వరుసగా రెండవనెలా నవంబర్లోనూ క్షీణతనే నమోదుచేశాయి. 2019 ఇదే నెలతో పోల్చి 2020 నవంబర్‌లో 9 శాతం పడిపోయి 23.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులూ ఇదే నెలలో 13.33 శాతం పడిపోయి 33.39 బిలియన్ డాలర్లకు తగ్గాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 9.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. నిజానికి మార్చి నుంచి ఆగస్టు వరకూ వరుసగా ఆరు నెలలు క్షీణ బాటన పయనించిన ఎగుమతుల విలువ సెప్టెంబర్‌లో తిరిగి వృద్ధి బాటకు మళ్లింది. 5.99 శాతం వృద్ధితో 27.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అయితే ఆ మరుసటి నెల– అక్టోబర్‌లోనే తిరిగి పతనం నమోదయ్యింది. ఇప్పుడు వరుసగా రెండవనెల– నవంబర్లోనూ క్షీణతే నమోదుచేసుకోవడం గమనార్హం. ఎనిమిది నెలల్లో 18 శాతం క్షీణత ఇక 2020–21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలాన్ని చూస్తే, ఎగుమతులు 173.49 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం 211 బిలియన్ డాలర్లు. అంటే 18 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. ఇక ఇదే ఎనిమిది నెలల సమయంలో దిగుమతులు 33.56 శాతం పడిపోయి 215.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ట్రిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాలకు చేరుతాం: కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ఆశాభావం కాగా, భారత్æ ఎగుమతులు 2025 నాటికి ట్రిలియన్ డాలర్ల (1000 బిలియన్ డాలర్లు– డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిరంగా 75 చొప్పున చూస్తే, రూ.75,00,000 కోట్లు) లక్ష్యాన్ని చేరుకుంటాయన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయెల్ వ్యక్తంచేశారు. ఇందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయని బుధవారం జరిగిన ట్రేడ్ బోర్డ్ సమావేశంలో అన్నారు. ‘‘కోవిడ్–19 ప్రతికూల పరిస్థితుల నుంచి దేశం వేగంగా రికవరీ అవుతోంది. పారిశ్రామిక రంగం సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతోంది. అంతర్జాతీయంగా సప్రై చైన్స్ భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ పురోగతి దిశలో ఇది ఎంతో ప్రోత్సాహకర అంశం’’ అని ఆయన అన్నారు. భారత్ ప్రయోజనం పొందేందుకు వీలుగా ప్రోత్సాహం అందించాల్సిన వివిధ రంగాలను ప్రభుత్వం గుర్తిస్తోందని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. చక్కటి ప్రతిభ కనబరచడానికి వీలున్న 24 పారిశ్రామిక రంగాలను ఇప్పటికే గుర్తించడం జరిగిందన్నారు. -
భారతీయ చేపల ప్యాకెట్లపై కరోనా!
బీజింగ్: భారత్ సహా వేర్వేరు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న చేపల ప్యాకెట్లపై కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు చైనా అధికారులు ప్రకటించారు. ఇండియా, రష్యా, అర్జెంటీనా తదితర దేశాల నుంచి వచ్చిన ఈ ప్యాకెట్లను పరీక్షించగా వాటిపై కరోనా ఆనవాళ్లు ఉన్నట్లు స్పష్టంగా తేలిందని బుధవారం గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఇండియా నుంచి వచ్చిన రెండు బట్టర్‌ఫిష్ ప్యాకెట్లు, రష్యా నుంచి వచ్చిన ఒక సాల్మన్ ఫిష్ ప్యాకెట్, అర్జెంటీనా నుంచి దిగుమతి చేసుకున్న రెండు బీప్ ప్యాకెట్ల ఉపరితలాలపై కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించామని అధికారులు తెలిపినట్లు పేర్కొంది. 20 దేశాల నుంచి వచ్చిన వివిధ ఉత్పత్తుల ప్యాకెట్లపైనా వైరస్ ఉన్నట్లు వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు. భారత్ నుంచి దిగుమతి అయిన ప్యాకెట్లపై వైరస్ ఆనవాళ్లు ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఇది రెండోసారి. దిగుమతుల పరీక్షలు, నిబంధనల విషయంలో చైనా అసంబద్ధంగా వ్యవహరిస్తోందని, ఇది వాణిజ్యాన్ని దెబ్బతిస్తోందని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. -
ఎగుమతులు, దిగుమతుల్లో సానుకూలత
న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల ధోరణులు ఆశాజనకంగా ఉన్నాయని.. ముఖ్యంగా ఎగుమతులు ఈఏడాది ఏప్రిల్‌లో కరోనా కారణంగా భారీగా పడిపోయిన స్థాయి నుంచి క్రమంగా గత ఏడాది స్థాయిలకు చేరుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఈ వివరాలను వాణిజ్య శాఖ శుక్రవారం ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్జాతీయంగా భారత వాణిజ్యానికి సంబంధించిన అంశాలను చర్చించేందుకు మంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మర్చండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా పథకం కింద రాయితీలకు రూ.2 కోట్ల పరిమితి విధించడం 98%ఎగుమతిదారులపై ప్రభావం చూపించబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పథకం స్థానంలో ఆర్వోడీటీఈపీ అనే కొత్త పథకాన్నిఇప్పటికే ప్రకటించడం గమనార్హం. వరుసగా ఐదో నెల జూలైలోనూ ఎగుమతులు 10% క్షీణించి 23.64 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం. మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్ షిప్పింగ్’ స్థానిక తయారీ టగ్ బోట్లనే వాడాలి ∙ ప్రధాన పోర్టులను కోరిన కేంద్రం స్వావలంబన భారత్ (ఆత్మ నిర్భర్) కార్యక్రమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లే చర్యలను కేంద్రం అనుసరిస్తోంది. దేశీయంగా నిర్మించిన చార్టర్ టగ్ బోట్లనే వినియోగించాలంటూ ప్రధాన పోర్టులను (ఓడరేవులు) షిప్పింగ్ మంత్రిత్వ శాఖా తాజాగా ఆదేశించింది. తద్వారా దేశీ షిప్ బిల్డింగ్ పరిశ్రమకు పునరుత్తేజాన్ని తీసుకురావచ్చన్నది కేంద్రం ఉద్దేశ్యం. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఆత్మనిర్భర్ షిప్పింగ్ కోసం చేపట్టిన చర్యగా దీన్ని షిప్పింగ్ శాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ అభివర్ణించారు. సవరించిన ఆదేశాలను ప్రధాన పోర్టులు పాటించాల్సి ఉంటుందన్నారు. టగ్ బోట్ అన్నది తొట్టి ఆకారంతో కూడిన పడవ. ఓడలు పోర్టుల్లోకి వచ్చేందుకు వీటి సాయం అవసరమవుతుంది. భారత షిప్ బిల్డింగ్ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, భారత్‌లో షిప్ బిల్డింగ్ కోసం కొన్ని దేశాలతో చర్చలు కూడా కొనసాగుతున్నాయని కేంద్ర షిప్పింగ్ శాఖా తన ప్రకటనలో తెలిపింది. -
ఫార్మాకు కలిసొచ్చిన ఉత్తర అమెరికా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19, లాక్డౌన్ అడ్డంకులు ఉన్నప్పటికీ భారత్ నుంచి ఔషధ ఎగుమతులు ఏప్రిల్–జూన్‌లో వృద్ధి చెందాయి. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) గణాంకాల ప్రకారం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఎగుమతులు 7.16 శాతం అధికమై రూ.37,875 కోట్ల నుంచి రూ.40,590 కోట్లకు చేరాయి. డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ ఒక్కటే వృద్ధికి తోడైంది. ఇతర విభాగాలన్నీ నిరాశపరిచాయి. డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ విభాగం 15.14 శాతం వృద్ధితో రూ.31,042 కోట్లు నమోదైంది. మొత్తం ఎగుమతుల విలువలో ఈ విభాగం వాటా ఏకంగా 76.48 శాతం ఉండడం గమనార్హం. వ్యాక్సిన్స్ 30 శాతం, ఆయుష్ 25, సర్జికల్స్ 15.8, బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంటర్మీడియేట్స్ 8 శాతం, హెర్బల్ ప్రొడక్ట్స్ 2.5 శాతం తిరోగమన వృద్ధి సాధించాయి. ఎగుమతులకు ఊతమిచ్చే బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియేట్స్ ఈ త్రైమాసికంలో మాత్రం 8.38 శాతం మైనస్‌లోకి వెళ్లాయని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ భాస్కర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశీయంగా ఫార్మా రంగం తిరోగమనంలో ఉన్నప్పటికీ ఏప్రిల్–జూన్‌లో ఎగుమతుల వృద్ధి సాధించడం విశేషమన్నారు. కొన్ని ప్రాంతాలు మినహా..: ఎగుమతుల్లో కొన్ని ప్రాంతాలు (రీజియన్లు) మినహా మిగిలినవన్నీ వృద్ధిని నమోదు చేశాయి. మధ్యప్రాచ్య మినహా ఆసియా, లాటిన్ అమెరికా దేశాలు, దక్షిణాసియా, కొన్ని యూరప్ దేశాలు నిరాశపరిచాయి. అయితే 2020 ఏప్రిల్–జూన్‌లో ఉత్తర అమెరికా మార్కెట్ ఎగుమతులకు ఊతమిచ్చింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ రీజియన్ 15.67 శాతం వృద్ధితో రూ.15,450 కోట్ల ఎగుమతులను నమోదు చేసింది. మొత్తం ఎక్స్‌పోర్ట్స్‌లో ఉత్తర అమెరికా వాటా అత్యధికంగా 38 శాతం ఉంది. వృద్ధి పరంగా మధ్య ప్రాచ్య దేశాలు 14 శాతం అధికమై రూ.2,220 కోట్లు, ఆసియాన్ ప్రాంతం 10.5 శాతం హెచ్చి రూ.2,580 కోట్లు సాధించాయి. పరిమాణంలో రెండో స్థానంలో ఉన్న ఆఫ్రికా మార్కెట్లు 0.4 శాతం పెరిగి రూ.6,510 కోట్లు, మూడో స్థానంలో ఉన్న యురోపియన్ యూనియన్ 6.9 శాతం అధికమై రూ.6,000 కోట్ల ఎగుమతులను నమోదు చేశాయి. -
ఎగుమతులు.. మూడోనెలా ‘మైనస్’
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతుల్లో వరుసగా మూడవనెలా ప్రతికూలతే నమోదయ్యింది. అక్టోబర్‌లో అసలు వృద్ధిలేకపోగా –1.11 క్షీణరేటు నమోదయ్యింది. అంటే 2018 అక్టోబర్‌తో పోల్చిన 2019 అక్టోబర్‌లో ఎగుమతుల విలువ –1.11 శాతం తగ్గి, 26.38 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పెట్రోలియం (–14.6 శాతం), తివాచీ (–17 శాతం), తోలు ఉత్పత్తులు (–7.6 శాతం), బియ్యం (–29.5 శాతం), తేయాకు (–6.16 శాతం)వంటి కీలక ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 18 క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. భారత్ ఎగుమతులు ఆగస్టులో –6 శాతం క్షీణతను నమోదుచేసుకుంటే, సెపె్టంబర్లో ఈ క్షీణ రేటు –6.57 శాతంగా ఉంది. దిగుమతులూ మైనస్... దిగుమతులు కూడా 16.31 శాతం పడిపోయాయి. విలువ రూపంలో 37.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు– దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2018 అక్టోబర్‌లో ఈ పరిమాణం 18 బిలియన్ డాలర్లు. శుక్రవారం విడుదలైన గణాంకాల్లో మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... - పసిడి దిగుమతులు 5 శాతం పడిపోయి 1.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. - చమురు దిగుమతులు అక్టోబర్‌లో –31.74 శాతం క్షీణించి 9.63 బిలియన్ డాలర్లుగా నమోదయితే, చమురేతర దిగుమతులు –9.18 శాతం పడిపోయి 27.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏడు నెలల్లోనూ నిరాశే... ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ చూస్తే, ఎగుమతులు 2.21 శాతం తగ్గి 185.95 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు – 8.37 శాతం క్షీణించి 280.67 బిలియన్ డాలర్లకు జారాయి. వెరసి వాణిజ్యలోటు 94.72 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ 116.15 బిలియన్ డాలర్లు. సేవల రంగం ఇలా... ఇక సేవల రంగానికి సంబంధించి అక్టోబర్ నెల గణాంకాలను కూడా ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసింది. సేవల ఎగుమతుల విలువ 17.22 బిలియన్ డాలర్లు ఉంటే, దిగుమతుల విలువ 10.92 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు గణాంకాలు తెలిపాయి. తక్షణ వాణిజ్య విధానం అవసరం జారుడుబల్లపై ఉన్న ఎగుమతుల పరిస్థితిని నిలువరించడానికి తక్షణం ప్రభుత్వం విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రకటించాలని ఎగుమతిదారులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పరిస్థితి మరింత విషమిస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మందగమనానికి, డిమాండ్‌లో బలహీనతకు గణాంకాలు అద్దం పడుతున్నాయని భారత వాణిజ్యాభివృద్ధి మండలి చైర్మన్ మోహిత్ సింగ్లా పేర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారత ఎగుమతి సంస్థల సమాఖ్య చీఫ్ శరద్ కుమార్ సరాఫ్ మాట్లాడుతూ, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు, రక్షణాత్మక వాణిజ్య విధానాల ప్రభావం భారత్ ఎగుమతులపై కనబడుతోందని తెలిపారు. -
భారత్ ఎగుమతులు బాగున్నాయి
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు గడచిన 14 నెలల్లో చాలా బాగున్నాయని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు బుధవారం చెప్పారు. అయితే పూర్తి సంతృప్తి మాత్రం లేదన్నారు. ఎగుమతుల పెంపునకు భారత్ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు. 2019లో పటిష్ఠ వృద్ధి సాధించడానికి ఎగుమతులే ప్రధాన వనరుగా ఉండాలన్నది ఈ వ్యూహం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రక్షణాత్మకవాదం, మందగమనం, వాణిజ్య యుద్ధం, దిగుమతి సుంకాలుసహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ, దేశ ఎగుమతులు పెరుగుతుండడం గమనార్హమని మంత్రి పేర్కొన్నారు. 2011–12 నుంచి దేశ ఎగుమతుల విలువ 300 బిలియన్ డాలర్లుగా ఉంది. 2017–18లో 10% వృద్ధితో 303 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అల్యూమినియంపై దిగుమతి సుంకం పెంపు! అల్యూమినియంపై దిగుమతి సుంకాల పెంపునకు కేంద్రం సానుకూలంగా ఉంది. దేశీయ పరిశ్రమ, తయారీ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు ప్రభు పేర్కొన్నారు. ఈ కమోడిటీ భారీ దిగుమతులపై అల్యూమినియం పరిశ్రమ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అల్యూమినియం స్క్రాప్‌పై బేసిక్ కస్టమ్స్ సుంకం 2.5%. ప్రైమరీ అల్యూమినియంపై 7.5%. రెండింటిపై ఈ సుంకాన్ని 10 శాతానికి పెంచాలన్న డిమాండ్ వస్తోంది. దీనితోపాటు ఈ కమెడిటీ దిగుమతిపై కనీస దిగుమతి ధర, దిగుమతులపై కోటా నిర్దేశం వంటి మరికొన్ని పరిమితులూ విధించాలని దేశీయ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. -
అంతా తగ్గుదలే!
న్యూఢిల్లీ: జనవరిలో ఎగుమతి-దిగుమతుల రంగం మిశ్రమ ఫలితాలు చవిచూసింది. 2013లో ఇదే నెలతో పోలిస్తే ఎగుమతుల్లో 3.79 శాతం వృద్ధి మాత్రమే నమోదయింది. అయితే బంగారం, వెండి దిగుమతుల తగ్గడం వల్ల ఎగుమతులు-దిగుమతుల మధ్య ఉన్న వ్యత్యాసం సానుకూల రీతిలో 9.92 బిలియన్ డాలర్లకు దిగింది. ఎగుమతుల్లో నిరాశ... జనవరిలో ఎగుమతుల వృద్ధి నామమాత్రంగా ఉంది. 2013 అక్టోబర్ నుంచి ఎగుమతులు నిరాశాజనకంగా పడిపోతున్నాయి. అప్పట్లో ఎగుమతుల్లో 13.47 శాతం వృద్ధి నమోదుకాగా, నవంబర్‌లో 5.86 శాతం, డిసెంబర్లో 3.49 శాతం మాత్రమే వృద్ధి నమోదయింది. రత్నాలు- ఆభరణాలు, పెట్రోలియం వంటి ప్రధాన ఉత్పత్తుల ఎగుమతులు తగ్గడం ఈ విభాగంపై ప్రభావం చూపినట్లు విదేశీ వాణిజ్య డెరైక్టర్ జనరల్ అనుప్ పూజారి చెప్పారు. ఈ రెండు విభాగాల నుంచి ఎగుమతులు 2013 జనవరితో పోలిస్తే అసలు వృద్ధి లేకపోగా వరుసగా 13.1 శాతం, 9.39 శాతం చొప్పున క్షీణతను నమోదుచేశాయి. తగ్గిన దిగుమతులు... బంగారం, వెండి దిగుమతులు 2013 జనవరితో పోలిస్తే 77 శాతం పడిపోయి 7.49 బిలియన్ డాలర్ల నుంచి 1.72 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతులు సైతం 10.1 శాతం క్షీణించి 13.18 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రభుత్వ నియంత్రణల వల్ల ఏప్రిల్-జనవరి మధ్య ఈ రెండు విలువైన మెటల్స్ దిగుమతులు 37.8 శాతం క్షీణించి 27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో అంటే 2012 ఏప్రిల్-2013 జనవరి మధ్య ఈ విలువ 46.7 బిలియన్ డాలర్లు. కరెంట్ ఖాతా లోటు కట్టడి... వాణిజ్యలోటు తగ్గడం కరెంట్ ఖాతా లోటుకు (క్యాడ్) సానుకూలాంశం. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-విదేశీ సంస్థాగత పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ వాణిజ్య రుణాలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసమే క్యాడ్. ఇదెంత ఎక్కువైతే ఆర్థిక వ్యవస్థకు అంత ప్రమాదం. రూపాయి విలువ కదలికలపై సైతం ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో ఈ రేటు 4.8 శాతం (88.2 బిలియన్ డాలర్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో 3.7 శాతానికి అంటే దాదాపు 70 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని తొలుత ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు ఇది 50 బిలియన్ డాలర్ల లోపునకు తగ్గుతుందని (జీడీపీలో 3 శాతం వరకూ) భావిస్తోంది.