ఒకప్పుడు మొబైల్ ఫోన్ అనగానే చైనాయే గుర్తొచ్చేది. డ్రాగన్ దేశం నుంచే వివిధ దేశాలకు లక్షలాదిగా మొబైళ్లు ఎగుమతి అయ్యేవి. పైగా స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ దాదాపు చైనాలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత్ ఫోన్ల తయారీలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2014–2023 మధ్య కాలంలో మొబైల్ ఫోన్‌ల ఉత్పత్తిలో 23 శాతం వార్షిక వృద్ధిరేటు సాధించుకుంటూ ప్రపంచంలో రెండవ అతి పెద్ద మొబైల్ ఉత్పత్తి దేశంగా అవతరించింది. ఈ మేరకు గ్లోబల్ రీసెర్చ్ ఆర్గ నైజేషన్ ‘కౌంటర్ పాయింట్’ నివేదించింది.
భారత్ దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం విజయవంతం కావడంతో దేశంలో ఫోన్ల ఉత్పత్తి భారీగా పెరిగింది. ఇండియాలో ఎలక్ట్రానిక్ రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఫోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం 2021 ఏప్రిల్లో పీఎల్‌ఐ పథకాన్ని ప్రవేశపెట్టింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేయడంలో ఆయా సంస్థలకు రూ. 40,995 కోట్ల రాయితీలు ఈ పథకం కింద ఇచ్చింది.
దీంతో స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్‌లతో పాటు పలు కంపెనీలు ఫోన్‌ల ఉత్పత్తిని విపరీతంగా పెంచాయి. దేశీయ మార్కెట్‌లో విక్రయించడంతో పాటు పలు దేశాలకు ఎగుమతులు పెరిగాయి. ఈ అనూహ్య పెరుగుదలకు యాపిల్ ఐఫోన్ల ఒప్పంద తయారీ కంపెనీలైన ఫాక్స్‌కాన్, పెగట్రాన్, విస్ట్రన్‌లతో పాటు శాంసంగ్ ప్రధాన కారణం. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి సాధించేందుకు ‘ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్’ (ఐసీఈఏ) సుంకాలు తగ్గించి, మార్కెట్‌లో పోటీ తత్వాన్ని పెంచాలని చూస్తోంది. ఉత్పత్తులను మెరుగుపరచడం, కార్మిక సంస్కరణలు చేయడం, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై దృష్టి సారించింది.
2025–26 నాటికి 600 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లు ఎగుమతి అవుతాయని భారత్ అంచనా వేస్తోంది. ఒకప్పుడు మన దేశం నుంచి మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు ఫోన్లు ఎగుమతి అవ్వగా... ప్రస్తుతం అమెరికా, నెదర్లాండ్, ఆస్ట్రియా, ఇటలీ వంటి యూరప్ దేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘పేస్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్’ (పీఎంపీ), ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్’ (పీఎల్‌ఐ), ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి కార్యక్రమాలను కేంద్రం ప్రారంభించి స్థానిక తయారీ సంస్థలను ప్రోత్సహించింది. 2014లో దేశీయంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 19 శాతం మాత్రమే ఉండేది. 2022 నాటికి 98 శాతం స్థానికంగా తయారు చేసిన ఫోన్‌లను భారత్ ఎగుమతి చేసింది.
ఇప్పటికే ఇండియాలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్‌లు, లాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ మదర్ బోర్డులతో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో వినియోగించే మైక్రో ప్రాసెసర్లు, చిప్‌సెట్స్ కూడా మన దేశంలోనే తయారు చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇదే తరహాలో భారత్ ముందుకెళ్తే ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింత వృద్ధి సాధించేందుకు అవకాశం ఉంది.
– తాడేపల్లి విజయ్ ‘ 78424 85865
Comments
Please login to add a commentAdd a comment