
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
సిలిండర్లు పేలి వ్యాపించిన మంటలు, పొగలు
ఊపిరాడక ఇద్దరు మహిళలు, బాలిక మృత్యువాత
పుప్పాలగూడ పాషా కాలనీలో తీవ్ర విషాదం
మణికొండ(హైదరాబాద్): గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి. భవనం మొదటి, రెండో అంతస్తులకు వ్యాపించడంతో ఊపిరి ఆడక ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ పాషా కాలనీలో శుక్రవారం సాయంత్రం విషాదాన్ని నింపింది.
స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. పాషా కాలనీ ప్లాట్ నెంబర్ 72లో ఉస్మాన్‌ఖాన్, అతని తమ్ముడు యూసుఫ్ ఖాన్ కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని తన కిరాణా దుకాణంలో ఉస్మాన్ ఖాన్ ఉండగా.. ఆకస్మికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న పార్కింగ్‌లో నిలిపిన రెండు కార్లకు అంటుకున్నాయి.
దీంతో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో కారులోని గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు మరింత ఉద్ధృతమై భవనంలోని మొదటి అంతస్తుకు వ్యాపించడంతో కిచెన్ గదిలోని రెండు సిలిండర్‌లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. దీంతో ఓ గదిలో ఇరుక్కుపోయిన ఉస్మాన్‌ఖాన్ తల్లి జమిలాఖాతమ్ (78), అతని తమ్ముడి భార్య శాహినా ఖాతమ్ (38), తమ్ముడి కూతురు సిజ్రా ఖాతమ్ (4)లు ఊపిరి ఆడకపోవడంతో గదిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కిందికి దూకి..
మంటల నుంచి తప్పించుకునేందుకు చుట్టుపక్కల వారు బాధితుల ఇంటి ముందు పరుపులు వేయగా.. ఉస్మాన్‌ఖాన్ తమ్ముడు యూసుఫ్‌ఖాన్, కుమారుడు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకారు. దీంతో యూసుఫ్ ఖాన్ కాలు విరిగింది. గాయపడిన యూసుఫ్ ఖాన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్ని మాపక శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫ్లాట్‌లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు.
అగి్నమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత పైఅంతస్తుకు వెళ్లి గోడలకు రంగులు వేసే జూల ద్వారా ఇద్దరిని సురక్షితంగా కిందికి తీసుకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో 8 మంది ఉన్నారు. ఇందులో ముగ్గురు మొదటి అంతస్తు నుంచి దూకి, ఇద్దరు జూల ద్వార కిందికి వచ్చి ప్రాణాలను కాపాడుకోగా.. ఇద్దరు మహిళలు, బాలిక మృతి చెందారు. ఘటనా స్థలానికి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణగౌడ్, మణికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్ ముదిరాజ్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment