smart phone market
-
ఎలక్ట్రానిక్స్‌లో దూసుకెళ్తున్న భారత్
ఒకప్పుడు మొబైల్ ఫోన్ అనగానే చైనాయే గుర్తొచ్చేది. డ్రాగన్ దేశం నుంచే వివిధ దేశాలకు లక్షలాదిగా మొబైళ్లు ఎగుమతి అయ్యేవి. పైగా స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ దాదాపు చైనాలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత్ ఫోన్ల తయారీలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2014–2023 మధ్య కాలంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో 23 శాతం వార్షిక వృద్ధిరేటు సాధించుకుంటూ ప్రపంచంలో రెండవ అతి పెద్ద మొబైల్ ఉత్పత్తి దేశంగా అవతరించింది. ఈ మేరకు గ్లోబల్ రీసెర్చ్ ఆర్గ నైజేషన్ ‘కౌంటర్ పాయింట్’ నివేదించింది. భారత్ దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం విజయవంతం కావడంతో దేశంలో ఫోన్ల ఉత్పత్తి భారీగా పెరిగింది. ఇండియాలో ఎలక్ట్రానిక్ రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఫోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం 2021 ఏప్రిల్‌లో పీఎల్ఐ పథకాన్ని ప్రవేశపెట్టింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేయడంలో ఆయా సంస్థలకు రూ. 40,995 కోట్ల రాయితీలు ఈ పథకం కింద ఇచ్చింది. దీంతో స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్‌లతో పాటు పలు కంపెనీలు ఫోన్ల ఉత్పత్తిని విపరీతంగా పెంచాయి. దేశీయ మార్కెట్లో విక్రయించడంతో పాటు పలు దేశాలకు ఎగుమతులు పెరిగాయి. ఈ అనూహ్య పెరుగుదలకు యాపిల్ ఐఫోన్ల ఒప్పంద తయారీ కంపెనీలైన ఫాక్స్‌కాన్, పెగట్రాన్, విస్ట్రన్లతో పాటు శాంసంగ్ ప్రధాన కారణం. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి సాధించేందుకు ‘ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్’ (ఐసీఈఏ) సుంకాలు తగ్గించి, మార్కెట్లో పోటీ తత్వాన్ని పెంచాలని చూస్తోంది. ఉత్పత్తులను మెరుగుపరచడం, కార్మిక సంస్కరణలు చేయడం, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై దృష్టి సారించింది. 2025–26 నాటికి 600 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లు ఎగుమతి అవుతాయని భారత్ అంచనా వేస్తోంది. ఒకప్పుడు మన దేశం నుంచి మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు ఫోన్లు ఎగుమతి అవ్వగా... ప్రస్తుతం అమెరికా, నెదర్లాండ్, ఆస్ట్రియా, ఇటలీ వంటి యూరప్ దేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘పేస్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్’ (పీఎంపీ), ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్’ (పీఎల్ఐ), ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి కార్యక్రమాలను కేంద్రం ప్రారంభించి స్థానిక తయారీ సంస్థలను ప్రోత్సహించింది. 2014లో దేశీయంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 19 శాతం మాత్రమే ఉండేది. 2022 నాటికి 98 శాతం స్థానికంగా తయారు చేసిన ఫోన్లను భారత్ ఎగుమతి చేసింది. ఇప్పటికే ఇండియాలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెల్ఫోన్లు, లాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ మదర్ బోర్డులతో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో వినియోగించే మైక్రో ప్రాసెసర్లు, చిప్సెట్స్ కూడా మన దేశంలోనే తయారు చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇదే తరహాలో భారత్ ముందుకెళ్తే ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింత వృద్ధి సాధించేందుకు అవకాశం ఉంది. – తాడేపల్లి విజయ్ ‘ 78424 85865 -
పాత ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో రీఫర్బిష్డ్ ఫోన్లు (పునరి్వనియోగ), ఎల్రక్టానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. రానున్న పండుగల సీజన్లో గతేడాదితో పోలిస్తే ఈ విభాగం నుంచి ఆదాయం 18 శాతం వృద్ధి చెందుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. దీంతో కొత్త ఫోన్ల విభాగంలో 7 శాతం వృద్ధిని పునరి్వనియోగ ఫోన్ల మార్కెట్ అధిగమించనుంది. క్యాషిఫై, రీఫిట్ గ్లోబల్ ఈ రెండూ రీఫర్బిష్డ్ ఫోన్లు, రీఫర్బిష్డ్ ఎల్రక్టానిక్ ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ సంస్థలు కాగా, వచ్చే పండుగల సందర్భంగా అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయనే అంచనాలతో ఉన్నాయి. ముఖ్యంగా ఖరీదైన రీఫర్బిష్డ్ ఫోన్లకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. ‘‘మా ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. 2021–22 రికార్డు ఆదాయన్ని డిసెంబర్ నాటికే అధిగమించనున్నాం’’అని రీఫిట్ గ్లోబల్ సహ వ్యవస్థాపకుడు సాకేత్ సౌరవ్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలతో రిఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి ఈ సంస్థకు ఒప్పందాలు ఉన్నాయి. యాపిల్, వన్‌ప్లస్ బ్రాండ్ల రీఫర్బిష్డ్ ఫోన్లకు పెద్ద పట్టణాల్లో మంచి ఆదరణ ఉన్నట్టు సౌరవ్ తెలిపారు. గత 8–10 నెలల్లో యాపిల్, వన్‌ప్లస్ నుంచి సరఫరాలు పెరిగినట్టు చెప్పారు. గతంలో ఈ రెండు బ్రాండ్లు మొత్తం అమ్మకాల్లో 3–3.5 శాతం వాటా కలిగి ఉండేవని, ఇప్పుడు 9–10 శాతానికి పెరిగినట్టు పేర్కొన్నారు. బలమైన అంచనాలు.. దేశంలో రీఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విక్రయాల్లో అగ్రగామి కంపెనీ క్యాషిఫై దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే పండుగల సీజన్లో రెండింత విక్రయాలను అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. ఓమ్నిచానల్ నమూనాను క్యాషిఫై అనుసరిస్తోంది. 2,000కు పైగా రిటైల్ స్టోర్లలోను ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సంస్థ సహ వ్యవస్థాపకుడు నకుల్ కుమార్ తెలిపారు. రీఫర్బిష్డ్ స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌ల విభాగాలనూ ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. యాపిల్, శామ్సంగ్, వన్‌ప్లస్ ఉత్పత్తులను రూ.18,000–22,000 శ్రేణిలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. రానున్న పండుగల సమయంలో రీఫర్బిష్డ్ విభాగం వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 18 శాతం వృద్ధి నమోదు కా>వచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. ఐఫోన్ 12, ఐఫోన్ 11, గెలాక్సీ ఎస్21ఎఫ్ఈ, గెలాక్సీ ఎస్21, రెడ్మీ నోట్ 10 తదితర ఉత్పత్తులు ఈ వృద్ధిని నడిపిస్తాయన్నారు. దేశీయంగా సరఫరా తక్కువగా ఉండడం రీఫర్బిష్డ్ విభాగంలో ఐఫోన్లకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు చెప్పారు. -
స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ షాక్: కేంద్రం సంచలన నిర్ణయం?
న్యూఢిల్లీ: జాతీయ భద్రత నేపథ్యంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పలు స్మార్ట్‌ఫోన్లలోముందే ఇన్స్టాల్ చేసిన యాప్‌లను నిరోధించే ప్లాన్‌లో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం యోచన ప్రకారం ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే చైనా సహా, ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ షాక్ తగలనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం గూఢచర్యం , వినియోగదారు డేటా దుర్వినియోగం గురించి ఆందోళనల మధ్య భారతదేశ ఐటీ మంత్రిత్వ శాఖ ఈ కొత్త నిబంధనలను పరిశీలిస్తోంది. స్మార్ట్ఫోన్లకు సంబంధించి కొత్త భద్రతా నియమాలను తీసుకురానుంది. ఫిబ్రవరి 8న ప్రభుత్వ రహస్య రికార్డు ప్రకారం ప్రీ-ఇన్స్టాల్ చేసిన యాప్‌లను తీసివేయడానికి, ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లను తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయడానికి అనుమతించమని స్మార్ట్‌ఫోన్ తయారీదారులను నిలువరించాలని యోచిస్తోంది. చైనా సహా విదేశీ కంపెనీల గూఢచర్యాన్ని నిరోధించాలని భావిస్తున్నట్టు పేరు చెప్పడానికి నిరాకరించిన సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. (పోకో ‘ది 5జీ ఆల్ స్టార్’ లాంచ్: ఆఫర్ ఎంతంటే?) కొత్త నిబంధనల ప్రకారం, స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఆయా ఫోన్లలో అన్ఇన్స్టాల్ ఆప్షన్ ఇవ్వాలి. అలాగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏజెన్సీ ఆమోదించిన ల్యాబ్ ద్వారా కొత్త మోడల్స్ టెస్టింగ్‌కు సమ్మతించాలి. ప్రతి ప్రధాన ఆపరేటింగ్సిస్టమ్ అప్డేట్ను వినియోగదారులకు అందించే ముందు తప్పనిసరి స్క్రీనింగ్ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది ప్రపంచంలోని నం.2 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆయా కంపెనీల లాంచ్ టైమ్ లైన్లను పొడిగించవచ్చని, ఇది యాపిల్ సహా శాంసంగ్, షావోమి, వివో తదితర సంస్థలకు ఎదురుదెబ్బేనని నిపుణులు భావిస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలదే ఆధిపత్యం. కౌంటర్ పాయింట్ డేటా ప్రకారం షావోమి, బీబీకే ఎలక్ట్రానిక్స్ వివో, ఒప్పో మొత్తం ఫోన్ అమ్మకాలలో దాదాపు సగం వాటాను సొంతం చేసుకోగా, దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌కు 20శాతం, యాపిల్‌కు 3 శాతం వాటా ఉంది. (లడ్డూ కావాలా నాయనా! పెళ్లికీ ఈఎంఐ ఆఫర్: మ్యారీ నౌ పే లేటర్!) పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారు? ♦ కెమెరా వంటి కొన్ని ముందే ఇన్స్టాల్ చేసిన యాప్‌లు వినియోగదాలకు చాలా కీలకమని, స్క్రీనింగ్ నిబంధనలను విధించేటప్పుడు ప్రభుత్వం వీటికి , అనవసరమైన వాటికి మధ్య తేడాను గుర్తించాలి. ♦ స్మార్ట్‌ఫోన్ ప్లేయర్లు తరచుగా తమ మొబైల్స్‌ను ప్రొప్రయిటరీ యాప్‌ల ద్వారా విక్రయిస్తారు, అలాగే మానిటైజేషన్ ఒప్పందాలనుతో కొన్ని యాప్స్‌ను ముందే ఇన్స్టాల్ చేస్తారు. ♦ ముఖ్య ఆందోళన ఏమిటంటే, టెస్టింగ్‌లకు ఎక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్, దాని భాగాలను భద్రతా సమ్మతి కోసం ప్రభుత్వ ఏజెన్సీ టెస్టింగ్‌కు దాదాపు 21 వారాలు పడుతోంది. ఈనేథ్యంలో గో-టు మార్కెట్ వ్యూహానికి ఇది భారీ అవరోధమని పరిశ్రమకు కొంతమంది ఎగ్జిక్యూటివ్స్‌అభిప్రాయం. కాగా జాతీయ భద్రత ముప్పు నేపథ్యంలో 2020 ఇండో-చైనా సరిహద్దు ఘర్షణ ఆందోళనల నేపత్యంలో టిక్‌టాక్‌తో సహా 300 కంటే ఎక్కువ చైనీస్ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. -
స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో 'లోకల్' స్కెచ్!! వేలకోట్లలో పెట్టుబడులు!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ వివో రానున్న రెండేళ్లలో దేశీయంగా రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. అంతేకాకుండా ఈ కేలండర్ ఏడాది(2022)లో దేశీయంగా తయారైన మొబైల్ ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేసే యోచనలో ఉంది. దేశీయంగా మొత్తం రూ. 7,500 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు వివో ఇండియా (వ్యాపార వ్యూహాల) డైరెక్టర్ పాయిగమ్ డానిష్ తాజాగా తెలియజేశారు. తద్వారా దేశీయంగా తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే(2021 వరకూ) రూ.1,900కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు.రానున్న రెండేళ్లలో మరో రూ.3,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేశారు. పెట్టుబడులన్నీ తయారీకే వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. లోకల్ డిమాండ్ స్థానికంగా మొబైల్ ఫోన్లకున్న డిమాండుకు అనుగుణంగా గ్రేటర్ నోయిడా ప్లాంట్ల నుంచి సరఫరాలు చేస్తున్నట్లు డానిష్ పేర్కొన్నారు. ఇకపై హ్యాండ్సెట్లను ఎగుమతి చేయడంపై దృష్టిసారించనున్నట్లు వెల్లడించారు. వెరసి ఈ ఏడాది నుంచే ఎగుమతులను చేపట్టనున్నట్లు తెలియజేశారు. దేశీ అవసరాలకు అనుగుణంగా గత ఏడేళ్లలో తామెంత బలపడిందీ ఈ అంశాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీ మార్కెట్లో వివో 10 కోట్లకుపైగా వినియోగదారులను చేరుకున్నట్లు తెలియజేశారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ ప్రకారం 2021లో షియోమీ, శామ్సంగ్ తదుపరి 15.6 శాతం మార్కెట్ వాటాతో దేశీయంగా మూడో ర్యాంకులో నిలిచినట్లు వెల్లడించారు. మరో 5000 మందికి ఉపాధి ప్రస్తుతమున్న 6 కోట్ల స్మార్ట్‌ఫోన్ తయారీ సామర్థ్యాన్ని 12 కోట్లకు పెంచుకునే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు డానిష్ తెలియజేశారు. ఇందుకు వెచ్చిస్తున్న రూ. 7,500 కోట్ల పెట్టుబడులతో ఉద్యోగుల సంఖ్య 40,000కు చేరనున్నట్లు తెలియజేశారు. తయారీ యూనిట్లలో ప్రస్తుతం 10,000 మంది విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 2023లో అదనంగా 5,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. గ్రేటర్ నోయిడాలో కొనుగోలు చేసిన మరో 169 ఎకరాలలో కొత్త ప్లాంటును నెలకొల్పుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక వస్తువులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం బ్యాటరీలను 90 శాతం, చార్జర్లను 60 శాతంవరకూ దేశీయంగానే సమకూర్చుకుంటున్నట్లు వివరించారు. 2023కల్లా 65 శాతం డిస్ప్లేలను స్థానికంగా రూపొందించనున్నట్లు వెల్లడించారు. -
Blackberry The Fall: ఆ ఆలస్యమే బ్లాక్‌బెర్రీ కొంప ముంచింది
ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ రారాజు. చేతిలో ఆ కంపెనీ ఫోన్ ఉంటే అదో దర్పం. ప్రొఫెషనల్స్‌కి అదొక అవసరం కూడా. ఒకానొక సీజన్లో ఏకంగా ఒక 5 కోట్ల డివైజ్‌లు అమ్ముడు పోయిన చరిత్ర ఉంది. కానీ, అటుపై ఘోరమైన పతనాన్ని చవిచూసింది. అందుకు కారణం ఆలస్యమేనన్న విశ్లేషణ నడుస్తోంది ఇప్పుడు. ‘ఆలస్యం అమృతం విషం’ అంటారు పెద్దలు. రీసెర్చ్ ఇన్ మోషన్(RIM) అలియాస్ బ్లాక్‌బెర్రీ లిమిటెడ్ విషయంలో ఇదే జరిగింది. పోటీతత్వాన్ని తేలికగా తీసుకున్న బ్లాక్‌బెర్రీ.. రాంగ్ స్టెప్పులు వేసింది. నష్టాలను సైతం పట్టించుకోకుండా విలువల పేరుతో ఈ కెనెడియన్ టెలికాం కంపెనీ స్వీయ తప్పిదాలు చేసి పతనం వైపు అడుగు వేసింది. ఇంతకీ బ్లాక్‌బెర్రీ ది రైజ్ అండ్ ది ఫాల్ ఎలా సాగిందో చూద్దాం.. పేజర్లు, హ్యాండ్సెట్ల తయారీతో మొదలైన RIM(బ్లాక్‌బెర్రీ) ప్రస్థానం.. స్మార్ట్‌ఫోన్ రాకతో కొత్త పుంతలు తొక్కింది. పూర్తిగా ఐకానిక్ కీబోర్డుతో పదిహేనేళ్లపాటు కోట్ల మంది యూజర్లను అలరించింది. ఒకానొక టైంలో బ్లాక్‌బెర్రీ.. అమెరికాలో 50 శాతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను, ప్రపంచం మొత్తం మీద 20 శాతం మార్కెట్‌ను శాసించింది. 2011, 2012లో ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి హ్యాండ్సెట్ల అమ్మకాలతో సంచలనం సృష్టించిన బ్లాక్‌బెర్రీకి.. పోటీదారుల ఒరవళ్లతో గడ్డుకాలం మొదలైంది. 2016 నుంచి ఏకంగా ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బ్లాక్‌బెర్రీ.. తాజాగా సొంత ఓఎస్ ఫోన్లు పని చేయవంటూ ప్రకటించింది. దీంతో కోట్ల ఫోన్లు మూగబోయాయి. ఇంతకీ ఏం జరిగింది? బీజం.. 1984లో మైక్ లాజరడీస్,డౌగ్లస్ ఫ్రాగ్ అనే కెనెడియన్ ఇంజీనీర్లు RIMను ప్రారంభించారు. మొదట్లో ఈ కంపెనీ ఐబీఎంకోసం ఎల్ఈడీ సిస్టమ్, మోడెమ్స్ తో పాటు పేజెస్ వంటి లోకల్ నెట్ వర్కింగ్ కనెక్టివిటీ టెక్నాలజీ డెవలప్ చేసింది. అలాగే ఫిల్మింగ్ ఎడిటింగ్ సిస్టమ్‌ను డిజైన్ చేసింది. అందుకు గాను 1998లో ఆస్కార్ అవార్డ్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 1989లో కెనడియన్ ఫోన్ కంపెనీ అయిన రోజెర్స్ ఫోన్ మెసేజింగ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన తన మొబైల్ నెట్‌వర్క్‌లో పనిచేసేలా రిమ్(RIM)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా పేజర్ల తయారీ మొదలుపెట్టింది. 1996లో వాటర్లూ(ఒంటారియో) వేదికగా రిమ్ నుంచి పేజర్లు కలర్ ఫీచర్లతో రిలీజ్ అయ్యాయి. ఫోన్ల రాక.. బ్లాక్ బెర్రీ డివైజ్ 850 1999 నుంచి అధికారికంగా రిలీజ్ అయ్యింది. 2000 సంవత్సరంలో ఫిజికల్ బోర్డుతో కూడిన 957 మోడల్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయ్యింది. 2006లో ట్రాక్ బాల్‌ను అమర్చింది. బిజినెస్ ప్రొఫెషనల్స్ కోసం తీసుకొచ్చిన ఫోన్లు.. సాధారణ జనాలకు సైతం కిక్కు ఇచ్చింది. బ్లాక్ బెర్రీ అంటే.. ముందుగా వచ్చిన అడ్వాన్స్డ్ స్మార్ట్‌ఫోన్ అనే ముద్ర పడింది. 2007లో కంపెనీ ఆదాయం అక్షరాల 3 బిలియన్ డాలర్లు దాటేసింది. బ్లాక్‌బెర్రీ సెల్ ఫోన్లు ఒకప్పుడు చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తులు వాటిని "క్రాక్బెర్రీస్" అని పిలిచేవారు. కిమ్ కర్దాషియాన్, బరాక్ ఒబామా లాంటి ప్రముఖులు ఈ ఫోన్లనే వాడేవాళ్లు. పెద్ద కీబోర్డు, మధ్యలో ఐబాల్.. కీ సెటప్‌తో ప్రత్యేకంగా ఆకర్షించేవి ఫోన్లు. అందులో నెట్ ఇన్కమ్ 631 మిలియన్ డాలర్లు. ఈ లోపు బ్లాక్‌బెర్రీ స్ఫూర్తితో యాపిల్ ఐఫోన్లను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా స్టీవ్ జాబ్స్ అంగీకరించడం విశేషం. పైగా ఇకపై బ్లాక్‌బెర్రీకి తాము గట్టి పోటీ ఇవ్వబోతున్నామంటూ ఆయన ప్రకటించాడు కూడా. కానీ, బ్లాక్‌బెర్రీ మాత్రం ఏనాడూ యాపిల్‌ను పోటీగా చూడలేదు. అదే కొంప ముంచింది. ఏడాదికో అప్డేట్ లేకపాయే! 2008లో రిలీజ్ అయిన ఫ్లిప్ఫోన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. అయితే ఆ వెంటనే వచ్చిన టచ్ మోడల్ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. అదే సమయంలో ఐఫోన్ అమ్మకాలు మొదలైనా ఖరీదు ఎక్కువ కావడంతో బ్లాక్‌బెర్రీ హవానే నడిచింది. అలా 2011 వరకు బ్లాక్‌బెర్రీ ఫోన్ల డామినేషన్ కొనసాగింది. అయితే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వస్తున్న మార్పును పసిగట్టడంలో బ్లాక్‌బెర్రీ ఘోరంగా విఫలమైంది. ఐఫోన్లో ప్రతీ ఏడాది ఓ అప్డేట్ రావడం, ఆపై మోటోరోలా అమ్మకాల సంచలనం కొనసాగడంతో బ్లాక్‌బెర్రీ పతనం చిన్నగా మొదలైంది. అదే సమయంలో టార్చ్, ప్లేబుక్ టాబ్లెట్ అంటూ ఇన్నోవేషన్లు చేసిందే తప్ప.. అప్డేట్కి ప్రయత్నించలేదు. దీంతో ఆ తర్వాత వచ్చిన మోడల్స్ ఏవీ పెద్దగా అమ్ముడుపోలేదు. బోర్ కొట్టించాయి. సొంత యాప్ స్టోర్ బ్లాక్‌బెర్రీలో మరో ఫెయిల్యూర్ అంశం. యాపిల్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లా మ్యాజిక్ చేయలేకపోయింది. ఎంత ప్రయత్నించినా.. చిన్న చిన్న ఫీచర్లు తీసుకొచ్చేందుకు బోలెడంత సమయం తీసుకునేది. ఇదంతా యూజర్లకు విసుగు తెప్పించింది. తోటి పోటీదారులు ఫ్రంట్ బ్యాక్ కెమెరాలంటూ అడ్వాన్స్డ్ ఫీచర్లు తెస్తుంటే.. బ్లాక్‌బెర్రీ మాత్రం అక్కడే ఆగిపోయింది. దీంతో పతనం ఉధృతి పెరిగింది. 2009లో 20 శాతానికి పడిపోయిన బ్లాక్‌బెర్రీ మార్కెట్.. మూడేళ్లలో 5 శాతానికి పడిపోయింది. అయితే 2013లో టచ్ మోడల్స్ స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికీ.. అప్పటికే చాలా ఆలస్యమైంది. అదే ఏడాది రిమ్ అధికారికంగా బ్లాక్‌బెర్రీ అనే పేరును ప్రమోట్ చేసుకుంది. కానీ, ఆ వ్యూహం కూడా బెడిసి కొట్టింది. కస్టమర్లు, యూజర్ల పట్ల నిజాయితీగా ఉందనుకునే తప్పా.. పతనాన్ని ఊహించలేదు. 2016 చివరి క్వార్టర్‌కు చేరుకునే సరికి.. 432 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లో అమ్ముడుపోయినవి కొన్నే. దీంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేర్ సున్నాకు చేరింది. చేతులు మారినా.. 2015 నుంచి బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను నిలిపివేసి.. సొంత ఓఎస్ ప్లేస్‌లో ఆండ్రాయిడ్ భాగస్వామిగా సాగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణలో సంచలనాలకు నెలవైన బ్లాక్‌బెర్రీ లిమిటెడ్.. అనూహ్యంగా ఓనర్షిప్ నుంచి పక్కకు జరిగింది. 2016లో చైనీస్ కన్జూమర్ ఎలక్ట్రిక్ కంపెనీ టీసీఎల్.. బ్లాక్‌బెర్రీని కొనుగోలు చేసింది. బ్లాక్‌బెర్రీ 10, బ్లాక్బెరర్రీ వోఎస్‌లతో పని చేసింది. 1999 నుంచి కెనెడియన్ కంపెనీ బ్లాక్‌బెర్రీ లిమిటెడ్ (RIM) ఆధ్వర్యంలో పని చేసి.. 2016 నుంచి బీబీ మెరాహ్ పుతిహ్(ఇండోనేషియా), ఒప్టిమస్ ఇన్ఫ్రాకమ్(ఇండియా), టీసీఎల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో నడిచింది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీసీఎల్ కార్పొరేషన్ మాత్రమే బ్లాక్‌బెర్రీ డెవలపర్‌గా ఉంది. కస్టమైజ్డ్ ఆప్షన్స్, సెక్యూరిటీ ఫీచర్స్.. ఇలా ఎన్నో.. 2018లో రిలీజ్ అయ్యింది. BlackBerry KeyOne అండ్ Key2 వంటి స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది టీసీఎల్. ఇక జనవరి 4, 2022 తేదీ నుంచి బ్లాక్‌బెర్రీ మోడల్స్ ఫోన్లలో బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పూర్తిగా నిలిపివేశాయి. కానీ బ్లాక్‌బెర్రీ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2021 నుంచి టెక్సాస్‌కు చెందిన స్టార్టప్ ఆన్వార్డ్మొబిలిటీ 5జీ బ్లాక్‌బెర్రీ స్మార్ట్ఫోన్ల లైసెన్స్‌ను చేజిక్కించుకుంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి బ్లాక్‌బెర్రీ ఫోన్లు ఇంకా పూర్తిగా కనుమరుగు కాకపోయి ఉండొచ్చు.. కానీ, క్లాసిక్ టచ్‌తో వచ్చిన ఫోన్లు, ఫీచర్లు, సొంత సాఫ్ట్వేర్ మాత్రం ఇక కనిపించవు. బహుశా.. రాబోయే రోజుల్లో ఆ పేరు కనుమరుగు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే.. బ్లాక్‌బెర్రీ నోస్టాల్జియా కేటగిరీలో చేరిపోవడం ఖాయం. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
చైనాకు భారత్ భారీ షాక్!
Indian Government Regulation To Prevent Handset Snooping: పొరుగు దేశం చైనాకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. భారత మార్కెట్‌ను శాసిస్తున్న.. చైనా బ్రాండ్ ఫోన్ల విషయంలో ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వివో, ఒప్పో, షావోమీ, వన్‌ఫ్లస్ కంపెనీలను పరిశీలన విభాగం కిందకు తీసుకొచ్చి మరీ నోటీసులు పంపించింది. ఇప్పటి నుంచి చైనా నుంచి దిగుమతి అయ్యే స్మార్ట్ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను భారత్‌కు సమర్పించాల్సి ఉంటుంది. అంటే.. సదరు బ్రాండ్ ఫోన్లలో ఎలాంటి కంపోనెంట్లు ఉపయోగిస్తున్నారో లాంటి పూర్తి వివరాల్ని సైతం వెల్లడించాల్సిందేనని(చైనా ఇంతవరకు చేయని పనే ఇది!.. ఈ విషయంలో పలు దేశాలకూ అనుమానాలున్నాయి) నోటీసుల్లో భారత్ పేర్కొంది. అంతేకాదు సెక్యూరిటీ కారణాల వల్ల ప్రీ ఇన్స్టాల్ యాప్స్ తదితర వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఇదంతా నిఘా కోణంలో భాగంగానే తీసుకున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌లోని కన్జూమర్లకు ఆ ప్రొడక్టులు సురక్షితమైనవేనా? కాదా? అనేది తేల్చుకోవాల్సిన అవసరం తమకు ఉందని ఈ సందర్భంగా భారత ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొన్నట్లు ది మార్నింగ్ కంటెక్స్ట్ ఓ కథనం ప్రచురించింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డాటా ప్రకారం.. మన దేశపు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పైన పేర్కొన్న ఫోన్ల కంపెనీల ఆధిపత్యమే 50 శాతం దాకా కొనసాగుతోంది. భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని తరుణంలో.. కిందటి ఏడాది ఒక్కసారిగా 220 చైనా యాప్‌ల్ని నిషేధించి పెద్ద దెబ్బ కొట్టింది కేంద్ర ప్రభుత్వం. యాప్‌ల ద్వారా రహస్యాలను, వ్యక్తిగత డాటాను సేకరిస్తుందనే ఆరోపణల మీద ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అప్పటి నుంచి ‘లోకల్‌నెస్’ ప్రదర్శించుకోవడం కోసం స్థానిక ఉత్పత్తి దిశగా అడుగులు ప్రారంభించాయి కొన్ని కంపెనీలు. కానీ, కేంద్రం మాత్రం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. ఇప్పుడు ఫోన్ల ద్వారా రహస్యాల సేకరణకు ఆస్కారం ఉన్నందున స్మార్ట్ఫోన్ల మార్కెట్ నియంత్రణకు సిద్ధపడడం విశేషం. చదవండి: చైనాతో కచ్చి.. బిజినెస్ మాత్రం బిలియన్లలో! -
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ మేకర్‌గా రెడ్మీ
-
సంచలనం:యాపిల్‌ను వెనక్కి నెట్టిన షియోమీ
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షియోమీ సంచలనం సృష్టించిది. యాపిల్ కంపెనీని వెనక్కి నెట్టేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ మేకర్‌గా నిలిచింది. ఇక ఈ చైనీస్ మొబైల్ కంపెనీ ఇప్పుడు శాంసంగ్ టాప్ పొజిషన్‌కు ఎర్త్ పెట్టేందుకు సిద్ధమైంది. టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ canalys నివేదిక ప్రకారం.. 2021 రెండో క్వార్టర్లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాల ద్వారా షియోమీ రెండో స్థానానికి చేరుకుంది. ఇక మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 19 శాతం షేర్లతో దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ టాప్ పొజిషన్లో ఉండగా, షియోమీ 17 శాతం షేర్ల వద్ద ముగిసింది. సాధారణంగా ఇప్పటిదాకా శాంసంగ్, యాపిల్ల్లో మాత్రమే ఏదో ఒకటి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటూ వచ్చేవి. ఫస్ట్ టైం షియోమీ రెండో ప్లేస్‌కు చేరి ఆ సంప్రదాయానికి పుల్‌స్టాప్ పెట్టింది. హువాయ్ పతనం తర్వాత మిగతా ఫోన్ కంపెనీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈ గ్యాప్‌ను పూరించే పోటీలో షియోమీ పైచేయి సాధించింది. లాటిన్ దేశాలకు 300 శాతం కంటే ఎక్కువ, ఆఫ్రికా దేశాలకు 150 శాతం, పశ్చిమ యూరప్ దేశాలకు 50 శాతం షియోమీ ఫోన్ ఎగుమతులు వెళ్లాయి. ఎంఐ11 అల్ట్రా లాంటి ఫోన్ల వల్లే షియోమీ క్రేజ్ పెరిగిందని.. అదే టైంలో ఒప్పో, వివో నుంచి గట్టి పోటీ ఎదురైందని కనాలిస్ నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ షియోమీ రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక ఈ ఊపు ఇలాగే కొనసాగితే షియోమీ నెంబర్ వన్ బ్రాండ్‌గా అవతరించేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం యాపిల్‌కు 14 శాతం షేర్ ఉండగా, ఒప్పో.. వివోలు చెరో పదిశాతం మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. -
38 మిలియన్లకు చేరనున్న 5జీ స్మార్ట్ఫోన్లు..!
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో 5జీ స్మార్ట్ఫోన్లు తొమ్మిది రెట్లు పెరిగి.. 38 మిలియన్లకు చేరుతాయని రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ అంచనా వేసింది. వన్‌ప్లస్, యాపిల్ వంటి బ్రాండ్ ఫోన్లు బలమైన పోర్ట్‌ఫోలియోను నమోదు చేస్తుండటమే ఈ వృద్ధికి కారణమని పేర్కొంది. గతేడాది మూడో త్రైమాసికంలో లాక్డౌన్ ఆంక్షలు తొలగించిన అనంతరం దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వేగంగా కోలుకుంటుందని తెలిపింది. ఎగుమతుల పరంగా గతేడాది సెప్టెంబర్ క్వాటర్లో డిమాండ్, కొత్త యూజర్లు, పెరగడంతో అత్యుత్తమ మార్కెట్‌ను నమోదు చేసింది. 2020 క్యూ1లో దేశంలో 5జీ స్మార్ట్ఫోన్ల ప్రారంభమయ్యాయి. అధిక ధరలు, పరిమిత 5జీ నెట్వర్క్ వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది. గతేడాది ఆగస్టులో వన్‌ప్లస్ నుంచి మిడ్ ప్రైస్ 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌తో పరిస్థితుల్లో మార్పులు కనిపించాయని పేర్కొంది. (చదవండి: డక్‌డక్‌గో.. గూగుల్‌కు పోటీ ఉందా?) 2020 చివరి నాటికి 4 మిలియన్లకు... గతేడాది సెప్టెంబర్ క్వార్టర్లో 1.7 మిలియన్లుగా ఉన్న 5జీ ఎగుమతులు 2020 చివరి నాటికి 4 మిలియన్లకు చేరుకున్నాయని తెలిపింది. వన్‌ప్లస్, యాపిల్ రెండు బ్రాండ్ల ఎగుమతులే జరిగాయి. 100 శాతం 5జీ పోర్ట్‌ఫోలియో ఉన్న ఏకైక బ్రాండ్ వన్‌ప్లస్. ఐ–ఫోన్ 12 సిరీస్‌ను 5జీతో ప్రారంభించింది. గతేడాది జనవరి–నవంబర్ మధ్య కాలంలో దేశంలో విక్రయమైన 5జీ స్మార్ట్ఫోన్లలో 89 శాతం వాటా రూ.20 వేల లోపు ధర ఉన్న ఫోన్లే అని కౌంటర్‌పాయింట్ తెలిపింది. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్ (ఓఈఎం)లకు చవకైన 5జీ చిప్సెట్ల లభ్యతతో ధరలు తగ్గుతాయని పేర్కొంది. ప్రస్తుతం అఫర్డబుల్ 5జీ చిప్సెట్లను క్వాల్కమ్, మీడియాటెక్‌లు ఆవిష్కరించాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి దేశంలో 5జీ స్మార్ట్ఫోన్ల ధరలు రూ.15 వేలకు చేరుతాయని అంచనా వేసింది. -
మొబైల్స్‌పై మళ్లీ బాదుడు
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల వినియోగదారులకు మరో విడత ధరల పెంపు వడ్డన తప్పేట్లు లేదు. చిప్సెట్లకు తీవ్ర కొరత నెలకొనడంతో కంపెనీలు ధరలు పెంచే యోచనలో ఉన్నాయి. పరిశ్రమ ఇప్పటికే విడిభాగాల కొరతను ఎదుర్కొంటూ, పన్నుల పెంపు, కరోనా కారణంగా కొన్ని నెలల పాటు అమ్మకాల్లేని పరిస్థితులను చవిచూడగా.. ఇప్పుడు చిప్సెట్ల కొరత రూపంలో మరో సమస్య వచ్చి పడింది. ధరలను మరో విడత పెంచితే 2020లో నాలుగో విడత పెంపు అవుతుంది. ఫోన్ల ధరలు 5 నుంచి 10 శాతం వరకు పెంచొచ్చని తయారీదారులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ల డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, అంతర్జాతీయంగా డిమాండ్–సరఫరా మధ్య అంతరం నెలకొనడంతో ఉత్పత్తులకు–ధరల మధ్య సమతుల్యం విషయంలో కంపెనీలకు సమస్య ఏర్పడింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 5.43 కోట్ల స్మార్ట్ఫోన్ల ఎగుమతులు నమోదు కాగా.. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 17 శాతం అధికం. చైనాకు చెందిన హువావే నుంచి అతిపెద్ద కాంట్రాక్టు రావడంతో చిప్సెట్ల డిమాండ్–సరఫరా మధ్య అంతరం పెరిగిపోయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చిప్సెట్లకు హువావే భారీ ఆర్డర్ ‘‘హువావే భారీ సంఖ్యలో చిప్సెట్లను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్లు సంస్థ అవసరాల పరంగా చూస్తే ఏడాదికి మించినవి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చిప్సెట్లకు తీవ్ర కొరత ఏర్పడింది’’ అని ఓ ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మరో ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ సైతం స్పందిస్తూ.. ‘‘హువావే భారీ ఆర్డర్ మధ్య స్థాయి కంపెనీలకు చిప్సెట్ల సరఫరాను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ కంపెనీలకు సరఫరాదారులతో స్వల్పకాల కాంట్రాక్టులే ఉన్నాయి’’ అని వివరించారు. అంతర్జాతీయంగా అతిపెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీలకు ఇటువంటి పరిస్థితుల నుంచి సాధారణంగా రక్షణ ఉంటుందని.. అయినకానీ, వాటి సరఫరాలపైనా 10–20% వరకు ప్రభావం ఉండొచ్చన్నారు. చిప్సెట్ల సరఫరా ఇప్పుడు మరీ తగ్గిపోయిందంటూ తమ అవసరాల్లో మూడు శాతం వరకే సమకూర్చుకోగలిగిన పరిస్థితి ఉందన్నారు. ఫలితంగా స్పాట్ మార్కెట్ నుంచి చిప్సెట్లను కొనుగోలు చేయాల్సి వస్తోందని, దీంతో అక్కడ ధరలు చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. సరఫరా కొరత కారణంగా స్పాట్ మార్కెట్లో చిప్సెట్ల ధరలు 25–27 శాతం వరకు పెరిగినట్టు పరిశ్రమ అంటోంది. దీంతో మొబైల్ హ్యాండ్సెట్ తయారీ వ్యయం 8–20 శాతం వరకు పెరుగుతుంది. ఈ భారాన్ని కొంతవరకు సర్దుబాటు చేసుకునేందుకు గాను 10 శాతం వరకు ఫోన్ల ధరలను పెంచాలన్నది కంపెనీల ప్రణాళిక. వచ్చే ఏడాది మెరుగుపడొచ్చు.. చిప్సెట్ల సరఫరాలో లోటు కొంత కాలం పాటు కొనసాగొచ్చని ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు. సాధారణంగా అదనపు తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలంటే అందుకు ఏడాదన్నా పడుతుందని పరిశ్రమ చెబుతోంది. వచ్చే ఏడాది మొదటి భాగంలో పరిస్థితులు కాస్త మెరుగుపడొచ్చని అంచనా వేస్తోంది. కొరత ఇప్పటికే తటాక స్థాయికి చేరిందని, రానున్న కాలంలో పరిస్థితులు కుదుటపడొచ్చని మొహింద్రూ చెప్పారు. టెక్నాలజీ వేగంగా మారిపోతున్న కాలంలో భారీ సంఖ్యలో చిప్‌లను కంపెనీలు కొని నిల్వ చేసుకోలేవని.. కొన్ని త్రైమాసికాలకే చిప్‌లు పాతబడడమే కాకుండా, పనికిరాకుండా పోతాయన్నారు. 2020లో ధరల పెంపు ఇలా.. మొబైల్ ఫోన్ల ధరల పెరుగుదల 2020 ఏప్రిల్‌లో మొదటి విడత చోటుచేసుకుంది. వీటిపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడమే ఇందుకు కారణమైంది. చైనా నుంచి వచ్చే విడిభాగాల ధరలు పెరగడంతో ఫోన్ల ధరలు సెప్టెంబర్‌లో మరో విడత పెరిగాయి. ఫోన్ల డిస్ప్లే ప్యానెళ్లపై డ్యూటీని కేంద్రం పెంచడంతో అక్టోబర్‌లో మరో విడత ధరలు పెరిగేందుకు దారి తీసింది. చిప్సెట్ల కొరత కారణంగా పెరిగిన తయారీ వ్యయాలు.. మరో విడత ధరలు పెరిగేందుకు దారీతీయవచ్చు. -
మళ్లీ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలోకి మైక్రోసాఫ్ట్
వాషింగ్టన్ : దాదాపు 4ఏళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలోకి తిరిగి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త డ్యూయల్ స్క్రీన్ ఆండ్రాయిడ్ డివైజ్ సర్ఫేస్ డ్యూయో కోసం కంపెనీ బుధవారం ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు 1,399 డాలర్లు ఉండొచ్చు. ఈ స్మార్‌ఫోన్ 5.6అంగుళాల డిప్లేను, 4.8 మిల్లిమీటర్ల మందాన్ని కలిగి ఉండొచ్చు. సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదల కావచ్చనే అంచనాలున్నాయి. స్మార్ట్ ఫోన్ అధిక ధరను కలిగి ఉన్నప్పటికీ.., వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. అయితే కరోనా ఎఫ్టెక్తో అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీ పతననాన్ని చవిచూడటం, నిరుద్యోగం రెండంకెల క్షీణత చూస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ స్మార్ట్ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టడం పట్ల మార్కెట్ వర్గాలు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. -
షావోమికి షాకిచ్చిన శాంసంగ్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి, ఇండో -చైనా ఆందోళనల నడుమ చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమికి భారీ షాక్ తగిలింది. భారతీయ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ లో రారాజులా దూసుకుపోయిన షావోమికి చైనా బ్యాన్ సెగ తాకింది. దీంతో మొత్తం భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో టాప్ ప్లేస్ ను కోల్పోయింది. పరిశోధనా సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ డేటా (ఐడీసీ) ప్రకారం దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తిరిగి అగ్రభాగానికి దూసుకొచ్చింది. (శాంసంగ్ 5జీ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్: అంచనాలు) ఐడీసీ డేటా ప్రకారం దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. జూన్-ముగిసిన త్రైమాసికంలో 29.1 శాతం మార్కెట్ వాటాను సాధించగలిగింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 15.6 శాతం మాత్రమే. ప్రధానంగా గెలాక్సీ ఎం 21 స్మార్ట్‌ఫోన్ టాప్ 5 మోడళ్లలో ఒకటిగా ఉందని తెలిపింది. 29 శాతం మార్కెట్ షేర్ తో షావోమి, 17.5 శాతంతో వివో ఆ తరువాతి స్థానాలో ఉన్నాయి. అయితే ఫీచర్ ఫోన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ 24 శాతం వాటాతో షావోమి, వివో కంటే వెనక బడి వుంది. అలాగే ఆన్ లైన్ వ్యాపారంలో శాంసంగ్ రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. (రెడ్మీ 9 ప్రైమ్ లాంచ్ : అందుబాటు ధరలో) షావోమి ఎగుమతులు 48.7శాతం తగ్గి (2 క్యూ 20 లో) 5.4 మిలియన్ యూనిట్లకు పడిపోయాయి. నాల్గవ స్థానంలో ఉన్న రియల్మీ 37శాతం క్షీణించి 1.78 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. ఐదవ స్థానంలో ఉన్న ఒప్పో ఎగమతులు క్యూ 2లో 51శాతం పడిపోయి 1.76 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. మార్కెట్ లీడర్ గా శాంసంగ్ ఉండటం తాత్కాలికమే కావచ్చని ఐడీసీ ఇండియా పరిశోధనా డైరెక్టర్ నవకేందర్ సింగ్ వ్యాఖ్యానించారు. చైనా వ్యతిరేక సెంటిమెంట్ కు తోడు, చైనా స్మార్ట్ ఫోన్ అమ్మకం దారుల వద్ద స్టాక్ కొరత శాంసంగ్ లాభాలకు దోహదపడిందన్నారు. లేదంటే వివో సులభంగా రెండవ స్థానానికి చేరుకునేదన్నారు. మొత్తంగా ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ 2020 రెండవ త్రైమాసికంలో గత ఏడాదితో 36.8 మిలియన్ యూనిట్ల పోలిస్తే 50.6శాతం క్షీణించి 18.2 మిలియన్ యూనిట్లకు పడిపోయిందని ఐడీసీ తెలిపింది. ఫీచర్ ఫోన్ ఎగుమతులు 2 క్యూ 20 లో సంవత్సరానికి 69 క్షీణించి 10 మిలియన్ యూనిట్లకు తగ్గాయని అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసనా జోషి తెలిపారు. రాబోయే పండుగ సీజన్ నేపథ్యంలో 2020 ద్వితీయార్ధంలో మార్కెట్ రికవరీ సంకేతాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
టిమ్ కుక్ వర్సస్ సుందర్ పిచాయ్.. గెలుపెవరిదో?
స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్‌ను అధిగమించి, భారత్ మార్కెట్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆపిల్ ఓ వైపు ప్రయత్నిస్తుండగా.. సొంత ఆండ్రాయిడ్ డివైజ్లతో మార్కెట్లను ఏలాలని గూగుల్ రంగంలోకి దిగింది. చైనా తర్వాత ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఎక్కువగా దృష్టిసారించిన భారత్ మార్కెట్లో.. ఆ కంపెనీకి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గట్టిపోటీని ఇస్తున్నారు. ఆపిల్ ఇటీవలే తన కొత్త ఐఫోన్లను భారత్ లో లాంచ్ చేయగా...గూగుల్ తన సొంత బ్రాండులోని కొత్త ఫిక్సెల్ స్మార్ట్ఫోన్లను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి గూగుల్ లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా .. ముందస్తుగానే ఆండ్రాయిడ్ మార్కెట్ అంతటిన్నీ తన సొంతం చేసుకుంది. భారత్‌లో 94 శాతం స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఆండ్రాయిడ్ ఓఎస్ డివైజ్లే ఏలుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ వైపు అత్యాధునికమైన డివైజ్‌లుగా ఆపిల్‌కు ఎంతో పేరుంది. ఆపిల్‌కు పోటీగా హై ఎండ్ డివైజ్‌లను తాము తీసుకొచ్చామంటూ గూగుల్ సీఈవో ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ప్రకటించిన ఆపిల్ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో ఆపిల్ విక్రయాలు గ్లోబల్‌గా దెబ్బతిన్నప్పటికీ, భారత్ మార్కెట్లో మెరుగైన ఫలితాలనే సాధించింది. భారత్‌లో ఐఫోన్ విక్రయాలను 50 శాతం పెంచుకున్నట్టు ప్రకటించింది. అయితే గూగుల్ కంపెనీ నుంచి తమకు గట్టి పోటీ వాతావరణం నెలకొందని పేర్కొంది. కానీ ఆండ్రాయిడ్ డివైజ్ ల ఆధిపత్యాన్ని తాము ఎలాగైనా కొల్లగొడతామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ గట్టిగా నొక్కి చెప్పారు. చైనా తర్వాత తాము ఎక్కువగా ఇండియా మార్కెట్‌పైనే దృష్టిసారించామని టిమ్ కుక్ తెలిపారు. రిలయన్స్ జియో ఇంటర్నెట్ స్పీడ్ సహకారంతో గూగుల్, శాంసంగ్‌లను తాము అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. ఒక్కసారి ఆండ్రాయిడ్ కస్టమర్లు ఐఫోన్ల వైపు మరిలితే, వారు ఇతర ఓఎస్‌లను కనెత్తి కూడా చూడరని విశ్లేషకులంటున్నారు. గూగుల్, తన ఆండ్రాయిడ్ కస్టమర్లను వదులుకుంటే, మళ్లీ వారిని తనవైపు మరలుచుకోవడం కొంత కష్టతరమేనంటున్నారు విశ్లేషకులు. అంతేకాక పాతుకుపోయిన ఆండ్రాయిడ్ డివైజ్‌లను మార్కెట్ నుంచి తొలగించడం ఆపిల్‌కూ ఓ పెద్ద సవాలేనట. ధర పరంగా కూడా ఆపిల్ కొత్త ఐఫోన్7, గూగుల్ కొత్త పిక్సెల్ ఫోన్ లు గట్టి పోటీ ఇంచుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో భారత్ మార్కెట్ ఇటు ఆపిల్ సీఈవో టిమ్ కుక్కు, అటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. రానున్న మార్కెట్లో గెలుపెవరిదో వేచిచూడాల్సిందే. ఎవరి వ్యూహాలు ఎలా ఫలిస్తాయో.