Vivo Made In India: Vivo To Invest Rs 3500 Crore In India By 2023 - Sakshi
Sakshi News home page

స్మార్ట్ ఫోన్ దిగ్గ‌జం వివో 'లోక‌ల్' స్కెచ్‌!! వేల‌కోట్లలో పెట్టుబ‌డులు!

Published Thu, Feb 17 2022 7:55 AM | Last Updated on Thu, Feb 17 2022 3:22 PM

Vivo to invest Rs 3500 crore in India by 2023  - Sakshi

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వివో రానున్న రెండేళ్లలో దేశీయంగా రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికల్లో ఉంది. అంతేకాకుండా ఈ కేలండర్‌ ఏడాది(2022)లో దేశీయంగా తయారైన మొబైల్‌ ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేసే యోచనలో ఉంది. దేశీయంగా మొత్తం రూ. 7,500 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు వివో ఇండియా (వ్యాపార వ్యూహాల) డైరెక్టర్‌ పాయిగమ్‌ డానిష్‌ తాజాగా తెలియజేశారు. తద్వారా దేశీయంగా తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే(2021 వరకూ) రూ.1,900కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.రానున్న రెండేళ్లలో మరో రూ.3,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేశారు. పెట్టుబడులన్నీ తయారీకే వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. 

లోకల్‌ డిమాండ్‌ 
స్థానికంగా మొబైల్‌ ఫోన్లకున్న డిమాండుకు అనుగుణంగా గ్రేటర్‌ నోయిడా ప్లాంట్ల నుంచి సరఫరాలు చేస్తున్నట్లు డానిష్‌ పేర్కొన్నారు. ఇకపై హ్యాండ్‌సెట్లను ఎగుమతి చేయడంపై దృష్టిసారించనున్నట్లు వెల్లడించారు. వెరసి ఈ ఏడాది నుంచే ఎగుమతులను చేపట్టనున్నట్లు తెలియజేశారు. దేశీ అవసరాలకు అనుగుణంగా గత ఏడేళ్లలో తామెంత బలపడిందీ ఈ అంశాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీ మార్కెట్లో వివో 10 కోట్లకుపైగా వినియోగదారులను చేరుకున్నట్లు తెలియజేశారు. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ఐడీసీ ప్రకారం 2021లో షియోమీ, శామ్‌సంగ్‌ తదుపరి 15.6 శాతం మార్కెట్‌ వాటాతో దేశీయంగా మూడో ర్యాంకులో నిలిచినట్లు వెల్లడించారు.  

మరో 5000 మందికి ఉపాధి 
ప్రస్తుతమున్న 6 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ తయారీ సామర్థ్యాన్ని 12 కోట్లకు పెంచుకునే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు డానిష్‌ తెలియజేశారు. ఇందుకు వెచ్చిస్తున్న రూ. 7,500 కోట్ల పెట్టుబడులతో ఉద్యోగుల సంఖ్య 40,000కు చేరనున్నట్లు తెలియజేశారు. తయారీ యూనిట్లలో ప్రస్తుతం 10,000 మంది విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 2023లో అదనంగా 5,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. గ్రేటర్‌ నోయిడాలో కొనుగోలు చేసిన మరో 169 ఎకరాలలో కొత్త ప్లాంటును నెలకొల్పుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక వస్తువులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం బ్యాటరీలను 90 శాతం, చార్జర్లను 60 శాతంవరకూ దేశీయంగానే సమకూర్చుకుంటున్నట్లు వివరించారు. 2023కల్లా 65 శాతం డిస్‌ప్లేలను స్థానికంగా రూపొందించనున్నట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement