న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులకు మరో విడత ధరల పెంపు వడ్డన తప్పేట్లు లేదు. చిప్‌సెట్లకు తీవ్ర కొరత నెలకొనడంతో కంపెనీలు ధరలు పెంచే యోచనలో ఉన్నాయి. పరిశ్రమ ఇప్పటికే విడిభాగాల కొరతను ఎదుర్కొంటూ, పన్నుల పెంపు, కరోనా కారణంగా కొన్ని నెలల పాటు అమ్మకాల్లేని పరిస్థితులను చవిచూడగా.. ఇప్పుడు చిప్‌సెట్ల కొరత రూపంలో మరో సమస్య వచ్చి పడింది. ధరలను మరో విడత పెంచితే 2020లో నాలుగో విడత పెంపు అవుతుంది.
ఫోన్ల ధరలు 5 నుంచి 10 శాతం వరకు పెంచొచ్చని తయారీదారులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ల డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, అంతర్జాతీయంగా డిమాండ్–సరఫరా మధ్య అంతరం నెలకొనడంతో ఉత్పత్తులకు–ధరల మధ్య సమతుల్యం విషయంలో కంపెనీలకు సమస్య ఏర్పడింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 5.43 కోట్ల స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు నమోదు కాగా.. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 17 శాతం అధికం. చైనాకు చెందిన హువావే నుంచి అతిపెద్ద కాంట్రాక్టు రావడంతో చిప్‌సెట్ల డిమాండ్–సరఫరా మధ్య అంతరం పెరిగిపోయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
చిప్‌సెట్లకు హువావే భారీ ఆర్డర్
‘‘హువావే భారీ సంఖ్యలో చిప్‌సెట్లను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్లు సంస్థ అవసరాల పరంగా చూస్తే ఏడాదికి మించినవి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చిప్‌సెట్లకు తీవ్ర కొరత ఏర్పడింది’’ అని ఓ ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మరో ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ సైతం స్పందిస్తూ.. ‘‘హువావే భారీ ఆర్డర్ మధ్య స్థాయి కంపెనీలకు చిప్‌సెట్ల సరఫరాను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ కంపెనీలకు సరఫరాదారులతో స్వల్పకాల కాంట్రాక్టులే ఉన్నాయి’’ అని వివరించారు. అంతర్జాతీయంగా అతిపెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీలకు ఇటువంటి పరిస్థితుల నుంచి సాధారణంగా రక్షణ ఉంటుందని.. అయినకానీ, వాటి సరఫరాలపైనా 10–20% వరకు ప్రభావం ఉండొచ్చన్నారు.
చిప్‌సెట్ల సరఫరా ఇప్పుడు మరీ తగ్గిపోయిందంటూ తమ అవసరాల్లో మూడు శాతం వరకే సమకూర్చుకోగలిగిన పరిస్థితి ఉందన్నారు. ఫలితంగా స్పాట్ మార్కెట్ నుంచి చిప్‌సెట్లను కొనుగోలు చేయాల్సి వస్తోందని, దీంతో అక్కడ ధరలు చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. సరఫరా కొరత కారణంగా స్పాట్ మార్కెట్లో చిప్‌సెట్ల ధరలు 25–27 శాతం వరకు పెరిగినట్టు పరిశ్రమ అంటోంది. దీంతో మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీ వ్యయం 8–20 శాతం వరకు పెరుగుతుంది. ఈ భారాన్ని కొంతవరకు సర్దుబాటు చేసుకునేందుకు గాను 10 శాతం వరకు ఫోన్ల ధరలను పెంచాలన్నది కంపెనీల ప్రణాళిక.
వచ్చే ఏడాది మెరుగుపడొచ్చు..
చిప్‌సెట్ల సరఫరాలో లోటు కొంత కాలం పాటు కొనసాగొచ్చని ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు. సాధారణంగా అదనపు తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలంటే అందుకు ఏడాదన్నా పడుతుందని పరిశ్రమ చెబుతోంది. వచ్చే ఏడాది మొదటి భాగంలో పరిస్థితులు కాస్త మెరుగుపడొచ్చని అంచనా వేస్తోంది. కొరత ఇప్పటికే తటాక స్థాయికి చేరిందని, రానున్న కాలంలో పరిస్థితులు కుదుటపడొచ్చని మొహింద్రూ చెప్పారు. టెక్నాలజీ వేగంగా మారిపోతున్న కాలంలో భారీ సంఖ్యలో చిప్‌లను కంపెనీలు కొని నిల్వ చేసుకోలేవని.. కొన్ని త్రైమాసికాలకే చిప్‌లు పాతబడడమే కాకుండా, పనికిరాకుండా పోతాయన్నారు.
2020లో ధరల పెంపు ఇలా..
మొబైల్ ఫోన్ల ధరల పెరుగుదల 2020 ఏప్రిల్‌లో మొదటి విడత చోటుచేసుకుంది. వీటిపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడమే ఇందుకు కారణమైంది. చైనా నుంచి వచ్చే విడిభాగాల ధరలు పెరగడంతో ఫోన్ల ధరలు సెప్టెంబర్‌లో మరో విడత పెరిగాయి. ఫోన్ల డిస్‌ప్లే ప్యానెళ్లపై డ్యూటీని కేంద్రం పెంచడంతో అక్టోబర్‌లో మరో విడత ధరలు పెరిగేందుకు దారి తీసింది. చిప్‌సెట్ల కొరత కారణంగా పెరిగిన తయారీ వ్యయాలు.. మరో విడత ధరలు పెరిగేందుకు దారీతీయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment