ముడిసరుకులపై మరింతగా వెచ్చించాల్సి రావడం, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడం ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు సమస్యగా మారాయి. ఈ అంశాల కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో దిగ్గజ సంస్థల మార్జిన్లు గణనీయంగా తగ్గాయి. పట్టణ ప్రాంతాల్లో వినియోగం నెమ్మదించడం.. హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (జీసీపీఎల్), మారికో, ఐటీసీ, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) తదితర దిగ్గజాలకు ఆందోళన కలిగిస్తోంది.
సాధారణంగా ఎఫ్‌ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో పట్టణ ప్రాంతాల్లో వినియోగం వాటా 65–68 శాతం స్థాయిలో ఉంటుంది. పామాయిల్ ధరలు పెరగడం, వినియోగదారుల నుంచి డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం వంటి కారణాలతో జీఎస్‌పీఎల్‌కి సెప్టెంబర్ క్వార్టర్ ఒక మోస్తరుగానే గడిచింది. సింథాల్, గోద్రెజ్ నంబర్ 1, హిట్ వంటి ఉత్పత్తులను తయారు చేసే జీఎస్‌పీఎల్ స్టాండెలోన్ ఎబిటా మార్జిన్లు తగ్గాయి.
డాబర్ ఇండియా
‘అధిక ఆహార ద్రవ్యోల్బణం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం’ వల్ల సెప్టెంబర్ క్వార్టర్‌లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడినట్లు డాబర్ ఇండియా పేర్కొంది. చ్యవన్‌ప్రాశ్, పుదీన్‌హరా వంటి ఉత్పత్తులను తయారు చేసే డాబర్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం క్షీణించి రూ.418 కోట్లకు, ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 3,029 కోట్లకు తగ్గాయి.
ఫుడ్ అండ్ బెవరేజెస్
డిమాండ్ పడిపోతుండటంపై నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని త్రైమాసికాల క్రితం వరకు ఎఫ్‌అండ్‌బీ (ఫుడ్ అండ్ బెవరేజెస్) విభాగంలో డిమాండ్ రెండంకెల స్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం 1.5–2 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. మ్యాగీ, కిట్‌క్యాట్, నెస్కెఫే మొదలైన బ్రాండ్స్‌ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా అమ్మకాలు దేశీయంగా కేవలం 1.2 శాతం వృద్ధికి పరిమితమయ్యాయి. ప్రథమ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కాస్త స్థిరంగానే ఉన్నప్పటికీ మెగా సిటీలు, మెట్రోల్లోనే సమస్యాత్మకంగా ఉన్నట్లు నారాయణన్ తెలిపారు.
ఊహించిదానికన్నా ఎక్కువ ప్రభావం..
పట్టణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులపై చేసే ఖర్చులపై ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని టీసీపీఎల్ ఎండీ సునీల్ డిసౌజా తెలిపారు. పరిమాణంపరంగా చూస్తే తమ ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి .. ఇటీవల కొద్ది నెలలుగా నెమ్మదించినట్లు హెచ్‌యూఎల్ సీఈవో రోహిత్ జావా తెలిపారు. గ్రామీణ మార్కెట్లు క్రమంగా పట్టణ ప్రాంతాలను అధిగమిస్తున్నాయని వివరించారు. సర్ఫ్, రిన్, లక్స్, లిప్టన్, హార్లిక్స్ తదితర ఉత్పత్తులను తయారు చేసే హెచ్‌యూఎల్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 2.33 శాతం తగ్గింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్ తదితర ఉత్పత్తుల సంస్థ ఐటీసీ మార్జిన్లు 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం, అధిక స్థాయి ఆహార ద్రవ్యోల్బణం, నిర్దిష్ట ముడివస్తువుల ధరలు పెరిగిపోవడం వంటి కారణాలతో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కనిపించినట్లు సంస్థ తెలిపింది.
ఇదీ చదవండి: ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!
రేట్లు పెంచే యోచన
పామాయిల్, కాఫీ, కోకో, వంటి ముడిసరుకుల ధరలు పెరగడంతో మార్జిన్లను కాపాడుకోవడానికి తాము కూడా ఉత్పత్తుల రేట్లను పెంచాలని కొన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు యోచిస్తున్నాయి. సహేతుక స్థాయిలో రేట్లను పెంచి, ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మార్జిన్లను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నట్లు జీఎస్‌పీఎల్ ఎండీ సీతాపతి తెలిపారు. పండ్లు, కూరగాయలు, నూనెలు వంటి ముడిసరుకుల ధరలు భరించలేనంత స్థాయిలో పెరిగిపోతే ఉత్పత్తుల రేట్ల పెంపునకు దారి తీసే అవకాశం ఉందని నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment