ఎఫ్‌ఎంసీజీ కంపెనీ మారికో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.433 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.360 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతం పెరిగింది. స్థిరాస్తుల విక్రయం, రూ.42 కోట్లకు సంబంధించిన వివాదంలో సానుకూల పరిష్కారం లాభం 20 శాతం పెరిగేందుకు దారితీసినట్టు మారికో తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు రెండింతలు పెరిగినట్టు వెల్లడించింది.
కన్సాలిడేటెడ్ ఆదాయం 7.6 శాతం వృద్ధితో రూ.2,476 కోట్ల నుంచి రూ.2,664 కోట్లకు చేరింది. దేశీయ అమ్మకాలు 5 శాతం పెరగ్గా, అంతర్జాతీయ వ్యాపారం స్థిర కరెన్సీ రూపంలో 13 శాతం వృద్ధి చెందింది. దేశీయ వ్యాపారం ఆదాయం 8 శాతం పెరిగి రూ.1,979 కోట్లుగా ఉంది. కోకోనట్ (పారాచ్యూట్) ఆయిల్ ధరలను పెంచడంతోపాటు అమ్మకాలు పెరగడం సానుకూలించినట్టు మారికో పేర్కొంది. పారాచ్యూట్ అమ్మకాలు 4 శాతం పెరగ్గా, ఆదాయం 10 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. సఫోలా వంట నూనెల రూపంలో ఆదాయం కేవలం 2 శాతమే పెరిగింది. ఎఫ్‌ఎంసీజీ రంగానికి సంబందించి ధరల వృద్ధి సానుకూలంగా మారినట్టు మారికో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో ఆదాయంలో రెండంకెల వృద్ధిని అంచనా వేస్తున్నట్టు ప్రకటించింది.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?
డాబర్ లాభం నేలచూపు
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 418 కోట్లకు పరిమితమైంది. పట్టణ ప్రాంతాలలో డిమాండ్ తగ్గడం, ఆహార ధరల పెరుగుదల ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 507 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2.75 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం 5 శాతం వెనకడుగుతో రూ. 3,029 కోట్లను తాకింది. మొత్తం వ్యయాలు సైతం స్వల్పంగా 1 శాతం తగ్గి రూ. 2,634 కోట్లకు చేరాయి. ఆదాయంలో కన్జూమర్ కేర్ విభాగం నుంచి 4 శాతం తక్కువగా రూ. 2,488 కోట్లు లభించగా.. ఫుడ్ బిజినెస్ 13 శాతం క్షీణించి రూ. 467 కోట్లకు పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment