
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విదేశీ కంపెనీలు మనదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో చైనీస్ కంపెనీ 'బీవైడీ' ఉంది. తాజాగా ఈ జాబితాలో ఎలాన్ మస్క్ టెస్లా కూడా చేరింది.
బీవైడీ కంపెనీ దేశంలో ఒక బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామన్నప్పుడు భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు అమెరికన్ కంపెనీ టెస్లాను మాత్రం ఆహ్వానిస్తోంది. ఈ వైఖరికి కారణాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి 'పియూష్ గోయల్' ముంబైలో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో వెల్లడించారు.
రెండు దేశాల మధ్య ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగానే చైనా పెట్టుబడులను కాదన్నట్లు వెల్లడించారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక ఆందోళనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థకు కూడా ఈ కారణాల చేతనే అనుమతి ఇవ్వలేదని పియూష్ గోయల్ వివరించారు.
ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?
అమెరికా, భారత్ సంబంధాల దృష్ట్యా.. టెస్లాను ఇండియా ఆహ్వానిస్తోంది. త్వరలోనే టెస్లా కంపెనీ భారతదేశంలో తమ కార్లను విక్రయించడానికి సన్నద్ధమవుతోంది. యూఎస్ కంపెనీ తన అమ్మకాల గురించి వెల్లడించింది.. కానీ స్థానికంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తుందా? లేదా అనేదానికి సంబంధించిన విషయాలను వెల్లడించలేదు. టెస్లా ఇండియాలో తన ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే.. భారతదేశం ఆటోమొబైల్ రంగంలో మరింత ముందుకు దూసుకెళ్తుందని నిపుణులు చెబుతున్నారు.
టెస్లా మోడల్ వై
టెస్లా (Tesla) కంపెనీ భారతీయ విఫణి కోసం ప్రత్యేకంగా 'మోడల్ వై' (Model Y)ను మరింత చౌకైన వెర్షన్‌గా అభివృద్ధి చేస్తోంది. దీని ధర సాధారణ మోడల్ కంటే 20 శాతం తక్కువ. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టెస్లా ఈ మోడల్ తీసురానుంది. దీని రేటు రూ. 21 లక్షల వరకు ఉంటుందని సమాచారం.