
వెజిటేరియన్లూ.. మీ భోజనం ఖర్చులు తగ్గాయ్! నాన్ వెజిటేరియన్లూ.. మీకో శుభవార్త. నాన్ వెజ్ మీల్స్ ఖర్చు కూడా తగ్గింది. క్రిసిల్ రేటింగ్ సంస్థ ఈమేరకు రిపోర్ట్ వెలువరించింది. ఈ ధరల తగ్గింపునకు ప్రధాన కారణం.. వెజిటేరియన్ అన్ని వంటల్లో దాదాపుగా వాడే టమాటా ధరలు తగ్గడమేనని నివేదిక తెలిపింది. నాన్‌వెజ్ మీల్స్ తగ్గింపునకు చికెన్ ధరలు దిగిరావడమే కారణమని పేర్కొంది.
క్రిసిల్ నివేదికలోని వివరాల ప్రకారం.. మార్చిలో ఇంట్లో వండిన థాలీ ధర వరుసగా ఐదోసారి తగ్గింది. దాంతో ఇది రూ.26.6కు చేరుకుంది. ముఖ్యంగా టమాటా ధరలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. మార్చిలో బ్రాయిలర్ చికెన్ ధరలు తగ్గడంతో మాంసాహార థాలీ ధర కూడా రూ.54.8కి చేరింది. శాఖాహార థాలీలో రోటీ, అన్నం, పప్పు, కూరగాయలు..వంటివి ఉంటాయి. ఈ భోజనాన్ని ఇంట్లో తయారు చేయడానికి సగటు ఖర్చు మార్చిలో రూ.26.6కు పడిపోయింది.
ఇదీ చదవండి: త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీ
భోజన ఖర్చులు క్షీణించడం కొన్ని వర్గాల వారికి ఆహార ద్రవ్యోల్బణం విస్తృతంగా తగ్గేలా చేసింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గడంతో ఈమేరకు ఉపశమనం కలిగినట్లయింది. ఇంట్లో వండిన భోజనంపై ఆధారపడే కుటుంబాలకు ఇది ఎంతో మేలు కలిగిస్తుంది. నాన్ వెజిటేరియన్ థాలీ ధరలు ప్రధానంగా చికెన్‌పై ఆధారపడి ఉంటాయి. బ్రాయిలర్ చికెన్ ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. మార్చిలో బర్డ్‌ఫ్లూ భయాలు అధికం కావడంతో భారీగా ధరలు తగ్గాయి. ఇది నాన్‌వెజ్ థాలీ తగ్గుదలకు కారణమైంది. మధ్యలో చికెన్ ధరలు ఒడిదొడుకులకులోనైనా చౌకగా కూరగాయలు లభ్యత ఉండడంతో ఖర్చులను భర్తీ చేసేందుకు తోడ్పడింది.