నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజాగా కీలక డేటాను విడుదల చేసింది. ఇంట్లోని శాఖాహార భోజనానికి అయ్యే ఖర్చు 7 శాతం పెరిగి రూ.27.3 చేరిందని నివేదికలో తెలిపింది. గతేడాది ఇదే నెలలో ఈ ధర రూ.25.5గా ఉండేది. ఇక మాంసహారం భోజనం ధర ఏడుశాతం తగ్గి రూ.54.9కి చేరగా.. గతేడాది రూ.59.2గా ఉండేదని క్రిసిల్ నివేదించింది.
నివేదికలోని వివరాల ప్రకారం.. ద్రవ్యోల్బణం వల్ల వంటిల్లు నిర్వహణ భారంగా మారుతోంది. గతేడాదితో పోలిస్తే వ్యయం పెరిగింది. ఏడాది ప్రాతిపదికన ఉల్లిగడ్డలు 46 శాతం, టమాటాలు 36 శాతం, బంగాళదుంపలు 22 శాతం పెరగడంతో వెజ్‌భోజనం ధర పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌లో ఉల్లి, బంగాళదుంపలు, టమాటా కొరత ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి. దాంతో పాటు బియ్యం ధరలు 14 శాతం, పప్పులు 22 శాతం అధికమయ్యాయి. అదే సమయంలో మాంసం ధరలు 16 శాతం పడిపోయినందున మార్చిలో భోజనానికి ఖర్చు తగ్గింది.
ఇదీ చదవండి: కీలక వడ్డీరేట్లు యథాతథం
క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ పూషన్ శర్మ మాట్లాడుతూ.. ‘గత ఐదు నెలలుగా శాకాహార, మాంసాహార భోజనం ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మాంసహారం ధర పడిపోయి, కాయగూరల ధరలు, నిత్యావసర సరుకుల ధరల పెరగడమే ఇందుకు కారణం. దేశంలో ముడి సరుకు ధరలు ఐదుశాతం పెరగడంతో ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో నాన్‌వెజ్ భోజనం ధర రెండుశాతం పెరిగింది. రంజాన్ మాసంలో మాంసాహారానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పశుగ్రాసం ధర కూడా అధికమైంది. సమీప భవిష్యత్తులో తాజా పంట మార్కెట్‌లోకి వస్తే గోధుమల ధరలు తగ్గుతాయి’ అని శర్మ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment