nonveg
-
పెరిగిన వెజ్ భోజనం ధర.. తగ్గిన నాన్‌వెజ్ ఖరీదు
నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజాగా కీలక డేటాను విడుదల చేసింది. ఇంట్లోని శాఖాహార భోజనానికి అయ్యే ఖర్చు 7 శాతం పెరిగి రూ.27.3 చేరిందని నివేదికలో తెలిపింది. గతేడాది ఇదే నెలలో ఈ ధర రూ.25.5గా ఉండేది. ఇక మాంసహారం భోజనం ధర ఏడుశాతం తగ్గి రూ.54.9కి చేరగా.. గతేడాది రూ.59.2గా ఉండేదని క్రిసిల్ నివేదించింది. నివేదికలోని వివరాల ప్రకారం.. ద్రవ్యోల్బణం వల్ల వంటిల్లు నిర్వహణ భారంగా మారుతోంది. గతేడాదితో పోలిస్తే వ్యయం పెరిగింది. ఏడాది ప్రాతిపదికన ఉల్లిగడ్డలు 46 శాతం, టమాటాలు 36 శాతం, బంగాళదుంపలు 22 శాతం పెరగడంతో వెజ్భోజనం ధర పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లో ఉల్లి, బంగాళదుంపలు, టమాటా కొరత ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి. దాంతో పాటు బియ్యం ధరలు 14 శాతం, పప్పులు 22 శాతం అధికమయ్యాయి. అదే సమయంలో మాంసం ధరలు 16 శాతం పడిపోయినందున మార్చిలో భోజనానికి ఖర్చు తగ్గింది. ఇదీ చదవండి: కీలక వడ్డీరేట్లు యథాతథం క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ పూషన్ శర్మ మాట్లాడుతూ.. ‘గత ఐదు నెలలుగా శాకాహార, మాంసాహార భోజనం ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మాంసహారం ధర పడిపోయి, కాయగూరల ధరలు, నిత్యావసర సరుకుల ధరల పెరగడమే ఇందుకు కారణం. దేశంలో ముడి సరుకు ధరలు ఐదుశాతం పెరగడంతో ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో నాన్‌వెజ్ భోజనం ధర రెండుశాతం పెరిగింది. రంజాన్ మాసంలో మాంసాహారానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పశుగ్రాసం ధర కూడా అధికమైంది. సమీప భవిష్యత్తులో తాజా పంట మార్కెట్లోకి వస్తే గోధుమల ధరలు తగ్గుతాయి’ అని శర్మ వెల్లడించారు. -
జొమాటోలో ‘ప్యూర్ వెజ్’ చిచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ‘ప్యూర్ వెజ్’ ఫుడ్ డెలివరీ సర్వీసులు ఆ సంస్థలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సమస్య నుంచి బయట పడేందుకు సంస్థ టాప్ ఎగ్జిక్యూటీవ్‌లతో సుమారు ఏకదాటిగా 20 గంటల పాటు జూమ్ కాల్స్ నిర్వహించినట్లు జొమాటో కోఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్’ ల కార్యక్రమం నిర్వహించింది. అయితే ఎంట్రప్రెన్యూర్ విభాగంలో దీపిందర్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డ్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ చేతులు మీదిగా అందుకున్నారు. పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఈ సందర్భంగా ప్యూర్ వెజ్ వివాదంపై జొమాటో సీఈవో మాట్లాడారు. కస్టమర్లు, ఆయా రెస్టారెంట్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేం ప్యూర్ వెజ్ మోడ్, ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చాం. కానీ ఈ సర్వీసులపై ఊహించని విధంగా వివాదం తలెత్తింది. నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారని అన్నారు. తలెత్తిన ఆందోళనలు ‘‘ప్యూర్ వెజ్ వివాదంపై నెటిజన్లు సైతం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs) వెజ్ - నాన్ వెజ్ కలిపి తెస్తే ఆర్డర్లను తిరస్కరించే అవకాశం ఉందనే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. డెలివరీ సిబ్బందిని సైతం అడ్డుకునే ప్రమాదం ఉందని వాపోయారు. ఇప్పటికే వెల్ఫేర్ అసోసియేషన్లలో విధించే ఆంక్షల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు గురించి ప్రస్తావించారు. అదే సమయంలో డెలివరీ సిబ్బంది సైతం ఓన్లీ వెజ్ పాలసీ వల్ల అవకాశాలు సన్నగిల్లుతాయనే ఆందోళనల్ని వ్యక్తం చేశారు.’’ ప్యూర్ వెజ్‌పై వెనక్కి తగ్గిన జొమాటో అయితే దీన్ని పరిష్కరించేందుకు జొమాటో ఉన్నత స్థాయి ఉద్యోగులతో సుమారు 20 గంటల పాటు జూమ్ కాల్ నిర్వహించామని గుర్తు చేశారు. ఆ తర్వాత వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడం, ప్యూర్ వెజ్‌పై దుమారం చెలరేగడంతో ఆయా ప్రభుత్వాలు జొమాటోకి నోటీసులు అందించాయి. ఫలితంగా పలు రాష్ట్రాల్లో ఆ సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు జొమాటో అధికారికంగా ఎక్స్.కామ్‌లో ట్వీట్ చేశారు. Hi, we have disabled delivery of non-veg items in Uttar Pradesh, Assam, Chhattisgarh, Madhya Pradesh and Rajasthan as per govt. notice. Hope this clarification helps! — Zomato Care (@zomatocare) January 22, 2024 ఇక ఎన్డీటీవీ అవార్డ్‌ల కార్యక్రమంలో ‘దయచేసి ఈ ప్యూర్ వెజ్ సర్వీస్ ఏ మతానికి, రాజకీయ ప్రాధాన్యతలకు వ్యతిరేకం కాదని జొమాటో అధినేత, సీఈవో దీపిందర్ గోయల్ మరోసారి పేర్కొన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ ప్యూర్ వెజ్ సేవల్ని అందిస్తారా? లేదంటే నిలిపివేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. Even though RTIs and mails for hostel GSec shows that there is no institute policy for food segregation, some individuals have taken it upon themselves to designate certain mess areas as "Vegetarians Only" and forcing other students to leave that area.#casteism #Discrimination pic.twitter.com/uFlB4FnHqi — APPSC IIT Bombay (@AppscIITb) July 29, 2023 -
ఏ వెలుగులకీ ప్రస్థానం!
చదివేస్తే ఉన్న మతి పోయిందని నానుడి. బాంబే ఐఐటీ పాలకవర్గం నిర్వాకం వల్ల తిండి చుట్టూ మన సమాజంలో అల్లుకొని ఉన్న వివక్ష ఆ ఉన్నత శ్రేణి విద్యాసంస్థను కూడా తాకింది. బాంబే ఐఐటీ హాస్టళ్లలో మూణ్ణెల్ల క్రితం శాకాహారులకు విడిగా టేబుల్స్ కేటాయించాలన్న డిమాండ్ బయల్దేరింది. మాంసాహారుల పక్కన కూర్చుంటే ఆ ఆహారం నుంచి వచ్చే వాసనల కారణంగా తమలో వికారం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆ డిమాండు చేస్తున్నవారి ఫిర్యాదు. ఎప్పుడో 1958లో స్థాపించిన ఆ విద్యాసంస్థలో ఇప్పుడే ఈ డిమాండ్ ఎందుకు తలెత్తిందన్న సంగతలా వుంచితే... దాన్ని అంగీకరిస్తే మాంసాహారం అపవిత్రం లేదా మలినం అని సమాజంలోని కొన్ని వర్గాల్లో నెలకొన్న అభిప్రాయానికి ఆమోదముద్ర వేసినట్టవుతుందన్న సందేహం బాంబే ఐఐటీ పాలకవర్గానికి కలగలేదు. ప్రాంగణంలోని మూడు హాస్టళ్లలో విడిగా ఆరు టేబుళ్లను ‘వెజిటేరియన్ ఓన్లీ’ బోర్డులతో అలంకరించింది. అంతటితో ఊరుకోలేదు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థికి రూ. 10,000 జరిమానా విధించింది. ఈ నిరసన ఘర్షణకు దారితీస్తుందనీ, క్రమశిక్షణ ఉల్లంఘన కిందికొస్తుందనీ డీన్ అంటున్నారు. ఇలాంటి డిమాండ్ తలెత్తినప్పుడు దానిపై అందరి అభిప్రాయాలూ తీసుకోవటం, ఒక కమిటీని నియమించటం, దాని సాధ్యాసాధ్యాలు, పర్యవసానాలపై చర్చించటం ప్రజాస్వామిక పద్ధతి. అలాంటి విధానమే అమలైవుంటే శాకాహార విద్యార్థులు అంతిమంగా తమ డిమాండ్‌ను వదులుకునేవారో, మాంసాహార ప్రియులు వారి సమస్య పట్ల సానుభూతితో వ్యవహరించేవారో తెలిసేది. ఈ ప్రక్రియ అమలైందా లేదా... అందులో వచ్చిన అనుకూల, ప్రతికూల అభిప్రాయాలేమిటన్నది ఎవరికీ తెలియదు. బాంబే ఐఐటీలోని అంబేడ్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్ (ఏపీపీఎస్సీ) విద్యార్థుల ప్రకారం పాలకవర్గం ఈ మొత్తం వ్యవహారాన్ని గోప్యంగా ఉంచింది. కనుక సహజంగానే నిరసనలు వ్యక్తమయ్యాయి. ‘మేం ఏం చేసినా శిరసావహించాల్సిందే, లేకుంటే కొరడా ఝళిపిస్తాం’ అన్నట్టు వ్యవహరించటం, ప్రశ్నించటమే నేరమన్నట్టు పరిగణించటం ఉన్నత శ్రేణి విద్యాసంస్థకు శోభస్కరం కాదు. వికారాలున్నవారిని దూరంగా పోయి తినమని చెప్పక గోటితో పోయేదానికి గొడ్డలి అందుకున్నట్టు ఇంత రాద్ధాంతం దేనికో అర్థం కాదు. పాశ్చాత్య దేశాల్లో కూడా శాకాహారం, మాంసాహారం విభజన వుంది. డెయిరీ ఉత్పత్తులు సైతం సమ్మతం కాదనే వెగానిజం కూడా అక్కడుంది. అమెరికన్లలో గత మూడు నాలుగేళ్లలో దాదాపు 15 శాతం మంది శాకాహారులుగా మారారని ఈమధ్య ఒక సర్వే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2020లో 1,400 కోట్ల డాలర్లుగా ఉన్న వెగాన్ మార్కెట్, ఆ మరుసటి ఏడాదికి 1,577 కోట్ల డాలర్లకు పెరిగిందని మరో సర్వే అంటున్నది. అయితే మన దేశంలో వలే అక్కడ తినే ఆహారం కులాలతో ముడిపడి లేదు. ఇక్కడ శాకాహారులు చాలా ఉన్నతులనీ, మాంసాహారులు తక్కువనీ అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. అందుకు మన సంస్కృతి, సంప్రదాయాలు కూడా దోహదపడుతున్నాయి. ఆహారపుటలవాట్లలో కులాన్ని వెతకటం పాక్షిక దృష్టి అంటున్నవారు కొన్ని తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, కశ్మీర్ వంటిచోట్ల బ్రాహ్మణులు మాంసాహారులుగా ఉండటాన్ని ఉదహరిస్తున్నారు. కానీ ఇవి చెబుతున్నవారు మన దేశంలో చాలాచోట్ల అట్టడుగు కులాలవారికి అద్దెకు ఇల్లు ఇవ్వకుండా ఉండటానికి ‘వెజిటేరియన్లకు మాత్రమే’ అనే బోర్డులు పెడుతున్న ధోరణిని మరిచిపోకూడదు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఒంటిస్తంభం మేడలో ఉంచి చదువు చెప్పించాలనుకోకుండా... ప్రాథమిక విద్య మొదలుకొని అన్ని దశల్లోనూ విద్యాసంస్థలకు పంపటంలో ఒక అంతరార్థం ఉంటుంది. వివిధ వర్గాల పిల్లలతో కలిసిమెలిసి పెరగటం, సామాజిక అవగాహన పెంపొందించుకోవటం అనే లక్ష్యాలు కూడా అంతర్లీనంగా ఇమిడివుంటాయి. తెలియనిది తెలుసుకోవటం, భిన్నత్వాన్ని గౌరవించటం, అవసరమైతే ప్రశ్నించటం, ఈ క్రమంలో తనను తాను మార్చుకోవటం కూడా విద్యాసముపార్జనలో భాగమే. బాధ్యతాయుతమైన రేపటి పౌరులుగా రూపొందటానికి ఇవన్నీ అవసరం. బాంబే ఐఐటీలో చదువుతున్నవారు పరిశోధనల కోసమో, ఉన్నతోద్యోగాల కోసమో విదేశాలకు వెళ్లవలసి వచ్చినప్పుడు తోటి మనిషి ఆహారాన్ని చూసి వికారాలు తెచ్చుకోవటం అక్కడికి కూడా మోసుకుపోతే క్షణకాలమైనా మనుగడ సాగించగలరా? ఈ ఆలోచన వాళ్లకు రాకపోతే పోయింది... సంస్థ నిర్వాహకులకేమైంది? ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని రాజ్యసభలో మొన్న జూలైలో కేంద్రం తెలిపింది. ఈ ఉదంతాల్లో వ్యక్తిగత కారణాలను వెదకటం తప్ప సంస్థాగతంగా ఎలాంటి దిద్దుబాటు చర్యలు అవసరమన్న విచికిత్సలోకి పోవటం లేదు. తినే తిండి మొదలుకొని ఎన్నిటినో ఎత్తి చూపి న్యూనత పరిచే ధోరణి ఉండటాన్ని ఈ సంస్థల పాలకవర్గాలు గుర్తించటం లేదు. బాంబే ఐఐటీ మరో అడుగు ముందుకేసి అలాంటి ధోరణులను బలపర్చే నిర్ణయాన్ని తీసుకోవటం ఆందోళన కలిగించే అంశం. ఈ జాడ్యం హైదరాబాద్ ఐఐటీకి కూడా వ్యాపించిందంటున్నారు. ఏకంగా శాకాహారుల కోసం అది ప్రత్యేక హాల్ కేటాయించబోతున్నదన్న వార్తలొస్తున్నాయి. తమ సంస్థల్ని ప్రపంచ శ్రేణి విద్యా కేంద్రాలుగా రూపుదిద్దటం ఎలాగన్న ఆలోచనలు మాని, క్షీణ విలువలను తలకెత్తుకోవటం ఏ మేరకు సమంజసమో నిర్వాహకులు ఆలోచించాలి. -
తగ్గేదేలే.. ప్రతీ నెలా నాన్‌వెజ్ కోసం రూ.240కోట్లు ఖర్చు చేస్తున్న జనాలు
ప్రపంచం మారుతోంది. ఆర్థికంగా ప్రతీ కుటుంబం బలపడుతోంది. జీవన విధానంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంపాదనలో దాచుకునే కాలం నుంచి సంపాదించిన సొమ్ములో సంతోషంగా జీవించడానికి సరిపడా ఖర్చు చేసి మిగిలిందే దాచుకుందాం అనే ధోరణి కనిపిస్తోంది. సంపాదనలో అత్యధిక శాతం విద్య, ఆహారం, ఆరోగ్యానికి మాత్రమే ఖర్చు చేస్తున్నారు. పిల్లలకు మంచి చదువు ఇస్తే చాలు అదే వాళ్లకు ఆస్తి అనే భావనతో చాలామంది విద్య విషయంలో రాజీ పడటం లేదు. ఆ తర్వాత మంచి పోషకాహారం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కోవిడ్ తర్వాత వీటిపై ప్రజల్లో మరింత చైతన్యం పెరగడం విశేషం. సాక్షి ప్రతినిధి కర్నూలు: పోషకాహార లోపంతో బాధపడే ప్రాంతాల్లో మనది కూడా ఒకటి. ముఖ్యంగా పేదరికం అత్యధికంగా ఉండే పశ్చిమ ప్రాంతంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. బతకడం కోసం మరో ప్రాంతానికి వెళ్లి ఒళ్లు హూనమయ్యేలా శ్రమించి తినీతినక ప్రతి రూపాయి దాచుకొని బతుకీడ్చేవారు.ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతీ ఇంటికి ఆర్థిక భరోసా లభిస్తోంది. వారి కష్టానికి ప్రభుత్వ సాయం దన్నుగా నిలుస్తోంది. దీంతో పిల్లలకు మంచి చదువులు చదివిస్తున్నారు. అక్షరాస్యత పెరగడంతో ప్రజల్లో చైతన్యం కూడా అధికమైంది. జీవన విధానంలో ప్రాధాన్యతలు గ్రహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలనే భావనకు వచ్చారు. ఆరోగ్యానికీ ప్రాధాన్యత ప్రతి వందమందిలో 63శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. 2030కి ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతో చనిపోతారని స్పష్టం చేసింది. ఎన్సీడీ(నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) వ్యాధుల బారిన పడుతున్నారు. 35 ఏళ్లుదాటితే హైపర్‌టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్, బీపీ వస్తున్నాయి. ఆశ్చర్యమేంటంటే 18 ఏళ్లు దాటిన వారు కూడా ఎన్సీడీ బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆరోగ్యంపై జాగ్రత్త పెరిగింది. మంచి ఆహారం, వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు. అందుకే జిమ్‌లు, ఫిట్నెస్, జుంబా సెంటర్లకు వెళ్తున్నారు. పిల్లలను ఏదో ఒక స్పోర్ట్‌లో చేర్పిస్తే శారీరంగా, మానసింగా ఆరోగ్యంగా ఉంటారని స్పోర్ట్స్‌వైపు పంపుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ లెక్కల ప్రకారం వయస్సుకు తగ్గట్లు బరువు ఉన్నవారు 2019కి ముందు 90 శాతంలోపు ఉంటే 2022లో 93.82 శాతం ఉన్నారు.2023లో 94.15 శాతంఉన్నారు. దీన్నిబట్టే పోషకాహారలోపంతో బాధపడేవారి సంఖ్య తగ్గుతోందని స్పష్టమవుతోంది. పోషకాహారం కోసం ఖర్చులో తగ్గేదేలే.. 10–15ఏళ్ల కిందట కిరాణా మినహా ఏదైనా పండ్లు, ఇతర ఆహార పదార్థాలు కొనాలంటే జేబులో డబ్బులు చూసేవారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆహారం మినహా ప్రత్యేకంగా పండ్లు, మాంసంపై దృష్టి సారించేవారు కాదు. పండుగలు, బంధువులు ఇంటికి వచ్చిన సందర్భాల్లోనే నాన్‌వెజ్ ఉండేది. ఇప్పుడు ప్రతీవారం కచ్చితంగా, కొందరు వారంలో 2, 3 సార్లు నాన్‌వెజ్ తీసుకుంటున్నారు. అలాగే డ్రైప్రూట్స్ వాడకం గణనీయంగా పెరిగింది. చాలామంది బాదం, పిస్తా, ఖర్జూర, కాజు, ఆఫ్రికాట్స్తో పాటు పలు రకాల డ్రైప్రూట్స్ కొంటున్నారు. పిల్లలకు రోజూ డ్రైప్రూట్స్ ఇస్తే పటిష్టంగా ఉంటారనే భావనకు వచ్చారు. ఏదైనా బేకరీ, డ్రైప్రూట్స్ లేదా మరో దుకాణానికి వెళితే ధరలు అడగకుండా కావల్సింది తీసుకుని బిల్లు చూసి ఫోన్‌పే చేసి వస్తున్నారు. దీంతో పాటు మిల్లెట్స్ వినియోగం కూడా పెరిగింది. కొర్రలు, అరికెలు, కినోవాతో పాటు మిల్లెట్స్ తినేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇవన్నీ పోషకాహారం తీసుకోవడంలో భాగమే. వీటన్నిటి కంటే ప్రధానమైంది మాంసాహారం. వారంలో ఒకరోజు.. కనీసం నెలలో ఒక రోజు ఫ్యామిలీతో రెస్టారెంట్లకు వెళ్లే సంస్కృతి పెరిగింది. ప్రతీ నెలా నాన్‌వెజ్ ఖర్చు రూ.240కోట్లు దేశంలోని 29 రాష్ట్రాల్లో మాంసాహార వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 98.4శాతం పురుషులు, 98.1శాతం సీ్త్రలు మాంసాహారం తీసుకుంటారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. చివరిస్థానంలో రాజస్తాన్ ఉంది. అయితే ఎన్ఎఫ్హెచ్ఎస్–5(నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) ప్రాంతాల వారీగా 33,755 మంది సీ్త్రలు, 5,048 మంది పురుషులతో 2019–20లో సర్వే నిర్వహించింది. ఇందులో మహిళలు 71.8శాతం, పురుషులు 83.2శాతం మాంసాహారం తీసుకుంటున్నట్లు తేలింది. కోవిడ్ తర్వాత ప్రతీ జిల్లాలో మాంసాహార వినియోగం అధికమైంది. రోగనిరోధకశక్తి పెరుగుతుందనే భావనతో మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు. పశుసంవర్ధకశాఖ అధికారుల గణాంకాల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నెలా 5వేల మెట్రిక్ టన్నుల మాంసాహారం వినియోగిస్తున్నారు. ఇందులో 2,400 టన్నులు చికెన్, 1600 టన్నులు చేపలు, 1400 టన్నుల మటన్ ఉంటోంది. దీనికి నెలకు రూ.209కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇవి కాకుండా కోడిగుడ్లు, బీఫ్, ఫోర్క్, కంజు ఇతర మాంసాహార ఖర్చులు లెక్కిస్తే నెలకు రూ.240కోట్లు మాంసాహారానికి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడంలో పోషకాహారలోపంతో బాధపడేవారి సంఖ్య కూడా క్రమేణా తగ్గుతోంది. -
శ్రావణమాసంలో మాంసాహారం తినకూడదు అని ఎందుకు అంటారు?
శ్రావణమాసం అంటేనే శుభ ముహూర్తాల సమ్మేళనం. ఈ మాసంలో మహిళలందరూ భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. పూజలు, వ్రతాలు, నోములు వంటి కార్యక్రమాలతో నియమ, నిబంధనలతో పూజలు ఆచరిస్తారు. ఇక శ్రావణమాసం పూర్తయ్యేవరకు మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికి గల కారణాలు ఏంటి? మాసం పూర్తయ్యే వరకు నాన్‌వెజ్ ముట్టుకోకపోవడానికి సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు చూద్దాం. శ్రావణం కోసం కోసం తెలుగు లోగిళ్లలో చాలామంది వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.శ్రావణ మాసం అనగానే శుభకార్యాలకు ప్రత్యేకంగా భావిస్తారు. అయితే అధిక శ్రావణ మాసం అశుభకర మాసమని పండితులు నిర్ణయించటంతో ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించలేదు. నిజ శ్రావణ మాసం శుభ కార్యక్రమాలకు అనుకూలంగా నిర్ణయించగా వేలాదిగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి.నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనం, అక్షరాభాస్యం, అన్నప్రాశన, వ్యాపార, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనలు.. ఇలా పలు శుభకార్యాలు జరగనున్నాయి. ఎప్పటివరకు శ్రావణమాసం? సాధారణంగా శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంటుంది. సగటున జులై మధ్య నెలలో ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగుతుంది. కొన్నిసార్లు అధికమాసం వస్తుంటుంది. ఈసారి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఓ నెల అధిక శ్రావణ మాసం కాగా, మరో నెల నిజ శ్రావణ మాసం. తొలుత వచ్చిన అధిక శ్రావణ మాసం గత నెల 18న ప్రారంభమై ఈ నెల 16తో ముగిసింది. ఈనెల 17 నుంచి మొదలైన నిజ శ్రావణమాసం సెప్టెంబర్ 15వరకు ఉండనుంది. అయితే ఈ మాంసంలో శాకాహారానికే అధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని పలు శాస్త్రాలు చెబుతున్నాయి. మాంసం ముట్టరు.. కారణాలు అవేనా? ► శ్రావణమాసం వర్షాకాలంలోనే వస్తుంది. సాధారణంగానే వర్షాకాలంలో కొన్నిరకాల ఆహార పదార్థాలను తినకూడదంటారు. వాటిలో ముందు వరుసలో ఉండేది మాంసాహారం. ఎందుకంటే ఈ కాలంలో హెపటైటిస్, కలరా, డెంగీ వంటి అనేక రోగాలు చుట్టుముడతాయి. ► నీరు నిల్వ ఉండటం, శుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో వ్యాధులు వ్యాపిస్తాయి. ఇదే సమస్య జంతువులకు కూడా ఎదురవుతుంది. దీంతో వాటి ద్వారా ఇన్ఫెక్షన్లు మనుషులకు కూడా వస్తాయని అంటుంటారు. ► ఈ కాలంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది.మాంసం అరగక పేగుల్లో బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణ మార్పులతో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి తేలికపాటి ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు. ► ఇక మరో కారణం ఏంటంటే.. చేపలు, అలాగే ఇతర జలచరాలు వర్షాకాలంలో సంతానోత్పత్తి చేపడతాయి. ఈ ప్రక్రియలో ఉన్నప్పుడు జలచరాలు కొన్ని వ్యర్థాలను నీటిలో విడుదల చేస్తుంటాయి. మళ్లీ వాటినే చేపలు తింటుంటాయి. అలా ఈ మాసంలో నాన్‌వెజ్‌కు దూరంగా ఉండాలని అంటారు. పైగా, గర్భంతో ఉన్న జీవాలను చంపి తినడం మంచిది కాదన్న విశ్వాసం కూడా దీనికి మరో కారణం. -
హారిబుల్ ఎక్స్పీరియన్స్: జొమాటో మరో నిర్వాకం వెలుగులోకి!
సాక్షి, ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు సంబంధించిన మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళకి నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ చేసి కస్టమరుకు భారీ షాకిచ్చింది. తనకెదురైన చేదు అనుభవాన్ని ట్విటర్లో ఆమెషేర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. పలువురు నెటిజనులు జొమాటోపై మండిపడుతున్నారు. ఫలితంగా ఈ పోస్ట్ 6 లక్షలకు పైగా వ్యూస్, 700 లైక్‌లను పొందింది. జొమాటోలో శాఖాహారం ఆర్డర్ చేస్తే.. చికెన్ పంపించారంటూ నిరుపమా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్విటర్లో షేర్ చేసిన నాలుగు సెకన్ల చిన్న క్లిప్‌లో చికెన్ ముక్కను చిదుముతూ తన షాకింగ్ అనుభవాన్ని తెలిపారు. ఇదేం సర్వీసురా బాబూ, భయంకరమైన అనుభవం అని ఆమె పేర్కొన్నారు. దీనిపై జొమాటో స్పందించింది. జరిగిన సంఘటనపై హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పింది. దర్యాప్తు చేస్తామని వెల్లడించింది. (జెరోధా నితిన్ నెల జీతం ఎంతో తెలుసా? ఈ తప్పులు చేయొద్దన్న బిలియనీర్) అయితే యూజర్లకు ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఓ యూజర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కాఫీలో చికెన్ ముక్క దర్శనమిచ్చింది. ఈ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. అయితే స్పందించి క్షమాపణలు చెప్పినప్పటికీ జొమాటోతో తన "అసోసియేషన్" అధికారికంగా ఆ రోజు ముగిసిందని పేర్కొనడం గమనార్హం. Hi @zomato , ordered veg food and got all non veg food. 4/5 of us were vegetarians. What is this service, horrible experience. pic.twitter.com/6hDkyMVBPg — Nirupama Singh (@nitropumaa) March 4, 2023 -
మగవాళ్ల విందు.. తింటే పసందు
సాక్షి, తిరువొత్తియూరు: సాధారణంగా గొప్ప వంటను గురించి చెప్పాలంటే నలభీమ పాకం అని వర్ణిస్తుంటారు. ఆరితేరిన వంటగాళ్ల గురించి చెప్పాలంటే చారిత్రకపరంగా, సాంస్కృతిక పరంగా మగవాళ్లనే ఉదాహరణగా చెబుతుంటారు. దీన్ని నిజం చేస్తూ.. మదురై జిల్లా తిరుమంగళం సమీపం కరడిక్కల్ పంచాయతీలోని గ్రామం అనుపంపట్టి గ్రామంలో శనివారం చేపట్టిన మాంసాహార విందుకు వేలామంది పురుషులు హాజరయ్యారు. (కావల్ దైవం) కాపలా దేవుడుగా ప్రసిద్ధి చెందిన కరుపారై ముత్తయ్య సామి ఆలయంలో ఏటా మార్గళి మాసంలో పౌర్ణమి మరుసటి రోజున ఈ విందు కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ భోజనం చేస్తే వీరులైన మగ సంతానం వృద్ధి చెందడంతో పాటు వంశం అభివృద్ధి చెందుతుందని భక్తుల నమ్మకం. శుక్రవారం అర్ధరాత్రి పూజలు ప్రారంభించి 60కి పైగా మేకలతో 50 బస్తాల బియ్యంతో మాంసాహార భోజనం తయారు చేశారు. శనివారం ఉదయం ముత్తయ్యస్వామికి ప్రత్యేక పూజలు చేసి తరువాత అందరికీ విందు పెట్టారు. (చదవండి: తమిళనాడులో దారుణం..) -
మంట పుట్టిస్తున్న మటన్ ధరలు.. కిలో ధర ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: మాంసాహార ప్రియులకు చేదువార్త. మటన్ ధరలు మంట రేపుతున్నాయి. తెలంగాణలో మేక మాంసం ధర మరోసారి ‘వెయ్యి’ మైలురాయివైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుత స్పీడ్ చూస్తుంటే త్వరలోనే మటన్ థౌజండ్ వాలా పేలడం ఖాయంగానే కనిపిస్తోంది. క్వాలిటీని బట్టి కిలో మటన్ ధర ప్రస్తుతం 800 నుంచి 850 రూపాయలకు విక్రయిస్తున్నారు. కార్తీక మాసం ముగిసిన తర్వాత ధర మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మటన్ ఇప్పటికే కొన్నిచోట్ల నాలుగు అంకెల స్థాయికి చేరిందని టాక్. సామాన్యులకు దూరం గత కొద్ది సంవత్సరాలుగా ధరలు బాగా పెరుగుతూ వస్తుండటంతో సామాన్యులు మటన్ కొనాలంటే జంకుతున్నారు. మేక మాంసం కొనే స్తొమత లేక చికెన్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అరకొరగా మాత్రమే మటన్ కొంటున్నారు. ధరలు భారీగా పెరగడంతో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు మటన్‌కు దూరమవుతున్నారు. గతేడాది జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మటన్ కిలో ధర వెయ్యి రూపాయలు దాటినా తర్వాత దిగివచ్చింది. బర్డ్‌ప్లూను బూచిగా చూపి అప్పట్లో కొంతమంది వ్యాపారులు అడ్డగోలుగా రేట్లు పెంచేశారు. కరోనా సమయంలోనూ మటన్ ధరలు ఆకాశాన్నంటాయి. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో మటన్ వినియోగం ఎక్కువ. ఈమధ్య కాలంలో మటన్ వినియోగం బాగా పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల వినియోగానికి సరిపడనంతగా గొర్రెలు, మేకలు అందుబాటులో లేకపోవడమే ధరలు పెరగడానికి కారణమని అంటున్నారు. జాతీయ పశుగణన లెక్కల ప్రకారం తెలంగాణలో 2019లో 1.91 కోట్ల గొర్రెలు, మేకలు ఉన్నట్టు అంచనా. ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 600 ట్రక్కుల్లో గొర్రెలు, మేకలు తెలంగాణకు సరఫరా అవుతుంటాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం కూడా డిమాండ్‌ను అందుకోకలేకపోతోంది. గొర్రె, మేకల నుంచి 50 శాతం మాత్రమే మాంసం వస్తుందని.. అదే చికెన్ అయితే 70 శాతం వస్తుందని.. మటన్ ధర ఎక్కువగా ఉండడానికి ఇదీ ఓ కారణం. కరోనా తర్వాత ప్రజలు ఎక్కువగా మంసాహారం వైపు మొగ్గు చూపుతుండడం గమనార్హం. చికెన్ మాదిరిగా మటన్ ధరను నిర్ణయించే ఓ వ్యవస్థ లేకపోవడంతో ధరలపై నియంత్రణ లేకుండా పోతోంది. ధరల మాట ఎలా ఉన్నా ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మాత్రం గత నెల రోజులుగా మటన్ విక్రయాలు భారీగా పెరిగాయని పరిశీలకుల అంచనా. మాంసాహారులే ఎక్కువ దేశంలో మాంసాహారులు పెరుగుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5 వెల్లడించింది. అధిక శాతం ప్రజలు వారానికి కనీసం ఒకసారి చేపలు, చికెన్, మాంసంలో ఏదో ఒక దానిని కచ్చితంగా ఆరగిస్తున్నారని తెలిపింది. అయితే మటన్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉంది. 73 శాతం మంది ప్రజలు కనీసం వారంలో ఒకసారైనా మాంసం తింటున్నారు. కేవలం 4.4 శాతం మంది ఎటువంటి మాంసాహారం ముట్టకుండా కోడిగుడ్డు మాత్రమే తీసుకుంటున్నారు. 0.27 శాతం మంది మాత్రమే వెజిటేరియనన్లు ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. (క్లిక్ చేయండి: నిమ్స్‌కు మునుగోడు గ్రహణం) -
కొత్త కొత్తగా స్టయిలిష్ బార్బెక్యూ..
శ్రమ తెలియకుండా రుచి, ఆరోగ్యం రెండు అందించే ఫుడ్ మేకర్స్‌కి ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఉంది. చిత్రంలోని ఈ డివైజ్‌లో ఒకే సమయంలో నాలుగైదు వెరైటీలను వండుకోవచ్చు. ఎడమవైపు ఉన్న హాట్ పాట్లో.. సూప్స్, రైస్ ఐటమ్స్, కర్రీస్ వంటివి చేసుకుంటే.. కుడివైపు పైభాగంలో బార్బెక్యూ గ్రిల్ లేదా ఫ్రైయిడ్ పాన్ పెట్టుకుని నాన్ వెజ్, వెజ్ ఐటమ్స్‌ని గ్రిల్ చేసుకోవచ్చు. ఇక దాని కింద భాగంలో ఉన్న ఖాళీలో రెండు పాన్ ప్లేట్స్ అమర్చుకునే వీలుంటుంది. వాటిపైన పాన్ కేక్స్, ఆమ్లెట్స్, దోసెలు ఎట్సెట్రా వేసుకోవచ్చు. ఇరువైపులా టెంపరేచర్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి విడివిడిగా రెండు రెగ్యులేటర్స్ ఎడమవైపు ఉంటాయి. కుకింగ్ హాట్ పాట్‌కు ట్రాన్స్పరెంట్ మూతతో పాటు.. ప్రత్యేకమైన హ్యాండిల్స్ ఉంటాయి. అలాగే పాన్ ప్లేట్స్కి కూడా పొడవాటి హ్యాండిల్స్ ఉంటాయి. ధర 179 డాలర్లు (రూ.13,383) హైక్వాలిటీ మల్టీఫంక్షనల్ మేకర్ ఈ తరానికి ‘సింపుల్ అండ్ ఈజీ’ పద్ధతిని అలవాటు చేసిన టెక్నాలజీ.. నిత్యం ‘అంతకు మించి’ అనే పాలసీని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త సౌకర్యాలను అందిస్తూనే ఉంటుంది. అందులో భాగమే ఈ మేకర్. ఇందులో పెద్దపెద్ద నాన్ వెజ్ ముక్కలతో పాటు.. రకరకాల రైస్ ఐటమ్స్, గ్రిల్ ఐటమ్స్ ఎక్కువ మోతాదులో తయారు చేసుకోవచ్చు. అలాగే కట్లెట్స్, శాండ్‌విచ్‌లతో పాటు.. చికెన్, మటన్, రొయ్యలు వంటివి క్రిస్పీగా గ్రిల్ చేసుకోవచ్చు. ఒకే సమయంలో మూడు వెరైటీలను తయారు చేసుకునేందుకు వీలుగా పాన్ బౌల్, ఫ్రైయిడ్ పాన్లతో పాటు.. పొంగనాల పాన్ కూడా లభిస్తుంది. టెంపరేచర్ పెంచుకోవడానికి మేకర్ కిందభాగంలో సెటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక బౌల్స్ అండ్ పాన్స్ గాడ్జెట్ నుంచి విడిగా తీసుకుని క్లీన్ చేసుకోవడం తేలిక. ధర 344 డాలర్లు (రూ.25,720) కంఫర్ట్ చార్కోల్ గ్రిల్ ఎన్ని సదుపాయాలొచ్చినా.. ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. రోటి పచ్చడిలానే బొగ్గులపైన చేసే వంటకీ ఓ ప్రత్యేకత ఉంది. మెషిన్స్ అందివ్వలేని ఏదో కమ్మని రుచి అందులో ఉందంటారు కొందరు భోజనప్రియులు. అలాంటి వారికోసమే ఈ చార్కోల్ గ్రిల్. చిత్రంలోని ఇంతపెద్ద మేకర్ని.. సులభంగా ఫోల్డ్ చేసి చిన్న బ్యాగ్‌లో పెట్టుకుని.. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. కింద భాగంలో బొగ్గులు రాజేసి.. గ్రిల్ మీద కావాల్సినవన్నీ కుక్ చేసుకోవచ్చు. వంటకు కావాల్సిన వస్తువులతో పాటు తయారైన ఫుడ్‌ని పక్కన పెట్టుకోవడానికి వీలుగా.. ఇరువైపులా ప్రత్యేకమైన స్టోరేజ్ బాస్కెట్స్ ఉంటాయి. కుడివైపు స్టెయిన్లెస్ స్టీల్ బేకింగ్ నెట్, ఎడమవైపు ఫ్రైయిడ్ పాన్ అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ డివైజ్ కింద భాగంలో పెద్ద సొరుగు ఉంటుంది. వంటకు కావాల్సిన బాక్స్‌లు, పాత్రలు అందులో పెట్టుకోవచ్చు. ఇక నాలుగువైపులా ఉండే స్టాండ్స్ కావాల్సిన హైట్‌ని బట్టి అడ్జెస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. ధర 79 డాలర్లు (రూ.5,906) -
బీరకాయతో నాన్‌వెజ్ ట్రై చేశారా.. ఇలా చేస్తే అదిరిపోవాల్సిందే!
కూరగాయలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. బీరకాయలో పీచుపదార్థం, విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, జింక్, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీర తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా రక్తహీనత, చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు కూడా తగ్గుతారు. రుచిలో కాస్త చప్పగా ఉండే బీరకాయను వివిధ రకాల కాంబినేషన్లలో వండితే మరిన్ని పోషకాలతో పాటు రుచి కూడా పెరుగుతుంది. ఎండురొయ్యలు బీర కుర్మా కావలసినవి: ఎండు రొయ్యలు – పావు కేజి; బీరకాయ – ఒకటి; ఆయిల్ – మూడు టీస్పూన్లు; ఉల్లిపాయ – ఒకటి(సన్నగా తరుక్కోవాలి); ఉప్పు – రుచికి సరిపడా; అల్లం వెల్లుల్లి పేస్టు – అరటీస్పూను; కరివేపాకు – ఒక రెమ్మ; చింతపండు – పావు టీస్పూను; ధనియాల పొడి – పావు టీస్పూను; జీలకర్ర పొడి – పావు టీస్పూను; కారం – రెండు టీస్పూన్లు; గరం మసాలా – అరటీస్పూను. తయారీ..ముందుగా ఎండు రొయ్యల తల, తోక తీసి ఇసుకలేకుండా శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి. ►బీరకాయ తొక్కతీసి సన్నని ముక్కలు చేయాలి. ►స్టవ్ మీద పాన్ పెట్టి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పువేసి వేగనివ్వాలి. ►మరో పాన్‌లో కప్పు నీళ్లు పోసి ఎండు రొయ్యలు వేసి నాలుగు నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►ఉల్లిపాయ ముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పసుపు వేసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ►ఇప్పుడు బీరకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలపాటు మూత పెట్టి ఉడకనిచ్చి, ఉడికించి పెట్టుకున్న ►ఎండు రొయ్యలు వేసి మరో ఎనిమిది నిమిషాలు మగ్గనివ్వాలి ►తరువాత గరం మసాలా వేసి తిప్పి నూనె పైకి తేలేంత వరకు ఉడికిస్తే ఎండురొయ్యలు బీరకాయ కుర్మా రెడీ. బీరకాయ చికెన్ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – అరకేజి; ఆయిల్ – నాలుగు టీ స్పూన్లు; పచ్చిమిరపకాయలు – మూడు (నిలువుగా కట్ చేయాలి); ఉల్లిపాయ – ఒకటి (ముక్కలుగా కట్ చేయాలి); అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర టీ స్పూను; పసుపు – అర టీస్పూను; బీరకాయ ముక్కలు – ఒక కప్పు; కారం – రెండు టీ స్పూన్లు; ధనియాల పొడి – టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; తరిగిన కొత్తిమీర – పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ.. చికెన్‌ను శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి. ►స్టవ్ మీద పాన్ పెట్టి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ►ఉల్లిపాయలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించాలి. ►అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక చికెన్ ముక్కలు వేసి మూతపెట్టి పదినిమిషాలు ఉడికించాలి. ►తరువాత బీరకాయ ముక్కలు వేసి మూతపెట్టి ఐదు నిమిషాలయ్యాక, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. ►తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసి ఆయిల్ పైకి తేలాక, కొత్తిమీర వేసి స్టవ్ ఆపేస్తే బీరకాయ చికెన్ రెడీ. బీర ఖీబా కావలసినవి: మటన్ ఖీమా – పావు కేజి; బీరకాయ ముక్కలు – అరకేజి(తొక్కతీసినవి); తరిగిన పచ్చిమిర్చి – రెండు; వెల్లుల్లి తురుము – టీస్పూను; ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు; మిరియాల పొడి – టీ స్పూను; పసుపు – టీస్పూను; కారం – రెండు టీ స్పూన్లు; గరం మసాలా – అరటీస్పూను; జీలకర్ర – టీస్పూను; ఆవ నూనె – నాలుగు టీ స్పూన్లు; ఉప్పు– రుచికి సరిపడా. తయారీ.. మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక జీలకర్ర వేసి వేగనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ►ఇవన్నీ వేగాక పసుపు, బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►బీరకాయ ముక్కలు సగం ఉడికిన తరువాత కొద్దిగా ఉప్పు, మటన్ ఖీమా వేసి మూతపెట్టి పదిహేను నిమిషాలు ఉడికించాలి. ►ఖీమాలో వచ్చిన నీళ్లన్నీ ఇగిరిపోయాక, కారం, మిగిలిన మసాలా పొడులు వేసి వేగనివ్వాలి. ►చివరిగా ఉప్పు చూసి సరిపోకపోతే కొద్దిగా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనిస్తే బీర ఖీమా రెడీ. -
నాన్–వెజ్ స్పెషల్
పచ్చిమిర్చి కోడి పులావ్ కావల్సినవి: చికెన్ – అరకేజీ; పచ్చిమిర్చి పేస్ట్ – టేబుల్ స్పూన్; పచ్చిమిర్చి – 6 (పొడవుగా చీల్చాలి); కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు ; ఉప్పు – తగినంత; సాజీర – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; మసాలా దినుసులు (దాల్చిన చెక్క–చిన్నముక్క, లవంగాలు – 4 , యాలకులు–4) ; కరివేపాకు – 2 రెమ్మలు; పుదీనా ఆకులు – అరకప్పు; పెరుగు – కప్పు ; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయల తరుగు – కప్పు; కొబ్బరి – పావు కప్పు; బాస్మతి బియ్యం – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని ; నిమ్మరసం టేబుల్ స్పూన్. తయారీ: ►బియ్యాన్ని కడిగి, నీళ్లలో నానబెట్టాలి ►చికెన్‌లో ఉప్పు, కొద్దిగా ధనియాలపొడి, పసుపు, పెరుగు, పుదీనా ఆకులు వేసి బాగా కలిపి పక్కనుంచాలి ►పొయ్యిమీద పాన్ పెట్టి, గరం మసాలా దినుసులన్నీ వేసి వేయించి పక్కనుంచాలి ►చల్లారాక పొడి చేసుకోవాలి ∙విడిగా కొబ్బరి తురుమును పేస్ట్‌లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ►పులావ్ కోసం పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి, వేడయ్యాక నూనె వెయ్యాలి ►వేడి నూనెలో సాజీర, ఉల్లిపాయలు వేపాలి ∙దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి ►ఆ తర్వాత పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, కట్ చేసిన మిర్చి, కరివేపాకు వేసి మూడు నిమిషాలు వేగనివ్వాలి ►కొబ్బరిపొడి, ధనియాల పొడి వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి ►మసాలా కలిపిన చికెన్‌ను వేసి, పదినిమిషాలు ఉడకనివ్వాలి ►ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కలపాలి ►ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి, పైన మూత పెట్టి, మిశ్రమం అంతా ఉడకనివ్వాలి ►అన్నం పూర్తిగా ఉడికేంతవరకు ఉంచి, మూత తీసి పైన వేయించిన జీడిపప్పు పలుకులు, కొత్తిమీర ఆకులు చల్లి సన్నని మంట మీద మరికాసేపు ఉంచి, దించాలి. గోంగూర మటన్ కావాల్సినవి: గోంగూర ఆకులు – 250 గ్రాములు; మేక మాంసం – 500 గ్రాములు; కొత్తిమీర – తగినంత; పుదీన – గుప్పెడు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లిపేస్ట్ – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్; కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కారం – తగినంత; మసాలా – (లవంగాలు –4, యాలకులు –4, ధనియాలు టేబుల్ స్పూన్. ఇవన్నీ కలిపి వేయించి, పొడి చేయాలి); గసగసాలు – టీ స్పూన్. తయారీ: ►మటన్ ముక్కలను వేడినీటిలో 10 నిమిషాలు ఉడికించాలి ►పొయ్యిమీద గిన్నెపెట్టి నూనె వేసి వేడిచేయాలి ►అందులో సాజీరా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి ►అల్లం వెల్లుల్లి ఫేస్ట్, పుసుపు వేసి కలపాలి ►అందులో మటన్ వేసి 5 నిమిషాలు ఉడికించాలి ►తగినంత కారం, ఉప్పు కలిపి ఉడికించాలి ►కొబ్బరి పొడి వేసి 15 నిమిషాలు ఉడికించాలి ►తరువాత తరిగిన గోంగూర ఆకులు వేసి ఉడికించాలి ►చివరగా గరం మసాలా, కొత్తి మీర వేసి దించాలి. మునక్కాయ చేపల కూర కావలసినవి: కొరమీను చేప ముక్కలు – అరకేజీ; కారం – నాలుగు టీ స్పూన్లు; ధనియాల పొడి – రెండు టీ స్పూన్లు; చింతపండు గుజ్జు – అర కప్పు; కొబ్బరి పేస్ట్ – అర కప్పు; పచ్చిమిర్చి – 10 (కచ్చాపచ్చాగ దంచాలి); మునక్కాయలు – 2 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); నూనె – అర కప్పు,; జీలకర్ర పొడి – టీ స్పూన్; ఎండుమిర్చి – 5, కరివేపాకు – రెమ్మ; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత. తయారీ: ►చేపముక్కలను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి ►స్టౌ మీద పాన్ పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక అందులో కొబ్బరి పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాలపొడి, కారం, పసుపు తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి ►తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టాలి ►ఈ మిశ్రమం కాస్త చిక్కపడ్డాక అందులో కట్ చేసిన మునక్కాయ ముక్కలు, చింతపండు గుజ్జు పోసి సన్నటి సెగ మీద ఉంచాలి ►ఇది ఉడుకుతుండగా మధ్యలో చేప ముక్కలను కూడా జత చేసి మూతపెట్టాలి ►ఈ మిశ్రమమంతా చిక్కబడుతుండగా దించి వేరొక పాన్‌లో మిగిలిన నూనె వేయాలి ►అది వేడెక్కాక అందులో జీలకర్రపొడి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టాలి ►వేయించిన తాలింపును ఉడికించిన కూరలో కలిపి గిన్నెలోకి తీసుకోవాలి. -
గర్బిణీలకు మాంసం, సెక్స్ వద్దా?
న్యూఢిల్లీ: గర్బిణీలు మాంసం తినరాదని, సాత్విక ఆహారమే తీసుకోవాలని, సెక్స్‌లో పాల్గొనరాదని కేంద్రంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనలు చేయడం, ‘తల్లీ బిడ్డల సంరక్షణ’ పేరుతో ఓ చిన్న పుస్తకాన్ని కూడా విడుదల చేయడం పట్ల సోషల్ మీడియాలో పలువురు, ముఖ్యంగా మహిళలు ధ్వజమెత్తుతున్నారు. మొన్నటి వరకు గోమాంసం ఎవరూ తినరాదంటూ ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆహారపు అలవాట్లు వారి వారి ఇష్టం అంటూ మార్చింది. మళ్లీ ఇప్పుడు గర్భవతుల ఆహారపు అలవాట్లపై సూచనలు చేయడం పట్ల వారు మండిపడుతున్నారు. గర్భవతులకు కావాల్సిన ఐరన్, పౌష్టికాహారం మాంసం నుంచి వస్తుంది తప్ప, సాత్విక ఆహారం ద్వారా ఎలా వస్తుందని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. చేపలు తినడం తమకు తరతరాల నుంచి వస్తోందని, పైగా చేపలు తమకు శాకాహారమని, చేపలు తినొద్దని సూచించడం ఏమిటని ప్రముఖ చరిత్రకారులు, రచయిత్రి ప్రీతాసేన్ ప్రశ్నించారు. చేపల్లో ఇంధనం, ఫాస్పరస్, కాల్సియం ఉంటుందని ఆమె చెప్పారు. మాంసాహారంలో ఉండే పోషక విలువలు ఏ కూరగాయాల్లో ఉంటాయో, ఏ స్థాయిలో ఉంటాయో తెలియజేయాలని ఆమె ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలు కూడా గర్భవతులకు మాంసం మంచిదని సూచిస్తున్నాయి. గర్భిణీలు గోమాంసం తినడం కూడా మంచిదని, అయితే రోజూ, అందరూ దీన్ని తినకూడదని ‘శుశ్రుతా సంహిత, చరక సంహిత’ లాంటి ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలు సూచిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌తోపాటు కేరళ, మేఘాలయ, అస్సాం రాష్ట్రాల్లో గర్భిణీ మహిళలు చేపలతోపాటు మాంసం కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో గర్బిణీలు ఎక్కువగా శాకాహారాన్ని తీసుకుంటారు. వారు నెయ్యి, బాదం, కర్బూజ గింజలు తీసుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో బొప్పాయి పండ్లను కూడా తీసుకునేవారు. వాటి వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలున్నాయని పరిశోధనల్లో తేలడంతో ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నారు. అస్సాంలో మహిళలు గర్భవతని తెలియగానే మాంసాన్ని తగ్గించి దేశీయ చికెన్‌ను ఎక్కువ తింటారని అస్సామీ హోం చెఫ్, ఫుడ్ క్యూరేటర్ గీతికా సైకియా తెలిపారు. కేరళలో మహిళలు కుల, మతాలతో సంబంధం లేకుండా పాలకూర, మునుగకాయలు, కర్జూరాలు, పండ్లు, చేపలు, మాంసం ఎక్కువగా తింటారని ప్రముఖ వంటల పుస్తకాల రచయిత్రి లతికా జార్జ్ తెలిపారు. కొబ్బరితో వండిన చేపల కూరను గర్బిణీలకు పెడతారని ఆమె చెప్పారు. నెయ్యి, కొబ్బరి మంచిదని దేశంలోని అన్ని సంస్కతుల వారు అంగీకరిస్తున్నప్పటికీ వారి వారి సంస్కతులను బట్టి ఆహారపు అలవాట్లు ఉంటాయని, ఇలా బలవంతంగా ఒక్క సంస్కతి అలవాట్లను తమపై రుద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం ఏమిటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. సెక్స్ కోరికలు చంపుకోవాలని చెప్పడం పట్ల కూడా వారు మండి పడుతున్నారు. ఈ విషయంలో తాము ఎప్పుడైనా వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తామని చెబుతున్నారు. -
‘గర్భిణులకు మాంసాహారం వద్దు’
న్యూఢిల్లీ: ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలంటే గర్భిణులు మాంసాహారంతో పాటు శృంగారానికి దూరంగా ఉండాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. ఆథ్యాత్మిక భావాలతో గడపడంతో పాటు బెడ్రూమ్లో అందమైన వాల్పేపర్లు అంటించాలని తన బుక్‌లెట్‌లో సూచించింది. మహిళలు గర్భం దాల్చిన సమయంలో గొప్పగొప్ప మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని తెలిపింది. ‘తల్లి పిల్లల సంరక్షణ’ పేరుతో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ యోగా అండ్ నేచురోపతి(సీసీఆర్‌వైఎన్) ఈ బుక్లెట్లను జారీ చేసింది. ఈ సిఫార్సులకు ఎలాంటి హేతుబద్ధత లేదని అలోపతి వైద్యులు తేల్చిచెప్పారు. అసాధారణ కేసుల్లో తప్పించి గర్భిణులు శృంగారానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఎయిమ్స్ గైనకాలజీ ప్రొఫెసర్ నీర్జా భాటియా స్పష్టం చేశారు. -
ఉత్సవ వేళ.. దుర్గగుడిలో అపచారం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అత్యంత పవిత్రంగా జరుగుతున్న దసరా ఉత్సవాలలో మూడో రోజైన గురువారం మహా అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి ఆలయ పరిసరాలలో జంతు బలి, మాంసాహారం తినడం నిషిద్ధం. ఆలయ పరిసరాలలో పూర్తి శాకాహారమే భుజించాల్సి ఉండగా, దసరా విధులు నిర్వహించేందుకు వచ్చిన సిబ్బంది మాంసాహారం భుజించడమే కాకుండా తిన్న తర్వాత ప్యాకెట్‌ను అమ్మవారి మెట్ల మార్గంలో పడేశారు. ఉత్సవాలలో విధులు నిర్వహించేందుకు రాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ శాఖలకు చెందిన సిబ్బంది వచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మాంసాహారం భుజించి ఆ ప్యాకెట్‌ను కొండ పై నుంచి కింద పడేశారు. ఆ ప్యాకెట్ అమ్మవారి ఆలయ మెట్ల మార్గంలో పడటంతో ఈ వ్యవహారం బయట పడింది. మహా మండపం పరిసరాలలో విధులు నిర్వహించేవారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని ఆలయ సిబ్బంది అనుమానిస్తున్నారు. మహిళా భక్తులు అత్యంత పవిత్రంగా పూజించే మెట్లపై బిర్యానీ ప్యాకెట్‌తో పాటు మాంసం ముక్కలు దర్శనమిచ్చాయి. మహా మండపం, ఆలయ పరిసరాలలో విధులు నిర్వహించే సిబ్బందిని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లయితే ఇందుకు కారకులెవరో బయట పడుతుంది.