శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అత్యంత పవిత్రంగా జరుగుతున్న దసరా ఉత్సవాలలో మూడో రోజైన గురువారం మహా అపచారం చోటుచేసుకుంది.
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అత్యంత పవిత్రంగా జరుగుతున్న దసరా ఉత్సవాలలో మూడో రోజైన గురువారం మహా అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి ఆలయ పరిసరాలలో జంతు బలి, మాంసాహారం తినడం నిషిద్ధం. ఆలయ పరిసరాలలో పూర్తి శాకాహారమే భుజించాల్సి ఉండగా, దసరా విధులు నిర్వహించేందుకు వచ్చిన సిబ్బంది మాంసాహారం భుజించడమే కాకుండా తిన్న తర్వాత ప్యాకెట్‌ను అమ్మవారి మెట్ల మార్గంలో పడేశారు. ఉత్సవాలలో విధులు నిర్వహించేందుకు రాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ శాఖలకు చెందిన సిబ్బంది వచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మాంసాహారం భుజించి ఆ ప్యాకెట్‌ను కొండ పై నుంచి కింద పడేశారు.
ఆ ప్యాకెట్ అమ్మవారి ఆలయ మెట్ల మార్గంలో పడటంతో ఈ వ్యవహారం బయట పడింది. మహా మండపం పరిసరాలలో విధులు నిర్వహించేవారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని ఆలయ సిబ్బంది అనుమానిస్తున్నారు. మహిళా భక్తులు అత్యంత పవిత్రంగా పూజించే మెట్లపై బిర్యానీ ప్యాకెట్‌తో పాటు మాంసం ముక్కలు దర్శనమిచ్చాయి. మహా మండపం, ఆలయ పరిసరాలలో విధులు నిర్వహించే సిబ్బందిని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లయితే ఇందుకు కారకులెవరో బయట పడుతుంది.