ప్రపంచం మారుతోంది. ఆర్థికంగా ప్రతీ కుటుంబం బలపడుతోంది. జీవన విధానంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంపాదనలో దాచుకునే కాలం నుంచి సంపాదించిన సొమ్ములో సంతోషంగా జీవించడానికి సరిపడా ఖర్చు చేసి మిగిలిందే దాచుకుందాం అనే ధోరణి కనిపిస్తోంది. సంపాదనలో అత్యధిక శాతం విద్య, ఆహారం, ఆరోగ్యానికి మాత్రమే ఖర్చు చేస్తున్నారు. పిల్లలకు మంచి చదువు ఇస్తే చాలు అదే వాళ్లకు ఆస్తి అనే భావనతో చాలామంది విద్య విషయంలో రాజీ పడటం లేదు. ఆ తర్వాత మంచి పోషకాహారం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కోవిడ్ తర్వాత వీటిపై ప్రజల్లో మరింత చైతన్యం పెరగడం విశేషం.
సాక్షి ప్రతినిధి కర్నూలు: పోషకాహార లోపంతో బాధపడే ప్రాంతాల్లో మనది కూడా ఒకటి. ముఖ్యంగా పేదరికం అత్యధికంగా ఉండే పశ్చిమ ప్రాంతంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. బతకడం కోసం మరో ప్రాంతానికి వెళ్లి ఒళ్లు హూనమయ్యేలా శ్రమించి తినీతినక ప్రతి రూపాయి దాచుకొని బతుకీడ్చేవారు.ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతీ ఇంటికి ఆర్థిక భరోసా లభిస్తోంది. వారి కష్టానికి ప్రభుత్వ సాయం దన్నుగా నిలుస్తోంది. దీంతో పిల్లలకు మంచి చదువులు చదివిస్తున్నారు. అక్షరాస్యత పెరగడంతో ప్రజల్లో చైతన్యం కూడా అధికమైంది. జీవన విధానంలో ప్రాధాన్యతలు గ్రహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలనే భావనకు వచ్చారు.
ఆరోగ్యానికీ ప్రాధాన్యత
ప్రతి వందమందిలో 63శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. 2030కి ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతో చనిపోతారని స్పష్టం చేసింది. ఎన్‌సీడీ(నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) వ్యాధుల బారిన పడుతున్నారు. 35 ఏళ్లుదాటితే హైపర్‌టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్, బీపీ వస్తున్నాయి. ఆశ్చర్యమేంటంటే 18 ఏళ్లు దాటిన వారు కూడా ఎన్‌సీడీ బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆరోగ్యంపై జాగ్రత్త పెరిగింది. మంచి ఆహారం, వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు. అందుకే జిమ్‌లు, ఫిట్‌నెస్, జుంబా సెంటర్లకు వెళ్తున్నారు. పిల్లలను ఏదో ఒక స్పోర్ట్‌లో చేర్పిస్తే శారీరంగా, మానసింగా ఆరోగ్యంగా ఉంటారని స్పోర్ట్స్‌వైపు పంపుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ లెక్కల ప్రకారం వయస్సుకు తగ్గట్లు బరువు ఉన్నవారు 2019కి ముందు 90 శాతంలోపు ఉంటే 2022లో 93.82 శాతం ఉన్నారు.2023లో 94.15 శాతంఉన్నారు. దీన్నిబట్టే పోషకాహారలోపంతో బాధపడేవారి సంఖ్య తగ్గుతోందని స్పష్టమవుతోంది.
పోషకాహారం కోసం ఖర్చులో తగ్గేదేలే..
10–15ఏళ్ల కిందట కిరాణా మినహా ఏదైనా పండ్లు, ఇతర ఆహార పదార్థాలు కొనాలంటే జేబులో డబ్బులు చూసేవారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆహారం మినహా ప్రత్యేకంగా పండ్లు, మాంసంపై దృష్టి సారించేవారు కాదు. పండుగలు, బంధువులు ఇంటికి వచ్చిన సందర్భాల్లోనే నాన్‌వెజ్ ఉండేది. ఇప్పుడు ప్రతీవారం కచ్చితంగా, కొందరు వారంలో 2, 3 సార్లు నాన్‌వెజ్ తీసుకుంటున్నారు. అలాగే డ్రైప్రూట్స్ వాడకం గణనీయంగా పెరిగింది. చాలామంది బాదం, పిస్తా, ఖర్జూర, కాజు, ఆఫ్రికాట్స్‌తో పాటు పలు రకాల డ్రైప్రూట్స్ కొంటున్నారు. పిల్లలకు రోజూ డ్రైప్రూట్స్ ఇస్తే పటిష్టంగా ఉంటారనే భావనకు వచ్చారు.
ఏదైనా బేకరీ, డ్రైప్రూట్స్ లేదా మరో దుకాణానికి వెళితే ధరలు అడగకుండా కావల్సింది తీసుకుని బిల్లు చూసి ఫోన్‌పే చేసి వస్తున్నారు. దీంతో పాటు మిల్లెట్స్ వినియోగం కూడా పెరిగింది. కొర్రలు, అరికెలు, కినోవాతో పాటు మిల్లెట్స్ తినేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇవన్నీ పోషకాహారం తీసుకోవడంలో భాగమే. వీటన్నిటి కంటే ప్రధానమైంది మాంసాహారం. వారంలో ఒకరోజు.. కనీసం నెలలో ఒక రోజు ఫ్యామిలీతో రెస్టారెంట్లకు వెళ్లే సంస్కృతి పెరిగింది.
ప్రతీ నెలా నాన్‌వెజ్ ఖర్చు రూ.240కోట్లు
దేశంలోని 29 రాష్ట్రాల్లో మాంసాహార వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 98.4శాతం పురుషులు, 98.1శాతం సీ్త్రలు మాంసాహారం తీసుకుంటారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. చివరిస్థానంలో రాజస్తాన్ ఉంది. అయితే ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–5(నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) ప్రాంతాల వారీగా 33,755 మంది సీ్త్రలు, 5,048 మంది పురుషులతో 2019–20లో సర్వే నిర్వహించింది.
ఇందులో మహిళలు 71.8శాతం, పురుషులు 83.2శాతం మాంసాహారం తీసుకుంటున్నట్లు తేలింది. కోవిడ్ తర్వాత ప్రతీ జిల్లాలో మాంసాహార వినియోగం అధికమైంది. రోగనిరోధకశక్తి పెరుగుతుందనే భావనతో మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు. పశుసంవర్ధకశాఖ అధికారుల గణాంకాల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నెలా 5వేల మెట్రిక్ టన్నుల మాంసాహారం వినియోగిస్తున్నారు.
ఇందులో 2,400 టన్నులు చికెన్, 1600 టన్నులు చేపలు, 1400 టన్నుల మటన్ ఉంటోంది. దీనికి నెలకు రూ.209కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇవి కాకుండా కోడిగుడ్లు, బీఫ్, ఫోర్క్, కంజు ఇతర మాంసాహార ఖర్చులు లెక్కిస్తే నెలకు రూ.240కోట్లు మాంసాహారానికి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడంలో పోషకాహారలోపంతో బాధపడేవారి సంఖ్య కూడా క్రమేణా తగ్గుతోంది.
Comments
Please login to add a commentAdd a comment