Nutritional deficiency
-
తగ్గేదేలే.. ప్రతీ నెలా నాన్‌వెజ్ కోసం రూ.240కోట్లు ఖర్చు చేస్తున్న జనాలు
ప్రపంచం మారుతోంది. ఆర్థికంగా ప్రతీ కుటుంబం బలపడుతోంది. జీవన విధానంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంపాదనలో దాచుకునే కాలం నుంచి సంపాదించిన సొమ్ములో సంతోషంగా జీవించడానికి సరిపడా ఖర్చు చేసి మిగిలిందే దాచుకుందాం అనే ధోరణి కనిపిస్తోంది. సంపాదనలో అత్యధిక శాతం విద్య, ఆహారం, ఆరోగ్యానికి మాత్రమే ఖర్చు చేస్తున్నారు. పిల్లలకు మంచి చదువు ఇస్తే చాలు అదే వాళ్లకు ఆస్తి అనే భావనతో చాలామంది విద్య విషయంలో రాజీ పడటం లేదు. ఆ తర్వాత మంచి పోషకాహారం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కోవిడ్ తర్వాత వీటిపై ప్రజల్లో మరింత చైతన్యం పెరగడం విశేషం. సాక్షి ప్రతినిధి కర్నూలు: పోషకాహార లోపంతో బాధపడే ప్రాంతాల్లో మనది కూడా ఒకటి. ముఖ్యంగా పేదరికం అత్యధికంగా ఉండే పశ్చిమ ప్రాంతంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. బతకడం కోసం మరో ప్రాంతానికి వెళ్లి ఒళ్లు హూనమయ్యేలా శ్రమించి తినీతినక ప్రతి రూపాయి దాచుకొని బతుకీడ్చేవారు.ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతీ ఇంటికి ఆర్థిక భరోసా లభిస్తోంది. వారి కష్టానికి ప్రభుత్వ సాయం దన్నుగా నిలుస్తోంది. దీంతో పిల్లలకు మంచి చదువులు చదివిస్తున్నారు. అక్షరాస్యత పెరగడంతో ప్రజల్లో చైతన్యం కూడా అధికమైంది. జీవన విధానంలో ప్రాధాన్యతలు గ్రహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలనే భావనకు వచ్చారు. ఆరోగ్యానికీ ప్రాధాన్యత ప్రతి వందమందిలో 63శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. 2030కి ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతో చనిపోతారని స్పష్టం చేసింది. ఎన్సీడీ(నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) వ్యాధుల బారిన పడుతున్నారు. 35 ఏళ్లుదాటితే హైపర్‌టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్, బీపీ వస్తున్నాయి. ఆశ్చర్యమేంటంటే 18 ఏళ్లు దాటిన వారు కూడా ఎన్సీడీ బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆరోగ్యంపై జాగ్రత్త పెరిగింది. మంచి ఆహారం, వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు. అందుకే జిమ్‌లు, ఫిట్నెస్, జుంబా సెంటర్లకు వెళ్తున్నారు. పిల్లలను ఏదో ఒక స్పోర్ట్‌లో చేర్పిస్తే శారీరంగా, మానసింగా ఆరోగ్యంగా ఉంటారని స్పోర్ట్స్‌వైపు పంపుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ లెక్కల ప్రకారం వయస్సుకు తగ్గట్లు బరువు ఉన్నవారు 2019కి ముందు 90 శాతంలోపు ఉంటే 2022లో 93.82 శాతం ఉన్నారు.2023లో 94.15 శాతంఉన్నారు. దీన్నిబట్టే పోషకాహారలోపంతో బాధపడేవారి సంఖ్య తగ్గుతోందని స్పష్టమవుతోంది. పోషకాహారం కోసం ఖర్చులో తగ్గేదేలే.. 10–15ఏళ్ల కిందట కిరాణా మినహా ఏదైనా పండ్లు, ఇతర ఆహార పదార్థాలు కొనాలంటే జేబులో డబ్బులు చూసేవారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆహారం మినహా ప్రత్యేకంగా పండ్లు, మాంసంపై దృష్టి సారించేవారు కాదు. పండుగలు, బంధువులు ఇంటికి వచ్చిన సందర్భాల్లోనే నాన్‌వెజ్ ఉండేది. ఇప్పుడు ప్రతీవారం కచ్చితంగా, కొందరు వారంలో 2, 3 సార్లు నాన్‌వెజ్ తీసుకుంటున్నారు. అలాగే డ్రైప్రూట్స్ వాడకం గణనీయంగా పెరిగింది. చాలామంది బాదం, పిస్తా, ఖర్జూర, కాజు, ఆఫ్రికాట్స్తో పాటు పలు రకాల డ్రైప్రూట్స్ కొంటున్నారు. పిల్లలకు రోజూ డ్రైప్రూట్స్ ఇస్తే పటిష్టంగా ఉంటారనే భావనకు వచ్చారు. ఏదైనా బేకరీ, డ్రైప్రూట్స్ లేదా మరో దుకాణానికి వెళితే ధరలు అడగకుండా కావల్సింది తీసుకుని బిల్లు చూసి ఫోన్‌పే చేసి వస్తున్నారు. దీంతో పాటు మిల్లెట్స్ వినియోగం కూడా పెరిగింది. కొర్రలు, అరికెలు, కినోవాతో పాటు మిల్లెట్స్ తినేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇవన్నీ పోషకాహారం తీసుకోవడంలో భాగమే. వీటన్నిటి కంటే ప్రధానమైంది మాంసాహారం. వారంలో ఒకరోజు.. కనీసం నెలలో ఒక రోజు ఫ్యామిలీతో రెస్టారెంట్లకు వెళ్లే సంస్కృతి పెరిగింది. ప్రతీ నెలా నాన్‌వెజ్ ఖర్చు రూ.240కోట్లు దేశంలోని 29 రాష్ట్రాల్లో మాంసాహార వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 98.4శాతం పురుషులు, 98.1శాతం సీ్త్రలు మాంసాహారం తీసుకుంటారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. చివరిస్థానంలో రాజస్తాన్ ఉంది. అయితే ఎన్ఎఫ్హెచ్ఎస్–5(నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) ప్రాంతాల వారీగా 33,755 మంది సీ్త్రలు, 5,048 మంది పురుషులతో 2019–20లో సర్వే నిర్వహించింది. ఇందులో మహిళలు 71.8శాతం, పురుషులు 83.2శాతం మాంసాహారం తీసుకుంటున్నట్లు తేలింది. కోవిడ్ తర్వాత ప్రతీ జిల్లాలో మాంసాహార వినియోగం అధికమైంది. రోగనిరోధకశక్తి పెరుగుతుందనే భావనతో మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు. పశుసంవర్ధకశాఖ అధికారుల గణాంకాల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నెలా 5వేల మెట్రిక్ టన్నుల మాంసాహారం వినియోగిస్తున్నారు. ఇందులో 2,400 టన్నులు చికెన్, 1600 టన్నులు చేపలు, 1400 టన్నుల మటన్ ఉంటోంది. దీనికి నెలకు రూ.209కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇవి కాకుండా కోడిగుడ్లు, బీఫ్, ఫోర్క్, కంజు ఇతర మాంసాహార ఖర్చులు లెక్కిస్తే నెలకు రూ.240కోట్లు మాంసాహారానికి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడంలో పోషకాహారలోపంతో బాధపడేవారి సంఖ్య కూడా క్రమేణా తగ్గుతోంది. -
పోషకాహార లోపంతో సతమతమవుతున్న చిన్నారులు.. రోజూ ఏం తినాలంటే..
సాక్షి, మేడ్చల్ జిల్లా: మహిళలు, చిన్నారుల్లో పోషకాహార స్థితిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో పోషణ మాసోత్సవాన్ని చేపట్టారు. తద్వారా ఆరోగ్యకరంగా జీవించేందుకు బాటలు వేసేందుకు జిల్లా సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పలు పథకాలను కూడా అమలు చేస్తున్నాయి. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నగరంతో సహా శివారు జిల్లాలైన మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డిలలో పోషకాల లోపంతో సతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. పోషకాలపై అవగాహన కల్పించి, పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం కల్పించే మాసోత్సవాన్ని పోషణ్ అభియాన్ పేరుతో ఈ నెలాఖరు వరకు ఆయా జిల్లా సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్నాయి. ఇదీ లక్ష్యం.. స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా ఈ నెలాఖరు వరకు వివిధ కార్యక్రమాలతో తల్లిదండ్రులను చైతన్యం చేస్తారు. పోషకాహార లోపం లేని తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. గర్భిణులు మిటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉన్న వివిధ రకాల పోషకాహారం ఎలా తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు. బహుమతుల ప్రదానం పోషణ మాసోత్సవంలో భాగంగా నగరంతో సహా శివారు జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయతీల్లో పిల్లల ఎత్తు, బరువు చూస్తారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు బహుమతులు అందజేస్తారు. రక్తహీనత శిబిరాలు నిర్వహించి, పోషకాహారంపై అవగాహన కల్పిస్తారు. ఈ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించటం వల్ల.. మాసోత్సవాల్లో ఈ అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్నారులకు నిత్యం పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు పాలు, పండ్లు సూచిస్తున్నారు. యువజన, మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. బరువు లేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోషణ మాసోత్సవాన్ని షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తున్నాం. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మాసోత్సవం సజావుగా సాగేలా చూస్తున్నాం. వయస్సుకు తగ్గ బరువులేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూస్తున్నాం. నిత్యం పాలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలను ఆహారంలో చేర్చడం ద్వారా ఉండే ప్రయోజనాలపై వారికి వివరిస్తున్నాం. – కృష్ణారెడ్డి, జిల్లా సంక్షేమాధికారి, మేడ్చల్–మల్కాజిగిరి. -
ఇంటింటా పౌష్టికాహార ‘పుట్ట’!
మన దేశంలో ప్రజలు తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు. ఈ లోపాన్ని భర్తీ చేయగలిగినవి పుట్టగొడుగులు. వీటిలోని పోషక విలువలు, ఔషధగుణాల గురించి తెలిసినప్పటికీ.. ప్రజలకు అందుబాటులోకి తేవడం అంతగా సాధ్యపడటం లేదు. పుట్టగొడుగులు పట్టణాలు, నగరాల్లో కూడా అరుదుగానే అందుబాటులో ఉంటున్నాయి. ధర ఎక్కువగా ఉండటం వల్ల ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల వారికి పోషకాల గనులైన పుట్టగొడుగులు ఇప్పటికీ అందని ద్రాక్షల్లాగే మిగిలిపోయాయి. వీటి పెంపకానికి నైపుణ్యం అవసరం. విత్తన లభ్యత కూడా పెద్ద సవాలుగా ఉంది. అయితే, పుట్టగొడుగులను ఎక్కడో పెంచి తీసుకువచ్చి దుకాణాల్లో ప్రజలకు అమ్మేదానికి బదులు.. ‘పుట్టగొడుగులను అందించే సంచి’ని అమ్మటం ఉత్తమమైన పని అని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనాసంస్థ (ఐ.ఐ.హెచ్.ఆర్.) శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇందుకోసం వారు ‘రెడీ టు ఫ్రూట్(ఆర్.టి.ఎఫ్.)’ బ్యాగ్ సాంకేతికతకు రూపకల్పన చేశారు. ఒక్కో బ్యాగ్‌తో 300 గ్రా. పుట్టగొడుగులు కిలో బరువుండే బ్యాగ్‌ను తెచ్చుకొని ఇంట్లో ఎండ తగలని, గాలి పారాడే చోట వేలాడదీసి ఉంచితే.. ఐదు లేక 6 రోజుల్లో 200–300 గ్రాముల పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది. ఈ బ్యాగ్‌ను బెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్‌లో ముందుగా బుక్ చేసుకున్న వారికి లాభాపేక్ష లేకుండా రూ. 20లకే విక్రయిస్తోంది. అయితే, దీన్ని తయారు చేసే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు అంతకన్నా ఎక్కువ ధరకు అమ్మాల్సి ఉంటుంది. ‘రెడీ టు ఫ్రూట్(ఆర్.టి.ఎఫ్.)’ బ్యాగ్‌ను ఉత్పత్తి చేసే యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే వారికి బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలకు సాంకేతికతను అందించడంతోపాటు, ఏడాదిలో 3 దఫాలు శిక్షణ కూడా ఇస్తోంది. శిక్షణ 5 రోజులు. ఫీజు ఒక్కొక్కరికి రూ. 7 వేల వరకు ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకానికి వరిగడ్డితో బ్యాగ్‌ల తయారీపై శిక్షణ పొందుతున్న మహిళలు బ్యాగ్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసుకోదలచిన వారు ఐఐహెచ్ఆర్ రూపొందించిన మల్టీఫ్యూయల్ బాయిలర్, స్టెరిలైజేషన్ యూనిట్, మోటారుతో నడిచే చాఫ్ కట్టర్లను రూ. 5–6 లక్షల ఖర్చుతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 3–4 గదుల షెడ్/భవనంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. స్పాన్‌ను ఐఐహెచ్ఆర్ లేదా మరెక్కడి నుంచైనా తెచ్చుకొని బ్యాగ్‌లను ఉత్పత్తి చేసుకొని వినియోగదారులకు అమ్ముకోవచ్చు. ఈ యూనిట్ ద్వారా రోజుకు కిలో బరువైన బ్యాగ్‌లు 100 వరకు (2 కిలోల బ్యాగులైతే 50 వరకు) ఉత్పత్తి చేయొచ్చు. బ్యాగ్‌లలో పుట్టగొడుగులు పెంచుతున్న గృహిణులు స్పాన్ ఉత్పత్తి కీలకం పుట్టగొడుగుల పెంపకంలో స్పాన్ (విత్తనం) లభ్యత కీలకాంశం. అయితే, పుట్టగొడుగుల స్పాన్‌ను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే రూ. 20 లక్షల పెట్టుబడితోపాటు 1500 చదరపు అడుగుల పక్కా భవనంలో వసతి అవసరమవుతుంది. స్పాన్ ఉత్పత్తి సాంకేతికతను ఐఐహెచ్ఆర్ అందిస్తోంది. శిక్షణ కూడా ఇస్తోంది. శిక్షణ కాలం 5 రోజులు. ఫీజు ఒక్కొక్కరికి రూ. 7 వేల వరకు ఉంటుంది. ప్రభుత్వ శాఖలు కోరితే రాష్ట్రాల్లోనూ శిక్షణ ‘రెడీ టు ఫ్రూట్(ఆర్.టి.ఎఫ్.)’ బ్యాగ్‌లను, పుట్టగొడుగుల స్పాన్ ఉత్పత్తి సాంకేతికతలపై ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు వివిధ రాష్ట్రాలకు వచ్చి కూడా శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ/ఉద్యాన శాఖల కోరిక మేరకు కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో ఇటువంటి శిక్షణా తరగతులు జరిగాయి. కర్ణాటక ప్రభుత్వం 5 చోట్ల పుట్టగొడుగుల స్పాన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆయా పరిసర ప్రాంతాల్లో ప్రజలకు బ్యాగ్‌లను అందుబాటులోకి తెచ్చింది. చలికాలంలో ఆయిస్టర్ పుట్టగొడుగులు పెంచుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వాతావరణం మిల్కీ మష్రూమ్స్ పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇతర సమాచారం కోసం ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు సంప్రదించాల్సిన చిరునామా: అధిపతి, విస్తరణ–సాంఘిక శాస్త్రాల విభాగం, ఐసిఎఆర్–ఐఐహెచ్ఆర్, హెసరఘట్ట, బెంగళూరు – 560089. Email: Venkattakumar.R@icar.gov.in http://www.iihr.res.in/ 5,6 రోజుల్లో తాజా పుట్టగొడుగులు పుట్టగొడుగులను అందించే ఈ రెడీ మేడ్ బ్యాగ్ ప్రత్యేకత ఏమిటంటే.. దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలు సులభంగా ఐదారు రోజుల్లో తాజా పుట్టగొడుగులను కళ్లముందే పెంచుకోవచ్చు. పాలిథిన్ క్యారీ బ్యాగ్‌లో శుద్ధి చేసిన వరి గడ్డి ముక్కలతోపాటు పుట్టగొడుగుల విత్తనం చల్లి, మూతి కట్టేస్తారు. ఈ బ్యాగును వినియోగదారుడు కొని తెచ్చి ఇంట్లో ఒక మూలన పెట్టుకొని, దానికి అక్కడక్కడా చిన్న బెజ్జాలు చేస్తే చాలు. ఆ బెజ్జాల్లో నుంచి పుట్టగొడుగులు మొలుస్తాయి. వాటిపై నీటి తుంపరలను రోజుకోసారి పిచికారీ చేస్తుంటే చాలు. బ్యాగ్‌పై పుట్టగొడుగులు పెరగడానికి వీలుగా చిన్న బెజ్జం చేస్తున్న దృశ్యం కేవలం 5,6 రోజుల్లో తాజా పుట్టగొడుగులు వంటకు సిద్ధమవుతాయి. ఇలా ఎవరికి వారు ఇంట్లోనే పెద్ద హైరానా ఏమీ లేకుండా సునాయాసంగా పుట్టగొడుగులు పెంచుకోవచ్చు. మరీ ముదిరిపోక ముందే కోసుకుంటే చాలు. ఈ పని చేయడానికి నైపుణ్యం ఏమీ అవసరం లేదు. చదువు లేని గృహిణులు కూడా సులభంగా ఈ పద్ధతిలో పుట్టగొడుగులను ఇంట్లోనే పెంచుకోగలుగుతారు. తాజా పుట్టగొడుగులను కూర వండుకోవచ్చు లేదా ఎండబెట్టి పొడి (ఏడాది వరకు నిల్వ చేసుకోవచ్చు) చేసి రోజువారీగా ఆహార పదార్థాల్లో కలిపి వాడుకుంటూ ఆరోగ్యవంతంగా జీవించవచ్చని ఐ.ఐ.హెచ్.ఆర్. శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్యాగ్‌పై మొలిచిన పుట్టగొడుగులపై నీటి పిచికారీ పోషక గనులు.. ఔషధ గుణాలు! పుట్టగొడుగులు కూడా మొక్కల్లాంటివే. మొక్కల్లో మాదిరిగా క్లోరోఫిల్ ఉండదు కాబట్టి తెల్లగా ఉంటాయి. పోషకాల గని వంటివి పుట్టగొడుగులు. ప్రొటీన్లు, బి విటమిన్లు ఉన్నాయి. విటమిన్ డిని కలిగి ఉండే ఏకైక శాకాహారం పుట్టగొడుగులు మాత్రమే. వీటిల్లోని ఐరన్ ఆహారంగా తీసుకున్న వారికి ఇట్టే వంటపడుతుంది. పొటాషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి టైప్ –2 మధుమేహ రోగులు సైతం నిశ్చింతగా తినవచ్చు. సోడియం అతి తక్కువగా, పొటాషియం ఎక్కువగా కలిగి ఉండి కొలెస్ట్రాల్ అసలు లేని కారణంగా పుట్టగొడుగులు హృద్రోగులకు అద్భుత ఆహారం. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపకరిస్తాయి. పుట్టగొడుగులు శాకాహారులకు అద్భుతపోషకాల వనరు మాత్రమే కాదు, మాంసాహారం వాడకాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి రుచికరమైన సాధనాలుగా కూడా ఉపయోగపడతాయని ఐ.ఐ.హెచ్.ఆర్.లోని మష్రూమ్ లాబ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. మీరా పాండే తెలిపారు. ఇన్ని ప్రత్యేకతలున్నప్పటికీ పుట్టగొడుగులు ఇప్పటికీ భారతీయ ప్రజల రోజువారీ ఆహారంలో భాగం కాలేకపోతున్నాయి. అందుకోసమే ఇంటింటా పుట్టగొడుగులు పెంచుకునే సులభమార్గాన్ని తాము రూపొందించినట్లు డా. మీరా పాండే ‘సాక్షి’తో అన్నారు. డా. మీరా పాండే – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఆకలి రాజ్యం అంతం ఎప్పుడు
సమస్య గుర్తింపు–నివారణపై దృష్టిపెట్టాలన్న ఐక్యరాజ్యసమితి 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆకలిని నిర్మూలించాలి. పోషకాహార లోపాన్ని నివారించాలి. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ది లక్ష్యాల్లో ఇవి అతి ముఖ్యమైనవి. అయితే వీటిని సాధించే దిశగా జరుగుతున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఐక్యరాజ్య సమితి వెలువరించిన 2018 ప్రపంచ ఆహార భద్రత – పోషణ స్థితిగతుల నివేదిక వివరిస్తోంది. ఆకలి బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారని, వాతావరణ మార్పులు ఆహార భద్రతను దెబ్బ తీస్తున్నాయని, తీవ్ర కరువులు, వరదలు వచ్చిన దేశాల్లో ఆకలితో ఆలమటించేవారి సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిందని ఈ నివేదిక బహిర్గతం చేసింది. ఆకలిని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు.. ప్రపంచంలో కొన్ని చోట్ల తలెత్తిన సంఘర్షణాత్మక, హింసాయుత వాతావరణం అడ్డంకిగా మారిన విషయాన్ని కూడా నివేదిక పేర్కొంది. శిశువులు, ఐదేళ్ల లోపు పిల్లలు, బడికి వెళ్లే పిల్లలు, కిశోర బాలికలు, స్త్రీలు మొదలైన దుర్బల తరగతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. ‘ఆక్స్‌ఫామ్’ఆహార – వాతావరణ విధాన విభాగాధినేత రాబిన్ విలంగ్బీ నివేదికాంశాలపై స్పందిస్తూ.. శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వాలు, రాజకీయవేత్తలు రెట్టింపు కృషి చేయాలని, వాతావరణ సంక్షోభాలు ఎదుర్కొంటున్న పేద దేశాలకు నిధులిచ్చి సాయపడాలని సూచించారు. పోషకాలలేమితో అధిక బరువు 2016 నాటికి ప్రతి ఎనిమిది మంది పెద్దవారిలో ఒకరికి (67.2 కోట్ల మందికి పైగా) స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఆఫ్రికా, ఆసియాల్లో స్థూలకాయులు పెరుగుతున్నారు. భారత్‌లోని ఐదేళ్లలోపు పిల్లల్లో, 18 ఏళ్లు పైబడిన జనాభాలో అధిక బరువున్న వారి సంఖ్య పెరుగుతోంది. అధిక ధరల కారణంగా పోషకాహారం అందుబాటులో లేకపోవడం, తిండి లేకపోవడం తాలూకూ ఒత్తిళ్లు వంటి అంశాలు కూడా అధిక బరువు, స్థూలకాయానికి కారణమవుతున్నాయి. ఈ పరిస్థితులు స్త్రీలలో రక్తహీనతకు, బరువు తక్కువ పిల్లలు పుట్టడానికి, బడికి పోయే బాలికలు బరువు పెరిగేందుకు కారణమవుతున్నాయి. పెరిగిన ఎనీమియా బాధితులు గర్భిణుల్లో తగినంత రక్తం లేకపోతే.. వారికి పుట్టే పిల్లలకు కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. కానీ ఈ సమస్యను నివారించడంలో ఏ దేశం కూడా ప్రగతి సాధించలేదని వెల్లడైంది. ప్రతి ముగ్గురు గర్భిణుల్లో ఒకరు రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. 2012 (30.3%)తో పోల్చుకుంటే 2016 నాటికి (32.8శాతం) వీరి సంఖ్య పెరిగింది. ఉత్తర అమెరికాతో పోల్చుకుంటే ఆఫ్రికా, ఆసియాల్లో రక్తహీనత బారిన పడుతున్న స్త్రీలు ఇంచుమించు మూడింతలు ఎక్కువ. వాతావరణ విపత్తులు రెట్టింపు వాతావరణ మార్పులు వ్యవసాయంపై, ఆహార భద్రతపై చూపుతున్న ప్రభావాల్ని నివేదిక వివరించింది. ఆకలిని, పోషకాహారలేమిని తుద ముట్టించే దిశగా సాధిస్తున్న పురోగతిని ఈ మార్పులు సవాల్ చేస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. విపరీతమైన వేడి, వరదలు, తుపానులు, కరువులు సహా వివిధ వాతావరణ విపత్తులు 1990 నుంచి రెట్టింపు అయ్యాయి. 1990–2016 మధ్య సగటున ఏడాదికి 213 విపత్తులు విరుచుకుపడ్డాయి. ఆహార ఉత్పత్తిని దెబ్బ తీశాయి. మొత్తం నష్టంలో 80 శాతానికి కరువులే కారణం. 2005 నుంచి తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్న దేశాల్లో పోషకాహార లోపం పెరిగింది. పలు దిగువ, మధ్య ఆదాయ దేశాల్లో 1996– 2000తో పోలిస్తే.. 2011–2016 మధ్య ప్రకృతి వైపరీత్యాలు పెద్దమొత్తంలో పెరిగాయి. ఇవి దిగుబడులను, గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బ తీయడంతోపాటు ధరల పెరుగుదలకు, వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. దీర్ఘకరువులతో ప్రజలు వలస బాట పడుతున్నారు. పర్యావరణమూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణ విపత్తులను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు తగిన కార్యక్రమాలను, విధానాలను రూపొందించుకుని అమలు చేయాలని ఈ నివేదిక నొక్కి చెప్పింది. మూడంచెల విధానంతో.. ఐదేళ్ల లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపంతో సరైన ఎదుగుదల ఉండటంలేదు. 2017లో ఇలాంటి వారి సంఖ్య 15.1కోట్లు. 2012లో ఇది 16.5 కోట్లు. ప్రపంచ దేశాలు ఈ విషయంలో సాధించిన ప్రగతి చాలా స్వల్పమని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఎదుగుదల సరిగాలేని పిల్లల్లో అత్యధికులు ఆఫ్రికా (39%) ఆసియా (55%) పిల్లలే. ఇలాంటి పిల్లల్లో ఎత్తుకు తగిన బరువు పెరగని వారు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది ఉన్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. వీరిలో ఇంచుమించు సగానికి సగం మంది దక్షిణాసియాకు చెందినవారే. 25% మంది సబ్–సహరన్ ఆఫ్రికా పిల్లలు. అనారోగ్యం, మరణం బారినపడే ప్రమాదం వీరికి ఎక్కువని నివేదిక హెచ్చరించింది. ఇదే వయసు పిల్లల్లో 3.8కోట్ల మందికి పైగా అధిక బరువుతో వున్నారు. పోషకాహారం అందుబాటులో లేకపోవడం వల్లే.. బరువు తక్కువ పిల్లలు పుట్టేందుకు, వారిలో ఎదుగుదల సమస్యలకు కారణమవుతోందని.. తదనంతర జీవితంలో వీరు అధిక స్థూలకాయం బారిన పడే ప్రమాదముందని నివేదిక వివరించింది. ‘నివారించడం, సాధ్యమైనంత త్వరగా గుర్తించడం, చికిత్స అందించడం’అనే మూడంచెల విధానం ద్వారా పోషకాల లోపంతో తలెత్తుతున్న ఇలాంటి సమస్యల్ని పరిష్కరించాలని ఆ నివేదిక సూచించింది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
విద్యార్థులను పీడిస్తున్న మేథో బలహీనత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో పలువురిని మేథోబలహీనత వేధిస్తోంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, ఇతర సమస్యల కారణంగా పుట్టినప్పటి నుంచి సరైన పౌష్టికాహారం లేకపోవడం, జన్యుపరమైన లోపాల వల్ల వీరిని ఈ సమస్య వెంటాడుతోంది. ఇటీవల ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి విద్యార్థుల్లోని ‘డౌన్‌సిండ్రోమ్’ (మేథోబలహీనత, శారీరక అసాధారణ పరిస్థితి)పై పరిశీలన నిర్వహించారు. మొత్తంగా 4,719 మందిని పరిశీలించగా 1,040 మంది డౌన్‌సిండ్రోమ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. ఈ రుగ్మతల వల్ల వారి విద్యాభ్యాసంపై తీవ్ర ప్రభావం పడుతోందని గుర్తించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా చదువుతున్న ప్రభుత్వం పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఆశించిన మేర పౌష్టికత ఉండడం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ పథకం అమలవుతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తున్నాయి. దీనికింద హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హోమ్‌సైన్సు కాలేజీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ సూచనల మేరకు స్థానిక వనరులతో పౌష్టికాహార మెనూను నిర్దేశించారు. అన్నం, పప్పు, కూరగాయలు, సాంబారు, పులిహోరతో పాటు వారానికి అయిదు గుడ్లు, అరటిపండ్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత మార్గదర్శకాలు విడుదల చేస్తున్నా ఆ మేరకు పథకం అమలు కావడం లేదు. కోడిగుడ్లు, ఆయిల్, పప్పుల సరఫరా టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా విద్యార్థులకు సరైన ప్రమాణాల్లో పౌష్టికాహారం అందడం లేదు. పైగా మురిగిపోయిన కోడిగుడ్లు, నాణ్యతలేని కందిపప్పు, సమయం దాటిన ఆయిళ్లు పంపిణీ చేస్తుండడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే పేర్కొంటున్నారు. అటు నిరుపేద కుటుంబాల పిల్లలకు ఇంటివద్ద పౌష్టికాహారం లేకపోగా ఇటు పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం ద్వారా కూడా అందడం లేదు. ఫలితంగా విద్యార్థుల్లో మేథోపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. క్రోమోజోమ్‌ల లోపంతోనే ఈ సమస్య పుట్టుకతో ఏర్పడిన కొన్ని సమస్యల వల్ల విద్యార్థులు మేథోబలహీనతతో పాటు ఇతర శారీరక రుగ్మతలకు గురవుతున్నారు. పిల్లల పుట్టుకకు 23 జతల క్రోమోజోమ్‌లు కారణభూతంగా ఉంటాయి. వీటిలో 21వ జత క్రోమోజోమ్‌లో అదనపు క్రోమోజోమ్ ఎక్కువగా జతవ్వడం వల్ల పుట్టిన పిల్లలు అసాధారణ శారీరక మార్పులకు గురవుతుంటారు. వీరిలో మెదడు పెరుగుదల ఆశించినంతగా ఉండదు. ఎముకలు గుల్లబారడం, పేగుల్లో సమస్యలు తలెత్తడం వంటివి ఎదురవుతుంటాయి. వీటివల్ల ఈ పిల్లలు చదువుల్లో వెనుకబడిపోతుంటారు. పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే తల్లికి సరైన పౌష్టికాహారం వంటివి అందించాల్సి ఉంటుంది. గర్భంలో పిల్లల ఎదుగుదల ఎలా ఉందో ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా తెలుసుకుంటూ తగిన జాగ్రత్తలు చేపట్టాలి. పిల్లలు పుట్టిన దగ్గర నుంచీ కూడా సరైన పౌష్టికాహారం అందించాలి. – డాక్టర్ జి.శ్రీనివాస్, చిన్నపిల్లల వైద్యనిపుణుడు, వైఎస్సార్ జిల్లా పౌష్టికత లోపం వల్లనే ఈ సమస్యలు పౌష్టికత లోపం వల్లనే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు, ప్రసవం తరువాత తల్లికి సరైన పౌష్టికాహారం అందేలా తొలినుంచి చర్యలు తీసుకోవాలి. పేద కుటుంబాల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవ్వడం వల్లనే ఈ సమస్య ఎక్కువవుతోంది. పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా కూడా సరైన ఆహారం అందడం లేదు. ఐసీడీఎస్ పథకం పూర్తిగా నీరుగారిపోయింది. ఇక పాఠశాలల్లో చేరాక పిల్లలకు మధ్యాహ్న భోజనం ద్వారా పౌష్ఠికాహారం అందించాల్సి ఉన్నా అది కాస్తా అక్రమాలమయంగా మారింది. పిల్లలకు గుడ్లు, అరటి పండ్లు అందడం లేదు. ఆహార పదార్థాల సరఫరాకు రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలుస్తూ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. 60 శాతానికి పైగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. – విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ -
బాలికలే కొంత మేలు!
సాక్షి, హైదరాబాద్: బాలికల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపే పౌష్టిక లోపం విషయంలో పరిస్థితి మెరుగుపడుతోంది. ఆరేళ్ల లోపు బాలికల్లో పౌష్టికాహార లోపం ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అంగన్ వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్య స్థితిపై మహిళా భివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చేపట్టిన పరిశీలనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్న వారిలో బాలికలే అధికం కాగా.. అనారోగ్యం బారిన పడుతున్న వారిలో బాలురు అధికంగా ఉంటున్నారు. పౌష్టికాహార లోపంతోనే ఈ పరిస్థితి అని అధికారుల పరిశీలనలు చెబుతున్నాయి. ఆరోగ్యవంతులు 47.72 శాతమే! రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో 23,71,398 మంది చిన్నారులు నమోదయ్యారు. వీరిలో బాలురు 12,22,902 మంది కాగా బాలికలు 11,48,496 మంది ఉన్నారు. గత నెలలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, వయసు, బరువు తదితర అంశాలపై అధికారులు పరిశీలన చేశారు. 13.96 లక్షల మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించి ఫలితాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇందులో కేవలం 47.72 శాతం పిల్లలే ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. 17.79 శాతం పిల్లల ఆరోగ్య స్థితి మధ్యస్థంగా ఉండగా.. 12.87 శాతం పిల్లల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వీరంతా ఎత్తుకు తగినట్టు బరువు లేరు. అంతేకాకుండా వయసుకు తగిన విధంగా ఎత్తు పెరగలేదు. మిగతా 21.61 శాతం పిల్లలు వయసుకు తగిన ఎత్తు, బరువు లేకపోగా.. దీర్ఘకాల జలుబు, జ్వరం, శారీరకంగా బలహీనంగా ఉంటూ తీవ్ర అనారోగ్యకరంగా ఉంటున్నట్లు వెల్లడైంది. బాలికారోగ్యం మెరుగే.. శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన పరిశీలనలో బాలికల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. బాలికలు ఆరోగ్యపు అలవాట్లు పాటించడం, పోషకాల స్వీకరణలో స్వీయ శ్రద్ధ చూపడంతోనే వారి ఆరోగ్య స్థితి సంతృప్తికరంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బాలురలో పోషకాలు ఇవ్వడంలో ఒత్తిడి కనిపిస్తోందని, ఇది వారి పౌష్టికత్వంపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. దీంతో నాలు గింట మూడు కేటగిరీల్లో వెనుకబడి ఉన్నట్లు విశ్లేషిస్తు న్నారు. సాధారణ కేటగిరీలో బాలికలు 2.68 శాతం మెరుగ్గా ఉన్నారు. ప్రమాదకరంగా ఉన్న వారిలో బాలుర కంటే 0.82 శాతం తక్కువగా, తీవ్ర ఆందోళనకరంగా ఉన్న కేటగిరీలో బాలికలు 3.57 శాతం తక్కువగా ఉన్నారు. పరిశీలించిన చిన్నారులు :13,96,948 బాలురు: 7,17,599 బాలికలు: 6,79,349 -
అమ్మకు బలమేదీ..?
⇒ రక్తహీనత, పోషక లోపాలతో మహిళలు సతమతం ⇒ 62 శాతం మంది గర్భిణిల్లో రక్తహీనత ⇒ మసకబారుతున్న ఆరోగ్యలక్ష్మి, బాలామృతం పథకాల అమలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘అమ్మ’ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది. రక్తహీనత, పోషక లోపాలతో సతమతమవుతోంది. మహిళల్లో గర్భిణి సమయం నుంచే మొదలవుతున్న సమస్యలు క్రమంగా పెరగడం భయాందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో సగటున 100 మంది గర్భిణిల్లో 62 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిశీలనలో తేలింది. 15 నుంచి 49 ఏళ్ల వయసున్న ప్రతి ముగ్గురిలో ఒకరు పోషక లోపంతో బాధపడుతున్నట్లు స్పష్టమైంది. ఈ సమస్యల్ని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యలక్ష్మి పథకం అమలు తీరు అధ్వానంగా మారింది. గత జనవరిలో ఈ పథకం కింద పోషకాహార పంపిణీపై ఆ శాఖ అధ్యయనం చేయగా ఆందోళనకర వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ పథకం కింద నమోదైన వారి సంఖ్యకు, లబ్ధిపొందిన వారి సంఖ్యకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. సగటున 25% మంది పథకాన్ని వినియోగించుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. 25 శాతానికి మించని హాజరు: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 3,04,773 మంది గర్భిణులు, 2,23,107 మంది బాలింతలు (పాలిచ్చే తల్లులు) ఉన్నారు. వీరికి ఆరోగ్యలక్ష్మి కింద రోజూ పాలు, కోడిగుడ్డుతోపాటు సం పూర్ణ పోషకాలున్న ఒకపూట భోజనాన్ని అంది స్తారు. రక్తహీనత తీవ్రతను బట్టి ఐఎఫ్ఏ (ఐరన్ ఫోలిక్ ఆసిడ్) మాత్రలు ఇస్తారు. రోజులో ఒకపూటైనా సంపూర్ణ పోషకాహారం తీసుకుంటే పోషక లోపాలు తగ్గుతాయనేది సర్కారు భావన. ఉద్దేశం మంచిదైనప్పటికీ.. క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరు అధ్వానంగా ఉంది. నమోదైన గర్భిణులు, బాలింతల్లో కేవలం 25 శాతానికి మించి హాజరు శాతం నమోదు కావడం లేదు. ఈ నెల 13 నాటి గణాంకాల ప్రకారం జనవరిలో గర్భిణి విభాగంలో పోషకాహారం తీసుకున్న వారి సంఖ్య 23.27% కాగా, బాలింతల విభాగంలో 28.48 శాతంగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. బాలామృతం కార్యక్రమమూ అంతే..! చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు తలపెట్టిన బాలామృతం కార్యక్రమం అమలు ఇదే తరహాలో ఉంది. శిశు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం గత జనవరిలో ఈ పథకం కింద మూడేళ్లలోపు చిన్నారులు 11,61,256 మందికి గాను 2,48,793 మంది మాత్రమే పౌష్టికాహారాన్ని తీసుకున్నారు. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారుల కేటగిరీలో 12,56,076 మందికి గాను 2,29,337 మంది మాత్రమే పోషకాహారాన్ని పొందారు. బాలామృతం, ఆరోగ్య లక్ష్మి పథకాల కింద నమోదైన వారిలో కేవలం 20.8% మాత్రమే లబ్ధిపొందుతున్నట్లు తెలుస్తోంది. -
బాల్యం బలహీనం!
చిన్నారుల్లో పౌష్టికాహారలోపం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో పావువంతు పిల్లలు బలహీనంగా ఉన్నారు. శిశు సంక్షేమ శాఖ గణాంకాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఆ శాఖ వెలువరించిన తాజా లెక్కల ప్రకారం.. జిల్లాలో 21.4 శాతం పిల్లలు జనన సమయంలోనే తక్కువ బరువుతో పుడుతున్నారు. ఈ కారణంగా తరచూ వారు అనారోగ్యాల బారిన పడుతున్నారు. పౌష్టికాహారం లోపించడం వారి నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా * మూడేళ్లలోపు చిన్నారుల్లో పౌష్టికాహారలోపం * సాధారణం కంటే తక్కువ బరువున్న పిల్లలు 21.4% * తరచూ అనారోగ్యాల బారిన పడుతున్న వైనం * ఆరోగ్యలక్ష్మి ఫలితాలు అంతంతమాత్రమే.. * శిశు సంక్షేమ శాఖ తాజా గణాంకాలు విడుదల సాక్షి, రంగారెడ్డి జిల్లా : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వివరాల ప్రకారం జిల్లాలో 2,36,424 మంది మూడేళ్లలోపు చిన్నారులున్నారు. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న ఈ చిన్నారుల్లో 1,82,711 మంది పిల్లలు మాత్రమే సాధారణ బరువు కలిగి ఉన్నారు. 50,696 మంది చిన్నారులు సాధారణ బరువు కంటే తక్కువగా ఉన్నట్లు ఆ శాఖ సర్వేలో తేలింది. గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఇలా తక్కువ బరువున్న పిల్లలు పుడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా మరో 2,017 మంది పిల్లలు అత్యంత తక్కువ బరువుతో జన్మించారు. మొత్తం చిన్నారుల్లో 1.2 శాతం పిల్లలు అతి తక్కువ బరువుతో ఉండడం ఆందోళన కలిగించే విషయమే. ఫలించని ఆరోగ్యలక్ష్మి గర్భిణులు, బాలింతల కోసం ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతిరోజు ఉడికించిన గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు, ఆకుకూరలు, పప్పుతో కూడిన ఒక పూట భోజనం, ఐరన్ మాత్రలు అందిస్తారు. పుట్టే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కింద 37,658 మంది గర్భిణులకు పౌషికాహారాన్ని అందిస్తున్నట్లు ఐసీడీఎస్ గణాంకాలు చెబుతున్నాయి. పిల్లల ఆరోగ్య పరిస్థితిని చూస్తుంటే ఈ పథకం ఫలితాలు ఆశించినట్లుగా కనిపించడం లేదు. పావువంతు పిల్లలు తక్కువ బరువుతో అనారోగ్యం పాలవుతుండడంతో యంత్రాంగం ఆందోళన చెందుతోంది.