అమ్మకు బలమేదీ..?
⇒ రక్తహీనత, పోషక లోపాలతో మహిళలు సతమతం
⇒ 62 శాతం మంది గర్భిణిల్లో రక్తహీనత
⇒ మసకబారుతున్న ఆరోగ్యలక్ష్మి, బాలామృతం పథకాల అమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘అమ్మ’ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది. రక్తహీనత, పోషక లోపాలతో సతమతమవుతోంది. మహిళల్లో గర్భిణి సమయం నుంచే మొదలవుతున్న సమస్యలు క్రమంగా పెరగడం భయాందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో సగటున 100 మంది గర్భిణిల్లో 62 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిశీలనలో తేలింది. 15 నుంచి 49 ఏళ్ల వయసున్న ప్రతి ముగ్గురిలో ఒకరు పోషక లోపంతో బాధపడుతున్నట్లు స్పష్టమైంది. ఈ సమస్యల్ని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యలక్ష్మి పథకం అమలు తీరు అధ్వానంగా మారింది. గత జనవరిలో ఈ పథకం కింద పోషకాహార పంపిణీపై ఆ శాఖ అధ్యయనం చేయగా ఆందోళనకర వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ పథకం కింద నమోదైన వారి సంఖ్యకు, లబ్ధిపొందిన వారి సంఖ్యకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. సగటున 25% మంది పథకాన్ని వినియోగించుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది.
25 శాతానికి మించని హాజరు: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 3,04,773 మంది గర్భిణులు, 2,23,107 మంది బాలింతలు (పాలిచ్చే తల్లులు) ఉన్నారు. వీరికి ఆరోగ్యలక్ష్మి కింద రోజూ పాలు, కోడిగుడ్డుతోపాటు సం పూర్ణ పోషకాలున్న ఒకపూట భోజనాన్ని అంది స్తారు. రక్తహీనత తీవ్రతను బట్టి ఐఎఫ్‌ఏ (ఐరన్ ఫోలిక్ ఆసిడ్) మాత్రలు ఇస్తారు. రోజులో ఒకపూటైనా సంపూర్ణ పోషకాహారం తీసుకుంటే పోషక లోపాలు తగ్గుతాయనేది సర్కారు భావన. ఉద్దేశం మంచిదైనప్పటికీ.. క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరు అధ్వానంగా ఉంది. నమోదైన గర్భిణులు, బాలింతల్లో కేవలం 25 శాతానికి మించి హాజరు శాతం నమోదు కావడం లేదు. ఈ నెల 13 నాటి గణాంకాల ప్రకారం జనవరిలో గర్భిణి విభాగంలో పోషకాహారం తీసుకున్న వారి సంఖ్య 23.27% కాగా, బాలింతల విభాగంలో 28.48 శాతంగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది.
బాలామృతం కార్యక్రమమూ అంతే..!
చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు తలపెట్టిన బాలామృతం కార్యక్రమం అమలు ఇదే తరహాలో ఉంది. శిశు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం గత జనవరిలో ఈ పథకం కింద మూడేళ్లలోపు చిన్నారులు 11,61,256 మందికి గాను 2,48,793 మంది మాత్రమే పౌష్టికాహారాన్ని తీసుకున్నారు. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారుల కేటగిరీలో 12,56,076 మందికి గాను 2,29,337 మంది మాత్రమే పోషకాహారాన్ని పొందారు. బాలామృతం, ఆరోగ్య లక్ష్మి పథకాల కింద నమోదైన వారిలో కేవలం 20.8% మాత్రమే లబ్ధిపొందుతున్నట్లు తెలుస్తోంది.