ముంబై: మహారాష్ట్రలోని పుణెలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణికి ఇంట్లోనే అబార్షన్ చేయడం వల్ల 24 ఏళ్ల మహిళ మృతిచెందింది. ఈ కేసులో ఆమె భర్త, మామలను పోలీసులు అరెస్ట్ చేయగా.. అత్తపై కూడా కేసు నమోదు చేశారు. ఇక అబార్షన్ చేసేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకొచి విచారిస్తున్నారు. నాలుగు నెలల పిండాన్ని కుటుంబీకులు పొలంలో పాతిపెట్టినట్లు తేలింది.
వివరాలు.. 2017లో యువతికి వివాహం జరిగింది. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు( ఒక బాలిక, బాలుడు) ఉన్నారు. ఇటీవల ఆమె మూడోసారి గర్భం దాల్చింది. అయితే కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. మహిళకు ఇంట్లోనే అబార్షన్ చేయాని ప్లాన్ చేశారు. ఇందుకు ఓ వైద్యుడిని కూడా పిలిపించారు.
నాలుగు నెలల గర్బిణీకి ఇంట్లోనే అబార్షన్ చేయించారు. పిండాన్ని కుటుంబీకులు పొలంలో పాతిపెట్టారు. అనంతరం అధిక రక్తస్రావం కారణంగా మహిళ పరిస్థితి విషమంగా మారింది. మరుసటి రోజు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మరణించింది.
మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి ఆమె భర్త, మామలను అరెస్ట్ చేశారు. పొలం నుంచి పిండాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అబార్షన్ చేసేందుకు పిలిచిన ఓ ప్రైవేట్ వైద్యుడిని కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఇందాపూర్ పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment