Child welfare department
-
స్త్రీ, శిశు సంక్షేమశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ఐదు నెలల ఉత్కంఠకు తెర! ఆ అమ్మను నేనే..
అనంతపురం సెంట్రల్/చిలమత్తూరు: ఐదు నెలల ఉత్కంఠకు తెరపడింది. అనాథ శిశువుగా శిశుగృహకు చేరుకున్న చిన్నారి ఎట్టకేలకు తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అసలేం జరిగిందంటే... సరిగ్గా ఐదునెలల క్రితం (జూన్ 7న) చిలమత్తూరులో ముళ్లపొదల మధ్యన నవజాత మగ శిశువు లభ్యమైంది. స్థానికులు గుర్తించి సమాచారం అందించడంతో అక్కడి పోలీసులు వెంటనే స్పందించారు. శిశువును వెంటనే కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అనంతపురంలోని శిశుగృహకు చేర్చారు. ఉత్కంఠకు తెర పెనుకొండ నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన దంపతులు బతుకు తెరువు కోసం చిలమత్తూరుకు చేరుకున్నారు. అప్పటికే ఆమె నిండు గర్భిణి. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెకు ప్రసవమైంది. ఆ సమయంలో ఆమె మతిస్థిమితం లేక నవజాత శిశువును వదిలేసి ఇంటికి చేరుకుంది. అదే రోజు సాయంత్రం విషయం తెలుసుకున్న భర్త వెంటనే చిలమత్తూరు పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే శిశువును శిశుగృహకు అప్పగించినట్లు పోలీసులు తెలపడంతో అనంతపురం చేరుకుని ఐసీడీఎస్ అధికారులను సంప్రదించాడు. అయితే తమ బిడ్డేననే ఆధారాలు చూపలేకపోవడంతో శిశువు అప్పగింతకు అధికారులు అంగీకరించలేదు. దీంతో తండ్రి జిల్లా న్యాయసేవాప్రాధికార సంస్థను ఆశ్రయించాడు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు శిశువుకు ఐసీడీఎస్ అధికారులు డీఎన్ఏ పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షకు సంబంధించిన నివేదిక గురువారం ఐసీడీఎస్ అధికారులకు అందింది. అందులో శిశువు తల్లిదండ్రులు వారేనని రుజువైంది. దీంతో తల్లిదండ్రులకు గురువారం సీడబ్ల్యూసీ చైర్పర్సన్ రామలక్ష్మి సమక్షంలో ఐసీడీఎస్ పీడీ బీఎన్ శ్రీదేవి అప్పగించారు. శిశుగృహ సిబ్బందికి అభినందన తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన తరుణంలో ముళ్లపొదల మధ్య నుంచి నేరుగా తమ చెంతకు చేరుకున్న శిశువును శిశుగృహ సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు. దాదాపు ఐదు నెలల పాటు బిడ్డ ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు తల్లిదండ్రులకు శిశువును అప్పగిస్తున్న తరుణంలో శిశుగృహ సిబ్బంది కాసింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వారిని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ రామలక్ష్మీ, సభ్యులు ఓబుళపతి, కామేశ్వరి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ కృష్ణమాచారి తదితరులు అభినందించారు. తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శిశుగృహ మేనేజర్ శ్రీలక్ష్మీ, ఐసీపీఎస్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు వెంకటేశ్వరి, చంద్రకళ, చిలమత్తూరు పోలీసులు పాల్గొన్నారు. (చదవండి: వరద గుప్పిట్లో అనంతపురం) -
మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష
-
ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించండి
సాక్షి, అమరావతి: హైకోర్టు ముందుకు ఓ ఆసక్తికరమైన కేసు విచారణకు వచ్చింది. ఇలాంటి కేసు హైకోర్టు ముందుకు రావడం ఇదే తొలిసారి. విజయవాడలో మూడో తరగతి చదువుతున్న చిన్నారిని తల్లి కొట్టింది.. దీనిపై ఇరుగుపొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో పోలీసులు ఆ చిన్నారిని శిశు సంక్షేమ అధికారుల సంరక్షణలో ఉంచారు.. దీంతో షాకైన తల్లిదండ్రులు తమ కుమార్తెను తమకు అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించారు. చివరకు హైకోర్టు ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించింది. సంచలనం సృష్టించిన ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన శ్రీనివాసరావు, సంధ్యారాణికి మూడో తరగతి చదువుతున్న కుమార్తె లీలా కృష్ణశ్రీ ఉంది. బట్టలు లేకుండా మేడపై తిరుగుతోందని ఆ చిన్నారిని తల్లి కొట్టింది. చిన్నారి ఏడుపులు విన్న ఇరుగుపొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చిన్నారిని శిశు సంక్షేమ శాఖ అధికారుల సంరక్షణలో ఉంచారు. దీంతో సంధ్యారాణి, శ్రీనివాసరావులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి ధర్మాసనం విచారణ జరిపింది. న్యాయమూర్తులు ఆ చిన్నారితోపాటు శిశు సంక్షేమ కమిటీ చైర్మన్‌తో విడివిడిగా మాట్లాడారు. తల్లిదండ్రులు తమ చిన్నారి కోసం పరితపించారు. కుమార్తె పట్ల తాను వ్యవహరించిన తీరుపై తల్లి సంధ్యారాణి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. చిన్నారి సైతం తల్లిదండ్రులతో వెళ్లేందుకు ఇష్టపడింది. ఇకపై చిన్నారిని ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇస్తూ ప్రమాణపూర్వక అఫిడవిట్ దాఖలు చేయాలని తల్లిదండ్రులను ధర్మాసనం ఆదేశించింది. దీంతో వారు అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో చిన్నారి లీలా కృష్ణశ్రీని వెంటనే తల్లిదండ్రులకు అప్పగించాలని శిశు సంక్షేమ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. కోర్టుకు చెప్పినట్లు ఆ చిన్నారి పేరు మీద రూ.50 వేలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, దాని కాపీని హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) ముందుంచాలని తల్లిదండ్రులకు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. ఏ వ్యక్తికైనా తల్లే ప్రథమ దైవం, గురువు.. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఈ కేసులో తల్లి సంధ్యారాణి చర్యలు చట్టపరంగా నేరంగా కనిపించొచ్చు. అయితే మన సంస్కృతి ప్రకారం ప్రతి వ్యక్తికీ తల్లే మొదటి దైవం, గురువు. ఏ తల్లీ తన బిడ్డను శిక్షించే సమయంలో హాని చేయాలన్న దురుద్దేశంతో వ్యవహరిస్తుందని మేం అనుకోవడం లేదు. ఈ కేసులో చిన్నారి పట్ల తల్లి ప్రవర్తన దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటామని తల్లిదండ్రులిద్దరూ హామీ ఇచ్చారు’ అని స్పష్టం చేసింది. కాగా చిన్నారులను ఉంచే శిశు సంరక్షణ కేంద్రాల్లో తగిన సదుపాయాలు ఉండేలా చూడాలని శిశు సంక్షేమ శాఖను ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రైవేటు అనాథ శరణాలయాలు, శిశు సంక్షేమ కేంద్రాలు, అందులోని సౌకర్యాల వివరాలను తమ ముందుంచాలని కోరింది. వాటన్నింటినీ పరిశీలించి శిశు సంక్షేమం నిమిత్తం తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది. -
చిక్కుల్లో కరాటే కల్యాణి, చిన్నారి దత్తతపై నోటీసులు
Karate Kalyani Summoned By Officials Over Child Adoption: సినీ నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రాంక్ పేరుతో ఆసభ్యకర వీడియోలు చేస్తున్నాడంటూ శ్రీకాంత్‌పై కరాటే కళ్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరిపై ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా కరాటే కల్యాణి కనిపించకుండ పోవడం కొసమెరుపు. ఆమె ఆజ్ఞాతంలోకి వెళ్లిందా?.. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అనేది తెలియల్సి ఉంది. చదవండి: సమంత ‘ఊ అంటావా..’ పాట సింగర్‌కు గోల్డ్ మెడల్! మరోవైపు కరాటే కల్యాణి ఓ చిన్నారి దత్తత వ్యవహరం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఆమెకు గతంలో నోటిసులు ఇచ్చినట్లు తాజాగా అధికారులు మీడియాకు వెల్లడించారు. అయితే ఆమె ఆ నోటీసులకు స్పందించలేదని, తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నేడు సోమవారం(మే 16) ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. రేపటి వరకు ఆమె ఈ నోటీసులపై స్పందించకపోతే తనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: కరాటే కల్యాణి మిస్సింగ్.. ఏమైపోయింది? ఎక్కడుంది? పిల్లలను దత్తత తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయని, దాని ప్రకారమే దత్తత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ చట్టానికి విరుద్ధంగా వెళితే మూడేళ్లు జైలు శిక్ష పడుతుందని అధికారులు తెలిపారు. కాగా కరాటే కల్యాణి అక్రమంగా పాపను దత్తత తీసుకుందని పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా రీసెంట్గా శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు ఆమెతోపాటు ఆ చిన్నారి కూడా ఉన్న విషయం తెలిసిందే. -
కరాటే కల్యాణి మిస్సింగ్.. ఏమైపోయింది? ఎక్కడుంది?
కరాటే కల్యాణి ఆచూకిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న(ఆదివారం)నుంచి కనపించకుండా పోయిన కరాటే కల్యాణి ఇంకా అఙ్ఞాతం వీడలేదు. ఆమె ఫోన్ కూడా ఇంకా స్విచ్ ఆఫ్‌లోనే ఉంది. దీంతో తన కూతురు ఏమైపోయిందో అని కరాటే కల్యాణి తల్లి విజయలక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. శ్రీకాంత్ రెడ్డి తన కూతుర్ని కిడ్నాప్ చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సాక్షి మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'కరాటే కల్యాణి ఫేమ్ చూసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెపై చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవం. పాప విషయం గురించి నాకేమీ తెలియదు. దత్తత తెచ్చుకుందని తెలుసు. కళ్యాణి మిస్సింగ్‌పై పోలీసులకు పిర్యాదు చేస్తాను తను ఎక్కడున్నా బయటికి రావాలని టీవీ ఛానెల్స్ ద్వారా కోరుతున్నాను' అని పేర్కొంది. కాగా ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను విక్రయిస్తుందని ఫిర్యాదులు రావడంతో ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పాపతో కలెక్టరేట్‌కి రమ్మని చెప్పారు. అయితే సోదాల సమయంలో కరాటే కల్యాణి ఇంట్లో లేదు. అంతేకాకుండా అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోనే ఉండిపోయింది. దీంతో ఆమె ఎక్కడ ఉందన్నదానిపై అధికారులు విచారిస్తున్నారు. -
అజ్ఞాతంలో కరాటే కల్యాణి
-
నటి కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు..
Child Welfare Officials Raid In Actress Karate Kalyani Home: నటి కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ కరాటే కల్యాణి శ్రీకాంత్‌రెడ్డి పరస్పర దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదం ముదిరి ఇరువురిపై కేసులు నమోదు అయ్యాయి. తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కంప్లైట్ చేస్తే ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని ఎస్ఆర్ నగర్ సీఐ సైదులుపై కల్యాణి ఫైర్ అయింది. తర్వాత మీడియాతో మాట్లాడిన కల్యాణి సీఐపై తీవ్రంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో ఒక చిన్నారిని గుర్తించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుతోనే అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు ఆమెతోపాటు ఆ చిన్నారి ఉన్న విషయం తెలిసిందే. చదవండి: కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4451453475.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Child Marriages: 43 పెళ్లిళ్లకు అడ్డుకట్ట
సాక్షి, యాదాద్రి: చట్టవిరుద్ధమని తెలిసినా తల్లిదండ్రులు తమ పిల్లలకు పసిప్రాయంలోనే పెళ్లి చేస్తున్నారు. మంచి సంబంధం వచ్చిందని, కట్నకానుకలు లేకుండా దొరికడాని, మేనరికం ఓ కారణమైతే నిరక్షరాస్యత, ఆర్థిక ఇబ్బందులు, ఆడపిల్లంటే అభద్రతాభావం, సెల్‌ఫోన్ చాటింగ్‌లు, టీనేజ్‌లో ప్రేమ మరో కారణంగా తెలుస్తోంది. అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా నిత్యం ఏదో ఒక మూలన బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో గడిచిన నాలుగేళ్లలో అధికారులు 100 బాల్యవివాహాలను అడ్డుకోగా అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 43 ఉన్నాయి. కరోనా వేళ కొన్నిచోట్ల గుట్టచప్పుడు కాకుండా బాల్యవివాహాలు జరిగిపోయినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇలా.. జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్, రాజాపేట, ఆలేరు, ఆత్మకూర్ (ఎం), భువనగిరి, సంస్థాన్ నారాయణపురం, మోత్కూరు, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. హైసూ్కల్ స్థాయిలోనే బాలికలకు పెళ్లి చేస్తున్నారు. లో కం తెలియని వయసులో పెళ్లి చేయడం ద్వారా భార్యభర్త మధ్య వివాదాలు తలెత్తి విడాకులకు దారి తీస్తు న్నాయి. దీంతో మైనార్టీ వయస్సులోనే పెళ్లి పెటా కులవుతున్నాయి. బాల్య వివాహాలను అరికట్టేందుకు పోలీ స్, రెవెన్యూ, ఐసీడీఎస్, విద్యాశాఖ, బాలల పరిరక్షణ విభాగం, టీషీం అధికారులు విశేష కృషి చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు మరింత పెంచాల్సి ఉంది. బాల్య వివాహాలకు కారణం బాల్య వివాహాలు జరుగడం వెనక పలుకారణాలు వెలుగు చూస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో కోవిడ్ మరణాల భయం, మంచి సంబంధాల నెపం, మేనరికం, లైంగికదాడులు, ప్రేమ వివాహాలు, మంచి సంబంధాలు పోతే దొరకవన్న ఆతృత, పేదరికం, నిరక్షరాస్యత కారణంగా చిన్నతనంలోనే తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. గతంలో గిరిజన తండాల్లో ఎక్కువగా బాల్యవివాహాలు జరగగా ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయి. అధికారుల అనుమతితో! కోవిడ్ సమయంలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వద్ద తీసుకుంటున్న అనుమతితోనే వివాహం చేస్తున్నారు. ఎవరైనా బాల్య వివాహం ఎలా చేస్తున్నారంటే అనుమతిపత్రం చూపుతున్నారు. శుభలేఖ ఆధా రంగా అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అయితే ఆధార్‌కార్డు, పాఠశాల బోనాఫైడ్ సర్టిఫికేట్ ఆధారం చూపితే చాల వివాహాలను అడ్డుకోవచ్చు. అయితే అన్ని అనుమతులతోనే వివాహాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. బాల్య వివాహాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన చైల్డ్ మారేజ్ ప్రొటక్షన్ కమిటీలు నామమాత్రంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో జరగుతున్న బాల్య వివాహాల గురించి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆయాలకు తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమాచారం చెబితే ఎక్కడ గొడవలు జరుగుతాయోనన్న భయం వారిలో వ్యక్తమవుతోంది. అందుబాటులో హెల్ప్‌లైన్ నంబర్లు బాల్య వివాహాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచింది. ఎలాంటి బిల్లు లేకుండా ఫోన్ చేస్తే అధికారులు వచ్చి బాల్యవివాహాన్ని అడ్డుకొని కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తారు. చైల్డ్‌లైన్ నంబర్ 1098, పోలీస్ 100, సఖి సెంటర్ 181కు ఫోన్ చేస్తే వెంటనే అధికారులు స్పందిస్తారు. వివాహం జరిపిన కుటుంబ పెద్దలు, పెళ్లి పెద్ద, పురోహితుడు, వివాహానికి హాజరైన బంధువులు, స్నేహితులు, వివాహానికి సహకరిస్తున్న వారందరిపై కేసులు నమోదు చేస్తారు. బాల్య వివాహాలు నేరం 10 తరగతి పూర్తికా గానే వివాహం చేస్తున్న ఘట నలు వెలుగు చూస్తున్నాయి. బాల్యవివాహాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే అక్కడికి వెళ్లి అడ్డుకుంటున్నాం. సఖి కేంద్రానికి రప్పించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. బాల్య వివాహాలు, అక్రమ దత్తతపై సమాచారం ఇవ్వాలని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను జూమ్ మీటింగ్ ద్వారా కోరాం. హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచాం. బాల్య వివాహాలు చేస్తే చర్యరీత్యా నేరం. - బండారు జయశ్రీ, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ సమాచారం ఇవ్వాలి ఎక్కడైనా బాల్యవివాహా లు చేస్తున్నా, అందుకు ప్రయత్నం జరుగుతున్నా వెంటనే సమాచారం ఇవ్వాలి. షీటీం, బాలల పరిరక్షణ విభాగం వెంటనే అక్కడికి చేరుకుంటుంది. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం చిన్నతనంలో పెళ్లి చేయడం నేరం. కోవిడ్ సమయంలో బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అధికారులను జూమ్ మీటింగ్ ద్వారా కోరాం. జిల్లాలో బాల్య వివాహాలపై నిరంతర నిఘా కొనసాగుతోంది. - పి.సైదులు, డీసీపీఓ -
పిల్లల బువ్వ కల్తీ.. హవ్వ!
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల్లో పౌష్టికాహార లోపాల్ని అరికట్టేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే ఆహార పదార్థాలు కల్తీమయ మవుతున్నాయి. ఇటీవల అధికార యంత్రాంగం అంతర్గత తనిఖీల్లో ఇది వెలుగుచూసింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరేళ్లలోపు చిన్నారులకు బా లామృతం, న్యూట్రిమిక్స్, స్నాక్ ఫుడ్ ఇస్తున్నారు. వీటిని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో తెలంగాణ ఫుడ్స్ విభాగం తయారు చేసి అంగన్వా డీలకు సరఫరా చేస్తుంది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 31,711 ప్రధాన అంగన్వాడీ, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 4,31,310 మంది గర్భిణులు, బాలింత లు, 10,42,675 మంది మూడేళ్లలోపు చిన్నారులు, 6,54,165 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముడిసరుకుల సరఫరా కాంట్రాక్టర్లదే.. ఈ ఆహార పదార్థాల తయారీకి ముడిసరుకును ప్రైవేటు వ్యక్తుల నుంచి తెలంగాణ ఫుడ్స్ కొనుగోలు చేస్తుంది. ఎస్‌ృ30 షుగర్, శనగపప్పు, మొక్కజొన్న, కారం, పసుపు, గోధుమలు తదితరాలను కాంట్రాక్టర్ల నుంచి తీసుకుని బాలామృతం, న్యూట్రిమిక్స్, స్నాక్ ఫుడ్‌ను తయారు చేసి అంగన్వాడీలకు సరఫరా చేస్తారు. అయితే ఈ సరుకులను ప్యాకేజీ రూపంలో పంపిణీ చేస్తుండగా.. చాలా వరకు కల్తీ ఉంటోందని తెలిసింది. కాగా, ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శాఖ పరమైన కార్యక్రమాల్లో భాగంగా తయారీ కేంద్రాన్ని, ఇతర హోమ్‌లను సందర్శించిన సందర్భంలో సరుకుల నాణ్యతలో లోపాలను గుర్తించారు. థర్డ్ పార్టీ ద్వారా విచారణ.. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫుడ్స్‌కు సరఫరా చేస్తు న్న సరుకుల నాణ్యతను పరిశీలించాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీనిపై థర్డ్ పార్టీ విచారణ చేయించాలని మంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోం ది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు సరఫరా చేసిన సరుకుల శాంపిల్స్‌ను ప్రైవేటు సంస్థకు ఇచ్చినట్లు సమాచారం. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గడువు దాటినా తెరుచుకోని టెండర్లు తెలంగాణ ఫుడ్స్ విభాగానికి ముడిసరుకుల పంపిణీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అక్టోబర్ 11న తెలంగాణ ఫుడ్స్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించిగా.. మళ్లీ ఈ కాంట్రాక్టర్లే టెండర్లు వేసినట్లు తెలిసింది. గత నెల 31తో టెండర్ల దాఖలు గడువు ముగిసింది. వాస్తవానికి ఈ నెల 1న టెండర్లు తెరవాల్సి ఉంది. కానీ సరుకుల నాణ్యతపై ఆందోళన కలగడంతో వాటిని తెరవొద్దని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. థర్డ్ పార్టీ నివేదిక వచ్చాక కాంట్రాక్టర్ల ఎంపిక చేపట్టాలని, కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలా? లేక క్రిమిన ల్ కేసులు నమోదు చేయాలా? అనే దానిపై నిర్ణ యం తీసుకుంటామని ఓ అధికారి చెప్పారు. -
శిశు సంక్షేమ శాఖ అధికారులకు పసికందు అప్పగింత
తూర్పుగోదావరి, తాడితోట(రాజమహేంద్రవరం): మూడు రోజుల పసికందును శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించిన సంఘటన ఇది. కూనవరం మండలం, కూటూరు పంచాయతీ పరిధిలోని పులుసుమామిడిగొంది గ్రామానికి చెందిన 20 ఏళ్ల కొండ్ల లక్ష్మిని ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడు. ఈనెల 17న కూనవరం పొలాల్లో ఉన్న పాకలో గర్భిణిగా ఉన్న లక్ష్మి తనకు తానుగా పురుడు పోసుకొని బిడ్డను పాకలో వదిలి వెళ్లిపోయింది. సమీపంలో పొలంలో పనులు చేసుకుంటున్న కూలీలు గుర్తించి ఆ శిశువును కూటూరు ఆసుపత్రికి తరలించి వైద్యులకు అప్పగించారు. వైద్యులు ఆ పాపకు చికిత్స అందించారు. స్థానికులు పూరిపాక సమీపంలో మరో పాకలో శిశువుకు జన్మనిచ్చిన తల్లి లక్ష్మిని గుర్తించారు. తల్లి బిడ్డలను ఇప్పటి వరకూ అంగన్ వాడీ సంరక్షణలో ఉంచారు. తల్లి బిడ్డను పోషించుకునే స్థితిలో లేకపోవడంతో గురువారం బాలల సంక్షేమ సమితి, జిల్లా చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో స్త్రీ , శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. తల్లి లక్ష్మిని రాజమహేంద్రవరం రూరల్, బొమ్మూరు లో ఉన్న స్వధార హోమ్‌లో చేర్చారు. కార్యక్రమంలో సీడబ్ల్యూఎస్సీ చైర్పర్సన్ బి. పద్మావతి, కె.ఎల్.తాయారు, టి.పద్మజ, టి.ఆదిలక్ష్మి, చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ బి. శ్రీనివాసరావు, డీసీపీయూ కె.శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మశ్రీ, పోలీస్ కానిస్టేబుల్ సుష్మలత, ఏఎన్ఎం పి.లలిత పాల్గొన్నారు. -
‘ఆశ’ నిరాశేనా?
ఆశ వర్కర్ల పాత్ర రోజురోజుకూ విస్తరిస్తోంది.కేవలం ఆరోగ్యపరమైన అంశాలకే కాకుండా ఎన్నికలు,మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలు, జనాభా లెక్కల వంటి వాటిల్లోనూ వారిని ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నా, వారికి పని ఒత్తిడి తప్ప ఎలాంటి ఆర్థిక ప్రయోజనం దక్కడంలేదు. కేవలం బానిసల మాదిరిగా వారితో పనిచేయించుకుంటున్నారు. – ఇండిపెండెంట్ కమిషన్ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ‘ఆశ’వర్కర్లకు తీరని అన్యాయం జరుగుతున్నదని పలు జాతీయ సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మినహా వారికి కేవలం ప్రోత్సాహకాలే దక్కుతున్నాయని, నికరంగా నెలనెలా వేతనం మాత్రం దక్కడం లేదని చెబుతున్నాయి. నర్సింగ్ వంటి కోర్సుల్లో వారికి వెయిటేజీ ఇచ్చి ఆదుకోవాలని, తద్వారా వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ‘ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ ఇన్ ఇండియా’సిఫార్సు చేస్తూ రోడ్ మ్యాప్ టూ ఇండియాస్ హెల్త్ అనే నివేదికను ఇటీవల కేంద్రానికి అందజేసింది. కొన్ని ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు కూడా సకాలంలో ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 9.5 లక్షలు,రాష్ట్రంలో 28,000 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, పోలియో తదితర టీకాలు, బీపీ, షుగర్లాంటి వ్యాధుల గుర్తింపు, చెకప్‌లు వంటి కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసేది ఆశ వర్కర్లే. ఒకరకంగా చెప్పాలంటే గ్రామాల్లో ఆరోగ్య కార్యక్రమాలన్నీ కూడా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. గ్రామాల్లో ఆరోగ్య కార్యక్రమాలను జయప్రదం చేయాలన్న లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం 2006లో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద ‘ఆశ’వర్కర్ల వ్యవస్థను ప్రారంభించింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 9.5 లక్షల మంది ఆశ వర్కర్లు ఉన్నారు. తెలంగాణలో 28 వేల మంది పనిచేస్తున్నారు. ఆశ వర్కర్ల వ్యవస్థ రాగానే దేశంలో మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. అందుకోసం నిధులను కేంద్రం సమకూర్చింది. శిక్షణ, కిట్లు తదితర అవసరాలకోసం ఒక్కో ఆశ వర్కర్కోసం రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు ఖర్చు చేస్తున్నది. వేతనం లేని జీవితం ఎన్హెచ్ఎం నిర్దేశించిన కార్యక్ర మాలకే పరిమితం చేయకుండా ఆయా రాష్ట్రాలు తమ ప్రాధాన్య అంశాల అమలుకోసం ఆశ వర్కర్లను ఉపయోగించుకుంటున్నాయి. కానీ వారికి నిర్దేశిత వేతనాలు ఇవ్వ డానికి ముందుకు రావడంలేదు. అనేక రాష్ట్రాలు కేవలం వారికి ప్రోత్సాహకాలు మాత్రమే ఇస్తున్నాయి తప్ప కనీస వేతనాలు అమలు చేయడం లేదు. సిక్కిం, కేరళ, రాజస్తాన్, హరియాణా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. తెలంగాణలోనూ ఆశ వర్కర్లను కేవలం ప్రోత్సాహకానికే పరిమితం చేశారు. వేతనం ఇవ్వాలంటూ సమ్మె చేసినా వారి గోడు పట్టించుకోలేదు. అయితే సమ్మె ఫలితంగా ప్రోత్సాహకం నెలకు రూ.3,500 నుంచి రూ.6 వేల వరకు వస్తోందని తెలంగాణ ఆశ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు జయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. తాము రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇక కొన్ని రాష్ట్రాలు వారి చదువును బట్టి స్థాయిని పెంచేలా ఏర్పాట్లు చేశాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, త్రిపుర వంటి రాష్ట్రాలు నర్సింగ్ కోర్సుల్లో ఆశ వర్కర్లకు వెయిటేజీ ఇస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బీఎస్సీ నర్సింగ్‌లోనూ వెయిటేజీ కల్పించారు. ఢిల్లీలోనూ చదువులో వెయిటేజీ ఇస్తున్నారు. కేరళ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్లో ఆశ వర్కర్లకు మెడికల్, జీవిత బీమా వంటి సౌకర్యాలు ఇస్తున్నారు. అయితే మొత్తమ్మీద ఆశ వర్కర్లకు దేశవ్యాప్తంగా తగినంత వేతనం, గౌరవం దక్కడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
'పే' స్కూల్స్..!
సాక్షి, అమరావతి : ‘నలుగురిలో ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో పిల్లలకు చిన్నప్పుడే నేర్పాలి. ప్లే స్కూల్లో వెయ్యాలి. పిల్లల బుర్రలు ఐదేళ్లలోపు చురుగ్గా ఉంటాయి కాబట్టి ఆ టైంలో వాళ్లకు బాగా నేర్పిస్తే తర్వాత చదువుల్లో బాగా ఎదుగుతారు’.. అంటోంది లలితమ్మ. నాలుగిళ్లల్లో పనిచేస్తేనే ఆమె కుటుంబం గడుస్తుంది. ఆయినప్పటికీ అప్పుచేసి మరీ తన కొడుకును ప్లే స్కూల్లో చేర్పించింది. ‘నా కూతురి ప్లే స్కూలుకు చెల్లించిన ఫీజు నేను ఒకటవ తరగతి నుంచి పీజీ వరకు చెల్లించిన ఫీజుకు రెట్టింపుగా ఉంది. మారిన కాలానికి అనుగుణంగా నా బిడ్డ ఎదగాలనే కోరికతో అప్పుచేసి మరీ చేర్పించా’నంటున్నారు విజయవాడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి శ్రీరామ్. ..ప్లేస్కూళ్ల యజమానులు సాగించే ప్రచారం ఏ స్థాయిలో ఉందో.. కిందిస్థాయి వర్గాలను సైతం అది ఏ విధంగా ప్రభావితం చేస్తోందో గ్రహించడానికి ఇదో ఉదాహరణ. ప్రధానంగా పై తరహా ఆలోచన విధానమే ప్లే స్కూళ్ల మార్కెట్ ఏటా 32 శాతం వృద్ధితో దూసుకుపోయేందుకు కారణమవుతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్లల్లో పిల్లల బాగోగుల గురించి పట్టించుకునే వారే లేకపోవడం.. పిల్లల భవిష్యత్తు గురించి పెద్దలు భారీగా కలలు కనడం, పోటీ ప్రపంచంలో తమ పిల్లలు వెనుకబడిపోతారేమోనని భావిస్తుండటం వంటి అంశాలు.. ప్లే స్కూళ్ల విస్తరణకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు, ఆదాయాలు పెరగడం వంటివి కూడా ప్లే స్కూల్ మార్కెట్ పెరగడానికి దోహదం చేస్తున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. పిల్లలకు 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిస్తామంటూ కొన్ని కార్పొరేట్ సంస్థలు సాగిస్తున్న భారీ ప్రచారం కూడా పెద్దల్ని కొంతమేర ప్రభావితం చేస్తోంది. అయితే, పెద్దలు ఈ తరహా ప్రచారంలో కొట్టుకుపోరాదంటున్నారు హైదరాబాద్‌కు చెందిన చైల్డ్ సైకాలజిస్ట్ సి.వీరేందర్. ‘హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యాన్ని భవిష్యత్తు పేరుతో ఒత్తిడికి గురిచేయొద్దు. వాళ్లను కుటుంబంతో, తాతయ్య అమ్మమ్మలతో గడపనివ్వండి’ అని సలహా ఇస్తున్నారు. వేల నుంచి లక్షల్లో ఫీజులు.. నిన్నమొన్నటి వరకు కేవలం నగరాలకే పరిమితమైన ప్లే స్కూళ్ల సంస్కృతి ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించింది. ‘సాక్షి’ పరిశీలన ప్రకారం.. నగరాల్లో పేరున్న స్కూళ్లు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. విశాఖ, తిరుపతిలోని ప్లే స్కూళ్లలో లక్ష, లక్షన్నర రూపాయల ఫీజు కడితేనే సీటు. విజయవాడలో సీటు కావాలంటే పాతిక వేల నుంచి లక్ష వరకూ చెల్లించాల్సిందే. హైదరాబాద్ నగరంలోని టాప్ ప్లే స్కూళ్లు రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఫీజు కట్టించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు కలిగిన కంగారు, యూరో కిడ్స్, బచ్పన్, కిడ్జస్ వంటి సంస్థలు నగరాన్ని బట్టి ఫీజుల్ని నిర్దేశిస్తున్నాయి. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించిన అనంతరం.. విజయవాడలో ఏర్పాటుచేసిన ప్లే స్కూళ్లల్లో ఆశించిన రీతిలో పిల్లలు చేరలేదు. సచివాలయం వచ్చినప్పటికీ, చాలామంది ఉద్యోగులు తమ కుటుంబాల్ని ఇక్కడకు తీసుకురాకపోవడంతో అనుకున్న స్థాయిలో వ్యాపారం జరగడం లేదంటున్నారు విజయవాడలోని బచ్పన్ ఫ్రాంఛైజ్ నిర్వాహకులు కాళేశ్వరరావు. ఒంటరిగా ఉంచలేక.. ఐదేళ్లు వచ్చే వరకు మా అబ్బాయిని బడికి పంపకూడదనుకున్నాం. కానీ, ఇంతలో తిరుపతికి బదిలీ అయ్యింది. మూడు గదుల ఇంటిలో నేనూ, మా వారూ, బాబు మాత్రమే ఉంటున్నాం. అదే మా ఊళ్లో అయితే ఆడుకోవడానికి విశాలమైన స్థలం ఉంటుంది. ఇక్కడ బయటకు వెళ్లే అవకాశమే లేదు. అందుకే ఇష్టం లేకపోయినా ప్లే స్కూల్‌కు పంపుతున్నాను. – బి.వీణ, తిరుపతి పిల్లలతో కలసి ఉంటారని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరమూ ఉద్యోగానికి వెళ్తేనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకే ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. పిల్లాణ్ణి ఇంటి దగ్గరుంచితే వీడియో గేమ్స్, మొబైల్ ఫోన్ వదలడు. ఫిజికల్ గేమ్స్ ఆడేందుకు ఎవరూ అందుబాటులో లేరు. అందుకే ప్లే స్కూలుకి పంపుతున్నాం. అక్కడ ఉల్లాసంగా గడిచిపోతుంది. పైగా నాలెడ్జ్ కూడా అందుతుంది. – మాధురి, తల్లి, విశాఖపట్నం నిరుడు ఇద్దరే.. ఇప్పుడు 45 మంది ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్లే స్కూల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. అందుకు మా స్కూలే ఉదాహరణ. ఏడాది కిందట ఇద్దరు పిల్లలతో స్కూల్ ప్రారంభించాం. ఇప్పుడు పిల్లల సంఖ్య 45కి చేరింది. ప్లే స్కూల్లో పిల్లలపట్ల తగిన కేర్ తీసుకుంటాం. అవసరమయ్యే శిక్షణను అందిస్తాం. వీటి నిర్వహణ చాలా కష్టం. – మల్లిక, ప్రిన్సిపల్, లిటిల్ డాక్లింగ్ స్కూల్, విశాఖపట్నం కేంద్రం ఏం చెబుతోంది? కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ’ (ఈసీసీఈ–2013) ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్న పిల్లలకు విద్య, ఆటపాటలు నేర్పాలి. ప్రైవేటు సంస్థలు కూడా ఈ పాలసీ తాలూకు విధివిధానాలకు కట్టుబడి నడుచుకోవాలి. - ప్రతీ 20 మంది పిల్లలకు ఒక టీచరు, ఒక ఆయా తప్పనిసరిగా ఉండాలి. - ప్లేస్కూల్ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. - పిల్లలకు ఎటువంటి ప్రమాదాలు జరగడానికి వీల్లేకుండా పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాలి. - పిల్లలకు అనుకూలమైన బాత్రూంల ఏర్పాటు, సీసీటీవీ, అగ్నిమాపక రక్షణ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్ కలిగి ఉండాలి. - ప్రతీ మూడు నెలలకు ఒకసారి చిన్నారులకు వైద్య పరీక్షలు చేయించాలి. - ముఖ్యంగా రోజుకు 3–4 గంటలకు మించి ప్లే స్కూల్ నిర్వహించకూడదు. - చిన్న పిల్లలకు ఏం నేర్పించాలనే దానిపై కూడా కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ బోధన ప్రణాళిక రూపొందించింది. ప్రతీ ప్లే స్కూల్ నిర్వాహకులు దీన్ని విధిగా పాటించాల్సి వుంది. ఈ దిశగా.. శిశు సంక్షేమ శాఖ తనిఖీలు జరపాల్సిన అవసరముందనే అభిప్రాయం బలంగా వినబడుతోంది. -
కొడుకును ఆటోకేసి కొట్టిన తండ్రి
హైదరాబాద్: పరిచయమున్న ఓ మహిళ తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ వ్యక్తి ఉన్మాదిలాగా ప్రవర్తించాడు. తన మూడేళ్ల కుమారుడిని ఆటోకేసి కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. తమ కళ్ల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఆదివారంరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సుమోటోగా స్వీకరించి నిందితుడు శివగౌడ్‌ను అరెస్టు చేశారు. ఉప్పల్‌కు చెందిన శివగౌడ్‌కు అనూషతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. శివగౌడ్ తన కుటుంబంతో కలసి జగద్గిరిగుట్టలోని ఉమాదేవినగర్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉంటున్న మరో మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. దీంలో భార్యాపిల్లలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో శివగౌడ్ ఆదివారం అర్ధరాత్రి ఆ మహిళకు ఫోన్ చేసి ‘నీ కుమారుడిని చంపుతా’నంటూ బెదిరించాడు. భయాందోళనకు గురైన ఆ మహిళ అదే రాత్రి జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శివగౌడ్‌కు ఫోన్ చేయగా దురుసుగా మాట్లాడాడు. దీంతో పోలీసులు శివగౌడ్ ఇంటికి రాత్రి రెండు గంటల సమయంలో చేరుకున్నారు. పోలీసులతోపాటు సదరు మహిళ కూడా అక్కడకు వెళ్లింది. అప్పటికే అతడు మద్యం మత్తులో ఉన్నాడు. ఇంటికి పోలీసులను తీసుకుని వస్తావా అంటూ ఆ మహిళపై శివగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారిపై ఉన్మాదిలాగా ప్రవర్తించాడు. తన కుమారుడు రిత్విక్(3)ను బయటకు తీసు కొచ్చి అక్కడున్న ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటనతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన రిత్విక్‌ను నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఇంత జరిగినా శివగౌడ్ భార్య అనూష పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ కేసును పోలీసులు సుమోటోగా స్వీకరించి శివగౌడ్‌పై కేసు నమోదు చేశారు. చికిత్స అనంతరం బాలుడిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. -
ఏడ్రోజుల్లో ఎన్నారై వివాహ రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే ఎన్నారై వివాహాలన్నీ ఏడు రోజుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సిందేనని కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ వారం రోజుల్లో రిజిస్టర్ చేసుకోని పక్షంలో పాస్‌పోర్టులు, వీసాలు జారీ చేసే అవకాశం ఉండదని పేర్కొంది. గతవారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మనేకా గాంధీ ఎన్నారై వివాహాలు కచ్చితంగా రెండ్రోజుల్లోనే రిజిస్టర్ అవ్వాలని సూచించారు. అయితే.. ఇలాంటి వివాహాల్లో మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రుల బృందం (రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, మేనకా గాంధీ) సమావేశంలో దీన్ని ఏడురోజులకు పెంచాలని నిర్ణయించారు. ఎస్క్రో (వివాహం తర్వాత భార్యను తీసుకెళ్తానని మూడో వ్యక్తి సమక్షంలో పత్రము రాసుకుని ఆ తర్వాత అది చెల్లదని తప్పించుకోవడం) కేసుల్లో భార్యను వదిలేసి పారిపోయే ఎన్నారైల ఆస్తులను జప్తు చేసుకోవడంతోపాటు.. ఇలాంటి వివాహాల్లోని పలు సమస్యలను పరిష్కరించడంపైనా మంత్రివర్గ బృందం చర్చించింది. ఇందుకు నేర శిక్ష్మాస్మృతి నిబంధనలు, వివాహ చట్టం, పాస్‌పోర్ట్ చట్టాల్లో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. ప్రస్తుతం ఎన్నారై వివాహాల రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి సమయ పరిమితి లేదు. -
‘డబ్బు చెల్లించలేకపోతే.. పెళ్లి జరిపించండి’
హైదరాబాద్ : బాల్య వివాహాల నిరోధానికి ఎన్ని చట్టాలు చేసినా సమాజంలో మార్పు మాత్రం రావడం లేదు. రోజుకు ఎంతో మంది చిన్నారుల బాల్యం వివాహమనే బంధీఖానాలో చిక్కుకుంటూనే ఉంది. ఇటువంటి దురాచారాలు మారుమూల పల్లెల్లోనే కాదు.. హైద్రాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాలలోనూ జరుగుతున్నాయి. తల్లిదండ్రులు ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్న కారణంగా వివాహానికి సిద్ధమైందో 15 ఏళ్ల బాలిక. వివరాల్లోకి వెళితే.. ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాకు చెందిన ఊర్మిళ, శ్రీకాంత్ దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. అయితే బతుకుదెరువు కోసం శ్రీకాంత్ కుటుంబం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి కాటేదాన్ ఏరియాలో నివసిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే శ్రీకాంత్ కుటుంబానికి.. పొరుగున ఉన్న చెన్నయ్య గుప్త అనే వ్యక్తి ఇంటిని అద్దెకివ్వడంతో పాటు డబ్బు సాయం చేశారు. అయితే శ్రీకాంత్ కుటుంబం ఈ డబ్బును తిరిగి ఇవ్వలేకపోయింది. దీంతో చెన్నయ్య గుప్త.. దివ్యాంగుడైన తన 38 ఏళ్ల కుమారుడు రమేశ్ గుప్తాకు శ్రీకాంత్ పెద్ద కూతురు(15)ను ఇచ్చి వివాహం చేయాల్సిందిగా బలవంతపెట్టాడు. ఇందుకు అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించడంతో.. బుధవారం సాయంత్రం గుడిలో పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు గుడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలికను గర్ల్స్ హోంకి తరలించారు. ఆమె ఇష్టప్రకారమే.. బాలిక తల్లి ఊర్మిళ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు వచ్చిన నాటి నుంచి రమేశ్ కుటుంబం తమకు అన్ని విధాల సాయపడిందని తెలిపింది. ఆ కుటుంబానికి రుణపడి ఉన్నాం కాబట్టి రమేశ్‌కు తమ కూతురినిచ్చి వివాహం చేస్తామని మాట ఇచ్చామని పేర్కొంది. మా అమ్మాయి తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు.. ఆమె అంగీకారంతోనే పెళ్లి నిర్ణయించామని చెప్పింది. డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేసి.. దివ్యాంగుడైన తమ కుమారుడిని చూసుకోవడానికే చెన్నయ్య గుప్త ఈ పెళ్లి నిశ్చయించారని మైలర్‌దేవ్‌పల్లి ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. డబ్బు చెల్లించలేని పక్షంలో బాలికతో తమ కుమారుడి వివాహం జరిపించాలంటూ ఆమె తల్లిదండ్రులను ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు బాల్య వివాహ నిషేధ చట్టం కింద వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మహిళకు భరోసా... శిశువుకు రక్షణ
సాక్షి, హైదరాబాద్: గృహహింస... వేధింపులు... అత్యాచారాలు...రాష్ట్రంలో మహిళలపై నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతున్న దారుణాలివి. ఇలాంటి దాడులకు గురైన బాధితులకు అండగా నిలిచేందుకు సర్కారు సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లా కేంద్రంలో ‘సఖి’ (వన్–స్టాప్ సెంటర్) పేరిట ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల ద్వారా బాధితులకు అవసరమైన వైద్య, పోలీసు, న్యాయ సాయంతోపాటు కౌన్సెలింగ్, బస అందించనుంది. బాధితులు నేరుగా సఖి కేంద్రాలను ఆశ్రయిస్తే నిర్వాహకులే అన్ని విషయాలు చూసుకుంటారు. దాడికి గురైన మహిళ లేదా మైనర్లు, చిన్నారులకు తొలుత చికిత్స అందించడంతోపాటు వారికి షెల్టర్ కూడా ఇస్తారు. అంతేకాకుండా దాడికి కారకులైన వారిపై చర్యల కోసం అవసరమైన న్యాయ సహకారాన్ని సైతం అందించేలా చర్యలు తీసుకుంటారు. వీధిబాలలు, చిన్నారులపై జరిగే దాడులపైనా ఈ కేంద్రం స్పందిస్తుంది. వారికి ఆశ్రయం కల్పించి సంరక్షణ చర్యలు తీసుకుంటుంది. ప్రతి జిల్లాలో సఖి కేంద్రం... సఖి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి నిర్వహణ బాధ్యతంతా కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖదే. ఒక్కో కేంద్రానికి రూ.50 లక్షల వరకు కేంద్రం మంజూరు చేయనుంది. ఈ మొత్తంతో శాశ్వత భవనాలు నిర్మించి అక్కడ సేవలు అందించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోనూ సఖి కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రతిపాదనలు రూపొందించిన యంత్రాంగం... వాటిని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అయితే కేంద్రం పాత పది జిల్లాల ప్రకారం హైదరాబాద్‌ను మినహాయించి మిగిలిన తొమ్మిది జిల్లాల్లో ఈ కేంద్రాలను మంజూరు చేసింది. దీంతో ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో సఖి కేంద్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఈ కేంద్రాలను ప్రాథమికంగా తెరవగా అక్కడ మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో వాటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మరో 8 కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో యాదాద్రి, కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, సిద్దిపేట, మంచిర్యాల, జనగాం జిల్లాల్లోనూ సఖి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వచ్చే ఏడాది అన్ని జిల్లాలకూ సఖి కేంద్రాలు మంజూరయ్యే అవకాశం ఉందని సఖి ప్రాజెక్టు రాష్ట్ర మేనేజర్ బి.గిరిజ తెలిపారు. -
ఆధార్ నమోదు ఇక సులువు!
-
ఆధార్ నమోదు ఇక సులువు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆధార్ నమోదు మరింత సులభతరం కానుంది. ఇకపై ప్రధాన అంగన్వాడీ కేంద్రాలన్నీ ఆధార్ నమోదు సెంటర్లుగా మారనున్నాయి. ప్రస్తుతం మీసేవ కేంద్రాల ద్వారా ఆధార్ నమోదు చేస్తున్నప్పటికీ... గ్రామ స్థాయిలో ఈ కేంద్రాలు లేకపోవడంతో పల్లె ప్రజలంతా మండల కేంద్రాలు, సమీప టౌన్లకు వెళ్లి ఆధార్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తోంది. అలాగే చంటిపిల్లల ఆధార్ నమోదు తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారుతోంది. మరోపక్క ఆధార్ నమోదు కోసం రుసుము, రవాణా ఖర్చులు సామాన్యులకు భారంగా మారాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకే ఆధార్ నమోదు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ఆధార్ రిజిస్ట్రార్‌గా అధికారాలు ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో ఉన్న ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి ప్రాజెక్టు)లను ఆధార్ నమోదు ఏజెన్సీలుగా అభివృద్ధి చేయనుంది. ఈ ఏజెన్సీల పర్యవేక్షణలో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు ఆధార్ నమోదు బాధ్యతలు నిర్వహిస్తాయి. ప్రస్తుతం గ్రామానికి ఒకటి.. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. ఇందులో 99 ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, 25 ప్రాజెక్టులు పట్టణాల్లో, మరో 25 ప్రాజెక్టులు ఐటీడీఏ పరిధిలో ఉన్నాయి. వీటిæ పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గ్రామ విస్తీర్ణం, జనాభా సంఖ్యకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేశారు. మేజర్ పంచాయతీల్లో 8 నుంచి 10 కేంద్రాలుండగా... చిన్న గ్రామాల్లో ఒక్కో కేంద్రం చొప్పున కొనసాగుతున్నాయి. తాజాగా ఐసీడీఎస్ పరిధిలోని సీడీపీవో(శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి)కు ఆధార్ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 149 ఆధార్ ఏజెన్సీలు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఒక్కో ఏజెన్సీ పరిధిలో ఎంత సంఖ్యలో ఆపరేటర్లను ఏర్పాటు చేయాలనే అంశంపైన ఆ శాఖ సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతానికి ప్రతి గ్రామానికి ఒక కేంద్రం నిర్వహిస్తే సరిపోతుందని భావిస్తున్న ఆ శాఖ... ఆమేరకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రతి కేంద్రానికి ఒక ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్ ఇవ్వనున్నారు. పథకాల అమలులో పారదర్శకత.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఆధార్ కీలకంగా మారింది. వృద్ధులకు ఇచ్చే ఆసరా పింఛన్లు మొదలు శిశువుల కోసం అమలు చేస్తున్న బాలామృతం పథకానికి కూడా ఆధార్‌ను తప్పనిసరి చేసింది. శిశువుల పౌష్టికాహార పథకాల్లో ఆధార్ సంఖ్య తప్పనిసరిగా కావాల్సి ఉన్నప్పటికీ చిన్నపిల్లలకు కార్డుల జారీలో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా వాటికి మినహాయింపు ఇస్తోంది. తాజాగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోనే ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెడితే ఇలాంటి ఇబ్బందులుండవని అధికారులు భావిస్తున్నారు. దీంతో కేంద్రానికి వచ్చే పిల్లలకు వెనువెంటనే ఆధార్ నమోదు చేపట్టి కార్డులు జారీ చేస్తే పథకాల అమలు పారదర్శంగా ఉంటుందని చెబుతున్నారు. -
అంగన్వాడీలకు ‘ఆన్లైన్’లో సరుకులు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కొత్తగా సప్లై చైన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు చేరవేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ట్యాబ్‌లు, బార్‌కోడింగ్ విధానాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇదే నమూనాను జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. బార్కోడ్ ద్వారానే పంపిణీ.. రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 22.28 లక్షల మంది బాలింతలు, గర్భిణులు, శిశువులకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. పోషకాహార పంపిణీకి ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తుండగా... కొన్నిచోట్ల ఈ సరుకులు పక్కదారి పడుతుండడంతో లక్ష్యం గాడితప్పుతోంది. దీంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టేందుకు సర్కారు ఉపక్రమించింది. రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టు పరిధిలో ఒకటి చొప్పున 149 గోదాములున్నాయి. వీటి ద్వారా పప్పులు, వంటనూనె, మురుకులు, బాలామృతం ప్యాకెట్లను అంగన్వాడీ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారుల నుంచి జారీ అయ్యే ప్రొసీడింగ్ల ద్వారా కేంద్రాలకు సరుకులను సరఫరా చేస్తుండగా... ఇకనుంచి బార్కోడ్ పద్ధతిని అమలు చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రం స్థాయిలో అవసరమైన కోటా వివరాలను ఐసీడీఎస్ ప్రాజెక్టుకు ముందుగా చేరవేయాల్సి ఉంటుంది. అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు ఆయా కేంద్రాలకు అవసరమైన కోటా విడుదల చేస్తూ.. సరుకుల వారీగా బార్‌కోడ్‌ను ఆన్లైన్లో కేంద్రం నిర్వాహకులకు జారీ చేస్తారు. అలాగే సరుకులు పంపిణీ చేసే కాంట్రాక్టరు సదరు కోటాను అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్లినప్పుడు అంగన్వాడీ టీచర్ వేలిముద్రలు నమోదు చేస్తేనే కోటా పంపిణీకి సంబంధించిన ఫైలు తెరుచుకుంటుంది. అనంతరం బార్కోడ్ ద్వారా సరుకులను పొందాల్సి ఉంటుంది. వేలిముద్రల నమోదుకు కాంట్రాక్టరు వద్ద ట్యాబ్ ఉంటుంది. అదేవిధంగా బార్కోడ్ వివరాలు, సరుకుల పంపిణీ సమాచారం ట్యాబ్‌లో నిక్షిప్తం కావడంతో పంపిణీ చేసిన వెంటనే ఆ సమాచారం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలోని సెంట్రల్ సర్వర్‌కు చేరుతుంది. దీంతో కాంట్రాక్టరు రూటుమ్యాపు సైతం తెలుస్తుందని, సరుకులు దారితప్పే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో బార్కోడ్ విధానాన్ని మూడు నెలల క్రితం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ కార్యక్రమం అక్కడ సత్ఫలితాలిచ్చింది. దీంతో ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. -
శిశువులు, తల్లులకు ఆసరా!
సాక్షి, హైదరాబాద్: నవజాత శిశువులు, తల్లుల పౌష్టికాహార అవసరాల పర్యవేక్షణకు డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ తెలిపారు. గర్భస్థ మహిళలకు పోషకాహారం అందడం మొదలు నవజాత శిశువులకు సకాలంలో టీకాలు వేయడం.. వారిలోని విటమిన్, పోషకాల లోపాలు, వాటిని సరిచేసేందుకు తీసుకుంటున్న చర్యలు తదితరాలతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను జనవరి 1 నుంచి దేశంలో ని 315 జిల్లాల్లో అమల్లోకి తేనున్నట్లు పేర్కొన్నారు. ఈ సాఫ్ట్వేర్ సాయంతో ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం నుంచే గ్రామాల్లోని బిడ్డలు, తల్లుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించవచ్చన్నారు. జాతీయ పౌష్టికాహార సంస్థ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్‌కుమార్ మాట్లాడుతూ.. 2030 నాటికి అగ్రరాజ్యంగా ఎదగాలన్న దేశ ఆకాంక్షలకు నవజాత శిశువుల ఆరోగ్యం కీలకమని స్పష్టం చేశారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 38 శాతం మంది ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎదగలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి జాతీయ పౌష్టికాహార సంస్థ సహకారంతో కేంద్రం యత్నాలు చేస్తోందన్నారు. సగటు ఐక్యూ 82 పాయింట్లే.. పోషకాహార లోపం వల్ల భారతీయ బాలల సగటు మేధో శక్తి (ఐక్యూ) 82 పాయింట్ల స్థాయిలోనే ఉందని.. గర్భిణులు తొలి త్రైమాసికంలో తగినంత ఫోలిక్ యాసిడ్, ఐరన్లను తీసుకుంటే ఈ సమస్యను అధిగమించి సగటు మేధోశక్తిని 8–12 పాయింట్ల వరకూ పెంచవచ్చని చెప్పారు. -
బాలికలే కొంత మేలు!
సాక్షి, హైదరాబాద్: బాలికల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపే పౌష్టిక లోపం విషయంలో పరిస్థితి మెరుగుపడుతోంది. ఆరేళ్ల లోపు బాలికల్లో పౌష్టికాహార లోపం ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అంగన్ వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్య స్థితిపై మహిళా భివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చేపట్టిన పరిశీలనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్న వారిలో బాలికలే అధికం కాగా.. అనారోగ్యం బారిన పడుతున్న వారిలో బాలురు అధికంగా ఉంటున్నారు. పౌష్టికాహార లోపంతోనే ఈ పరిస్థితి అని అధికారుల పరిశీలనలు చెబుతున్నాయి. ఆరోగ్యవంతులు 47.72 శాతమే! రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో 23,71,398 మంది చిన్నారులు నమోదయ్యారు. వీరిలో బాలురు 12,22,902 మంది కాగా బాలికలు 11,48,496 మంది ఉన్నారు. గత నెలలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, వయసు, బరువు తదితర అంశాలపై అధికారులు పరిశీలన చేశారు. 13.96 లక్షల మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించి ఫలితాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇందులో కేవలం 47.72 శాతం పిల్లలే ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. 17.79 శాతం పిల్లల ఆరోగ్య స్థితి మధ్యస్థంగా ఉండగా.. 12.87 శాతం పిల్లల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వీరంతా ఎత్తుకు తగినట్టు బరువు లేరు. అంతేకాకుండా వయసుకు తగిన విధంగా ఎత్తు పెరగలేదు. మిగతా 21.61 శాతం పిల్లలు వయసుకు తగిన ఎత్తు, బరువు లేకపోగా.. దీర్ఘకాల జలుబు, జ్వరం, శారీరకంగా బలహీనంగా ఉంటూ తీవ్ర అనారోగ్యకరంగా ఉంటున్నట్లు వెల్లడైంది. బాలికారోగ్యం మెరుగే.. శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన పరిశీలనలో బాలికల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. బాలికలు ఆరోగ్యపు అలవాట్లు పాటించడం, పోషకాల స్వీకరణలో స్వీయ శ్రద్ధ చూపడంతోనే వారి ఆరోగ్య స్థితి సంతృప్తికరంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బాలురలో పోషకాలు ఇవ్వడంలో ఒత్తిడి కనిపిస్తోందని, ఇది వారి పౌష్టికత్వంపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. దీంతో నాలు గింట మూడు కేటగిరీల్లో వెనుకబడి ఉన్నట్లు విశ్లేషిస్తు న్నారు. సాధారణ కేటగిరీలో బాలికలు 2.68 శాతం మెరుగ్గా ఉన్నారు. ప్రమాదకరంగా ఉన్న వారిలో బాలుర కంటే 0.82 శాతం తక్కువగా, తీవ్ర ఆందోళనకరంగా ఉన్న కేటగిరీలో బాలికలు 3.57 శాతం తక్కువగా ఉన్నారు. పరిశీలించిన చిన్నారులు :13,96,948 బాలురు: 7,17,599 బాలికలు: 6,79,349 -
స్త్రీ పురుష సమానత్వం కోసం పోరాటం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: స్త్రీ, పురుష సమానత్వం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని స్త్రీ, శిశు సంక్షేమశాఖ విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇటీవల వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఒక అసెస్మెంట్ చేసింది. 2186 నాటికి స్త్రీ పురుష సమానత్వం వస్తుందని తేల్చింది. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. వీలైనంత తొందరలో సమానత్వం వచ్చేంతవరకు పోరాడాలి’ అని చెప్పారు. ఆల్ ఇండియా లెవెల్లో ఫైనాన్స్ మినిష్టర్ కూడా సరిగా పనిచేయలేరేమోగానీ ఇంట్లో ఫైనాన్స్ గురించి మహిళలు ఎంతో చక్కగా చూసుకుంటారని పేర్కొన్నారు. పబ్లిక్ రిలేషన్స్‌లో కూడా వారు మెరుగ్గా ఉంటారన్నారు. -
మా వేతనాలూ పెంచండి
మినీ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లకు వేతనాలు పెంచినట్లే తమకు కూడా పెంచాలని రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.10,500, హెల్పర్లకు రూ.8 వేలకు పెంచాలని కోరింది. రాష్ట్రంలో 4 వేల మంది మినీ అంగన్వాడీ వర్కర్లు టీచర్‌గా, హెల్పర్‌గా రెండు రకాల విధులు నిర్వహిస్తున్నారని, అయినా వారిని హెల్పర్లతో సమానంగా చూడడం వల్ల నష్టం జరుగుతోందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డైరెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ధర్నాలో సంఘం నేతలు పి.జయలక్ష్మి, ఆర్.వాణి, కవిత తదితరులు పాల్గొన్నారు. -
24 మంది ఉత్తమ మహిళలు
మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: విశిష్ట మహిళలకు విశేష గౌరవం దక్కనుంది. 13 రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన 24 మంది ఉత్తమ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేయనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఉత్తమ మహిళలకు రూ.లక్ష నగదు బహుమతి, అవార్డులు అందజేసి సత్కరించనుంది. అవార్డుకు ఎంపికైనవారికి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే సమాచారం అందజేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
త్యాగాలు వృథా కానివ్వం: మంద కృష్ణ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలు వృథా కానివ్వబోమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మాదిగ అమరవీరుల సంస్మ రణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఎమ్మార్పీఎస్ కార్యా లయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీ కరణకు చట్టబద్ధత కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, త్వరలో వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందనుందని అన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా కొనసాగించాలి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో వికలాంగుల సంక్షేమ శాఖను విలీనం చేయొద్దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ కోరారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. సీఎస్‌ను కలిసిన వారిలో వికలాంగుల సంఘం అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు తదితరులున్నారు. -
అమ్మకు బలమేదీ..?
⇒ రక్తహీనత, పోషక లోపాలతో మహిళలు సతమతం ⇒ 62 శాతం మంది గర్భిణిల్లో రక్తహీనత ⇒ మసకబారుతున్న ఆరోగ్యలక్ష్మి, బాలామృతం పథకాల అమలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘అమ్మ’ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది. రక్తహీనత, పోషక లోపాలతో సతమతమవుతోంది. మహిళల్లో గర్భిణి సమయం నుంచే మొదలవుతున్న సమస్యలు క్రమంగా పెరగడం భయాందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో సగటున 100 మంది గర్భిణిల్లో 62 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిశీలనలో తేలింది. 15 నుంచి 49 ఏళ్ల వయసున్న ప్రతి ముగ్గురిలో ఒకరు పోషక లోపంతో బాధపడుతున్నట్లు స్పష్టమైంది. ఈ సమస్యల్ని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్యలక్ష్మి పథకం అమలు తీరు అధ్వానంగా మారింది. గత జనవరిలో ఈ పథకం కింద పోషకాహార పంపిణీపై ఆ శాఖ అధ్యయనం చేయగా ఆందోళనకర వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ పథకం కింద నమోదైన వారి సంఖ్యకు, లబ్ధిపొందిన వారి సంఖ్యకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. సగటున 25% మంది పథకాన్ని వినియోగించుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. 25 శాతానికి మించని హాజరు: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 3,04,773 మంది గర్భిణులు, 2,23,107 మంది బాలింతలు (పాలిచ్చే తల్లులు) ఉన్నారు. వీరికి ఆరోగ్యలక్ష్మి కింద రోజూ పాలు, కోడిగుడ్డుతోపాటు సం పూర్ణ పోషకాలున్న ఒకపూట భోజనాన్ని అంది స్తారు. రక్తహీనత తీవ్రతను బట్టి ఐఎఫ్ఏ (ఐరన్ ఫోలిక్ ఆసిడ్) మాత్రలు ఇస్తారు. రోజులో ఒకపూటైనా సంపూర్ణ పోషకాహారం తీసుకుంటే పోషక లోపాలు తగ్గుతాయనేది సర్కారు భావన. ఉద్దేశం మంచిదైనప్పటికీ.. క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరు అధ్వానంగా ఉంది. నమోదైన గర్భిణులు, బాలింతల్లో కేవలం 25 శాతానికి మించి హాజరు శాతం నమోదు కావడం లేదు. ఈ నెల 13 నాటి గణాంకాల ప్రకారం జనవరిలో గర్భిణి విభాగంలో పోషకాహారం తీసుకున్న వారి సంఖ్య 23.27% కాగా, బాలింతల విభాగంలో 28.48 శాతంగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. బాలామృతం కార్యక్రమమూ అంతే..! చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు తలపెట్టిన బాలామృతం కార్యక్రమం అమలు ఇదే తరహాలో ఉంది. శిశు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం గత జనవరిలో ఈ పథకం కింద మూడేళ్లలోపు చిన్నారులు 11,61,256 మందికి గాను 2,48,793 మంది మాత్రమే పౌష్టికాహారాన్ని తీసుకున్నారు. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారుల కేటగిరీలో 12,56,076 మందికి గాను 2,29,337 మంది మాత్రమే పోషకాహారాన్ని పొందారు. బాలామృతం, ఆరోగ్య లక్ష్మి పథకాల కింద నమోదైన వారిలో కేవలం 20.8% మాత్రమే లబ్ధిపొందుతున్నట్లు తెలుస్తోంది. -
కేంద్ర నిధులు పూర్తిస్థాయిలో రాబడదాం
‘మహిళాభివృద్ధి’ సమీక్షలో తుమ్మల సాక్షి, హైదరాబాద్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రతీ పైసా రాబట్టేలా చర్యలు తీసుకో వాలని మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదే శించారు. నిధుల విడుదలలో జాప్యం జరిగితే ఢిల్లీ వెళ్లి అక్కడి అధికారులపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. శుక్రవారం తన చాంబర్లో మహిళాభి వృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, కమిషనర్ విజయేందిర తదిత రులతో ఆయన సమావేశం నిర్వ హించారు. కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా మహి ళాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని, ఈమేరకు కేంద్ర గణాంకాలను విశ్లేశించి ప్రణాళిక తయారు చేయాలని తుమ్మల సూచించారు. మహి ళా శక్తి కేంద్రాలు, తల్లుల పౌష్టికాహారం, క్రెచ్ పథకం, బేటీ బచావో’–బేటీ పడావో, మహిళల భద్రతకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందని, వీటిద్వారా రాష్ట్రానికి సుమారు రూ.వెయ్యి కోట్లు వచ్చే అవకాశముందని అన్నారు. -
‘బాల్యం’.. చిక్కి శల్యం
- పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహారలోపం - నెలకు సగటున ఈ సమస్య బారిన 12 వేల మంది చిన్నారులు - శిశు సంక్షేమ శాఖ తాజా అధ్యయనంలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: బాల్యం ప్రమాదంలో పడింది. రాష్ట్రంలో నెలకు సగటున 12 వేల మంది చిన్నారులు పౌష్టికాహారలోపంతో బాధ పడుతున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ తాజా పరిశీలనలో వెల్లడైంది. బిడ్డ జనన సమయంలో పౌష్టికత్వంలో లోపాలు, తదనంతర పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ఈ ప్రక్రియ శిశుమరణాలకు దారితీస్తోంది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సం క్షేమ శాఖ చిన్నారుల పౌష్టిక స్థితిపై ఇటీవల అధ్యయనం చేసింది. రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులు 19.48 లక్షల మంది ఉండగా, వీరిలో 15.05 లక్షల మంది సాధారణ బరు వు ఉన్నారు. 4.29 లక్షల మంది తక్కువ బరువుతో ఉన్నారు. 12,620 మంది పిల్లల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. గర్భిణీ సమయం నుంచే... మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి పౌష్టి కాహార స్వీకరణపై దృష్టి పెట్టాలి. కానీ గ్రా మీణ ప్రాంతంలో ఈ అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో పిల్లలపై ప్రభావం చూపుతోంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆరోగ్యలక్ష్మి, బాలామృతం లాంటి కార్యాక్రమాలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి ఫలితాలు రావడం లేదు. ఆర్నెళ్లు దాటిన చిన్నారులకు తల్లిపాలతో పాటు అదనపు పోషణ ఇవ్వాలి. ఉగ్గు, ఫ్యారెక్స్ తదితర పోషకాహారాన్ని మితంగా ఇవ్వాలి. కానీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పదినెలల వరకు తల్లిపాలతోనే సరిపెడు తున్నారు. కొన్నిచోట్ల ఆర్నెళ్ల తర్వాత తల్లి పాలు ఆపేసి గేదెపాలు ఇస్తున్నట్లు పరిశీలనలో తెలిసింది. ఈ ప్రక్రియ పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. పౌష్టిక లోపాలున్న చిన్నారుల సంఖ్య రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఎక్కువగా ఉంది. సెప్టెంబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,620 మంది చిన్నారుల్లో తీవ్ర పౌష్టిక సమస్య ఉన్నట్లు గుర్తించారు. అందులో రంగారెడ్డి జిల్లాలో 2,978 మంది, మెదక్ జిల్లాలో 2,922 మంది చిన్నారులున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఈ సంఖ్య 578గా నమోదు కావడం గమనార్హం. -
ప్రతి జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాలు
- పిల్లల్ని వేధిస్తే 1098కి ఫోన్ చేయాలి - మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ - సంచాలకులు విజయేందిర బోరుు సాక్షి, హైదరాబాద్: ‘బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత. వారి సంరక్షణకు ప్రతి జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా సంక్షేమాధికారి కన్వీనర్‌గా, సంబంధిత శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ఈ కేంద్రా లు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పిల్లల్ని వేధించినట్లు తెలిస్తే వెంటనే 1098కి ఫోన్ చేయం డి. ఈ కమిటీ చర్యలకు ఉపక్రమిస్తుంది’ అని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు విజయేందిర బోరుు పేర్కొన్నారు. రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ నెల 14న బాలల దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో రాష్ట్రస్థారుు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 8.30కి గన్‌పార్క్ నుంచి రవీంద్రభారతి వరకు చిన్నారులతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. పిల్లల హక్కులు, సంరక్షణ చట్టంపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. బాల సదనాల ను పెంచేందుకు ప్రభుత్వానికి నివేదించామన్నారు. పిల్లల దత్తతను ఆన్లైన్లో చేపడుతున్నామని, గతేడాది 215 మంది పిల్లల్ని దత్తతిచ్చామన్నారు. పట్టణాల్లో పిల్లల భిక్షా టనపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నెలాఖర్లో నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. శాఖ పరంగా వసతి పొందుతున్న బాల, బా లికలకు గురుకులాలు, కేజీబీవీల్లో చేర్పించనున్న ట్లు వివరించారు. సమావేశంలో ఆ శాఖ సంయుక్త సంచాలకులు లక్ష్మి, రాములు పాల్గొన్నారు. -
బాల్యం బలహీనం!
చిన్నారుల్లో పౌష్టికాహారలోపం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో పావువంతు పిల్లలు బలహీనంగా ఉన్నారు. శిశు సంక్షేమ శాఖ గణాంకాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఆ శాఖ వెలువరించిన తాజా లెక్కల ప్రకారం.. జిల్లాలో 21.4 శాతం పిల్లలు జనన సమయంలోనే తక్కువ బరువుతో పుడుతున్నారు. ఈ కారణంగా తరచూ వారు అనారోగ్యాల బారిన పడుతున్నారు. పౌష్టికాహారం లోపించడం వారి నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా * మూడేళ్లలోపు చిన్నారుల్లో పౌష్టికాహారలోపం * సాధారణం కంటే తక్కువ బరువున్న పిల్లలు 21.4% * తరచూ అనారోగ్యాల బారిన పడుతున్న వైనం * ఆరోగ్యలక్ష్మి ఫలితాలు అంతంతమాత్రమే.. * శిశు సంక్షేమ శాఖ తాజా గణాంకాలు విడుదల సాక్షి, రంగారెడ్డి జిల్లా : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వివరాల ప్రకారం జిల్లాలో 2,36,424 మంది మూడేళ్లలోపు చిన్నారులున్నారు. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న ఈ చిన్నారుల్లో 1,82,711 మంది పిల్లలు మాత్రమే సాధారణ బరువు కలిగి ఉన్నారు. 50,696 మంది చిన్నారులు సాధారణ బరువు కంటే తక్కువగా ఉన్నట్లు ఆ శాఖ సర్వేలో తేలింది. గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఇలా తక్కువ బరువున్న పిల్లలు పుడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా మరో 2,017 మంది పిల్లలు అత్యంత తక్కువ బరువుతో జన్మించారు. మొత్తం చిన్నారుల్లో 1.2 శాతం పిల్లలు అతి తక్కువ బరువుతో ఉండడం ఆందోళన కలిగించే విషయమే. ఫలించని ఆరోగ్యలక్ష్మి గర్భిణులు, బాలింతల కోసం ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతిరోజు ఉడికించిన గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు, ఆకుకూరలు, పప్పుతో కూడిన ఒక పూట భోజనం, ఐరన్ మాత్రలు అందిస్తారు. పుట్టే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కింద 37,658 మంది గర్భిణులకు పౌషికాహారాన్ని అందిస్తున్నట్లు ఐసీడీఎస్ గణాంకాలు చెబుతున్నాయి. పిల్లల ఆరోగ్య పరిస్థితిని చూస్తుంటే ఈ పథకం ఫలితాలు ఆశించినట్లుగా కనిపించడం లేదు. పావువంతు పిల్లలు తక్కువ బరువుతో అనారోగ్యం పాలవుతుండడంతో యంత్రాంగం ఆందోళన చెందుతోంది. -
‘ఐవీఎఫ్’ కేంద్రాలపై నిరంతర నిఘా
‘బేబీ ఫ్యాక్టరీ’ కథనంపై హైకోర్టుకు కలెక్టర్ నివేదిక సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నంలోని అన్ని సంతాన సాఫల్య కేంద్రాల(ఐవీఎఫ్)పై నిరంతరం నిఘా ఉంచామని ఆ జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ ఒక్క రికార్డును కూడా సక్రమంగా నిర్వహించడం లేదని, ఈ సెంటర్లో నిపుణులైన యంబ్రియోలాజిస్ట్ కూడా లేరని తెలిపారు. విశాఖపట్నంలో పసిపిల్లలపై ‘బేబీ ఫ్యాక్టరీ’ పేరుతో ‘సాక్షి’ గతేడాది డిసెంబర్ 31న సంచలన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనంపై న్యాయవాది పి.అరుణ్‌కుమార్ రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా మార్చి విచారణ చేపట్టింది. ఈ బేబీ ఫ్యాక్టరీలపై రహస్య విచారణకు ఆదేశించింది. విచారణ జరిపి రూపొందించిన నివేదికను కలెక్టర్ యువరాజ్ ఇటీవల కోర్టుకు సమర్పించారు. నోవోటెల్ హోటల్ సమీపంలో ఉన్న భాగ్యసాయి అపార్ట్మెంట్లో పసిపిల్లల విక్రయాలు జరుగుతున్నాయంటూ సాక్షి కథనం ప్రచురించిన తరువాత దీనిపై విచారణ జరపాలని వైద్య, శిశు సంక్షేమశాఖల అధికారులను ఆదేశించానన్నారు. విజయలక్ష్మి, మూర్తి దంపతులకు ఈ అపార్ట్మెంట్లోని 101 నంబర్ ఫ్లాట్ ఉందని, అదే అపార్టుమెంట్లో 403 ఫ్లాట్ కూడా అద్దెకు తీసుకుని ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చే వారికి అద్దెకు ఇచ్చే వారన్నారు. సమీపంలోని ఇండిపెండెంట్ ఇళ్లను, ఫ్లాట్లను అద్దెకు తీసుకుని ఐవీఎఫ్ చికిత్సకు వచ్చే వారికి అద్దెకి ఇచ్చే వారని విచారణలో తేలిందన్నారు. కలెక్టర్ నివేదికను పరిశీలించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. -
బంగారుతల్లిని కొనసాగించం
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకాన్ని ప్రభుత్వం ఇకపై కొనసాగించబోదని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. పురిట్లోనే ఆడపిల్లలను చంపుకొనే పరిస్థితుల నుంచి ఆయా కుటుంబాలను బయటపడేసే బంగారుతల్లి పథకాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత కోరారు. ఈ మేరకు తుమ్మల మాట్లాడుతూ.. తల్లి ఆరోగ్యంతో పాటు, పుట్టిన ఆడపిల్ల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. వివాహ వయస్సు వచ్చాక పేద కుటుంబాల్లోని ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థికసాయం అందిస్తున్నందున, బంగారు తల్లి వంటి నగదు బదిలీ పథకం అవస రం లేదన్నారు. కాగా, రాష్ట్రంలో మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్సీ యాదవరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి సమాధానం ఇచ్చారు. సూక్ష్మ సాగుకు సంబంధించి ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం బదులిస్తూ.. డ్రిప్ ఇరిగేషన్ కోసం దరఖాస్తు చేసిన రైతులందరికీ సబ్సిడీ అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు నాబార్డ్ నుంచి రూ.1,000 కోట్లు తీసుకుంటున్నామని, మరో రూ.300కోట్లు బడ్జెట్లో కేటాయించామన్నారు. -
పెళ్లి కోసం బాలికపై ఒత్తిడి
► కుటుంబసభ్యులు నిర్భందించారంటూ బాలల హక్కుల ► పరిరక్షణ కమిషన్‌కు మొర ► పోలీసుల సహకారంతోబాలికను విడిపించిన కమిషన్ ► సంరక్షణ కోసం శిశుసంక్షేమ శాఖకు అప్పగింత హైదరాబాద్: ‘‘పెళ్లి చేసుకోవాలంటూ మా తల్లిదండ్రులు, తాతలు, అన్న నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు... నాకు చదువు కోవాలని ఉంది... ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు... ప్లీజ్ నన్ను రక్షించండి’’ అంటూ ఓ మైనర్ బాలిక బాలల హక్కుల సంఘానికి మొరపెట్టుకుంది. బాలిక వినతికి స్పందించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పోలీసుల సహకారంతో మైనర్ బాలికను తల్లిదండ్రుల చెర విడిపించి ఆమెను బాలల సదన్‌కు తరలించారు. ఈ ఘటన బుధవారం హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు, పోలీసులు వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం ముగ్ధంపల్లికి చెందిన నువ్వుల రమేష్ కూతురు(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు సంబంధం చూశారు. బాలిక పెళ్లికి నిరాకరించడంతో తల్లిదండ్రులు, అన్న, తాతయ్యలు బాలికను మానసికంగా, శారీరకంగా హింసించసాగారు. దీంతో బాలిక గత నెల 20న అచ్యుతరావును కలసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నల్లగొండ ఎస్పీని కోరింది. దీంతో భువనగిరి పోలీసులు బాలిక కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం హయత్‌నగర్ మండలం బలిజగూడలో బంధువుల వివాహం ఉందని బాలికను మేనమామ డప్పు రమేష్ ఇంటికి తీసుకొచ్చారు. పోలీసుల అనుమతి లేకుండా బాలికను తీసుకొచ్చిన తల్లిదండ్రులు పెళ్లి జరిగి మూడు రోజులైనా తిరిగి ఇంటికి తీసుకుపోలేదు. దీంతో తనను ఇక్కడే నిర్బంధిస్తారని భావించిన బాలిక అచ్యుతరావుకు ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్ పంపించింది. దీంతో స్పందించిన ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో కలసి బలిజగూడలోని బాలిక ఇంటికి చేరుకున్న అచ్యుతరావు బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. బాలిక కోరిక మేరకు పోలీసులు ఆమెను శిశు సంక్షేమ శాఖ వారికి అప్పగించగా వారు బాలికను నింబోలి అడ్డాలోని బాల సదన్‌కు తరలించారు. తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను హింసిస్తే చర్యలు తప్పవు... మైనర్లపై మానసికంగా, శారీరకంగా హింసకు పాల్పడితే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులైనా సరే చర్యలు తప్పవని బాలల హక్కుల సంరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు హెచ్చరించారు. మైనర్లకు పెళ్లి చట్టవిరుద్ధమని దానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన అన్నారు. తల్లిదండ్రులపై కేసు నమోదు... బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తల్లి ఇందిర, తండ్రి రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బాలికను నిర్బంధించినట్లు విచారణలో తేలితే అందుకు కారణమైన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
‘బంగారు తల్లి’ ఎక్కడ!
ఇంతవరకూ లబ్ధిదారులకు బాండ్లు అందని వైనం ప్రభుత్వ శాఖల వద్ద అందుబాటులో లేని సమాచారం రాయవరం/అంబాజీపేట : పుట్టుక నుంచి పట్టా పుచ్చుకునే వర కూ అండగా ఉంటామం టూ ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకం దిశానిర్దేశం లేకుండా ఉంది. తెలుపు రేషన్‌కార్డు కలిగిన బడుగు, బలహీనవర్గాల కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డకు ఆసరాగా ఉండేం దుకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు బాండ్లు అందలేదు. పథకం ప్రవేశపెట్టిన తీరు ఈ పథకాన్ని 2013 మే ఒకటిన ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పుట్టిన చిన్నారులను గుర్తించేందుకు సర్వే చేపట్టి, వివరాలను ఆన్లైన్ చేశారు. బిడ్డకు తొలిదశలో రూ.2,500 ఇవ్వాలని నిర్దేశించారు. తొలి పుట్టిన రోజు మొదలు.. డిగ్రీ పూర్తి చేసే వరకు దశలవారీగా నగదును వారి ఖాతాలో జమచేస్తారు. డిగ్రీ చేతికి రాగానే ప్రభుత్వం లక్ష రూపాయలను జమ చేస్తుంది. పథకాన్ని ఆధార్‌కు అనుసంధానం చేశారు. తొలి కాన్పులో అమ్మాయి పుట్టి, రెండో కాన్పులో ఇద్దరు అమ్మాయిలు జన్మించినా పథకాన్ని వర్తింపజేయాలి. శాఖ మార్పుతో సందిగ్ధం ఐకేపీ ద్వారా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. గతేడాది ్రఏపిల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు పథకం బాధ్యతలు అప్పగిస్తూ జీఓ జారీ అయింది. దీంతో లబ్ధిదారులు దరఖాస్తులతో రెండు శాఖల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారుల వద్ద ఎలాంటి సమాచారం లేదు. తమకు సంబంధం లేదని ఐకేపీ అధికారులు అంటుండగా, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. అందని బాండ్లు జిల్లాలో ఈ పథకానికి సంబంధించి బాండ్లు ఇప్పటివరకు అందలేదు. రాయవరం మండలంలో 2013 మే నుంచి 2015 ఏప్రిల్ వరకు 469 మంది రిజిస్ట్రేషన్ చేయించారు. 24 మంది ధ్రువీకరణ పత్రాలను ఇవ్వలేకపోయారు. దీంతో 445 మందిలో కేవలం 33 మందికి మాత్రమే బాండ్లు వచ్చాయి. పి.గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ మొత్తం 1,800 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. దీనిపై ఏపీఎం రవిరాజాను వివరణ కోరగా, రాయవరం మండలంలో లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయాల్సి ఉందన్నారు. త్వరలో జమ కాగలవని పేర్కొన్నారు. -
భారమైన కన్నపేగు
ఆర్థిక పరిస్థితులే అడ్డు శిశువిహార్‌కు అప్పగింత టేక్మాల్: నవ మాసాలు మోసిన తల్లి.. ఎల్లకాలం ఆడపిల్లను మోసే పరిస్థితి లేక చేతులెత్తేసింది. పరిస్థితులకు తలొగ్గి చిన్నారి భవిష్యత్ కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. భారమైన హృదయంతో ఐదు నెలల పసికందును శిశువిహార్‌కు అప్పగించింది. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెల్పుగొండలో మంగళవారం చోటుచేసుకుంది. టేక్మాల్ మండలం వెల్పుగొండకు చెందిన తుపాకి మంజుల, రాంచందర్ దంపతులు. వీరిది నిరుపేద కుటుంబం. కొద్దిపాటి భూమిలో వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. మూడో సంతానం కోసం చూసిన మంజుల గత ఏడాది సెప్టెంబర్ 30న మెదక్ ఆస్పత్రిలో ఒకే కాన్పులో ముగ్గురికి (ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు) జన్మనిచ్చింది. మొత్తంగా ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలతో వీరి సంతానం ఐదుకు చేరింది. ఇంతమందిని పోషించడం ఆ కుటుంబానికి భారంగా మారింది. పుట్టిన నాటి నుంచే ఆడపిల్లను ఎవరికైనా విక్రయించాలా?, లేదా శిశు విహార్‌కు అప్పగించాలా? అనే ఆలోచన చేశారు. వీరికి ఐసీడీఎస్, శిశుసంక్షేమశాఖ అధికారులు పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ పోషణ భారమైంది. వీరి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న ఐసీడీఎస్ పరిధిలోని బాలల సంక్షేమశాఖ అధికారి విఠల్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్ కవిత మంగళవారం గ్రామానికి రాగా సర్పంచ్ గందం పౌలు ఆధ్వర్యంలో ఆ చిన్నారిని వారికి అప్పగించారు. కలచి వేసిన తల్లి రోదన తన శిశువును అధికారులకు అప్పగించిన తల్లి మంజుల రోదన అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించింది. నవమాసాలు మోసిన కూతురిని కళ్లముందే పెంచాలని భావించినా.. ఆర్థిక పరిస్థితులు అడ్డుగా నిలవడంతో శిశువిహార్‌కు అప్పగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కన్నపేగును చేతులారా దూరం చేసుకునే పరిస్థితి ఆ తల్లికి ఏర్పడిన తీరును చూసి అక్కడున్న వారిని కలచివేసింది. -
చెట్లపొదల్లో ఆడశిశువు
రాజానగరం మండలం కానవరం గ్రామసమీపంలోని చెట్లపొదల్లో మంగళవారం ఉదయం ఓ ఆడశిశువును గుర్తుతెలియని మహిళ వదిలేసి వెళ్లింది. శిశువు బొడ్డుతాడు కూడా కట్ చేయకుండా పడవేసినట్లు తెలిసింది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చూసి సమాచారాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తుల ఈ విషయాన్ని పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు తెలియజేయడంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పసికందును ఐసీడీఎస్ అధికారులు కాకినాడలోని శిశుసంక్షేమ కార్యాలయానికి తరలించారు. -
‘దత్తత’లో అమ్మాయిలే ఫస్ట్!
న్యూఢిల్లీ: పిల్లల దత్తత విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందున్నారు. అబ్బాయి కన్నా అమ్మాయిలను దత్తత తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం గత మూడేళ్లలో 7,439 మంది అమ్మాయిలను దత్తత తీసుకుంటే.. మగ పిల్లల్ని 5,167 మంది దత్తత తీసుకున్నారు. సంవత్సరాల వారీగా చూస్తే 2012-13లో 2,846 అమ్మాయిలను, 1,848 మంది అబ్బాయిలను దత్తత తీసుకున్నారు. 2013-14లో 2,293 మంది అమ్మాయిలు, 1,631 మంది అబ్బాయిలను, 2014-15లో 2,300 మంది అమ్మాయిలు, 1,688 మంది అబ్బాయిలను దత్తత తీసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘అమ్మాయిలను దత్తత తీసుకోవడం క్రమంగా పెరుగుతోంది. ఇది చాలా మంచి పరిణామం’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దత్తత ప్రక్రియలో తీసుకువచ్చిన మార్పులు, మార్గదర్శకాల నుంచి ప్రజలు, దత్తత ఏజెన్సీలు, అధికార వర్గాల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆయన వివరించారు. వికలాంగ పిల్లల్ని దత్తత తీసుకునేందుకు కాస్త వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి పిల్లల్ని 2012-13లో 170 మందిని, 2013-14లో 242 మంది, 2014-15లో 214 మందిని దత్తత తీసుకున్నారు. -
‘ఆపద బటన్’కు ఓకే
న్యూఢిల్లీ: అత్యవసర సమయాల్లో మహిళలను ఆదుకునేందుకు ఫోన్లలో ‘ఆపద బటన్’ సౌకర్యాన్ని కల్పించేందుకు మొబైల్ ఫోన్ కంపెనీలు అంగీకరించాయి. ఎమర్జెన్సీ అలర్ట్‌లను పంపగలిగే సౌకర్యముండే ఫోన్లు వచ్చే ఏడాది మార్చికల్లా అందుబాటులోకి రానున్నాయి. బటన్ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే టెలికమ్యూనికేషన్స్ శాఖ జారీచేయనుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మంగళవారం ప్రకటించారు. ఫోన్లలో కొత్త ఫీచర్ ద్వారా మహిళలకు అదనపు రక్షణ కల్పించగలమని ఆమె అన్నారు. ప్రస్తుతం ప్రజలు వినియోగిస్తున్న ఫోన్లలోనూ ఈ బటన్ ఏర్పాటుచేసుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 10,000 కేంద్రాలను నెలకొల్పాలని కంపెనీలతో భేటీ సందర్భంగా వారిని కోరినట్లు ఆమె తెలిపారు. మహిళల రక్షణ కోసం ‘నేషనల్ ఉమెన్ హెల్ప్‌లైన్’ నంబర్‌ను అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. పోలీసు, లీగల్, మెడికల్, కౌన్సెలింగ్ ఇలా అన్నిరకాలుగా మహిళలకు ఒకేచోట సాయం అందేందుకు ఈ నంబర్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. -
ప్లే స్కూళ్లపై నియంత్రణాధికారం ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్లే స్కూళ్లపై నియంత్రణాధికారం ఎవరిదన్న చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. వాటిని నియంత్రించాలన్న అంశాన్ని తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మలక్‌పేటలోని ఓ ప్రైవేటు ప్లే స్కూల్ లిఫ్టులో ఇరుక్కుని సైదా జైనాబ్ ఫాతిమా జాఫ్రీ అనే నాలుగేళ్ల చిన్నారి మృతిచెందడంతో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. ఇన్నాళ్లు ప్లే స్కూళ్లను విద్యాశాఖ కానీ, మహిళా, శిశు సంక్షేమ శాఖగానీ పట్టించుకోలేదు. ప్లే స్కూళ్లను ఎవరు నియంత్రించాలన్న విషయంలో ప్రభుత్వ శాఖలకే స్పష్టత లేకుండాపోయింది. ఐదేళ్ల వయసు నిండిన పిల్లలనే విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో చేర్చుకోవాలి. పైగా విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నది 1వ తరగతి నుంచి పదో తరగతి వరకే. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. కాబట్టి తమకు సంబంధం లేదని పట్టించుకోవడం లేదు. అటు మహిళా, శిశు సంక్షేమ శాఖ కూడా వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంగన్వాడీ కేంద్రాలను తప్ప.. ప్రైవేటు రంగంలోని క్రష్‌లు, ప్లే స్కూళ్లు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి వాటిపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ప్లే స్కూళ్లలో ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు విద్యా శాఖ అధికారులు స్పందించి ఆ తర్వాత వదిలేస్తున్నారు. వాస్తవానికి ప్రీప్రైమరీ విద్య గురించి విద్యా హక్కు చట్టంలోనూ ఉంది. అంతేకాదు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కొత్తగా తీసుకువచ్చిన ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రీపైమరీ ఉపాధ్యాయ విద్య కోర్సును ప్రవేశపెట్టింది. అయినా విద్యా శాఖ ఆ దిశగా దృష్టి సారించలేదు. పాఠశాల యాజమాన్యాల నుంచి విద్యా శాఖ అధికారులు అమ్యామ్యాలు పుచ్చుకుని కనీసం ఒకటో తరగతి నుంచి వర్తించే నిబంధనల మేరకైనా ప్రీప్రైమరీ సెక్షన్లను నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మలక్‌పేట స్కూల్లో జరిగిన ఘటనలో చిన్నారి మృత్యువాత పడటంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు. ప్లే స్కూళ్ల వ్యవహారాన్ని తేల్చాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో విద్యా శాఖ ప్లే స్కూళ్ల వ్యవహారంపై దృష్టి పెట్టింది. పాఠశాల విద్యా డెరైక్టర్ జి.కిషన్ విద్యా శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ప్లే స్కూళ్ల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ విషయంలో శిశు సంక్షేమ శాఖ అధికారులతోనూ సమావేశమై చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రెండు శాఖల సమన్వయంతో ప్లే స్కూళ్ల నియంత్రణను విద్యా శాఖ గానీ, శిశు సంక్షేమ శాఖ గానీ చేపట్టేలా విధానం తేవాలని విద్యా శాఖ భావిస్తోంది. దీనిపై త్వరలోనే శిశు సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి ప్లే స్కూళ్ల నియంత్రణకు ప్రతిపాదనలు పంపించేందుకు సిద్ధమవుతోంది. -
చిన్నారుల దత్తత ఇక సులభం
- ఆన్లైన్ ప్రక్రియకు ‘కారా’ శ్రీకారం - మార్గదర్శకాలను సరళీకరించిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: చిన్నారుల దత్తత స్వీకరణ ప్రక్రియ సులభతరంగా మారింది. గతంలోని మార్గదర్శకాల ప్రక్రియ ప్రకారం పిల్లల దత్తత కోసం స్త్రీ శిశుసంక్షేమశాఖకు దరఖాస్తు చేసుకునే దంపతులు తమ వంతు కోసం కనీసం 3-4 ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చే పరిస్థితి ఉం డగా కేంద్ర స్త్రీ శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ తాజాగా మార్గదర్శకాలను సరళీకరించింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ ప్రక్రియ ద్వా రా 4-5 నెలల్లోనే చిన్నారుల దత్తత పూర్తయ్యే వీలు కలుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,079 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉండగా శిశు సంక్షేమ సంస్థల్లో అందుబాటులో ఉన్న చిన్నారుల సంఖ్య 239 గానే ఉంది. ఇలా పలు రాష్ట్రా ల్లో చిన్నారుల దత్తత కోసం ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇతర రాష్ట్రాల నుంచి దత్తత సదుపాయం కల్పించేందుకు కేంద్రం ఆన్లైన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) ఇటీవల ఈ ప్రక్రియను ప్రారంభించింది. చిన్నారుల ఫొటోలను ఆన్లైన్లో వీక్షించి నచ్చిన వారిని ఎంచుకొని దత్తత స్వీకరించే వెసులుబాటు ఈ విధానంలో ఉంది. అప్లోడ్ చేయాల్సిన పత్రాలు.. హా పాన్ కార్డు నంబర్‌తోనే రిజిస్ట్రేషన్ హా కుటుంబ సభ్యుల తాజా ఫోటో హా నివాస ధ్రువీకరణ (ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లెసైన్స్, విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లులలో ఏదైనా ఒకటి) హా ఆదాయ ధ్రువీకరణ (వేతన సర్టిఫికేట్, ఐటీ రిటర్న్స్ లేదా ప్రభుత్వం ఇచ్చే ఆదాయ పత్రం) హా వివాహ ధ్రువీకరణ పత్రం లేదా విడాకుల జిరాక్సు హా దత్తత కోరుతున్న వారి పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు. దత్తత ప్రక్రియ ఇలా.. పిల్లలను దత్తత తీసుకోవాలనుకున్న వారు తమ పూర్తి వివరాలతో జ్ట్టిఞ://ఛ్చిట్చ.జీఛి.జీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫొటోలు, ఇతర వివరాల పత్రాలను అప్లోడ్ చే యాలి. రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోని చిన్నారులను దత్తత తీసుకునేందుకు కూడా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారుల దత్తత కోరుకునే వారు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సారా) అనుమతి పొందాల్సిన అవసరం లేదు. దంపతుల ఇద్దరి వయసు 90 ఏళ్ల లోపుంటేనే 0-4 ఏళ్లలోపు వయసున్న చిన్నారులను దత్తత తీసుకునేందుకు అర్హులు. మొత్తం వయసు వందేళ్లలోపుంటే 4-8 ఏళ్లలోపు, 110 ఏళ్లుంటే 8-18 ఏళ్లలోపు బాలలను దత్తత తీసుకోవచ్చు. ఒంటరి మహిళలు, పురుషులు దత్తత కోరుతున్నట్లైతే మూడు కేటగిరీల్లోనే సగటు వయసు(45, 50, 55)ను పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తుదారులు తమ పోలికలకు దగ్గరి పోలికలు ఉండే చిన్నారులను (ఆరుగురు చిన్నారుల లోపు), వారి ఆరోగ్య నివేదికలను ఆన్లైన్లోనే చూసుకోవచ్చు. నచ్చిన వారిని ఎంపిక చేసుకొని స్థానిక శిశు సంక్షేమ అధికారుల విచారణ అన ంతరం, న్యాయస్థానం ద్వారా దత్తత ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. -
అద్దె దరువు
నెలకు లక్షల రూపాయల అద్దె కనీస వసతులు మృగ్యం పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు శాశ్వత భవనాలు నిర్మించాలని వేడుకోలు రెండు నెలలుగా అద్దె చెల్లించని వైనం హన్మకొండ చౌరస్తా : జిల్లాలో చాలా వరకు అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నారుు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఖజానా నీళ్లలా ఖర్చవుతోంది. శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించడంలో అధికారులు విఫలమైతే.. పరిష్కారం ఉన్నా ప్రతినిధుల నిర్లక్ష్య ధోరణితో ఆచరణకు నోచుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఖజానా భారీగా తరుగుతోంది. మాతా, శిశు మరణాలు తగ్గించి, ఐదేళ్లలోపు చిన్నారుల ప్రాథమిక అక్షరాభ్యాస కేంద్రంగా విశిష్ట సేవలందిస్తున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ కూడా పట్టనట్టుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నారుు. ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంరక్షణ కార్యక్రమాలు అమలవుతున్నా పక్కా భనాలు లేకపోవడంతో అవస్థలు మాత్రం తప్పడం లేదు. ఉన్న భవనాల్లో కూడా వసతులు సక్రమంగా లేవు. నెలకు అద్దె దాదాపు రూ.28 లక్షలు జిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నారుు. వీటి పరిధిలో 4,523 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నారుు. జిల్లావ్యాప్తంగా కేవలం 825 కేంద్రాలు మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతున్నారుు. మరో 807 సొంత బిల్డింగ్లు కాకుండా.. అటు అద్దె భవనాల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సముదాయాల్లో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కాగా పట్టణ ప్రాంతాల్లో 327, గ్రామీణ ప్రాంతాల్లో 2,524 కేంద్రాలు అద్దె కొంపల్లోనే కొనసాగుతున్నారుు. అంటే జిల్లాలో సగానికిపైగా కేంద్రాలు అద్దె ఇళ్లలోనే కొనసాగుతున్నాయన్న మాట. అద్దె భవనాలకు ప్రభుత్వం ప్రతి నెల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాటికి రూ.750, పట్టణ ప్రాంతాల్లోని ఒక్కో కేంద్రానికి రూ.3 వేల చొప్పున చెల్లిస్తోంది. ఈ లెక్క ప్రకారం జిల్లావ్యాప్తంగా అద్దె ఇళ్లల్లో నిర్వహిస్తున్న కేంద్రాలకు ప్రతి నెలా ప్రభుత్వం దాదాపు రూ.28 లక్షలు అద్దె రూపేణా చెల్లిస్తోంది. అద్దె కేంద్రాలకు చెల్లించే డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో స్థలాన్ని కొనుగోలు చేసి భవనాలు నిర్మించవచ్చని పలువురు పేర్కొంటున్నారు. అయితే అక్కడి స్థలాన్ని కొనుగోలు చేసి ప్రతి నెల నాలుగు నుంచి ఐదు కేంద్రాలను నిర్మించవచ్చని పలువురు లెక్కలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అద్దె భవనాలకు బదులు సొంత భవనాలు నిర్మించాలని పలువురు పేర్కొంటున్నారు. అద్దె భవనాలతో అవస్థలు నర్మెట : నా పేరు దన్నారపు శోభ, నేను నర్మెటలో అంగన్వాడీ కార్యకర్తగా ప నిచేస్తున్నా. 13 ఏళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగిస్తున్నా. సొంత భవనం లేకపోవడంతో ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం మొదట్లో కిరాయి రూ.200 ఇచ్చే ది. ప్రస్తుతం అన్ని సౌకర్యాలు ఉంటే రూ.750 చెల్లిస్తోంది. అన్ని సౌకర్యాలు ఉన్న భవనాలు దొరకడం లేదు. ఏడాదిగా అద్దె రావడం లేదు.. కేసముద్రం : నా పేరు కవిత. నేను కేసముద్రం మండల కేంద్రంలోని శివారు కట్టుకాల్వతండాలో అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్నా. ప్రభుత్వం నెలకు రూ.200 ఇస్తుంది. నేను రూ.300 కలిపి అద్దె ఇస్తున్నా. ఏడాదిగా అద్దె రాకపోవడంతో ఇబ్బందిగా ఉంది. ఏడేళ్లుగా అద్దె భవనంలోనే.. మహబూబాబాద్ : నా పేరు వసంత. నేను మానుకోట పట్టణంలోని కంకరబోడ్ ప్రాంతంలో నంబర్ 1 అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నా. సొంత భవనం లేకపోవడంతో ఏడేళ్లుగా అద్దె భవనంలోనే అవస్థలు పడుతున్నాం. మా కేంద్రంలో 74 మంది పిల్లలు ఉన్నారు. వారిలో ఫ్రీ స్కూల్ పిల్లలు 14 మంది.. టీహెచ్ఆర్ పిల్లలు 42 మంది.. గర్భిణులు, బాలింతలు 18 మంది ఉన్నారు. ప్రతి నెల ప్రభుత్వం అద్దె రూపంలో రూ.200 ఇస్తుండగా అదనంగా రూ.300 కలిపి ఇంటి యజమానికి చెల్లిస్తున్నాం. భవనంలో కూలిపోయే దశలో ఉంది. కనీస సౌకర్యాలు కూడా లేవు. ప్రభుత్వం సొంత భవనాలు నిర్మిస్తే బాగుంటుంది. -
మిస్ అయితే.. ఉందిగా ఐసీపీఎస్
పుష్కరఘాట్ (రాజమండ్రి) : జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్)లో భాగమైన సమగ్ర శిశు సంరక్షణ సంస్థ (ఐసీపీఎస్) సిబ్బంది గోదావరి పుష్కరాల్లో విశేష సేవలందిస్తున్నారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్, గోదావరి రైల్వే స్టేషన్, సెంట్రల్ కంట్రోల్ రూమ్, మెయిన్ కంట్రోల్ రూమ్‌లలో ఐసీపీఎస్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తప్పిపోయిన చిన్నారులను చేరదీసి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ పది రోజుల్లో సుమారు 200 మంది చిన్నారులు, రెండు వేల మంది పెద్దలు వారి కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోవడంతో వారిని ఐసీపీఎస్ అధికారులు చేరదీసి మైకుల ద్వారా ప్రచారం చేసి వారి వద్దకు చేర్చారు. 24 మంది ఐసీపీఎస్ సిబ్బంది గోదావరి పుష్కరాలలో సేవలందిస్తున్నారు. నలుగురితో రెస్క్యూటీమ్ : గోదావరి పుష్కరాల్లో తప్పిపోయిన చిన్నారులను సంరక్షించేందుకు వివిధ ఘాట్లు, రాజమండ్రిలో నలుగురు సభ్యులతో రెస్క్యూ టీమ్‌ను ఏర్పాటు చేశారు. వారు అన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ చిన్నారులను చేరదీసి వారిని చిల్డ్రన్ హోమ్‌కు తరలించి సంరక్షిస్తూ వారిని తల్లిదండ్రుల చెంతకు చేరుస్తున్నారు. రాజమండ్రికి చెందిన ఏకలవ్య చిల్డ్రన్ హోమ్, సీడీపీఓ ఎస్ఎస్ కుమారి, జిల్లా బాలల సంరక్షణాధికారి సీహెచ్ వెంకట్రావు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. -
హెల్ప్‌డెస్క్‌లు భేష్
తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రుల చెంతకు ఇప్పటివరకు 64 మంది చిన్నారులకు రక్షణ ఇందూరు/మోర్తాడ్ : జిల్లాలోని 11 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 18 పుష్కరఘాట్లలో పుణ్య స్నానాలు ఆచరించడాని కి ప్రజలు పిల్లా పాపలతో వస్తున్నారు. భక్తుల ర ద్దీ ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పిపోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రుల చెం తకు చేర్చడానికి జిల్లా మహిళా, శిశు సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ ఘాట్ వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏ ర్పాటు చేశారు. వారం రోజులుగా పుష్కరాలలో మొ త్తం 64 మంది పిల్లలు తప్పిపోయారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది వీరిని క్షే మంగా వారి వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అందజేసి ఘనతను చాటుకున్నారు. సమస్య తలెత్తకుండా తప్పిపోయిన పిల్లలు కుటుంబసభ్యులకు చెందిన వారో కాదో పూర్వాపరా లు, గుర్తింపు కార్డులు పరిశీలించిన తరువాతే అప్పగించారు. ఎక్కువగా పోచంపాడ్, కందకుర్తి, తడ్పాకల్, తుంగిని ఇంకా ఒకటి రెండు పుష్కరప్రాం తా లలో నిత్యం లక్షల మంది స్నానా లు ఆచరించడానికి వచ్చారు. ఇక్కడ భక్తుల రద్దీ గణనీయంగా పెరగడం తో చిన్న పిల్లలు చాలా మంది తప్పిపోయారు. ఈ క్రమంలో పుష్కర ప్రాంతాలలో ఉన్న హెల్ప్ డెస్క్ సిబ్బందికి కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో తప్పిపోయిన పిల్లలను వెతికి మరీ వారికి అందించా రు. ఒంటరిగా కనిపించిన పిల్లలను హెల్ప్ డెస్క్‌కు తీసుకువచ్చి పిల్లల వివరాలు కుటుంబ సభ్యులకు తె లిసేలా మైకు ద్వారా ప్రచారం నిర్వహించారు. తద్వారా పిల్లల ఆచూకీ తొందరగా లభించింది. హెల్ప్ డెస్క్‌ల విధుల నిర్వహణను బాధిత తల్లిదండ్రులు కొనియాడారు. అధికారులు కూడా వారిని అభినందించారు. పుష్కర ఘాట్ల వద్ద ఒక వేళ హెల్ప్ డె స్క్‌లు లేకుంటే జన ప్రవాహంలో తప్పిపోయిన పిల్ల ల ఆచూకీ అంత సులభంగా లభించేది కాదు. -
యాచక బాలలకు డీఎన్ఏ పరీక్షలు
రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ నిర్ణయం సాక్షి, ముంబై: నగరంలో యాచకులవద్ద కనిపిస్తున్న చిన్న పిల్లలకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షల్లో దోషులుగా తేలిన యాచకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆస్పత్రులు, రైల్వే స్టేషన్ల నుంచి చిన్న పిల్లలు ఆపహరణకు గురవుతున్న సంఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు నిర్మూలించడంలో దర్యాప్తు బృందాలు విఫలమవుతున్నాయి. దీంతో యాచకులవద్ద కనిపించే పిల్లల్లో అపహరణకు గురైనవారు ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే అసలు విషయం బయటపడుతుందని మహిళ, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ముంబైలో కూడళ్లవద్ద, లోకల్ రైళ్లలో, స్టేషన్లలో, బస్టాపుల్లో.. ఇలా ఎక్కడ చూసినా యాచకులవద్ద పిల్లలు కనిపిస్తున్నారు. చిన్న పిల్లలుంటే ఎవరైన జాలీ, కరుణ చూపించి డబ్బులు వేస్తార ని యాచకులు తమ వద్ద పసికందులను కచ్చితంగా ఉంచుకుంటారు. యాచకులకు పిల్లలను అద్దెకు ఇచ్చే ముఠాలు కూడా ఉన్నాయి. వారికి పాలు, ఆహారం ఇవ్వడంతోపాటు సాయంత్రం పిల్లల యజమానికి కొంత డబ్బు అప్పజెప్పాల్సి ఉంటుంది. దీంతో వారు డబ్బుకు ఆశపడి పిల్లలను నిద్రపోకుండా చేస్తారు. ఒకవేళ ఏడ్వకుంటే వారిని గిల్లి బలవంతంగా మరీ ఏడిపిస్తారు. ఇలాచేస్తే డబ్బులు కచ్చితంగా ఇస్తారని వారు భావిస్తారు. కాని వారివెంటే ఉండే పిల్లలు నిజానికి వారి బిడ్డలేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కొందరు ఇతర రాష్ట్రాల నుంచి అపహరించిన పిల్లలు కూడా ఉండవచ్చనే అనుమానాలున్నాయి. అందుకు ప్రత్యేకంగా కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయని గతంలో పట్టుబడ్డ నిందితుల ద్వారా వెల్లడైంది. దీంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని మహిళ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి విద్యా ఠాకూర్ చెప్పారు. అందుకు రైల్వే పోలీసు, రాష్ట్ర పోలీసు, మహిళ శిశు హక్కుల కమిటీతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఈ చర్చల్లో తుది నిర్ణయం కాగానే నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఠాకూర్ చెప్పారు. పరీక్షల్లో వారి పిల్లలు కాదని తేలితే పిల్లలను బాలల సంరక్షణాలయాలకు పంపించి, దోషులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. -
కథలు చెప్పొద్దు!
సాక్షి, అనంతపురం : ‘నాకు కాకమ్మ కథలు చెప్పకండి.. మీ సంగతి నాకు మొత్తం తెలుసు.. అసలు మీ వల్లే శాఖకు చెడ్డపేరు వస్తోంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ గురించి బయట ఎవర్ని కదిపినా ఒకటే మాట..అవినీతి.. అవినీతి.. ఎందుకిలా? అంతా మీ వల్లే.. నిబంధనలను తుంగలో తొక్కి మీ ఇష్టానుసారం టెండర్లు పిలవడం, నాసిరకం సరుకులు కొనడం.. రివ్యూ మీటింగ్‌లలో మేము ప్రశ్నిస్తే మా కళ్లకు గంతలు కట్టాలని చూస్తారు.. మరోసారి నేను జిల్లాకు వచ్చినప్పుడు అవినీతి అనే మాట వినిపించిందా.. చెప్పను చేసి చూపిస్తా’ అంటూ స్త్రీ శిశు సంక్షేమ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, భూగర్భ గనుల శాఖ మంత్రి పీతల సుజాత అధికారులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంగళవారం జిల్లాలోని రామగిరి గోల్డ్ మైన్స్‌ను పరిశీలించిన తర్వాత అనంతపురం చేరుకున్న ఆమె డ్వామా హాలులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మైనింగ్ శాఖ అధికారులతో వేర్వేరుగా సమీక్షించారు. తొలుత స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి.. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా సీడీపీఓల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘మిమ్మల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు మీ ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచారు. అయితే మీరు మాత్రం అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. ఏ జిల్లాకు వెళ్లినా మేడమ్.. సరుకులు నాసిరకంగా ఉంటున్నాయి.. గుడ్లు మురిగిపోతున్నాయి.. సైజు చిన్నగా ఉంటున్నాయి అన్న ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. కనీసం మీ జిల్లాలోనైనా ఆ ఫిర్యాదులు రాాకుంటే బాగుంటుందని అని అనుకుంటే ఇక్కడా అవే ఫిర్యాదులు. సీడీపీవోలు క్షేత్ర స్థాయికి వెళ్లకుండా కార్యాలయాల్లోనే కూర్చుంటున్నారు. అది ఇక కుదరదు. ప్రతి ఒక్క సీడీపీఓ కచ్చితంగా క్షేత్ర స్థాయికి వెళ్లి కేంద్రాలను పరిశీలించాలి. మీరు వెళ్తే కదా.. కేంద్రాలకు కార్యకర్తలు వస్తున్నారా? లేదా? అని తెలిసేది. మీరు వెళ్లరు.. వారు కేంద్రాలకు రారు.. పని భారమంతా ఆయాలపై వదిలేసి ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ కూర్చుండిపోతున్నారు. గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ.. వారిని కేంద్రాలలో లబ్ధిదారులుగా చేర్పించాలి. వారితో పాటు చిన్నారులకు పౌష్టికాహారం సకాలంలో అందేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్థాయి కాన్వెంట్లుగా తీర్చిదిద్దాలని చూస్తుంటే మీరేమో.. వాటిని పట్టించుకోకుండా మీ ఇష్టానుసారంగా చేస్తున్నారు. అసలు కేంద్రాలను ఏబీసీడీ గ్రేడ్లుగా విభజించాలని ఎవరు చెప్పారు? అన్ని కేంద్రాలను ఒకే దృష్టితో చూడండి.. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ఇచ్చే పౌష్టికాహారం నాణ్యతగా ఉండేలా చూడండి’ అంటూ మంత్రి ఆదేశించారు. ‘జిల్లాలో ఇద్దరు మంత్రులున్నారు.. అయినా మీకు బొత్తిగా భయం అనేది లేకుండా పోయింది. మీరు కూడా ఐసీడీఎస్ పనితీరుపై సిబ్బందితో సమీక్షలు జరుపుతూ ఉండండి’ అంటూ అక్కడే ఉన్న కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌ను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని 10 ప్రాజెక్టుల పరిధిలో అమలవుతున్న అమృతహస్తం పథకం ద్వారా గర్బిణీలు, బాలింతలకు సకాలంలో సరుకులు అందజేయాలని, సరుకుల్లో నాణ్యత లోపించినట్లు తెలిస్తే.. ఇక అంతే అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సరుకుల్లో నాణ్యత లోపించినా, గుడ్ల సైజు తగ్గినా వెంటనే కాంట్రాక్టర్‌ను ప్రశ్నించాలన్నారు. నెలకు 2 కోట్ల కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నామని చెబుతున్నారే.. వాటిలో ఎన్ని బాగున్నాయో ఏనాడైనా ఆలోచించారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. జిల్లాలో అంగన్వాడీ భవనాలకు సంబంధించి నిధులు మంజూరు చేయించిన వెంటనే కలెక్టర్‌తో సంప్రదించి, అవసరమై స్థలసేకరణ చేసి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ‘మీరు బాగా పనిచేయండి.. మీకు ఏం కావాలో మాకు చెప్పండి.. ఏం చేస్తే శాఖపై ఉన్న అవినీతి మరక పోతుందో చెప్పండి.. మేం స్వీకరిస్తాము. నాకు కావాల్సింది ఒక్కటే.. ఇకపై స్త్రీశిశుసంక్షేమ శాఖలో అవినీతి అనే మాటకు తావుండకూడదు. మీరు బాగా పనిచేయండి..నాకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి’ అని మంత్రి సూచించారు. ఈ సందర్బంగా ఐసీడీఎస్ పీడీ జుబేదా బేగం శాఖలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లోనే కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. 118 మంది హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. -
టెన్షన్..టెన్షన్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్-2 సూపర్వైజర్ రెగ్యులర్ పోస్టుల ఫలితాలు రోజురోజుకూ వెనక్కుపోతున్నాయి. ఎంపికైన అభ్యర్థుల ఫలితాలు ప్రకటిస్తారని ఏరోజుకారోజు ఎదురుచూస్తున్న అభ్యర్థులు భంగపాటుకు గురవుతున్నారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులను ఇప్పటికే వెబ్సైట్ ద్వారా తెలుసుకుని పోస్టులు వస్తాయోరావోనని ఆందోళన చెందుతున్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా రోస్టర్వారీగా సిద్ధమైనప్పటికీ కలెక్టర్ సంతకం కాలేదని సంబంధిత అధికారులు ప్రకటించకుండా వాయిదావేస్తూ వస్తున్నారు. అభ్యర్థుల్లో మాత్రం రోజురోజుకూ టెన్షన్ పెరిగిపోతోంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రెండురోజుల్లో ప్రకటిస్తామని అధికారులు చెప్పడం, కానీ, ప్రకటించకపోవడం జరుగుతోంది. మహిళాశిశు సంక్షేమశాఖలో ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో 305 గ్రేడ్-2 రెగ్యులర్ సూపర్వైజర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 3,572 మంది అభ్యర్థులు రాత పరీక్ష రాశారు. సరిగ్గా నాలుగు రోజులకు రాతపరీక్ష ఫలితాలను ఆ శాఖ వెబ్సైట్లో పెట్టారు. మొత్తం 45 మార్కులకుగానూ అభ్యర్థులకు వచ్చిన మార్కులను ఆ వెబ్సైట్లో ఉంచారు. కాంట్రాక్టు సూపర్వైజర్లకు 15 శాతం, అంగన్వాడీ శిక్షణ కేంద్రాల్లో కో ఆర్డినేటర్లుగా వ్యవహరించే వారికి 5 శాతాలను గ్రేస్ మార్కులుగా ఇస్తున్నట్లు నోటిఫికేషన్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాత పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కులు, గ్రేస్ మార్కులు కలుపుకుని రిజర్వేషన్ల వారీగా ఎవరికివారు లెక్కలు వేసుకుంటున్నారు. రోస్టర్ వారీగా అభ్యర్థుల వివరాలను ప్రకటించడంలో ఎక్కువ సమయం తీసుకుంది. రోస్టర్‌ను ఆధారం చేసుకుని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. రోస్టర్‌లో ఏ చిన్న తప్పు దొర్లినా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. అయితే రోస్టర్ ప్రక్రియ కూడా పూర్తయినప్పటికీ జాబితా ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను పత్రికాముఖంగా ప్రకటించడం జరుగుతుందని మహిళా శిశు సంక్షేమశాఖ రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ కామేశ్వరమ్మ ప్రకటించారు. దాంతో అభ్యర్థులు ఉదయాన్నే నిద్ర లేవగానే ముందుగా పేపర్లు చూడటం, ఫలితాలు లేకపోవడంతో నిరుత్సాహానికి గురికావడం జరుగుతోంది. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉన్న అభ్యర్థులు రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ కార్యాలయానికి ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఫలితాల జాప్యంతో అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ విజయకుమార్ చొరవ తీసుకుని వెంటనే ఫలితాలు విడుదల చేయాలని వారు కోరుతున్నారు.