సాక్షి, హైదరాబాద్: గృహహింస... వేధింపులు... అత్యాచారాలు...రాష్ట్రంలో మహిళలపై నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతున్న దారుణాలివి. ఇలాంటి దాడులకు గురైన బాధితులకు అండగా నిలిచేందుకు సర్కారు సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లా కేంద్రంలో ‘సఖి’ (వన్–స్టాప్ సెంటర్) పేరిట ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ కేంద్రాల ద్వారా బాధితులకు అవసరమైన వైద్య, పోలీసు, న్యాయ సాయంతోపాటు కౌన్సెలింగ్, బస అందించనుంది. బాధితులు నేరుగా సఖి కేంద్రాలను ఆశ్రయిస్తే నిర్వాహకులే అన్ని విషయాలు చూసుకుంటారు. దాడికి గురైన మహిళ లేదా మైనర్లు, చిన్నారులకు తొలుత చికిత్స అందించడంతోపాటు వారికి షెల్టర్ కూడా ఇస్తారు. అంతేకాకుండా దాడికి కారకులైన వారిపై చర్యల కోసం అవసరమైన న్యాయ సహకారాన్ని సైతం అందించేలా చర్యలు తీసుకుంటారు. వీధిబాలలు, చిన్నారులపై జరిగే దాడులపైనా ఈ కేంద్రం స్పందిస్తుంది. వారికి ఆశ్రయం కల్పించి సంరక్షణ చర్యలు తీసుకుంటుంది.
ప్రతి జిల్లాలో సఖి కేంద్రం...
సఖి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి నిర్వహణ బాధ్యతంతా కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖదే. ఒక్కో కేంద్రానికి రూ.50 లక్షల వరకు కేంద్రం మంజూరు చేయనుంది. ఈ మొత్తంతో శాశ్వత భవనాలు నిర్మించి అక్కడ సేవలు అందించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోనూ సఖి కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రతిపాదనలు రూపొందించిన యంత్రాంగం... వాటిని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అయితే కేంద్రం పాత పది జిల్లాల ప్రకారం హైదరాబాద్‌ను మినహాయించి మిగిలిన తొమ్మిది జిల్లాల్లో ఈ కేంద్రాలను మంజూరు చేసింది. దీంతో ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో సఖి కేంద్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
ఇప్పటికే సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఈ కేంద్రాలను ప్రాథమికంగా తెరవగా అక్కడ మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో వాటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మరో 8 కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో యాదాద్రి, కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, సిద్దిపేట, మంచిర్యాల, జనగాం జిల్లాల్లోనూ సఖి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వచ్చే ఏడాది అన్ని జిల్లాలకూ సఖి కేంద్రాలు మంజూరయ్యే అవకాశం ఉందని సఖి ప్రాజెక్టు రాష్ట్ర మేనేజర్ బి.గిరిజ తెలిపారు.
మహిళకు భరోసా... శిశువుకు రక్షణ
Published Tue, Feb 20 2018 4:37 AM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment