‘బాల్యం’.. చిక్కి శల్యం
- పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహారలోపం
- నెలకు సగటున ఈ సమస్య బారిన 12 వేల మంది చిన్నారులు
- శిశు సంక్షేమ శాఖ తాజా అధ్యయనంలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: బాల్యం ప్రమాదంలో పడింది. రాష్ట్రంలో నెలకు సగటున 12 వేల మంది చిన్నారులు పౌష్టికాహారలోపంతో బాధ పడుతున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ తాజా పరిశీలనలో వెల్లడైంది. బిడ్డ జనన సమయంలో పౌష్టికత్వంలో లోపాలు, తదనంతర పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ఈ ప్రక్రియ శిశుమరణాలకు దారితీస్తోంది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సం క్షేమ శాఖ చిన్నారుల పౌష్టిక స్థితిపై ఇటీవల అధ్యయనం చేసింది. రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులు 19.48 లక్షల మంది ఉండగా, వీరిలో 15.05 లక్షల మంది సాధారణ బరు వు ఉన్నారు. 4.29 లక్షల మంది తక్కువ బరువుతో ఉన్నారు. 12,620 మంది పిల్లల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి.
గర్భిణీ సమయం నుంచే...
మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి పౌష్టి కాహార స్వీకరణపై దృష్టి పెట్టాలి. కానీ గ్రా మీణ ప్రాంతంలో ఈ అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో పిల్లలపై ప్రభావం చూపుతోంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆరోగ్యలక్ష్మి, బాలామృతం లాంటి కార్యాక్రమాలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి ఫలితాలు రావడం లేదు. ఆర్నెళ్లు దాటిన చిన్నారులకు తల్లిపాలతో పాటు అదనపు పోషణ ఇవ్వాలి. ఉగ్గు, ఫ్యారెక్స్ తదితర పోషకాహారాన్ని మితంగా ఇవ్వాలి.
కానీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పదినెలల వరకు తల్లిపాలతోనే సరిపెడు తున్నారు. కొన్నిచోట్ల ఆర్నెళ్ల తర్వాత తల్లి పాలు ఆపేసి గేదెపాలు ఇస్తున్నట్లు పరిశీలనలో తెలిసింది. ఈ ప్రక్రియ పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. పౌష్టిక లోపాలున్న చిన్నారుల సంఖ్య రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఎక్కువగా ఉంది. సెప్టెంబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,620 మంది చిన్నారుల్లో తీవ్ర పౌష్టిక సమస్య ఉన్నట్లు గుర్తించారు. అందులో రంగారెడ్డి జిల్లాలో 2,978 మంది, మెదక్ జిల్లాలో 2,922 మంది చిన్నారులున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఈ సంఖ్య 578గా నమోదు కావడం గమనార్హం.