కొడుకును ఆటోకేసి కొట్టిన తండ్రి | Father Beats His Child in Hyderabad | Sakshi
Sakshi News home page

కొడుకును ఆటోకేసి కొట్టిన తండ్రి

Jul 10 2018 1:07 AM | Updated on Aug 21 2018 6:08 PM

Father Beats His Child in Hyderabad - Sakshi

రిత్విక్‌

హైదరాబాద్‌: పరిచయమున్న ఓ మహిళ తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ వ్యక్తి ఉన్మాదిలాగా ప్రవర్తించాడు. తన మూడేళ్ల కుమారుడిని ఆటోకేసి కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. తమ కళ్ల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో ఆదివారంరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సుమోటోగా స్వీకరించి నిందితుడు శివగౌడ్‌ను అరెస్టు చేశారు. ఉప్పల్‌కు చెందిన శివగౌడ్‌కు అనూషతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. శివగౌడ్‌ తన కుటుంబంతో కలసి జగద్గిరిగుట్టలోని ఉమాదేవినగర్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉంటున్న మరో మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. దీంలో భార్యాపిల్లలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు.

ఈ క్రమంలో శివగౌడ్‌ ఆదివారం అర్ధరాత్రి ఆ మహిళకు ఫోన్‌ చేసి ‘నీ కుమారుడిని చంపుతా’నంటూ బెదిరించాడు. భయాందోళనకు గురైన ఆ మహిళ అదే రాత్రి జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శివగౌడ్‌కు ఫోన్‌ చేయగా దురుసుగా మాట్లాడాడు. దీంతో పోలీసులు శివగౌడ్‌ ఇంటికి రాత్రి రెండు గంటల సమయంలో చేరుకున్నారు. పోలీసులతోపాటు సదరు మహిళ కూడా అక్కడకు వెళ్లింది. అప్పటికే అతడు మద్యం మత్తులో ఉన్నాడు. ఇంటికి పోలీసులను తీసుకుని వస్తావా అంటూ ఆ మహిళపై శివగౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారిపై ఉన్మాదిలాగా ప్రవర్తించాడు. తన కుమారుడు రిత్విక్‌(3)ను బయటకు తీసు కొచ్చి అక్కడున్న ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటనతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన రిత్విక్‌ను నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. ఇంత జరిగినా శివగౌడ్‌ భార్య అనూష పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ కేసును పోలీసులు సుమోటోగా స్వీకరించి శివగౌడ్‌పై కేసు నమోదు చేశారు. చికిత్స అనంతరం బాలుడిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement