‘ఆపద బటన్’కు ఓకే
న్యూఢిల్లీ: అత్యవసర సమయాల్లో మహిళలను ఆదుకునేందుకు ఫోన్లలో ‘ఆపద బటన్’ సౌకర్యాన్ని కల్పించేందుకు మొబైల్ ఫోన్ కంపెనీలు అంగీకరించాయి. ఎమర్జెన్సీ అలర్ట్‌లను పంపగలిగే సౌకర్యముండే ఫోన్లు వచ్చే ఏడాది మార్చికల్లా అందుబాటులోకి రానున్నాయి. బటన్ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే టెలికమ్యూనికేషన్స్ శాఖ జారీచేయనుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మంగళవారం ప్రకటించారు. ఫోన్లలో కొత్త ఫీచర్ ద్వారా మహిళలకు అదనపు రక్షణ కల్పించగలమని ఆమె అన్నారు.
ప్రస్తుతం ప్రజలు వినియోగిస్తున్న ఫోన్లలోనూ ఈ బటన్ ఏర్పాటుచేసుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 10,000 కేంద్రాలను నెలకొల్పాలని కంపెనీలతో భేటీ సందర్భంగా వారిని కోరినట్లు ఆమె తెలిపారు. మహిళల రక్షణ కోసం ‘నేషనల్ ఉమెన్ హెల్ప్‌లైన్’ నంబర్‌ను అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. పోలీసు, లీగల్, మెడికల్, కౌన్సెలింగ్ ఇలా అన్నిరకాలుగా మహిళలకు ఒకేచోట సాయం అందేందుకు ఈ నంబర్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.