
సాక్షి, హైదరాబాద్: నవజాత శిశువులు, తల్లుల పౌష్టికాహార అవసరాల పర్యవేక్షణకు డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ తెలిపారు. గర్భస్థ మహిళలకు పోషకాహారం అందడం మొదలు నవజాత శిశువులకు సకాలంలో టీకాలు వేయడం.. వారిలోని విటమిన్, పోషకాల లోపాలు, వాటిని సరిచేసేందుకు తీసుకుంటున్న చర్యలు తదితరాలతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను జనవరి 1 నుంచి దేశంలో ని 315 జిల్లాల్లో అమల్లోకి తేనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం నుంచే గ్రామాల్లోని బిడ్డలు, తల్లుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించవచ్చన్నారు. జాతీయ పౌష్టికాహార సంస్థ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్‌కుమార్ మాట్లాడుతూ.. 2030 నాటికి అగ్రరాజ్యంగా ఎదగాలన్న దేశ ఆకాంక్షలకు నవజాత శిశువుల ఆరోగ్యం కీలకమని స్పష్టం చేశారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 38 శాతం మంది ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎదగలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి జాతీయ పౌష్టికాహార సంస్థ సహకారంతో కేంద్రం యత్నాలు చేస్తోందన్నారు.
సగటు ఐక్యూ 82 పాయింట్లే..
పోషకాహార లోపం వల్ల భారతీయ బాలల సగటు మేధో శక్తి (ఐక్యూ) 82 పాయింట్ల స్థాయిలోనే ఉందని.. గర్భిణులు తొలి త్రైమాసికంలో తగినంత ఫోలిక్ యాసిడ్, ఐరన్‌లను తీసుకుంటే ఈ సమస్యను అధిగమించి సగటు మేధోశక్తిని 8–12 పాయింట్ల వరకూ పెంచవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment