పేదల ఊసు పెద్దలకు పట్టదా? | Sakshi Guest Column On Poor People Food Crisis In India | Sakshi
Sakshi News home page

పేదల ఊసు పెద్దలకు పట్టదా?

Published Mon, May 13 2024 4:51 AM | Last Updated on Mon, May 13 2024 4:51 AM

Sakshi Guest Column On Poor People Food Crisis In India

విశ్లేషణ

భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతున్నారు. కోట్లాది కార్మికులకు పనిలేదు. ఉద్యోగాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. బీజేపీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్‌ గల్లంతైంది. మతం మనిషికి తిండి పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. అలాంటి పార్టీతో చంద్రబాబు అంటకాగు తున్నారు. దేశంలో తమ పేరు మీద సాగుభూమి లేనివారు ఎందరో! ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణా ళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే!

18వ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌ 19 నుండి జూన్‌ 1 వరకు ఏడు విడతలుగా జరుగుతున్నాయి. తిరిగి మళ్లీ మూడోసారి అధికారంలోనికి రావడానికి మోదీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఉత్తరప్రదేశ్‌ మీద అయితే వాళ్లు ఎక్కువ ఆధారపడి ఉన్నారో అక్కడ సామాజిక రాజకీయ చైతన్యం పెల్లుబికింది. ముఖ్యంగా ముస్లింలలో ఎంతో మార్పు రావడం వల్లే రాయబరేలీలో రాహుల్‌ గాంధీ నిలబడటానికి పూనుకున్నారు. మతోన్మాద దాడులు, మహిళా సాధికారతను పునాదులతో తొలిచే భావజాలం, కార్పొరేట్‌ శక్తులకు దేశాన్ని తాకట్టు పెడుతున్న బీజేపీ విధానాలు లౌకికవాదులను, ఓబీసీలను, దళితులను, స్త్రీలను ఆలో చింపజేస్తున్నాయని చెప్పక తప్పదు. 

ముఖ్యంగా 370 ఆర్టికల్‌ రద్దు ద్వారా జమ్మూ కశ్మీర్‌ శాసనసభను రద్దుచేసి, ఆ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విడగొట్టిన ఉదంతాన్ని ప్రజాస్వామిక వాదులు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గించి, జీఎస్టీ ద్వారా కేంద్రీకృత ఆర్థిక పెత్తనాన్ని పెంచి, రాష్ట్రాల ఉనికిని నామమాత్రం చేయా లని చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు కలిగిన భాష, సంస్కృతి, విద్య, విద్యుత్, మానవ వనరులపై కూడా కేంద్ర ప్రభుత్వమే పెత్తనం చేయాలనే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్యవంతంగా ఆలోచిస్తు న్నాయి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన పత్రికల మీద చేస్తున్న దాడి బ్రిటిష్‌ వాళ్ళ కాలంలో కూడా జరగలేదని జర్నలిస్టు మేధావులు వాపోతున్నారు.

ఏప్రిల్‌ చివరి వారంలో వచ్చిన ‘గ్లోబల్‌ రిపోర్ట్‌ ఆన్‌ ఫుడ్‌ క్రైసిస్‌’ ప్రకారం, భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతు న్నారు. అత్యధిక స్త్రీలు రక్తలేమితో ఇబ్బంది పడుతున్నారు. కోట్లాది మంది కార్మికులకు పనిలేదు. భారతదేశం మొత్తం వలసలతో అన్నా ర్తులై పొట్ట చేత పట్టుకుని నగర శివారుల్లోని మురికివాడలలో జీవిస్తు న్నారు. నిజానికి పంజాబ్‌ రైతులు చేసిన రైతు ఉద్యమ ప్రభావం భారతదేశం మొత్తం మీద ఉంది. సంయుక్త కిసాన్‌ మోర్చా హోరా హోరీ రైతు ఉద్యమాన్ని నడిపింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టా లను రద్దు చేయాలనే డిమాండ్‌పై రాజీలేని పోరాటం చేసింది.

ముఖ్యంగా అడవుల నరికివేత వల్ల, నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల దేశంలో తీవ్రంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండుటెండల్లో ప్రజలు ఆహారం కోసం పని చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. మతం మనిషికి అన్నం పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా గ్రామాలలో మంచి నీళ్ళు దొరకడం లేదు. మద్యాన్ని అందించటంలో సఫలమైన ప్రభు త్వాలు, మంచినీళ్లు అందించడంలో విఫలమయ్యాయి.

ఇకపోతే దేశంలో నిరుద్యోగం విలయ తాండవం చేస్తోంది. ఉద్యో గాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. కాగా ఎన్నికల నేపథ్యంలో నిరు ద్యోగం ప్రధాన అంశంగా చర్చకొస్తోంది. ప్రతిపక్ష నేతలు నిరుద్యోగ సమస్యపై నిలదీస్తుండగా అధికార బీజేపీ నేతలు సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రధాని మోదీ ప్రసంగాలు, బీజేపీ మేనిఫెస్టో యువతకు భరోసా కల్పించలేదు. పైగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్‌ గల్లంతైంది. నిరుద్యోగ రేటు  పెరగడం ఆందోళన కలిగించే విషయం. 

ఇకపోతే ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణాళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో కోట్లాది మందికి సాగుభూమి సెంటు కూడా లేదు. ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ఇంటి స్థలం లేదు. మంచినీళ్ల వసతి లేదు. చనిపోతే పాతిపెట్టడానికి శ్మశానం లేదు. దేశంలోని సుమారు 7 లక్షల గ్రామాల్లో అంటరానితనం కొనసాగు తూనే వుంది. భారతదేశంలో దళితులు ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం లేక పేదరికంలో, అస్పృశ్యతలో, అవిద్యలో మగ్గిపోతున్నారు. బీటెక్‌లు, ఎంటెక్‌లు, బీఏలు, ఎంఏలు చదివినా నిరుద్యోగు లుగా, ఉపాధి హామీ కూలీలుగా జీవిస్తున్నారు. ఈ రోజున దళిత వాడల్లో విద్యార్థులు, స్త్రీలు నిరాశా  నిస్పృహలలో జీవిస్తున్నారు. వారి కుటుంబానికి తలా రెండెకరాల భూమి ఇవ్వటం ద్వారా ఆర్థిక సాధికారతను కల్గిస్తాం అని ఏ ప్రభుత్వమూ చెప్పటం లేదు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు అంబేడ్కర్‌ ఆలోచనకు భిన్నంగా ఉన్నాయి.

భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే. ఇప్పుడు ఎన్నికల్లో ప్రకటించిన ఏ మేనిఫెస్టోలో కూడా భూమి పంపకం గురించి రాయక పోవటం, అస్పృశ్యతా నివా రణ ఒక ఎన్నికల ఎజెండాగా లేకపోవటం, కుల నిర్మూలన కార్యక్రమం ఎవరి లక్ష్యంగా లేకపోవటాన్ని దళిత మేధావులు, ఆలోచనాపరులు అర్థం చేసుకుంటున్నారు. రాజ్యాధికారమే వీటన్ని టికీ పరిష్కారం అని ఆలోచిస్తున్నారు. నిజానికి ప్రసిద్ధమైన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, ఐఐటీల్లో, వైద్య విశ్వవిద్యాలయాల్లో, అన్ని కళా శాలల్లో దళిత విద్యార్థులు ఎంతో వివక్షకు గురి అవుతున్నారు.

మోదీ ఇంత తిరోగమన చర్యలతో ముందుకు వెళ్తుంటే, నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమిలో చేరటం ఆయనకున్న దళిత వ్యతిరేకతనూ, హిందూ మతోన్మాద భావజాలాన్నీ, కులాధి పత్య వైఖరినీ, మైనారిటీల పట్ల ద్వేషాన్నీ తెలియజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకూ, మోదీకీ మధ్య భావజాలంలో, దళితులు, స్త్రీల పట్ల వ్యతిరేకతలో ఏ విధమైన తేడాలేదు అని అర్థం అవుతోంది. ముఖ్యంగా మోదీ యూనివర్సిటీల్లో జీవపరిణామ, మానవ పరిణామ చారిత్రక సిద్ధాంతాల బోధనకు భిన్నంగా మతవాద భావజాలాన్ని ప్రోత్సహించటం లౌకిక భావజాల వ్యాప్తికి గొడ్డలి పెట్టు అవుతుంది.

ఇకపోతే అంబేడ్కర్‌ భావజాల ప్రచారంలో తమిళనాడు ముందుంది. తమిళనాడులోని అన్ని థియేటర్లలో సినిమా ప్రారం
భంలో అంబేడ్కర్‌ జీవిత పోరాటం గురించి ఐదు నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ ప్రదర్శించాలని అక్కడి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ఆదేశించారు. అంబేడ్కర్‌ ఆ రాజ్యాంగం ద్వారానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులు ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నారని గ్రహించాలి.

అంబేడ్కర్‌ రాజ్యాంగం భారతదేశ పునర్‌ నిర్మాణానికి ఆయువు పోసింది. ఏ దేశంలో స్త్రీ వ్యక్తిత్వంతో జీవిస్తుందో, ఏ దేశంలో
కుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుందో, ఏ దేశంలో స్త్రీ ఉత్పత్తి శక్తి దేశ సౌభాగ్యానికి ఊపిరి పోస్తుందో ఆ దేశం ఆర్థిక సంపదవున్న ప్రపంచ పంక్తిలో నిలబడగలుగుతుంది. నిజానికి అంబేడ్కర్‌ అడుగు అడుగులో స్త్రీ సమానత్వం కోసం పోరాడారు. వారి అభ్యున్నతి కోసం, వారి విద్యాభ్యాసం కోసం, వారి సాధికారిత కోసం, వారి భావ చైతన్యం కోసం, వారి రాజకీయ హక్కుల కోసం పోరాడారు. 

హిందూ కోడ్‌ బిల్లు విషయంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా రాజీనామా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి హిందూ కోడ్‌ బిల్లును సాధించారు. ఈనాడు ప్రభుత్వాలు స్త్రీ సాధికారితను నిలబెట్టాలి అంటే నిరుద్యోగులయిన స్త్రీలకు ఉద్యోగ వసతి కల్పించాలి. విధవరాండ్రకు నెలకు పది వేల రూపాయల పింఛన్‌ ఇవ్వ గలిగిన స్థాయికి రావాలి. ప్రతి దళిత స్త్రీకి రెండు ఎకరాల భూమి ఇచ్చి భారతదేశంలో వ్యవసాయ విస్తృతికి కృషి చేయాలి. ఇంటింటికీ మంచినీటి వసతి, విద్యుత్‌ వసతి కల్పించి, ఆరోగ్య సంరక్షణ కోసం పౌష్టికాహారాన్ని అందించి స్త్రీ శారీరక మానసిక శక్తిని పెంచి దేశ సౌభాగ్యానికి బాటలు వేయాలి. 

డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement