వాయు కాలుష్యంతో చిన్నారులు ఉక్కిరిబిక్కిరి
దేశంలో రోజుకు సగటున 464 మంది మృత్యువాత
పోషకాహార లోపం తర్వాత రెండో ప్రమాదకారి వాయు కాలుష్యమే
‘హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్’ తాజా అధ్యయనంలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వాయు కాలుష్యంతో పసి మొగ్గలు రాలిపోతున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల ఊపిరితిత్తులు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఫలితంగా దేశంలో రోజూ సగటున 464 మంది మృత్యువాత పడుతున్నారు. అమెరికాకు చెందిన లాభాపేక్షలేని పరిశోధనా సంస్థ ‘హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్’తొలిసారిగా ‘స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ ఎయిర్–2024’ నివేదికను విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలివీ..
పిల్లలకు న్యుమోనియా, పెద్దలకు ఆస్తమా
మానవ ఆరోగ్యంపై పీఎం (పర్టిక్యులేట్ మ్యాటర్)–2.5, నైట్రోజన్ డయాక్సైడ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గాలి కాలుష్యంతో పిల్లలు న్యుమోనియా బారిన, పెద్దలు ఆస్తమా బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాలంలో వాయు కాలుష్యం సంబంధమైన వ్యాధుల కారణంగా 81 లక్షల మంది మరణించగా.. ఇందులో 7 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులే. ఇందులో సుమారు 5 లక్షల మంది పిల్లలు గృహాల నుంచి విడుదలయ్యే కాలుష్యం కారణంగానే మృత్యువాతపడ్డారు. ఇక, మన దేశంలో 21 లక్షల మంది చనిపోగా.. అత్యధికంగా చైనాలో 23 లక్షల మంది కన్నుమూశారు.
శ్వాస, నాడీ వ్యవస్థలపై ప్రభావం
అడ్డూఅదుపు లేని మానవ చర్యల కారణంగా వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. స్వచ్ఛమైన గాలి కరువైపోతోంది. ఫలితంగా అనునిత్యం భారీగా కాలుష్యకారకాలు ఊపిరితిత్తుల్లోకి చేరిపోతున్నాయి. ప్రధానంగా ఇది చిన్నారులపై తీవ్ర దుష్ర్పభావాన్ని చూపిస్తోంది. ఎదుగుతున్న దశలో ఉన్న వారి శ్వాస, నాడీ వ్యవస్థలను దెబ్బతీసి, ప్రాణసంకటంగా మారుతోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలకు ప్రధాన కారణం పోషకాహార లోపం కాగా.. రెండో అత్యంత ప్రమాదకారి వాయు కాలుష్యమే. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు నెలలు నిండకముందే పుట్టడం, తక్కువ బరువుతో జని్మంచడం, ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ప్రమాద ఘంటికలిలా..
⇒ బాల్యంలో అధిక మోతాదులో వాయు కాలుష్యం బారినపడితే పెద్దయ్యాక గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది.
⇒ వాయు కాలుష్యం ఎక్కువైతే చిన్నారుల్లో మెదడు, నాడీ వ్యవస్థలో వృద్ధి మందగిస్తుంది. విషయ పరిజ్ఞాన సామర్థ్యం తగ్గుతుంది.
⇒ఉబ్బసం ముప్పు పెరుగుతుంది. చిన్నతనంలోనే కేన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదు.
⇒నవజాత శిశువులకు ఇళ్లల్లోని వాయు కాలుష్యం ముప్పు ఎక్కువ.
⇒ గర్భిణీలు కలుíÙతమైన గాలికి గురైతే.. వారికి నెలలు నిండకుండానే కాన్పు అయి తక్కువ బరువుతో శిశువులు జన్మించే ప్రమాదం ఉంది.
ఏం చేయాలంటే..
⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన వాయు నాణ్యత ప్రమాణాలను చేరుకోవడానికి ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి.
⇒ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలి. ఇంధన సమర్థతను పెంచడంపై పెట్టుబడులు పెంచాలి.
⇒ పునరి్వనియోగ వనరులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
⇒ బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం తగ్గించాలి. వ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలి.
⇒ రద్దీగా ఉండే రోడ్లు, కర్మాగారాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. కాబట్టి విద్యా సంస్థలు, క్రీడా మైదానాలు వీటికి దూరంగా ఏర్పాటు చేస్తే చిన్నారులను ఈ విషతుల్య వాయువుల నుంచి కాపాడొచ్చు.
⇒ రహదారుల వెంబడి ఆక్సిజన్ జనరేటర్లు, బూస్టర్లను ఏర్పాటు చేయాలి.
⇒ఎలక్ట్రిక్ వాహనాలను లేదా సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించాలి.
Comments
Please login to add a commentAdd a comment