రెండేళ్లలోపు చిన్నారులకు ఆహారంలో చక్కెర నియంత్రిస్తే అనేక ప్రయోజనాలు
పెద్దయ్యాక దీర్ఘకాలిక జబ్బుల నుంచి రక్షణ
35 శాతం మధుమేహం.. 25 శాతం రక్త పోటు ముప్పు తగ్గుదల
సౌత్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడి
మధుమేహం, రక్తపోటు రెండు జంట జబ్బులు ప్రస్తుతం మానవాళిని పట్టి పీడిస్తున్నాయి. వీటి బారినపడకుండా ఉండాలంటే చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిరుప్రాయం నుంచి తినే ఆహారం పట్ల నియంత్రణ ఉంటే పెద్దయ్యాక వ్యాధుల ముప్పు తగ్గుతుందని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తొలి వెయ్యి రోజులు చిన్నారులకు అందించే ఆహారంలో చక్కెరను నియంత్రిస్తే పెద్దయ్యాక 35 శాతం టైప్–2 డయాబెటిస్, 25 శాతం రక్తపోటు ముప్పు తగ్గుతుందని అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి జన్మనిచ్చాక, ఆ శిశువుకు రెండేళ్లు వచ్చే వరకు... అంటే వెయ్యి రోజుల పాటు చక్కెర తీసుకోవడాన్ని తగ్గిస్తే పెద్దయ్యాక రక్తపోటు, మధుమేహం ముప్పు గణనీయంగా తగ్గించవచ్చని నిర్ధారించారు. యూకే బయో బ్యాంక్‌లోని 1951 నుంచి 1956 మధ్య జన్మించిన 60 వేల మంది చిన్నారుల ఆరోగ్య వివరాలపై జరిపిన అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. రేషన్‌లో చక్కెర తీసుకున్న వారు, తీసుకోని వారు ఇలా రెండు వర్గాలుగా చిన్నారులను విభజించి అధ్యయనం నిర్వహించారు. ఈ నేపథ్యంలో చక్కెర తీసుకున్న వారితో పోలిస్తే తీసుకోని వారు యుక్త వయస్సులో దీర్ఘకాలిక జబ్బుల బారినపడే ప్రమాదం తక్కువగా ఉన్నట్టు తేలింది. – సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment