![Mahakumbh Traffic Jam Impacted Warehouse Shortage of Milk and Food Crisis](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/sugar-main.jpg.webp?itok=5zLkEaY6)
ప్రయాగరాజ్: యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో గత ఐదు రోజులుగా కిలోమీటర్ల పొడవున భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. గతంలో రెండు గంటల్లో చేరుకునే దూరానికి ఇప్పుడు 10 గంటల సమయం పడుతున్నదని స్థానికులు వాపోతున్నారు. వాహనాల రద్దీ కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసర సరుకులను తరలించే రవాణా వాహనాలు ప్రయాగ్‌రాజ్‌లోనికి ప్రవేశించలేకపోతున్నాయి.
ట్రాఫిక్‌ను నియంత్రించడానికి పోలీసులు పలుచోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాణిజ్య వాహనాలు ప్రయాగ్‌రాజ్‌లోనికి ప్రవేశించేందుకు అనుమతి లేకపోవడంతో ప్రయాగ్‌రాజ్‌లో పాలు, బ్రెడ్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు పెట్రోల్ పంపులలో పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది. నగరంలోని ప్రధాన మార్కెట్ అయిన ముత్తిగంజ్‌లోని పలు వ్యాపారులకు చెందిన గిడ్డంగులలో చక్కెర, గోధుమలు, మైదా నిల్వలు దాదాపుగా ఖాళీ అయిపోయాయి. కొద్దిపాటి స్టాక్ ఉన్న వ్యాపారులు రిటైల్ దుకాణాల డిమాండ్‌ను తీర్చలేకపోతున్నారు. జనవరి 26 నుంచి ప్రయాగ్‌రాజ్‌లోనికి వాణిజ్యవాహనాల రాకపోకలను నిలిపివేశారు. అయితే వసంత పంచమి తరువాత కొన్ని వాహనాలకు అనుమతులిచ్చారు. దీంతో కొంతమేరకు సమస్య పరిష్కారమయ్యింది. ఇయితే ఇప్పుడు తిరిగి ఆ ఆహార నిల్వలు ఖాళీ అయిపోయాయి.
ప్రయాగ్‌రాజ్‌కు చెందిన రిటైల్ వ్యాపారి దీపక్ కేసర్వానీ మీడియాతో మాట్లాడుతూ తాను చక్కెర కొనడానికి హోల్‌సేల్ మార్కెట్‌కు వెళ్లగా, అక్కడ చక్కెర నిల్వలు లేనట్లు తెలిసిందన్నారు. మరో వ్యాపారి మాట్లాడుతూ తాను 50 కిలోల చక్కెర కోసం ప్రయత్నించగా, 15 కిలోలు మాత్రమే దొరికిందన్నారు. పప్పుధాన్యాలతో నిండిన ట్రక్కులు గత కొన్ని రోజులుగా చక్‌ఘాట్ సరిహద్దు వద్దనే ఉండిపోయాయని, వాటిని ప్రయాగ్‌రాజ్‌లోనికి అనుమతించడం లేదని గ్రెయిన్ ఆయిల్ సీడ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ కేసర్వానీ తెలిపారు. నగరంలో ఆహారధాన్యాలు, నిత్యావసరాల కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్?
Comments
Please login to add a commentAdd a comment