బంగారుతల్లిని కొనసాగించం
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకాన్ని ప్రభుత్వం ఇకపై కొనసాగించబోదని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. పురిట్లోనే ఆడపిల్లలను చంపుకొనే పరిస్థితుల నుంచి ఆయా కుటుంబాలను బయటపడేసే బంగారుతల్లి పథకాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత కోరారు. ఈ మేరకు తుమ్మల మాట్లాడుతూ.. తల్లి ఆరోగ్యంతో పాటు, పుట్టిన ఆడపిల్ల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటోందన్నారు.
వివాహ వయస్సు వచ్చాక పేద కుటుంబాల్లోని ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థికసాయం అందిస్తున్నందున, బంగారు తల్లి వంటి నగదు బదిలీ పథకం అవస రం లేదన్నారు. కాగా, రాష్ట్రంలో మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్సీ యాదవరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి సమాధానం ఇచ్చారు. సూక్ష్మ సాగుకు సంబంధించి ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం బదులిస్తూ.. డ్రిప్ ఇరిగేషన్ కోసం దరఖాస్తు చేసిన రైతులందరికీ సబ్సిడీ అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు నాబార్డ్ నుంచి రూ.1,000 కోట్లు తీసుకుంటున్నామని, మరో రూ.300కోట్లు బడ్జెట్‌లో కేటాయించామన్నారు.