భారమైన కన్నపేగు
ఆర్థిక పరిస్థితులే అడ్డు
శిశువిహార్‌కు అప్పగింత
టేక్మాల్: నవ మాసాలు మోసిన తల్లి.. ఎల్లకాలం ఆడపిల్లను మోసే పరిస్థితి లేక చేతులెత్తేసింది. పరిస్థితులకు తలొగ్గి చిన్నారి భవిష్యత్ కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. భారమైన హృదయంతో ఐదు నెలల పసికందును శిశువిహార్‌కు అప్పగించింది. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెల్పుగొండలో మంగళవారం చోటుచేసుకుంది. టేక్మాల్ మండలం వెల్పుగొండకు చెందిన తుపాకి మంజుల, రాంచందర్ దంపతులు. వీరిది నిరుపేద కుటుంబం.
కొద్దిపాటి భూమిలో వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. మూడో సంతానం కోసం చూసిన మంజుల గత ఏడాది సెప్టెంబర్ 30న మెదక్ ఆస్పత్రిలో ఒకే కాన్పులో ముగ్గురికి (ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు) జన్మనిచ్చింది. మొత్తంగా ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలతో వీరి సంతానం ఐదుకు చేరింది. ఇంతమందిని పోషించడం ఆ కుటుంబానికి భారంగా మారింది. పుట్టిన నాటి నుంచే ఆడపిల్లను ఎవరికైనా విక్రయించాలా?, లేదా శిశు విహార్‌కు అప్పగించాలా? అనే ఆలోచన చేశారు. వీరికి ఐసీడీఎస్, శిశుసంక్షేమశాఖ అధికారులు పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ పోషణ భారమైంది. వీరి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న ఐసీడీఎస్ పరిధిలోని బాలల సంక్షేమశాఖ అధికారి విఠల్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సంధ్యారాణి, అంగన్‌వాడీ టీచర్ కవిత మంగళవారం గ్రామానికి రాగా సర్పంచ్ గందం పౌలు ఆధ్వర్యంలో ఆ చిన్నారిని వారికి అప్పగించారు.
కలచి వేసిన తల్లి రోదన
తన శిశువును అధికారులకు అప్పగించిన తల్లి మంజుల రోదన అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించింది. నవమాసాలు మోసిన కూతురిని కళ్లముందే పెంచాలని భావించినా.. ఆర్థిక పరిస్థితులు అడ్డుగా నిలవడంతో శిశువిహార్‌కు అప్పగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కన్నపేగును చేతులారా దూరం చేసుకునే పరిస్థితి ఆ తల్లికి ఏర్పడిన తీరును చూసి అక్కడున్న వారిని కలచివేసింది.