Shishu Vihar
-
ఆ పిల్లల రోదన తీరేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: అప్పటివరకు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పసిపిల్లలను ఒక్కసారిగా తమ నుంచి దూరం చేశారని పెంపుడు తల్లిదండ్రుల ఆవేదన ఒకవైపు.. కన్నవాళ్లు, పెంపుడు తల్లిదండ్రులు.. ఎవరూ కనిపించక పిల్లల రోదన మరోవైపు.. వెరసి యూసుఫ్‌గూడలోని శిశు విహార్ వద్ద పరిస్థితి కంటనీరు తెప్పిస్తోంది. పరారీలో ఉన్న ఢిల్లీ, పుణేకు చెందిన ప్రధాన నిందితులు పోలీసులకు చిక్కి, పిల్లల అసలు తల్లిదండ్రులు ఎవరనేది తేలే వరకూ ఈ పసికందుల ఆక్రందన తప్పేలా లేదు. సంచలనం సృష్టించిన పిల్లల విక్రయం కేసును ఎలా కొలిక్కి వస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్, విజయవాడకు చెందిన పిల్లల విక్రయం ముఠా ఇప్పటివరకు 60కి పైగా చిన్నారులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విక్రయించగా.. వీరిలో 13 మంది శిశువులను పోలీసులు రక్షించి, శిశు విహార్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. మధ్యవర్తులు ఢిల్లీ, పుణేలకు చెందిన కిరణ్, ప్రీతి, కన్నయ్య నుంచి పిల్లలను తీసుకొచ్చి, పెంపుడు తల్లిదండ్రులకు విక్రయించారు. ఈ పిల్లల అసలు తల్లిదండ్రులు ఎవరు? నిందితులు పేద తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని కొనుగోలు చేశారా? లేక అపహరించి, మధ్యవర్తుల ద్వారా విక్రయించారా? అనే అంశాలపై స్పష్టత వస్తేనే కేసు దర్యాప్తు ముందుకెళుతుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దీంతో కిరణ్, ప్రీతి, కన్నయ్యల కోసం నలుగురు సిబ్బంది చొప్పున రెండు ప్రత్యేక బృందాలు ఢిల్లీ, పుణేలలో గాలిస్తున్నాయి. పేరెంట్స్ ఎవరనేది తేలితేనే.. ఈ చిన్నారుల అసలు తల్లిదండ్రులు ఎవరనేది తేల్చడం పోలీసులకు సవాల్‌గా మారింది. పిల్లల డీఎన్ఏలతో తల్లిదండ్రుల డీఎన్ఏ నమూనాలను సరిపోల్చుతామని, ఒకవేళ పిల్లల డీఎన్ఏతో సరిపోలితే అసలు తల్లిదండ్రులకే అప్పగిస్తామని, ఒకవేళ తేలని పక్షంలో పిల్లల్ని తిరిగి శిశు విహార్కే తరలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. పిల్లలపై ఇష్టం లేని తల్లిదండ్రులకు బలవంతంగా ఇచ్చేయాలా? లేక పిల్లలంటే ప్రేమ చూపే పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించాలా? అనేది తేల్చలేని పరిస్థితి నెలకొంటుందని ఓ అధికారి తెలిపారు. త్వరలోనే పెంపుడు తల్లిదండ్రుల అరెస్టు.. పిల్లలను అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరం. ఇప్పటికే పిల్లలను విక్రయించిన 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఇక, పిల్లలను కొనుగోలు చేసిన దంపతులపై కూడా సీఆర్పీసీ, జువెనైల్ జస్టిస్ (జేజే) చట్టాల కింద కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. త్వరలోనే వీరిపై సెక్షన్ 370, 372, 373 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, 81, 87, 88 జువెనైల్ జస్టిస్ యాక్ట్–1985 కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేయనున్నట్లు సమాచారం. -
నాన్న వచ్చాడు.. నవ్వులు తెచ్చాడు!
షాద్‌నగర్ రూరల్: పేదరికం ఓడిపోయింది.. మమకారమే గెలిచింది.. పిల్లలపై ఉన్న ప్రేమ, వాత్సల్యం, అనురాగం, ఆప్యాయతను కాదనుకోలేక ఆ తండ్రి మనసు మార్చుకున్నాడు. శిశువిహార్‌కు తరలించిన చిన్నారులను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. తల్లిని కోల్పోయి, తండ్రికి దూరమై అనాథలుగా శిశువిహార్‌కు వెళ్లిన చిన్నారులపై కథనం ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన విషయం తెలిసిందే. (సీఎం ఆఫీసులో కరోనా కలకలం) మమకారమే గెలిచింది షాద్‌నగర్ పట్టణంలో ఉండే గణేశ్, శ్రీలత దంపతులకు పిల్లలు శ్రీగాయత్రి(4), హన్సిక (17 నెలలు) ఉన్నారు. శ్రీలత కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూయడంతో పిల్లల బాగోగులు చేసుకునేందుకు గణేశ్‌కు భారంగా మారింది. నిరుపేద కుటుంబానికి చెందిన అతడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. చిన్నారుల ఆలనాపాలనా చూసేవారు లేకపోవడంతో శుక్రవారం వారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించడంతో శిశువిహార్‌కు తరలించిన విషయం తెలిసిందే. హాస్టల్‌కు వెళ్లేటప్పుడు చిన్నారుల పరిస్థితి అందరి మనసులను కదిలించిన విషయం విదితమే. (మహిళల రక్షణ కోసం ‘స్త్రీ’) ‘నాన్న నేను మళ్లీ వస్తా.. అమ్మ బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తుండె.. ఆమె గుండెనొప్పితో చనిపోయింది.. అందుకే నేను మా చెల్లి హాస్టల్‌కు వెళ్తున్నాం’ అని చిన్నారి శ్రీగాయత్రి చెప్పడంతో స్థానికులు, అధికారులు భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. అయితే, భార్య మృతిచెందడం, పిల్లలు శిశువిహార్‌కు తరలివెళ్లడంతో ఒంటరిగా ఉన్న గణేశ్ మనసు చలించిపోయింది. పేదరికంలో ఉన్నా చిన్నారులను పోషించుకుంటానని భావించాడు. ఈనేపథ్యంలో మనసు మార్చుకున్న అతడు తన పిల్లలను తిరిగి అప్పగించాలని కోరుతూ శనివారం శిశువిహార్‌కు వెళ్లి అధికారులకు విజ్ఞప్తి చేశాడు. చిన్నారులను తాను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో పేదరికం ముందు తండ్రికి పిల్లలపై ఉన్న మమకారమే గెలిచింది. స్పందింపజేసిన కథనం ‘అమ్మలేదు..నాన్న పోషించ లేడు’ అని సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ప్రజలను స్పందింపచేసింది. హాస్టల్‌కు వెళ్లేటప్పుడు చిన్నారి శ్రీగాయత్రి చెప్పిన మాటలు అందరి హృదయాలను ద్రవింపజేశాయి. దీంతో గణేశ్ మనసు మార్చుకొని శనివారం శిశువిహార్‌కు వెళ్లి తన కూతుళ్లు శ్రీగాయత్రి, హన్సికను తిరిగి ఇంటికి తీసురావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. నా పిల్లలను బాగా చూసుకుంటాను.. ‘అనారోగ్యంతో నా భార్య కన్నుమూయటం, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పిల్లల పోషణ భారంగా మారింది. చిన్నారుల ఆలనాపాలనా చూసుకునేవారు లేకపోవడంతోనే వారిని శిశువిహార్‌కు అప్పగించాను. భార్య చనిపోవడం, పిల్లలు లేకపోవడంతో ఒంటరి వాడినయ్యాను. నా పిల్లలపై ఉన్న మమకారం, ప్రేమే వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేలా చేసింది. నా పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటాన’ని చిన్నారుల తండ్రి గణేశ్ వివరించాడు. -
నాన్నా మళ్లీ వస్తా..
షాద్‌నగర్ రూరల్: ఆ చిన్నారులకు జన్మనిచ్చిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. చిన్నారుల ఆలనా, పాలనా తండ్రికి భారంగా మారింది. ముక్కుపచ్చలారని పసిమొగ్గలను లాలించేందుకు అమ్మ లేకపోవడం.. వారి బాధ్యత నాన్నకు భారం కావడంతో ఆ చిన్నారులను ఐసీడీఎస్ అధికారులు శిశు విహార్‌కు తరలించారు. ఈ ఘటన శుక్రవారం షాద్‌నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల దీపాయిగూడకు చెందిన గణేష్ 16 సంవత్సరాల క్రితం షాద్‌నగర్‌కు వలస వచ్చాడు. పట్టణంలో కూలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో షాబాద్ మండలం సర్దార్‌నగర్‌కు చెందిన శ్రీలతతో పరిచయం ఏర్పడింది. (అమ్మ బతకాలని..) 9 సంవత్సరాల క్రితం గణేష్, శ్రీలత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూలీపని చేస్తూ రైల్వే స్టేషన్ సమీపంలో జీవనం కొనసాగిస్తున్నారు. వారికి శ్రీగాయత్రి(4), హన్సిక(17నెలలు) చిన్నారులు ఉన్నారు. శ్రీలత మూడు నెలల క్రితం గుండె సంబంధిత వ్యాధితో మృతిచెందింది. చిన్నారుల ఆలనా పాలనా చూసే తల్లి లేకపోవడంతో వారి బాధ్యత తండ్రికి భారంగా మారింది. ఈ విషయాన్ని తండ్రి గణేష్ అంగన్వాడీ టీచర్ జయమ్మ ద్వారా ఐసీడీఎస్ అధికారులకు సమాచారాన్ని అందించాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆ చిన్నారులను రెండు నెలల పాటు హోం క్వారంటైన్లో ఉంచి శుక్రవారం సీడీపీఓ నాగమణి ఆధ్వర్యంలో శిశు విహార్ ప్రతినిధులకు అప్పగించారు. (బుల్లెట్‌పై వంటలు.. రుచి చూడాల్సిందే!) నేను పెద్దయ్యాక మళ్లీ వస్తా చిన్నారులను అధికారులు శిశువిహార్‌కు తీసుకువెళ్లే సమయంలో ‘నాన్న నేను మళ్లీ వస్తా’ అంటూ చిన్నారి శ్రీగాయత్రి తండ్రి గణే‹శ్‌కు చెప్పింది. ‘మా అమ్మ బిస్కెట్లు, చాకెట్లు ఇప్పిస్తుండె. ఇప్పుడు గుండెనొప్పితో చనిపోయింది. అందుకే నేను మా చెల్లి హాస్టల్‌కు వెళ్తున్నాం. నేను పెద్దయ్యాక మళ్లీ వస్తా’ అంటూ ఆ చిన్నారి చెప్పిన మాటలు అందిరి మనసులను కదిలించాయి. ముక్కుపచ్చలారని పిల్లలు పసితనంలోనే తల్లిని కోల్పోయి మేము హాస్టల్‌కు వెళుతున్నామంటూ అమాయకత్వంతో ఆ చిన్నారి చెప్పడాన్ని చూసిన వారి కళ్లు చెమ్మగిల్లాయి.(భళారే చార్కోల్ చిత్రాలు) -
బాలుడి అపహరణ.. విక్రయానికి యత్నం
అమీర్‌పేట: రోడ్డుపై భిక్షాటన చేస్తున్న వ్యక్తి ఓ బాలుణ్ని అపహరించి అమ్మకానికి పెట్డాడు. సకాలంలో గుర్తించిన పోలీసులు సదరు బాలుడిని చేరదీసి శిశువిహార్‌కు తరలించారు.సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ రామారావునగర్‌లో ఉంటున్న పరశురాం రెండు కాళ్లూ లేకపోవడంతో జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం జవహర్‌నగర్ చౌరస్తా సమీపంలో ఏడాది వయసున్న బాలుణ్ని కాచికూడకు చెందిన కృష్ణ అనే వ్యక్తికి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కాచికూడకు చెందిన పరశురాం తన స్నేహితుడైన రవి ద్వారా ఎలక్ట్రిషియన్ కృష్ణకు బాలుడిని రూ.40 వేలకు విక్రయించేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. మూసాపేట కూరగాయల మార్కెట్ వద్ద బాలుడు తనకు దొరికాడని నిందితుడు చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. పరశురాంతో పాటు కృష్ణ, రవిలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.బాలుడిని శిశువిహార్‌కు తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు..చిన్నారిని సాకలేం..
షాద్‌నగర్ రూరల్: కూలీపని చేసుకుకే తమకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని, నాలుగో కాన్పులోనూ అమ్మాయి పుట్టడంతో సాకడం కష్టంగా మారిందని ఆ తల్లిదండ్రులు పాపను శిశువిహార్‌లో అప్పగించారు. అధికారులు వారికి సర్దిచెప్పే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఉప్పరిగడ్డ తండాలో సోమవారం జరిగింది. వివరాలు.. తండాకు చెందిన రవి, మమత దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కొంతకాలం క్రితం మమత గర్భం దాల్చింది. నాలుగో కాన్పులో అబ్బాయి పుడుతాడని ఆశించారు. అయితే, నాలుగు రోజుల క్రితం ఆమె పాపకు జన్మనిచ్చింది. దీంతో తాము సాకలేమని, అమ్మాయిని ఎవరికైనా ఇస్తామని అంగన్వాడీ టీచర్ అంజమ్మను దంపతులు సంప్రదించారు. ఈ విషయాన్ని అంజమ్మ సీడీపీఓ నాగమణి దృష్టికి తీసుకెళ్లారు. సీడీపీఓ నాగమణి గ్రామానికి వెళ్లి చిన్నారి తల్లిండ్రులతో మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలకు తేడా లేదని, బాలికలను బాగా చదివిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నచ్చజెప్పే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పాప తల్లిదండ్రులు ఎంతకూ అంగీకరించలేదు. దీంతో ఐసీడీఎస్ సూపర్వైజర్లు భవానీ, దివ్యాసిని ఆధ్వర్యంలో తల్లితండ్రుల సమక్షంలో చిన్నారిని నగరంలోని శిశువిహార్‌లో అప్పగించారు. -
బాలుడి మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
ధర్మవరానికి చెందిన ఇంద్రనీల్‌వర్మ (5) డెంగీ జ్వరంతో బాధపడుతూ అనంతపురంలోని ‘శిశు కేర్’ ఆస్పత్రిలో ఆదివారం మృతి చెందగా. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి నిర్వాహకుడితో పాటు ఐఎంఏ నాయకుడిపై దాడి చేశారు. సాక్షి, అనంతపురం: అనంతపురం రామచంద్రనగర్ ‘శిశు కేర్’ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... ధర్మవరంకు చెందిన లోకేష్, దేవి దంపతుల కుమారుడు ఇంద్రనీల్‌వర్మ (5) జ్వరంతో బాధపడుతుండటంతో ఈ నెల 5న ‘శిశు కేర్’ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు డెంగీ, న్యుమోనియాతో బాధపడుతున్నట్లు చెప్పి చికిత్స ప్రారంభించారు. శనివారం అర్ధరాత్రి మూత్ర విసర్జనకు వెళ్లి వచ్చిన బాలుడు.. కాసేపటికే కళ్లు తేలేయడంతో కుటుంబ సభ్యులు వైద్యుడికి సమాచారం అందించారు. రాత్రి 1:30 సమయంలో డాక్టర్ మౌలాలి అహ్మద్ బాషా వచ్చి బాలుడిని పరీక్షించి పరిస్థితి విషమంగా ఉండటంతో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ఈలోగానే బాలుడు మరణించాడు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు డాక్టర్ అహ్మద్ బాషా, ఐఎంఏ ఉపాధ్యక్షుడు మనోరంజన్‌రెడ్డిపై దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి కుటుంబ సభ్యులను శాంతింపజేశారు. డాక్టర్ అహ్మద్ బాషా నిర్లక్ష్యం వహించారన్న కారణంతో డీఎంహెచ్‌వో డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్ షోకాజ్ జారీ చేశారు. కాగా, వైద్యులపై దాడిని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ వైద్య మండలి సభ్యుడు డాక్టర్ ఎస్వీకే ప్రసాద్‌రెడ్డి ఖండించారు. -
చిన్నారులపై చిన్న చూపేలా?
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో దొరికిన పిల్లలు, లైంగిక దాడులకు గురైన చిన్నారులకు కుటుంబ వాతావరణం కల్పించి వారి బాగోగులు చూడాల్సిన శిశు విహర్ కేంద్రాలు ఆ దిశగా పనిచేయడం లేదని బాలల హక్కుల సంఘం మండిపడింది. ఇటీవల హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ శిశు విహార్ కేంద్రంలో 4 రోజుల వయసున్న నిత్య తలకు గాయమై, 9 నెలల వయసున్న సత్యశ్రీ ఫంగల్ ఇన్ఫెక్షన్తో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనల్లో సిబ్బంది నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ శిశు విహార్ కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే చిన్నారులు మృతి చెందారని, వారి మరణానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం బాలల హక్కుల సంఘం హెచ్ఆర్సీలో పిటిషన్ వేసింది. -
పెంటకుప్పలో ఆడశిశువు
♦ పడేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు ♦ బంట్వారం మండలం తొర్మామిడిలో వెలుగు చూసిన ఘటన ♦ తాండూరు ఆస్పత్రికి తరలించిన అంగన్వాడీ సిబ్బంది బంట్వారం(వికారాబాద్): అప్పుడే పుట్టిన ఓ ఆడ శిశువు పెంటకుప్ప పాలైంది. ఎవరో పాషాణ హృదయులు పడేసి వెళ్లిపోయారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం బంట్వారం మండల పరిధిలోని తొర్మామిడిలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ మహిళ సాయంత్రం 6 గంటలకు బహిర్భూమికి వెళ్లగా ఆమెకు ఓ చెత్తకుప్పలోంచి పసికందు రోదనలు వినిపించాయి. దీంతో ఆమె వెంటనే స్థానికులకు విషయం తెలిపింది. సమాచారం అందుకున్న అంగన్వాడీ కార్యకర్తలు మరియమ్మ, లలత, స్వప్న, విజయలక్ష్మితదితరులు అక్కడికి చేరుకున్నారు. ముళ్లపొదలు, చెత్తకుప్పలో ఉన్న అప్పుడే పుట్టిన ఆడపిల్లను గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్‌ను పిలిపించి తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశివు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాప బరువు రెండు కేజీల కంటే తక్కువగా ఉన్నందున 10 రోజులు పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. అనంతరం నగరంలోని శిశు విహార్‌కు తరలించనున్ననట్లు ఐసీడీఎస్ సూపర్ వైజర్ జగదాంబ తెలిపారు. అయితే, గ్రామానికి చెందిన గుర్తుతెలియని మహిళ ఆడపిల్ల జన్మించడంతో పెంచుకోవడం ఇష్టం లేక చెత్తకుప్పలో పడేసి వెళ్లినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. లేదా.. వివాహేతర సంబంధం నేపథ్యంలో పుట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరాలేదు. -
చిన్నారులను శిశువిహార్‌కు తరలింపు
మోత్కూరు: మోత్కూరుకు చేరిన చిన్నారులను ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని శిశువిహార్‌కు తరలించారు. వివరాలు.. మోత్కూరు కొత్త బస్టాండ్‌లో ఆదివారం రాత్రి ఓ తండ్రి కిషన్ (4), అంజలి(3)ని వదిలి వెల్లాడు. అక్కడ స్థానికులు గమనించి మీది ఏ ఊరు, ఎక్కడి వచ్చారని వివరాలు అడిగారు. దీంతో మానాన్న పేరు నర్సింహ్మ, అమ్మ అనిత అని, మాది పాలమూరు అని చెప్పారు. మా నాన్న ఇక్కడ నిలిచోపెట్టి మల్లివస్తానని వెళ్లాడని చిన్నారులు తెలిపారు. రాత్రి కావడంతో స్థానిక పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ ఎస్కె. జానీమియాకు అప్పగించారు. అంగన్వాడీ కార్యకర్తలు శ్రీదేవి, సునితలకు అప్పగించగా స్థానిక కస్తూరిభా బాలికల పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ యాదమ్మ వద్దకు తీసుకెళ్లారు. చిన్నారులు సరైన వివరాలు చెప్పకపోవడంతో ఎంఈఓ మన్నె అంజయ్య సమక్షంలో హెడ్‌కానిస్టేబుల్ జానిమియా, సీడీపీఓ వై.వి ఝాన్సీలక్ష్మీకి అప్పగించారు. వీరిని నల్లగొండలోని ప్రభుత్వ శిశు విహార్‌లో చేర్పించనున్నట్లు సీడీపీఓ తెలిపారు. హైదరాబాద్‌లోని లాలాపేట ప్రాంతంలో తాము అమ్మనాన్నలతో ఉన్నట్లు చిన్నారులు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు మంగమ్మ, ప్రమీళ, ఎస్ఓ యాదమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు శ్రీదేవి, నిర్మల, హోంగార్డు సిద్దక్ తదితరులు ఉన్నారు. . -
భారమైన కన్నపేగు
ఆర్థిక పరిస్థితులే అడ్డు శిశువిహార్‌కు అప్పగింత టేక్మాల్: నవ మాసాలు మోసిన తల్లి.. ఎల్లకాలం ఆడపిల్లను మోసే పరిస్థితి లేక చేతులెత్తేసింది. పరిస్థితులకు తలొగ్గి చిన్నారి భవిష్యత్ కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. భారమైన హృదయంతో ఐదు నెలల పసికందును శిశువిహార్‌కు అప్పగించింది. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెల్పుగొండలో మంగళవారం చోటుచేసుకుంది. టేక్మాల్ మండలం వెల్పుగొండకు చెందిన తుపాకి మంజుల, రాంచందర్ దంపతులు. వీరిది నిరుపేద కుటుంబం. కొద్దిపాటి భూమిలో వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. మూడో సంతానం కోసం చూసిన మంజుల గత ఏడాది సెప్టెంబర్ 30న మెదక్ ఆస్పత్రిలో ఒకే కాన్పులో ముగ్గురికి (ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు) జన్మనిచ్చింది. మొత్తంగా ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలతో వీరి సంతానం ఐదుకు చేరింది. ఇంతమందిని పోషించడం ఆ కుటుంబానికి భారంగా మారింది. పుట్టిన నాటి నుంచే ఆడపిల్లను ఎవరికైనా విక్రయించాలా?, లేదా శిశు విహార్‌కు అప్పగించాలా? అనే ఆలోచన చేశారు. వీరికి ఐసీడీఎస్, శిశుసంక్షేమశాఖ అధికారులు పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ పోషణ భారమైంది. వీరి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న ఐసీడీఎస్ పరిధిలోని బాలల సంక్షేమశాఖ అధికారి విఠల్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్ కవిత మంగళవారం గ్రామానికి రాగా సర్పంచ్ గందం పౌలు ఆధ్వర్యంలో ఆ చిన్నారిని వారికి అప్పగించారు. కలచి వేసిన తల్లి రోదన తన శిశువును అధికారులకు అప్పగించిన తల్లి మంజుల రోదన అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించింది. నవమాసాలు మోసిన కూతురిని కళ్లముందే పెంచాలని భావించినా.. ఆర్థిక పరిస్థితులు అడ్డుగా నిలవడంతో శిశువిహార్‌కు అప్పగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కన్నపేగును చేతులారా దూరం చేసుకునే పరిస్థితి ఆ తల్లికి ఏర్పడిన తీరును చూసి అక్కడున్న వారిని కలచివేసింది. -
మళ్లీ ఆడపిల్లే పుట్టిందని..
అచ్చంపేట (మహబూబ్‌నగర్ జిల్లా) : నాలుగవసారి కూడా ఆడపిల్ల పుట్టడంతో ఓ దంపతులు పుట్టిన పాపను ఐసీడీసీ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో చోటుచేసుకుంది. సింగారం గ్రామానికి చెందిన భీంజీ,లలిత దంపతులకు గతంలో ముగ్గురు ఆడపిల్లలు సంతానం. భీంజీ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో హమాలీగా పని చేస్తున్నాడు. కాగా మగపిల్లాడి కోసం ఎదురుచూస్తున్న వారికి నాలుగవ సంతానంగా కూడా ఆడపిల్లే పుట్టింది. దీంతో పాపను పెంచలేమని చెప్పి ఆ పసికందును ఐసీడీసీ అధికారులకు అప్పగించారు. ఐసీడీసీ అధికారులు బాలికను శిశువిహార్‌కు తరలించనున్నట్లు సమాచారం. -
దత్తతకు పిల్లలు కావలెను..!
లైఫ్ ఛేంజ్ ఎఫెక్ట్ సిటీలో పెరుగుతున్న సంతానలేమి జంటలు దత్తత కోసం శిశువిహార్‌కు దరఖాస్తుల వెల్లువ ఎదురు చూపుల్లో వెయ్యికి పైగా జంటలు ఆలస్యపు పెళ్లిళ్లు.. మారిన జీవనశైలి.. రోజంతా పని ఒత్తిడి.. ఆపై అధిక బరువు.. వెరసి నవ దంపతుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా సంతానం కలగక పోవడంతో తోడు కోసం అనాథ పిల్లలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. దత్తతకు పిల్లలు కావాలని కోరుతూ ఇప్పటికే అనేక మంది శిశువిహార్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, వారికి పిల్లలు మాత్రం దొరకడం లేదు. ఏడాది లోపు బిడ్డ కావాలంటే సుమారు ఆరేళ్లు ఆగాల్సి వస్తోంది. దీంతో చాలామంది దంపతులు ఆందోళన చెందుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో కప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాదిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చేవారు. ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. అధిక పని ఒత్తిడితో పాటు ఉష్ణోగ్రతలకు హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది. ఆకలి తీర్చుకునేందుకు పిజ్జాలు, బర్గర్లతో కడుపు నింపుకోవడంతో స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి తోడు భార్య ఒక షిఫ్ట్.. భర్త మరో షిఫ్ట్‌లో ఆఫీసుకు వెళ్తుండడం వల్ల వారు కనీస దాంపత్యానికి నోచుకోలేకపోతున్నారు. వీకెండ్లో పార్టీల పేరుతో మద్యం తీసుకోవడం వల్ల శృంగార సమస్యలు తలెత్తుతున్నాయి. పెళ్లై నాలుగైదేళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో చివరకు సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (ఐవీఎఫ్), ఇంట్రాసైటో ప్లాస్మి క్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) చికిత్సలు సైతం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే అంశంపై 2013లో నగరానికి చెందిన ఇద్దరు దంపతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తను ఆశ్రయించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంటిరిగా జీవించలేక, పిల్లలపై మమకారం చంపుకోలేక అనాథలను దత్తత తీసుకునేందుకు దంపతులు ముందుకు వస్తున్నా, పిల్లలు దొరకని పరిస్థితి తలెత్తింది. దత్తతకు ఆరేళ్లు ఆగాల్సిందే.. గతంతో పోలిస్తే దంపతుల వైఖరిలో చాలా మార్పులు వచ్చాయి. ఆడపిల్లలు భారమని భావించే రోజులు పోయాయి. శిశు విహార్‌లో పిల్లలను దత్తత తీసుకుంటున్న దంపతుల జాబితాను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. ప్రస్తుతం పిల్లల కోసం 1100 మందికిపైగా ఎదురు చూస్తున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆడశిశువు కావాలంటే కనీసం మూడేళ్లు సమయం పడుతుండగా, మగ శిశువుకు ఐదు నుంచి ఆరే ళ్లు పడుతోంది. పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నా.. అది కూడా గ్యారంటీ లేదు. ఇదిలా ఉంటే గత పదమూడేళ్లలో శిశువిహార్ ద్వారా మొత్తం 2047 మందిని దత్తత ఇవ్వడం గమనార్హం. ఐటీ అనుబంధ ఉద్యోగుల్లో అధికం నగరంలో 30కి పైగా ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా, మా ఆస్పత్రికి ప్రతి రోజూ సగటున 30 కేసులు వస్తున్నాయి. వీరిలో అధిక శాతం ఐటీ, కాల్ సెంటర్స్, మీడియా అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న దంపతులే. ముందు వీరికి పరీక్షలు చేసి లోపాన్ని గుర్తిస్తాం. తొలుత మందులతో ప్రయత్నిస్తాం. అయినా ఫలితం లేకపోతే ఐవీఎఫ్, ఐసీఎస్ఐ వంటి కృత్రిమ పద్ధతుల్లో టెస్ట్‌ట్యూబ్ బేబీకి సిఫారసు చేస్తాం. చిన్న వయసులోనే మోనోపాజ్ వస్తుండటం వల్ల నగరంలో చాలా మంది రెండో సారి గర్భధారణకు నోచుకోవడంలేదు. - డాక్టర్ చందన, నోవా ఇన్ఫెర్టిలిటీ సెంటర్ -
ముళ్లపొదల్లో చిన్నారి
నంద్యాల టౌన్ : తల్లిదండ్రులు చెత్తకుప్ప పాలు చేసిన ఓ చిన్నారిని మానవతామూర్తి అక్కున చేర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ ఆగ్నేష్ ఏంజల్ పాపను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల తర్వాత ఆమెను కర్నూలులోని శిశువిహార్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇస్మాయిల్, అధికారులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. ఆడ పిల్ల అనో.. మరే ఇతర కారణాలతోనో మూడు రోజుల వయస్సు చిన్నారిని కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో బొమ్మలసత్రం వద్దనున్న కుందూ నది ఒడ్డున ముళ్లకంప మధ్య వదిలేశారు. బహిర్భూమికి వెళ్లిన మూలసాగరం వాసి ఇస్మాయిల్ చిన్నారి ఏడుపు వినిపిస్తుండటంతో అటువైపుగా వెళ్లి అక్కున చేర్చుకున్నాడు. ఆ సమయంలో కుక్కలు గుమికూడి ఉండటంతో వాటిని తరిమేశాడు. పాపను ఇంటికి తీసుకెళ్లగా కుటుంబ సభ్యులు స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించి అందంగా ముస్తాబు చేశారు. ఆ తర్వాత విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త సుశీలకు తెలియజేశారు. ఆమె సమాచారంతో ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ ఆగ్నేష్ ఏంజల్ అక్కడికి చేరుకున్నారు. అయితే కొన్ని గంటల పాటు తమ వద్దే ఉంచుకున్న ఇస్మాయిల్ కుటుంబం పాపను విడిచిపెట్టలేక దత్తత తీసుకుంటామని సీడీపీఓను కోరగా అందుకామె నిరాకరించారు. దీంతో వారు ఆమెతో వాగ్వాదానికి దిగారు. విధిలేని పరిస్థితుల్లో సీడీపీఓ.. త్రీటౌన్ పోలీసుస్టేషన్లో సీఐ దైవప్రసాద్‌కు ఫిర్యాదు చేసి పోలీసుల సహాయంతో చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాపకు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్యురాలు లలిత పరీక్షించారు. నెలలు నిండక మునుపే జన్మించడంతో బరువు తక్కువగా ఉందని.. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆమె తెలిపారు. రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి కర్నూలులోని శిశువిహార్‌కు తరలిస్తామని సీడీపీఓ వెల్లడించారు. తల్లిదండ్రులకు పిల్లలు భారమైతే ఇలా పారేయకుండా సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లో అప్పగించాలని.. వివరాలను సైతం గోప్యంగా ఉంచుతామన్నారు. చిన్నారిని కాపాడిన ఇస్మాయిల్‌ను ఆమె అభినందించారు.