చిన్నారి తల్లితండ్రులతో మాట్లాడుతున్న సీడీపీఓ నాగమణి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు
షాద్‌నగర్ రూరల్: కూలీపని చేసుకుకే తమకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని, నాలుగో కాన్పులోనూ అమ్మాయి పుట్టడంతో సాకడం కష్టంగా మారిందని ఆ తల్లిదండ్రులు పాపను శిశువిహార్‌లో అప్పగించారు. అధికారులు వారికి సర్దిచెప్పే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఉప్పరిగడ్డ తండాలో సోమవారం జరిగింది. వివరాలు.. తండాకు చెందిన రవి, మమత దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కొంతకాలం క్రితం మమత గర్భం దాల్చింది. నాలుగో కాన్పులో అబ్బాయి పుడుతాడని ఆశించారు.
అయితే, నాలుగు రోజుల క్రితం ఆమె పాపకు జన్మనిచ్చింది. దీంతో తాము సాకలేమని, అమ్మాయిని ఎవరికైనా ఇస్తామని అంగన్‌వాడీ టీచర్ అంజమ్మను దంపతులు సంప్రదించారు. ఈ విషయాన్ని అంజమ్మ సీడీపీఓ నాగమణి దృష్టికి తీసుకెళ్లారు. సీడీపీఓ నాగమణి గ్రామానికి వెళ్లి చిన్నారి తల్లిండ్రులతో మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలకు తేడా లేదని, బాలికలను బాగా చదివిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నచ్చజెప్పే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పాప తల్లిదండ్రులు ఎంతకూ అంగీకరించలేదు. దీంతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు భవానీ, దివ్యాసిని ఆధ్వర్యంలో తల్లితండ్రుల సమక్షంలో చిన్నారిని నగరంలోని శిశువిహార్‌లో అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment