అటు కన్న పేగు.. ఇటు పెంచిన ప్రేమకు దూరం
అనాథల్లా శిశు విహార్‌లో 13 మంది చిన్నారులు
చుట్టూ కొత్తవారు కావడంతో గుక్కపెట్టి ఏడుపులు
అసలు పేరెంట్స్ ఎవరనేది తేలే వరకూ తప్పని రోదన
ప్రధాన నిందితులు చిక్కితేనే కేసు కొలిక్కి
ఢిల్లీ, పుణేల్లో రెండు ప్రత్యేక బృందాల గాలింపు
త్వరలోనే పెంపుడు తల్లిదండ్రుల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: అప్పటివరకు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పసిపిల్లలను ఒక్కసారిగా తమ నుంచి దూరం చేశారని పెంపుడు తల్లిదండ్రుల ఆవేదన ఒకవైపు.. కన్నవాళ్లు, పెంపుడు తల్లిదండ్రులు.. ఎవరూ కనిపించక పిల్లల రోదన మరోవైపు.. వెరసి యూసుఫ్‌గూడలోని శిశు విహార్ వద్ద పరిస్థితి కంటనీరు తెప్పిస్తోంది. పరారీలో ఉన్న ఢిల్లీ, పుణేకు చెందిన ప్రధాన నిందితులు పోలీసులకు చిక్కి, పిల్లల అసలు తల్లిదండ్రులు ఎవరనేది తేలే వరకూ ఈ పసికందుల ఆక్రందన తప్పేలా లేదు.
సంచలనం సృష్టించిన పిల్లల విక్రయం కేసును ఎలా కొలిక్కి వస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్, విజయవాడకు చెందిన పిల్లల విక్రయం ముఠా ఇప్పటివరకు 60కి పైగా చిన్నారులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విక్రయించగా.. వీరిలో 13 మంది శిశువులను పోలీసులు రక్షించి, శిశు విహార్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. మధ్యవర్తులు ఢిల్లీ, పుణేలకు చెందిన కిరణ్, ప్రీతి, కన్నయ్య నుంచి పిల్లలను తీసుకొచ్చి, పెంపుడు తల్లిదండ్రులకు విక్రయించారు.
ఈ పిల్లల అసలు తల్లిదండ్రులు ఎవరు? నిందితులు పేద తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని కొనుగోలు చేశారా? లేక అపహరించి, మధ్యవర్తుల ద్వారా విక్రయించారా? అనే అంశాలపై స్పష్టత వస్తేనే కేసు దర్యాప్తు ముందుకెళుతుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దీంతో కిరణ్, ప్రీతి, కన్నయ్యల కోసం నలుగురు సిబ్బంది చొప్పున రెండు ప్రత్యేక బృందాలు ఢిల్లీ, పుణేలలో గాలిస్తున్నాయి.
పేరెంట్స్ ఎవరనేది తేలితేనే..
ఈ చిన్నారుల అసలు తల్లిదండ్రులు ఎవరనేది తేల్చడం పోలీసులకు సవాల్‌గా మారింది. పిల్లల డీఎన్‌ఏలతో తల్లిదండ్రుల డీఎన్‌ఏ నమూనాలను సరిపోల్చుతామని, ఒకవేళ పిల్లల డీఎన్‌ఏతో సరిపోలితే అసలు తల్లిదండ్రులకే అప్పగిస్తామని, ఒకవేళ తేలని పక్షంలో పిల్లల్ని తిరిగి శిశు విహార్‌కే తరలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. పిల్లలపై ఇష్టం లేని తల్లిదండ్రులకు బలవంతంగా ఇచ్చేయాలా? లేక పిల్లలంటే ప్రేమ చూపే పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించాలా? అనేది తేల్చలేని పరిస్థితి నెలకొంటుందని ఓ అధికారి తెలిపారు.
త్వరలోనే పెంపుడు తల్లిదండ్రుల అరెస్టు..
పిల్లలను అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరం. ఇప్పటికే పిల్లలను విక్రయించిన 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఇక, పిల్లలను కొనుగోలు చేసిన దంపతులపై కూడా సీఆర్‌పీసీ, జువెనైల్ జస్టిస్ (జేజే) చట్టాల కింద కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. త్వరలోనే వీరిపై సెక్షన్ 370, 372, 373 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, 81, 87, 88 జువెనైల్ జస్టిస్ యాక్ట్–1985 కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment