
పోలీసులకు చిక్కిన పరశురాం బాలుడిని శిశువిహార్‌కు తరలిస్తున్న పోలీసులు
అమీర్‌పేట: రోడ్డుపై భిక్షాటన చేస్తున్న వ్యక్తి ఓ బాలుణ్ని అపహరించి అమ్మకానికి పెట్డాడు. సకాలంలో గుర్తించిన పోలీసులు సదరు బాలుడిని చేరదీసి శిశువిహార్‌కు తరలించారు.సబ్ ఇన్స్‌పెక్టర్ భాస్కర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ రామారావునగర్‌లో ఉంటున్న పరశురాం రెండు కాళ్లూ లేకపోవడంతో జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం జవహర్‌నగర్ చౌరస్తా సమీపంలో ఏడాది వయసున్న బాలుణ్ని కాచికూడకు చెందిన కృష్ణ అనే వ్యక్తికి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
కాచికూడకు చెందిన పరశురాం తన స్నేహితుడైన రవి ద్వారా ఎలక్ట్రిషియన్ కృష్ణకు బాలుడిని రూ.40 వేలకు విక్రయించేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. మూసాపేట కూరగాయల మార్కెట్ వద్ద బాలుడు తనకు దొరికాడని నిందితుడు చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. పరశురాంతో పాటు కృష్ణ, రవిలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.బాలుడిని శిశువిహార్‌కు తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.