బయట కాపుకాసి.. కాళ్లు, చేతులు కట్టేసి.. | Anusha and Pratyusha and Srivaishnavi fought bravely against the accused | Sakshi
Sakshi News home page

బయట కాపుకాసి.. కాళ్లు, చేతులు కట్టేసి..

Published Sat, Jun 1 2024 4:06 AM | Last Updated on Sat, Jun 1 2024 7:32 AM

Anusha and Pratyusha and Srivaishnavi fought bravely against the accused

ముగ్గురు అక్కాచెల్లెళ్లు అనూష, శ్రీవైష్ణవి, ప్రత్యూష

పిల్లాడిని కొనుగోలు చేస్తామంటూ శోభారాణిని ట్రాప్‌ చేసిన అక్షర ఫౌండేషన్‌ నిర్వాహకులు 

సీక్రెట్‌ కెమెరాలతో ఈ వ్యవహారమంతా రికార్డింగ్‌ 

పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులతో ధైర్యంగా పోరాడిన అనూష, ప్రత్యూష, శ్రీవైష్ణవి 

శోభారాణి విచారణ అనంతరం వెలుగులోకి ఢిల్లీ, పుణే లింక్‌లు  

సంచలనం సృష్టించిన పిల్లల విక్రయం కేసు వెనుక ముగ్గురు ధీర వనితల పోరాటం దాగి ఉంది. అక్షర జ్యోతి ఫౌండేషన్‌ను నిర్వహించే అక్కాచెల్లెళ్లు ధైర్య సాహసాలతో ఈ మానవ అక్రమ రవాణా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పీర్జాదిగూడలో ఆర్‌ఎంపీ శోభారాణితో పాటు స్వప్న, షేక్‌ సలీంలను పట్టుకున్నారు. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన తీరును అక్కాచెల్లెళ్లు అనూష, శ్రీవైష్ణవి, ప్రత్యూషలు ‘సాక్షి’తో పంచుకున్నారు. 

మహిళ ఇచ్చిన సమాచారంతో.. 
అక్షర జ్యోతి ఫౌండేషన్‌ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ మహిళ అనూషను సంప్రదించింది. తనకు పిల్లల్లేరని, శోభారాణి పిల్లలను విక్రయిస్తున్నట్టుగా తెలిసిందని, ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ శోభారాణి ఫోన్‌ నంబర్‌ ఇచ్చింది. షాక్‌కు గురైన అక్కాచెల్లెళ్లు శోభారాణి కార్యకలాపాలపై స్టింగ్‌ ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరికి యూట్యూబ్‌ చానల్‌ విలేకరి సాయికుమార్‌ సహకరించారు. 

సీక్రెట్‌ కెమెరాలతో క్లినిక్‌లోకి..:  ఈనెల 21న శ్రీవైష్ణవి పిల్లల్లేని తల్లిగా నటిస్తూ తనకో బిడ్డ కావాలని శోభారాణిని కలిసింది. దీంతో ఆమె వాట్సాప్‌లో అబ్బాయి, అమ్మాయి ఫొటోలను పంపించింది. బాబును కొనేందుకంటూ రూ.4.50 లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చెల్లించారు. ఆ మరుసటి రోజు ఉదయమే పీర్జాదిగూడలోని క్లినిక్‌కు వచ్చి బాబును తీసుకెళ్లాలని శోభ సూచించింది.

దీంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, సాయికుమార్‌తో శివ, శ్రీనివాస్‌ అనేవారు బృందంగా ఏర్పడి, సీక్రెట్‌ కెమెరాలను ధరించి క్లినిక్‌ లోపలికి వెళ్లారు. ఒకవేళ నిందితులు అనుమానంతో తమపై దాడి చేసినా, పారిపోయేందుకు ప్రయత్నించినా పట్టుకునేందుకు వీలుగా క్లినిక్‌కు వెళ్లే రెండు మార్గాలలో మరో 10 మందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. క్లినిక్‌ లోపల నిందితులు శోభారాణి, స్వప్నలతో జరిగే సంభాషణలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు బయట ఉన్న బృందానికి వాట్సాప్‌ మెసేజ్‌లలో చేరవేస్తూ ఏమాత్రం తేడా వచి్చనా వారు సహాయపడేలా రంగం సిద్ధం చేసుకున్నారు. 

ఆల్టో కారులో బాబును తెచ్చి.. 
    వారు క్లినిక్‌లోకి వెళ్లిన అరగంటలో మరో నిందితుడు షేక్‌ సలీం తెలుపు రంగు ఆల్టో కారులో బాబును తీసుకొచ్చాడు. క్లినిక్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉండే భవనం యజమాని ఇంట్లోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత శోభరాణి వెళ్లి బాబును తీసుకుని క్లినిక్‌ లోపలికి వచ్చింది. రెండు నకిలీ ఆధార్‌ కార్డులను ఇస్తూ వీళ్లే బాబు తల్లిదండ్రులు అని చెప్పింది. ఇంకో రూ.20 వేలు అదనంగా ఇస్తే బాబు బర్త్‌ సరి్టఫికెట్‌ కూడా ఇస్తానని, దీంతో మీరే సొంత తల్లి అయిపోతారని శ్రీవైష్ణవికి శోభ సూచించింది. ఒప్పందం మేరకు మిగతా డబ్బును అందించాలని కోరింది. దీంతో బయటికెళ్లి తీసుకొస్తానని శ్రీవైష్ణవి తలుపులు తెరవడంతో అప్పటికే బయట ఉన్న వారిని చూసిన శోభ, ఇతర నిందితులు ఇదంతా ట్రాప్‌ అని గ్రహించారు. 

చున్నీతో కాళ్లు, చేతులు కట్టేసి.. 
    శోభారాణి, స్వప్న, సలీంలు క్లినిక్‌ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ బయట ఉన్న బృందం కాపు కాస్తుండటంతో వారికి చాన్స్‌ లేకుండా పోయింది. సలీం గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ప్రత్యూష బలంగా అతన్ని పట్టుకొని, చున్నీతో అతని కాళ్లు, చేతులు కట్టేసింది. అతన్ని పక్కన ఉన్న పిల్లర్‌కు కట్టిపడేసింది. ఇదంతా స్టింగ్‌ ఆపరేషన్‌ తెలిసిపోవడంతో శోభారాణి ఏడుపు మొదలుపెట్టింది.

పోలీసులకు ఫోన్‌ చేయవద్దని సెటిల్‌మెంట్‌ చేసుకుందామంటూ ఆఫర్‌ ఇచ్చింది. ఈలోగా డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో మేడిపల్లి పోలీసులు వచ్చారు. నిందితులను ఠాణాకు తరలించి, బాబును చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ అధికారులకు అప్పగించారు. నిందితులను పోలీసులు విచారించగా.. ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యల నుంచి పసికందులను కొనుగోలు చేసి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. 

లింగ నిర్ధారణ, గర్భస్రావాలు కూడా.. 
శోభారాణి 20 ఏళ్లుగా పీర్జాదిగూడలో ఫస్ట్‌ ఎయిర్‌ సెంటర్‌ పేరుతో క్లినిక్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ముందు గదిలో క్లినిక్‌ ఉండగా.. వెనుక గది అంతా చీకటిగా ఉంది. ఇందులో శస్త్ర చికిత్సల కత్తెర్లు, క్లాంప్స్, బోన్‌ కట్టర్స్, సూదులు వంటి సర్జికల్‌ పరికరాలున్నాయి. డస్ట్‌ బిన్‌లో కనిపించకుండా దాచిపెట్టారు. శోభారాణి అక్రమంగా గర్భస్రావాలు, లింగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్‌ విచారణలో తేలింది. 

(ఆడెపు శ్రీనాథ్‌) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement