సీజనల్‌గా ప్రకృతి ఇచ్చే వరాల్లో మామిడి ఒకటి. మామిడి కాయలనే ఉపాధిగా మార్చుకుంది ఖమ్మం జిల్లా మండాలపాడు వాసి రావిలాల అనూష. ఏడేళ్ల క్రితం 15 వేల రూపాయలతో మామిడి ఒరుగుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన అనూష నేడు 30 మంది మహిళలకు ఉపాధి ఇస్తోంది.
వేసవిలో రెండు నెలలు మాత్రమే చేసే ఈ తయారీ మార్కెట్ రంగంలో తనకో కొత్త మార్గాన్ని చూపింది అని వివరించింది అనూష.
‘మాది వ్యవసాయ కుటుంబం. నేను డిగ్రీ వరకు చదువుకున్నా. పెళ్లై, ఇద్దరు పిల్లలు. ఎకరంన్నర భూమిలో పత్తి సాగు చేస్తున్నాం. ఏడేళ్ల క్రితం మార్కెట్‌లో పత్తి అమ్ముతున్నప్పుడు మామిడి ఒరుగుల వ్యాపారం గురించి తెలిసింది. సాధారణంగా ప్రతి వేసవిలో ఇంట్లో మామిడి ఒరుగులను తయారుచేసుకుంటాం. వాటిని వర్షాకాలంలో వంటల్లో వాడుకుంటాం.
అలాంటి ఈ ఒరుగులను పొడి చేసి, ఉత్తరభారతదేశంలో పెద్ద మార్కెట్ చేస్తున్నారని తెలిసింది. పులుపుకు బదులుగా వంటల్లో ఆమ్‌చూర్ పొడిని వాడుతుంటారని, ఈ బిజినెస్‌లో మంచి లాభాలు చూడవచ్చని తెలుసుకొని, దీని తయారీనే పెద్ద ఎత్తున చేయాలనుకున్నాం.
పదిహేనువేల రూపాయలతో మొదలు
మొదటి ఏడాది మావారు రామకృష్ణ నేను కలిసి 15వేల రూపాయలతో మామిడికాయలను కొనుగోలు చేశాం. మా బంధువుల నాలుగు మామిడి చెట్ల నుంచి 2 టన్నుల వరకు మామిడి కాయలు సేకరించి, ముక్కలు కోసి ఎండబెడితే ఏడు సంచులు అయ్యాయి. వాటిని అమ్మాం. ముందు మా కుటుంబమే ఈ పనిలో నిమగ్నమైంది. తర్వాత తర్వాత పనికి తగినట్టు ఇతరులను నియమించుకున్నాం.
ఆ యేడాది లక్ష రూపాయల ఆదాయం చూశాం. తర్వాత ఏడాది ఇంకాస్త ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఇరవై క్వింటాళ్ల ఒరుగులు తయారుచేసి నిజామాబాద్ తీసుకెళ్లి మార్కెట్ చేశాం.
నష్టం వచ్చినా వదల్లేదు
ప్రతి యేటా పనిని పెంచుతూనే వస్తున్నాం. ఐదేళ్లుగా ప్రతియేటా 50 క్వింటాళ్ల ఒరుగులు తయారుచేస్తున్నాం. ఒకసారి లాభం వచ్చిందంటే, మరోసారి తీవ్రమైన నష్టం కూడా చూస్తున్నాం. మామిడికాయ నుంచి ముక్క కట్ చేసి, ఆరబెట్టాక బాగా ఎండాలి. ఏ మాత్రం వర్షం వచ్చినా, ఒరుగులు పాడైపోతాయి. అమ్ముడుపోవు. వాతావరణం మీద ఆధారపడే తయారీ విధానం కాబట్టి, సమస్యలు తప్పవు.
మా ఇంటిపైన, ఖాళీగా ఉన్న రోడ్డువారన మామిడి ముక్కలను ఎండబెడుతుంటాం. దాదాపు ఎండల్లోనే పని అంతా ఉంటుంది. రెండు నెలల పాటు టెంట్లు వేసి, ఈ పని చేస్తుంటాం. ఈ పనిలో అంతా మహిళలే పాల్గొంటారు. రోజూ 30 మందికి పైగా పాల్గొనే ఈ పని రెండు నెలల పాటు కొనసాగుతుంది.
మా వర్క్ చూసి డీఆర్‌డీఎ, వి–హబ్ వాళ్లు రుణం ఇచ్చి సాయం చేశారు. కారం, పసుపు మిషన్లను కూడా కొనుగోలు చేశాం. ఒరుగులను పొడి చేసి అమ్మాలనుకున్నాం. ‘కృషి’ పేరుతో లేబుల్ కూడా వచ్చింది. కానీ, ఒరుగులను పొడి చేసే మిషన్లతో పాటు, లేబుల్ ప్రింట్‌కు, ప్యాకింగ్‌కి లక్షల్లో ఖర్చు అవుతుంది. వచ్చే ఏడాది ఆమ్‌చూర్ పొడిని మా సొంత లేబుల్‌తో అమ్మాలని ప్రయత్నాలు చేస్తున్నాను’ అని వివరించింది అనూష.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment