
సారంగాపూర్: సాగు చేస్తున్న మామిడితోటలో కాపుకొచ్చిన చెట్లకు రైతు దంపతులు పెళ్లి చేశారు. వ్యవసాయంతో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన ఓగుల అనిల, అజయ్ దంపతులు ఎనిమిది ఎకరాల్లో మామిడి తోట సాగు చేస్తున్నారు.
నాలుగేళ్ల తరువాత మొదటి కాత (పంట) వచ్చింది, దీంతో కాత కాసిన రెండు చెట్లకు పెళ్లి చేయాలని నిశ్చయించి బంధువులను సైతం ఆహ్వానించారు. బీర్‌పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చకుడు వొద్దిపర్తి మధుకుమారాచార్యులు ఆధ్వర్యంలో మామిడి చెట్లకు నూతన వస్త్రాలు ధరింపజేసి, జీలకర్ర, బెల్లం ఉంచి మాంగళ్యధారణ గావించారు. కార్యక్రమానికి గ్రామంలోని పలువురు రైతులు హాజరుకాగా.. మామిడితోటలో సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. ఆడెపు రమ్య, మహేశ్, సత్తెన్న, మమత దంపతులు పెళ్లి పెద్దలుగా హాజరయ్యారు.