
కాషాయమయం కానున్నకొండగట్టు
ఈనెల 11 నుంచి చిన్నజయంతి
తరలిరానున్న 2 లక్షల హనుమాన్ స్వాములు
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నకలెక్టర్, ఎస్పీ
జగిత్యాల: తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి చిన్న జయంతికి స్వాములు తరలిరానున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం జగిత్యాల జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో ఈనెల 11 నుంచి మూడు రోజుల పాటు చిన్నజయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది హనుమాన్ దీక్ష స్వాములు తరలివస్తారు. అధిక సంఖ్యలో దీక్షాపరులు వచ్చి మాల విరమణ తర్వాత అంజన్నకు ముడుపుకట్టి దర్శించుకుని వెళ్తుంటారు.
2 లక్షల మంది దీక్ష స్వాములు రాక
అంజన్న సన్నిధి అయిన కొండమీదకు కాలినడకన వాహనాల్లో అనేక ప్రాంతాల నుంచి భక్తులు చేరుకుంటారు. భక్తులు సోమవారం వరకు చేరుకుని ఆలయంలో అంజన్న సన్నిధిలో సేదతీరి అర్ధరాత్రి వరకు ఉండి ఆలయ క్యూలైన్లలో నిలబడి విరమణ చేయడానికి బారులు తీరుతారు. జై బజరంగభళి, పవనసుత హనుమాన్‌కీ జై, అంజనీపుత్ర కేసరీ నందన జై హనుమాన్ జై శ్రీరాం అంటూ కొండకు భక్తులు చేరుకుంటారు.
హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల ద్వారా కాలినడకన వాహనాల్లో వచ్చిన భక్తులకు ఉదయం 12 గంటల ప్రాంతంలో స్వామి వారి దర్శనానికి బారులు తీరి క్యూలైన్ ద్వారా మాల విరమణ చేసుకొని స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ మూడు రోజులు శుక్ర, శని, ఆదివారాల్లో కొండంతా కాషాయమయంగా మారనుంది.
భక్తులకు దర్శనం ఇలా..
కొండకు వచ్చే భక్తులు దిగువ కొండ మార్గాన వచ్చేవారు ఘాట్‌రోడ్‌తో పాటు మెట్లదారి మార్గాన కాలినడకన గుట్టకు చేరుకుంటారు. జేఎన్‌టీయూ చెక్‌పోస్ట్ వద్ద నుంచి వచ్చే భక్తులు కొండగట్టు బోజ్జ పోతన్న సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో పార్కింగ్ చేసి కాలినడకన కొండ మీదకు చేరుకుంటారు. కొండకు చేరుకున్నాక ముందుగా పాత కోనేరు ఎదురుగా ఉన్న మెట్లదారి వెంట వెళ్లి అక్కడ ఉన్న కల్యాణకట్టలో క్యూలైన్ పద్ధతిలో మాల విరమణ చేసుకోవాలి.
అనంతరం నూతన కోనేరు పక్కన ఉన్న చలువ పందిళ్ల దిగువ, శ్రీరామ కోటి స్తూపం వెనకాల షెడ్డులో తలనీలాలు సమర్పించి, నూతన కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించాలి. తర్వాత ఆలయ ఆవరణలోని నూతన రేకుల షెడ్డులో ఏర్పాటు చేసిన క్యూలైన్ ద్వారా వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి. అనంతరం ఆలయం వెనకాల నుంచి బయటకు వెళ్లాలి. ఇలా భక్తులకు ఎలాంటి లోటు పాట్లు ఇక్కట్లు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏర్పాట్లపై కలెక్టర్ దృష్టి
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ చిన్న జయంతికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా కొండకు వచ్చే భక్తులకు జేఎన్‌టీయూ కళాశాల దాటాక, ఘాట్ రోడ్ వెంట తాగునీటికి చలివేంద్రాలు, మల విసర్జనకు తాత్కాలిక మరుగుదొడ్లు, జేఎన్‌టీయూ బోజ్జ పోతన్న సమీపంలో వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం, ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఫైర్ ఇంజన్, చోరీలు జరగకుండా వందల నిఘానేత్రాలు, పోలీసులు, కొండ దిగువ నుంచి మీదకు ఉచిత బస్సు సౌకర్యం, దారి వెంట భక్తులకు ఆటో ద్వారా నీరు అందించడం లాంటి ఏర్పాట్లు చేశారు. భక్తులకు స్నానమాచరించే పరిసరాలలో నిత్యం శానిటేషన్ చేపట్టాలని ఆదేశించారు.
జయంతి రోజు కోరిన కోరికలు తీరుతాయి
జయంతి ఉత్సవాలకు భక్తులు ఏటా ఎక్కువ సంఖ్యలో తరలివస్తారు. ఎంతో నిష్టతో భక్తులు మాల వేసుకొని ఇక్కడ విరమణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. జయంతి రోజున ఇక్కడ విరమణ చేసిన భక్తులు వారు కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం.