Kondagattu anjanna
-
భక్తజన సంద్రంగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి (ఫొటోలు)
-
ఈ కొండ గట్టెక్కిస్తుందని..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముడుపు కట్టి మొక్కడం తెలుగు ప్రజల సంప్రదాయం. అందులోనూ ఏదైనా మంచిపని చేసేముందు.. కొత్త వాహనం కొన్న తర్వాత పూజలు చేయించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల) కొండగట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయానికి తెలుగువారే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. ముఖ్యంగా తెలుగు రాజకీయ నేతలు ఇక్కడ పూజలు నిర్వహించి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలోనూ సీఎం కేసీఆర్ ఇక్కడ పూజలు చేయడం గమనార్హం. ప్రత్యేక రాష్ట్రం సిద్దిస్తే.. కొండగట్టుకు వచ్చి మొక్కు తీరుస్తానని ఆయన ఉద్యమ సమయంలో అంజన్నకు మొక్కుకున్నారు. ఇటీవల జగిత్యాల పర్యటన సందర్భంగా అంజన్నకు తన మొక్కు చెల్లించుకున్నారు. కొండగట్టు అంటే సీఎం కేసీఆర్‌కు మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే ఇక్కడికి కుటుంబంతో వచ్చేవారు. ఎమ్మెల్సీ కవిత కూడా బాల్యం నుంచే కొండగట్టుకు వచ్చేవారు. ఎంపీ అయిన తర్వాత కూడా పలుమార్లు ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. 2019లో ఎంపీగా గెలవకముందు సంజయ్ కూడా అంజన్నకు ముడుపు కట్టారు. ఆ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన సంజయ్, కొండగట్టులో మొక్కు చెల్లించుకున్నారు. ఈనెల 19న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కరీంనగర్ మీదుగా బోధన్ వెళ్లే దారిలో కొండగట్టును దర్శించుకోనున్నారు. రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాయుపుత్రుని దీవెనలు ఉండాలని కాంగ్రెస నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి కొండగట్టు పూజలు షెడ్యూలులో లేనప్పటికీ, రాహుల్‌గాం«దీని కొండగట్టు వద్ద ఆపి, పూజలు చేయించేలా ప్రణాళిక రచిస్తున్నారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలకు పూజలు కూడా చేయించనున్నారు. -
భక్తజన సంద్రంగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి (ఫొటోలు)
-
కొండగట్టు అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
కొండగట్టు అంజన్న ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
-
వాయుపుత్ర.. వాహనమిత్ర..!.. కేసీఆర్, పవన్ నోట కొండగట్టు
సాక్షి, కరీంనగర్: ఆంజనేయుడు అంటేనే అభయం. వజ్రకాయుడి పేరు పలికితే తెలియని మనోబలం. ధైర్యానికి, స్థైర్యానికి, విశ్వాసానికి మారుపేరు హనుమంతుడు. ఉమ్మడి జిల్లాలో కొండగట్టుపై వెలసిన పవనసుతుడి గొప్పతనం తెలియనివారుండరు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉమ్మడి జిల్లావాసులకు దాదాపు కులదైవం. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి నుంచి ప్రతీ ఇంట ఆంజనేయుడి పేరును ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పెట్టుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఏ వాహనం కొన్నా మారుతి పాదాల చెంత తొలిపూజ చేసిన తరువాతే రంగంలోకి దింపుతారు. ఉమ్మడి జిల్లాలోని కొండగట్టు ఆ తరువాత మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి, వేములవాడ మండలం అగ్రహారంలోని అంజన్న ఆలయాలు వాహనపూజలకు ప్రసిద్ధి చెందినవి. ఆయా ఆలయాల విశిష్టతపై సండే స్పెషల్.. చిన్న కొండగట్టు గట్టుదుద్దెనపల్లి చిన్నకొండగట్టుగా పేరొందిన మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి ఆంజనేయస్వామి ఆలయం కూడా రోజురోజుకి ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. గట్టుదుద్దెనపల్లిలో ఆంజనేయుడి ప్రాచీన విగ్రహాన్ని పెద్ద బండరాయిపై చెక్కారు. అది కాలావధులపై సమాచారం లేదు. 1982 నుంచి గ్రామస్తులు ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం సగటున రోజుకు 200కుపైగా వాహనాలు ఇక్కడ పూజలు అందుకుంటాయి. దళితబంధులో మంజూరైన 1,285 వాహనాలకు ఇక్కడే పూజలు చేయించారు. 700 ఏళ్ల చరిత్ర.. కొండగట్టు దేశంలోని అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒకటి. ఇక్కడి స్వామివారిని దాదాపుగా 700 ఏళ్లుగా కొలుస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. కొండగట్టు మీద వాహన పూజల సంప్రదాయం అనాదిగా వ స్తోంది. ఒకప్పుడు రాజులు, సంస్థానాధీశులు, జ మీందారుల రథాలు, రైతుల ఎండ్లబండ్లకు పూజ లు జరిగేవి. ప్రస్తుతం కొండగట్టుకుపై నెలకు 5000 కుపైగా వాహనాలు పూజకు వస్తాయి. సగటున రోజుకు 170 వాహనాలు ఇక్కడ పూజలందుకుంటాయి. మన రాష్ట్రమే కాదు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తమ కొత్త వాహనాలకు పూజలు చేయిస్తుంటారు. అగ్రహారంలో.. వేములవాడ మండలంలోని అగ్రహరం శ్రీ జోడాంజనేయస్వామి ఆలయంలోనూ వాహనపూజలు చేస్తుంటారు. మంగళవారం, శనివారం నాడు ఎక్కు వ సంఖ్యలో వాహనపూజలు నిర్వహిస్తారు. మిగి తా రోజుల్లోనూ పదులసంఖ్యలో వస్తుంటాయి. దసరాకు రద్దీగా.. ఈ మూడు ఆలయాల్లోనూ దసరా రోజు పూజ చేయించేందుకు వేలాది వాహనాలు వరుస కడతాయి. దసరారోజు ఈ ఆలయాల వద్ద పూజలు చేయిస్తే.. మంచి జరుగుతుందన్న విశ్వాసంతో ఆ రోజున పాత వాహనాలకు సైతం ఇక్కడ పూజలు చేయడం గమనార్హం. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టు, సివిల్ పనులు చేసే కాంట్రాక్టర్లు తమ వాహనాలను కొండగట్టుకు తీసుకువస్తుంటారు. దళితబంధుతో తాకిడి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం ద్వారా 8,851 మంది లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. ఇందులో జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు, లారీలు, ఆటోలు, ట్రాలీలు ఉన్నాయి. వాహనమేదైనా బాహుబలి వద్ద పూజ చేయించకుండా బయటికి తీసేదే ఉండదంటే అతిశయోక్తి కాదు. దళితబంధులో ఇచ్చిన వాహనాల్లో హుజూరాబాద్ మాత్రమే కాకుండా.. ఉమ్మడి జిల్లా, పొరుగున ఉన్న ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి కూడా కొండగట్టు, గట్టుదుద్దెనపల్లి, అగ్రహారానికి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్, పవన్ నోట కొండగట్టు గతేడాది డిసెంబరు 7వ తేదీన జగిత్యాలలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి తన భక్తిని చాటుకున్నారు. అదే నెలలో జనసేన పార్టీ అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నికల రథం వారాహికి జనవరి నెలాఖరున పూజలు చేస్తానని ప్రకటించడంతో మరోసారి కొండగట్టు పేరు మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. ప్రతీవారం మంత్రులు, ప్రముఖులు, ఎమ్మెల్యేలు, సాధారణ భక్తుల తాకిడితో పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది. -
కొండగట్టు మాస్టర్‌ప్లాన్‌కు పట్టిన శని!
సాక్షి, మల్యాల(చొప్పదండి): కొండగట్టుపై వెలిసిన అంజన్నను దర్శించుకుంటే శని వదిలి అంతా మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు. అయితే భక్తుల సౌకర్యార్థం రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌కు పట్టిన శని మూడేళ్లుగా వీడడం లేదు. సీఎం వస్తే తప్పా పరిస్థితిలో మార్పు రాదనే భావన భక్తుల్లో నెలకొంది. కొండగట్టు పుణ్యక్షేత్రం మాస్టర్‌ప్లాన్ కాగితాలకే పరిమితమైంది. నివేదిక రూపొందించి దేవాదాయ శాఖకు సమర్పించి మూడేళ్లు గడుస్తున్నా..నేటికీ మాస్టర్‌ప్లాన్ అమలు ఊసే లేదు. కొండగట్టు పుణ్యక్షేత్రానికి సీఎం కేసీఆర్ వస్తేనైనా మాస్టర్‌ప్లాన్ అమలుకు నోచుకుంటుందనే ఆశతో భక్తులు ఎదురుచూస్తున్నారు. టూరిజం డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో రోప్ నిర్మాణం ప్రతిపాదనలు చేసి, ఐదేళ్లయినా అతీగతీలేదు. మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది వస్తుంటారు. కొండగట్టులో భక్తులసంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. తెలంగాణ జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఏటా వేలాది భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మాస్టర్‌ప్లాన్ అమలెప్పుడో? భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని తీసుకున్న నిర్ణయం ముందుకు సాగడం లేదు. కొండగట్టు ఆలయ పరిధిలో ప్రభుత్వ భూమి 333 ఎకరాలు ఉంది. వీటిలో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారు. మూడేళ్లు గడుస్తున్నా మాస్టర్‌ప్లాన్ అమలుకు నోచుకోవడం లేదు. కాగితాలకే పరిమితమైంది. మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వస్తే.. కొండగట్టులో మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వస్తే, భక్తులకు మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. భక్తులుకోసం 100 గదుల వసతి గృహం, మెట్లదారి వెంట రూఫ్ వేయనున్నారు. రోప్ వే నిర్మాణం, ఆలయ రెండో ప్రాకారం నిర్మాణం, కొండగట్టు దిగువన ఆర్చి గేటు నిర్మాణం, నిత్యాన్నదాన సత్రం భవనం, అభిషేక మండపం, సంతోల్లలొద్ది నుంచి గుట్టపైకి నీటిసరఫరా పైపులైన్, రెండస్తుల దీక్ష విరమణ భవనం, పార్కింగ్ స్థలం అభివృద్ధి, రెండు డార్మిటరీ హాళ్ల నిర్మాణం, యాత్రికులకోసం 500 గదుల భవనం, వీఐపీలకోసం 50 ఏసీ సూట్స్ నిర్మాణం, రెండు ఎకరాల్లో ఉద్యానవనం ఏర్పాటు, దేవాలయం ఆవరణలో క్యూలైన్ల కంపార్ట్మెంట్ నిర్మాణం చేయనున్నారు. సీఎంకోసం ఎదురుచూపులు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారంటూ మూడేళ్లు గడుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం ఆలయాలకు వచ్చినప్పటికీ, కొండగట్టుకు మాత్రం సీఎం రాకపోవడంపై భక్తులు నిరాశలో ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ కొండగట్టుకు వస్తారంటూ చెబుతున్నా, నేటికీ నెరవేరడం లేదు. మాస్టర్ ప్లాన్ నివేదిక అందజేశాం కొండగట్టులో మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన నివేదిక దేవాదాయశాఖకు అందజేసినం. మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వస్తే ఏటా పెరుగుతున్న భక్తులకు అవసరమైన వసతిగృహం, పార్కింగ్ స్థలం, మెట్లదారిలో రూఫ్ అందుబాటులోకి వస్తాయి. – అమరేందర్, కొండగట్టు ఆలయ ఈవో -
కొండగట్టు ప్రమాదం వెలికితీసిన బస్సు
-
కొండగట్టు బస్సు ప్రమాదం.. కారణాలు ఇవే!
సాక్షి, జగిత్యాల : కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 62కు చేరింది. ఈ ఘటనలో మరో 38 మంది కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. కారణాలు ఇవే.. కొండగట్టు ఘాట్‌రోడ్డు లోయలో పడిన ఆర్టీసీ బస్సును అధికారులు గురువారం వెలికితీశారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసిన అధికారులు.. ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు. ఆర్టీసీ బస్సు కండిషన్లో లేకపోవడం, బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. 2007 మోడల్‌కు చెందిన ఆర్టీసీ బస్సు జీవితకాలంలో 12 లక్షల కిలోమీటర్లు తిరగాల్సి ఉండగా.. ప్రమాదానికి గురైన బస్సు మాత్రం 14 లక్షల 95 వేల 116 కిలో మీటర్లు తిరిగిందని గుర్తించారు. 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత బస్సును స్క్రాప్ (తుక్కు) కింద భావించి పక్కకు పడేయాలని, కానీ, స్క్రాప్‌గా భావించే బస్సును జగిత్యాల- శనివారంపేట రూటులో ఆర్టీసీ అధికారులు నడపడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రెగ్యులర్ బస్సు, రెగ్యులర్ డ్రైవర్ అయినప్పటికీ కాలం చెల్లిన వాహనం కావడం.. ఘాట్‌రోడ్డులో సరిగ్గా బ్రేక్ వేయడానికి వీలుపడకపోవడంతో ప్రమాదం జరిగిందని విచారణ అధికారులు భావిస్తున్నారు. విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. బస్సు ఫిట్నెస్ సరిగా లేకపోవడం, బ్రేక్ రాకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఉండడం ఈ మహా విషాదానికి కారణమని వారు ప్రాథమికంగా తేల్చినట్టు తెలుస్తోంది. పార్టీ పరంగానూ సహాయం అందజేస్తాం కరీంనగర్లో చికిత్స పొందుతున్న 36మందిని మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ గురువారం పరామర్శించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వపరంగా రూ. ఐదు లక్షలు, ఆర్టీసీ పరంగా రూ. 3 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని మంత్రి ఈటల తెలిపారు. గాయపడ్డవారికి రెండున్నర లక్షల చొప్పున సహాయం అందిస్తామన్నారు. వారు పూర్తిగా కోలుకునే వరకూ ప్రభుత్వపరంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో తొమ్మిది మందికి రైతు బంధు జీవిత భీమా వర్తిస్తుందని, ఇక, పార్టీ సభ్యత్వం ఉన్న వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. రైతుబంధు, పార్టీ సభ్యత్వం వర్తించని వారికి టీఆర్ఎస్ పార్టీపరంగా ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి ఈటల హామీ ఇచ్చారు. -
మరుభూమిగా గ్రామాలు
హిమ్మత్‌రావుపేటకు చెందిన వేములభాగ్య వ్వ (45) తన కూతురు శైలజ, మనవడు అరుణ్‌సాయి(4)తో కలిసి జగిత్యాలలోని అసుపత్రికి బయల్దేరింది. ప్రమాదంలో భాగ్యవ్వ చనిపోయింది. అరుణ్‌సాయి సంఘటనాస్థలంలోనే చనిపోయారు. శైలజకు కాళ్లు, నడుము విరిగాయి. రాంసాగర్‌కు చెందిన బైరి రితన్య(4)కు ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లికీర్తన ఏడాది వయసున్న కొడుకు శివతోకలిసి జగిత్యాలకు బయల్దేరారు. ప్రమాదంలో రిత న్య మృతిచెందింది. తల్లి కీర్తనకు నడుము, కాళ్ల కు తీవ్రగాయాలయ్యాయి. శనివారంపేటకు చెందిన ఎండ్రిక్కాయలలత కూతురు నందిని(1), గాజుల శ్రీహర్ష(2) కూడా ప్రమాదంలో చనిపోయారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలైన మాతృమూర్తు లు శైలజ, కీర్తనలు కడచూపుకు నోచుకోలేని పరిస్థితి. కంటిపాపలు దూరమవడంతో రోదనలు మిన్నంటాయి. కొడిమ్యాల(చొప్పదండి): కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం కొడిమ్యాల మండలంలో విషాదాన్ని నింపింది. మండలంలోని హిమ్మత్‌రావుపేట, డబ్బుతిమ్మయ్యపల్లి, రాంసాగర్, శనివారంపేట, తిర్మలాపూర్ గ్రామాలు మరుభూములుగా మారాయి. ఏడాదివయ సున్న చిన్నారి నుంచి ప్రారంభిస్తే డిగ్రీచదివే విద్యార్థులు, ప్రసూతికి వెలుతున్న గర్భిణులు, వృద్ధదంపతులు, కుటుంబాలకు పెద్దదిక్కైనవారు అందరాని లోకాలకు వెళ్లారు. 31 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు, 16 మంది పురుషులు మృతిచెందినవారిలో ఉన్నారు. శనివారంపేట గ్రామంలో.. మండలంలోని శనివారంపేటకు చెందిన 13 మంది మృతిచెందారు. నామాల మౌనిక (24), గోలి అమ్మాయి(44), ఎండ్రికాయల ఎంకమ్మ(55), ఉత్తం భూలక్ష్మి(45), ఉత్తం సుమలత(25) ఉత్తం నందన (1), బొల్లారపు బాబు(54), సలేంద్ర వరలక్ష్మి(28), కుంబాల సునంద(45), గుడిసె రాజవ్వ(50), షేర్ల గంగయ్య(75), అల్లెరమ(22), గోలి రాజమల్లు(50) మృతిచెందారు. తిర్మలాపూర్‌లో.. తిర్మలాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో శ్యామకూర మల్లవ్వ(35), తిప్పర్తి రత్నవ్వ(65), దాసరి సుశీల(65), తైదల పుష్ప(40), సోమిడి పుష్ప(40)తోపాటు, అనుబంధ గ్రామమైన సంద్రాలపల్లిలో కంకణాలఎల్లవ్వ(70) చనిపోయారు. హిమ్మత్‌రావుపేటలో.. గ్రామానికి చెందిన లంబ కోటయ్య(55), పోలు లక్ష్మి(35), మల్యాల అనిల్(19), గండి లక్ష్మి(55), వేముల భాగ్యవ్వ(45), వేముల అరుణ్‌సాయి (4), పందిరి సత్తవ్వ(70), నేదూరి మధునవ్వ (69), పడిగెల స్నేహలత(18) లోకాన్ని విడిచారు. డబ్బుతిమ్మయ్యపల్లిలో.. గ్రామానికి చెందిన వొడ్నాల కాశీరాం(60), వొడ్నాల లసుమవ్వ(55), గోల్కొండ దేవయ్య(60), గొల్కొండ లక్ష్మి(55), పిడుగు రాజిరెడ్డి(55), గాజుల చిన్నయ్య(55), గాజుల రాజవ్వ(58), లైసెట్టి కళ(35), డబ్బు అమ్మాయి(55), పూండ్ర లలిత(35) మృతి చెందిన వారిలో ఉన్నారు. రాంసాగర్‌లో.. రాంసాగర్గ్రామానికి చెందిన డ్యాగల ఆనందం(60), డ్యాగల స్వామి(35), షేర్ల హేమ(30), షేర్ల మౌనిక(21), తిరుమణి ముత్తయ్య(65), మెడిచెల్మల గౌరమ్మ(45), మెడిచెల్మల రాజేశం(60), బైరి రితన్య(4) చనిపోయారు. -
హనుమాన్ జయంతికి ఏర్పాట్లు
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న క్షేత్రంలో ఈనెల 29నుంచి 31 వరకు జరిగే హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5లక్షలకు పైగా దీక్షాపరులు తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తారు. ఇప్పటికే ఆలయ ఆవరణతో పాటు.. సెక్యూరిటీ గది సమీపంలో చలువ పందిర్లు పూర్తి చేశారు. బొజ్జ పోతన్న సమీపంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత కోనేరుపై విమర్శలు వసున్నా.. నీటీ ఎద్దడి ఉన్నా.. ప్రత్యేక చొరవతో అందులో నీరు నింపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొనసాగుతున్న ఏర్పాట్లు.. హనుమాన్ చిన్న జయంతికి వచ్చే భక్తులకు తాగునీరు, చలివేంద్రాలు, విద్యుత్, చలువ పందిర్లు, మరుగుదొడ్లు, భోజనం, భారీకేడ్లు, పార్కింగ్ వసతి, సీసీ కెమెరాలు, వైద్యం, శానిటేషన్, క్యూలెన్లు, దర్శనంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా తాగునీటికోసం 20 చలివేంద్రాలు ఉండగా.. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరో 20 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. చలువ పందిర్లు వేసిన చోట విద్యుత్ వైర్లలో డ్యామేజ్ లేకుండా.. వికలాంగులకు, వృద్ధులకు కొండగట్టు కిందినుంచి దొంగలమర్రి మీదుగా కొండపైకి వచ్చేందకు కలెక్టర్ శరత్ చొరవతో 24 గంటలు.. 4 మినీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 4లక్షల లడ్డూలు, పులిహోర ప్యాకెట్లను ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచనున్నారు. నాచుపెల్లి గ్రామంలోని బావుల ద్వారా ట్యాంకర్ల సాయంతో కొండపైకి నీటిని తీసుకురావడం.. వందకుపైగా తాత్కాలిక మరుగుదొడ్లు.. వై–జంక్షన్ నుంచి బొజ్జ పోతన్న వరకు లైటింగ్, అదనంగా మరో 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పాత కోనేరులో సైతం భక్తులు స్నానాలు ఆచరించేందుకు అందులో ఎప్పటికప్పుడు నీటిని అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. తాగునీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు.. యేళ్లకేళ్ళుగా నెలకొన్న తాగునీటీ సమస్యపై అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. కొండ దిగువన, బొజ్జ పోతన్న వద్ద, కాలినడకన వచ్చే భక్తులకు చలివేంద్రాల ద్వారా నీరు అందిచనున్నారు. వీధిలైట్లు ఏర్పాటు.. రాత్రి సమయంలో దొంగలమర్రి నుంచి గట్టు మీదకు కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్థం దారికి ఇరువైపుల నూతనంగా విద్యుత్ స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందుబాటులో మరుగుదొడ్లు.. జయంత్యుత్సవాలకే వచ్చే భక్తులకోసం కొండ దిగువన.. ౖకొండపెన ఉన్న శాశ్వత మరుగుదొడ్లే కాకుండా, బొజ్జ పోతన్న ప్రాంతంలో, కొండపైకి వెళ్లే మార్గమధ్యలో తాత్కలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. -
అంజన్నకు భక్తాభిషేకం
కొండగట్టు అంజన్న క్షేత్రంలో చిన్నహనుమాన్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మల్యాల, న్యూస్‌లైన్ : కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానం భక్త జన సంద్రమైంది. సోమవారం చిన్నహనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆంజనేయస్వామి దీక్షాపరులు తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు జిల్లా నలుమూలలనుంచే కాకుండా నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా వేలాది మంది దీక్షాపరులు కొండగట్టుకు చేరుకుంటున్నారు. అంజన్న సన్నిధానంలో దీక్షలు విరమించి, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొండపైన నీటి ఎద్దడి ఉండడంతో ట్యాంకర్లద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు దేవస్థాన ఈవో గజరాజు తెలిపారు. వేకువజాము నుంచే దర్శనం వేలాది మంది భక్తులు తరలిరావడంతో సోమవారం వేకువజాము నుంచే స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అధికారులు వేకువజామున 4గంటల నుంచే స్వామివారి దర్శనానికి అనుమతించారు. కోనేటిలో స్నానాలు ఆచరించిన భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు. కల్యాణకట్ట భవనంలో అర్చకులు దీక్షవిరమణ నిర్వహించారు. పుష్కరిణి వద్ద ఎప్పటిలాగే తలనీలాల కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఆలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఘాట్‌రోడ్డు వెంట చలివేంద్రాలను ఏర్పాటుచేశారు. కొండపై అదనంగా స్వామివారి ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటుచేశారు. జయంతి రోజు దాదాపు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీతో వ్యాపారులు వస్తువుల ధరలను అమాంతం పెంచేశారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మల్యాల ఎస్సై వెంకటేశ్వర్లు బందోబస్తు నిర్వహించారు.