సాక్షి, కరీంనగర్: ఆంజనేయుడు అంటేనే అభయం. వజ్రకాయుడి పేరు పలికితే తెలియని మనోబలం. ధైర్యానికి, స్థైర్యానికి, విశ్వాసానికి మారుపేరు హనుమంతుడు. ఉమ్మడి జిల్లాలో కొండగట్టుపై వెలసిన పవనసుతుడి గొప్పతనం తెలియనివారుండరు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉమ్మడి జిల్లావాసులకు దాదాపు కులదైవం. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి నుంచి ప్రతీ ఇంట ఆంజనేయుడి పేరును ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పెట్టుకుంటారంటే అతిశయోక్తి కాదు.
ఏ వాహనం కొన్నా మారుతి పాదాల చెంత తొలిపూజ చేసిన తరువాతే రంగంలోకి దింపుతారు. ఉమ్మడి జిల్లాలోని కొండగట్టు ఆ తరువాత మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి, వేములవాడ మండలం అగ్రహారంలోని అంజన్న ఆలయాలు వాహనపూజలకు ప్రసిద్ధి చెందినవి. ఆయా ఆలయాల విశిష్టతపై సండే స్పెషల్..
చిన్న కొండగట్టు గట్టుదుద్దెనపల్లి
చిన్నకొండగట్టుగా పేరొందిన మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి ఆంజనేయస్వామి ఆలయం కూడా రోజురోజుకి ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. గట్టుదుద్దెనపల్లిలో ఆంజనేయుడి ప్రాచీన విగ్రహాన్ని పెద్ద బండరాయిపై చెక్కారు. అది కాలావధులపై సమాచారం లేదు. 1982 నుంచి గ్రామస్తులు ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం సగటున రోజుకు 200కుపైగా వాహనాలు ఇక్కడ పూజలు అందుకుంటాయి. దళితబంధులో మంజూరైన 1,285 వాహనాలకు ఇక్కడే పూజలు చేయించారు.
700 ఏళ్ల చరిత్ర..
కొండగట్టు దేశంలోని అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒకటి. ఇక్కడి స్వామివారిని దాదాపుగా 700 ఏళ్లుగా కొలుస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. కొండగట్టు మీద వాహన పూజల సంప్రదాయం అనాదిగా వ స్తోంది. ఒకప్పుడు రాజులు, సంస్థానాధీశులు, జ మీందారుల రథాలు, రైతుల ఎండ్లబండ్లకు పూజ లు జరిగేవి. ప్రస్తుతం కొండగట్టుకుపై నెలకు 5000 కుపైగా వాహనాలు పూజకు వస్తాయి. సగటున రోజుకు 170 వాహనాలు ఇక్కడ పూజలందుకుంటాయి. మన రాష్ట్రమే కాదు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తమ కొత్త వాహనాలకు పూజలు చేయిస్తుంటారు.
అగ్రహారంలో..
వేములవాడ మండలంలోని అగ్రహరం శ్రీ జోడాంజనేయస్వామి ఆలయంలోనూ వాహనపూజలు చేస్తుంటారు. మంగళవారం, శనివారం నాడు ఎక్కు వ సంఖ్యలో వాహనపూజలు నిర్వహిస్తారు. మిగి తా రోజుల్లోనూ పదులసంఖ్యలో వస్తుంటాయి.
దసరాకు రద్దీగా..
ఈ మూడు ఆలయాల్లోనూ దసరా రోజు పూజ చేయించేందుకు వేలాది వాహనాలు వరుస కడతాయి. దసరారోజు ఈ ఆలయాల వద్ద పూజలు చేయిస్తే.. మంచి జరుగుతుందన్న విశ్వాసంతో ఆ రోజున పాత వాహనాలకు సైతం ఇక్కడ పూజలు చేయడం గమనార్హం. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టు, సివిల్ పనులు చేసే కాంట్రాక్టర్లు తమ వాహనాలను కొండగట్టుకు తీసుకువస్తుంటారు.
దళితబంధుతో తాకిడి
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం ద్వారా 8,851 మంది లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. ఇందులో జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు, లారీలు, ఆటోలు, ట్రాలీలు ఉన్నాయి. వాహనమేదైనా బాహుబలి వద్ద పూజ చేయించకుండా బయటికి తీసేదే ఉండదంటే అతిశయోక్తి కాదు. దళితబంధులో ఇచ్చిన వాహనాల్లో హుజూరాబాద్ మాత్రమే కాకుండా.. ఉమ్మడి జిల్లా, పొరుగున ఉన్న ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి కూడా కొండగట్టు, గట్టుదుద్దెనపల్లి, అగ్రహారానికి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తున్నారు.
కేసీఆర్, పవన్ నోట కొండగట్టు
గతేడాది డిసెంబరు 7వ తేదీన జగిత్యాలలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి తన భక్తిని చాటుకున్నారు. అదే నెలలో జనసేన పార్టీ అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నికల రథం వారాహికి జనవరి నెలాఖరున పూజలు చేస్తానని ప్రకటించడంతో మరోసారి కొండగట్టు పేరు మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. ప్రతీవారం మంత్రులు, ప్రముఖులు, ఎమ్మెల్యేలు, సాధారణ భక్తుల తాకిడితో పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment