సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముడుపు కట్టి మొక్కడం తెలుగు ప్రజల సంప్రదాయం. అందులోనూ ఏదైనా మంచిపని చేసేముందు.. కొత్త వాహనం కొన్న తర్వాత పూజలు చేయించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల) కొండగట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయానికి తెలుగువారే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు.
ముఖ్యంగా తెలుగు రాజకీయ నేతలు ఇక్కడ పూజలు నిర్వహించి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలోనూ సీఎం కేసీఆర్ ఇక్కడ పూజలు చేయడం గమనార్హం. ప్రత్యేక రాష్ట్రం సిద్దిస్తే.. కొండగట్టుకు వచ్చి మొక్కు తీరుస్తానని ఆయన ఉద్యమ సమయంలో అంజన్నకు మొక్కుకున్నారు. ఇటీవల జగిత్యాల పర్యటన సందర్భంగా అంజన్నకు తన మొక్కు చెల్లించుకున్నారు.
- కొండగట్టు అంటే సీఎం కేసీఆర్‌కు మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే ఇక్కడికి కుటుంబంతో వచ్చేవారు.
- ఎమ్మెల్సీ కవిత కూడా బాల్యం నుంచే కొండగట్టుకు వచ్చేవారు. ఎంపీ అయిన తర్వాత కూడా పలుమార్లు ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు.
- 2019లో ఎంపీగా గెలవకముందు సంజయ్ కూడా అంజన్నకు ముడుపు కట్టారు. ఆ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన సంజయ్, కొండగట్టులో మొక్కు చెల్లించుకున్నారు.
- ఈనెల 19న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కరీంనగర్ మీదుగా బోధన్ వెళ్లే దారిలో కొండగట్టును దర్శించుకోనున్నారు. రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాయుపుత్రుని దీవెనలు ఉండాలని కాంగ్రెస నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి కొండగట్టు పూజలు షెడ్యూలులో లేనప్పటికీ, రాహుల్‌గాం«దీని కొండగట్టు వద్ద ఆపి, పూజలు చేయించేలా ప్రణాళిక రచిస్తున్నారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలకు పూజలు కూడా చేయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment