
భువనగిరి టౌన్: వారం రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోల్ గ్రామానికి చెందిన మామిడాల అనూష (30) 2020 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్. నాలుగు సంవత్సరాలుగా భువనగిరిలో విధులు నిర్వర్తిస్తూ విద్యానగర్‌లో నివాసముంటోంది. అనూషకు కోహెడ మండలానికి చెందిన యువకుడితో మార్చి 6న వివాహం జరగాల్సి ఉంది. ఈ నెల 14న ఆమెకు వివాహ నిశ్చితార్థం జరిగింది.
నాన్నకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి..
నాన్నకు యాక్సిడెంట్ అయ్యిందని, తనకు సెలవు కావాలని అనూష మంగళవారం ఉదయం ఏఆర్ సీఐకి సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకుంది. అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె మరో యువకుడితో ప్రేమలో ఉందని, తను ప్రేమించిన వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. అనూష కుటుంబ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం సమయంలో అనూషకు ఫోన్ చేయగా ఎత్తలేదు.
దీంతో సహోద్యోగికి సమాచారం ఇవ్వగా, ఆమె అనూష ఆత్మహత్య చేసుకుందని చెప్పింది. దీంతో వారు వెంటనే భువనగిరికి బయలుదేరి వచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనూష తల్లిదండ్రులు మామిడాల పద్మ, లక్ష్మయ్యలు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకనే అనూష ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: నేత్రదానంతో ఇతరుల జీవితాల్లో వెలుగులు
Comments
Please login to add a commentAdd a comment